close

ప్ర‌త్యేక క‌థ‌నం

ప్రకృతి ఆహారం

ప్రకృతి ఆహారం

పుడమిపై మరో ‘హరిత విప్లవానికి’ తెరలేస్తోంది. మన పెద్దలు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పుట్ల కొద్దీ, ఆరోగ్యకరమైన పంటలు పండించిన పాతరోజుల్ని సేంద్రియ వ్యవసాయం గుర్తుకు తెస్తోంది. ఆరోగ్య స్పృహ పెరిగిన నేటి మనిషి.. జీవనశైలి జబ్బుల నుంచి బయటపడేందుకు సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటల్ని ఇష్టపడుతున్నాడు. కొన్నేళ్లుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న మార్పు ఇది. ఆరోగ్యం, పర్యావరణ అనుకూలం, ఉపాధి అవకాశాల మేలుకలయికగా సేంద్రియ వ్యవసాయం ఊరిస్తోంది. రైతును సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేలా ఒప్పించడం, ఈ వ్యవసాయానికి ఆధునిక పద్ధతుల్ని జోడించడం, ప్రభుత్వ సహకారం.. ఇవన్నీ తోడైతే పాత రోజుల్లోలాగానే మళ్లీ మనం సేంద్రియ పంటల్ని ఆస్వాదించొచ్చు. 2019వ సంవత్సరంలోనూ ‘వంట’ను ‘ఒంటి’ని మరింత సురక్షితం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఈ మార్పుపై  ప్రత్యేక కథనం.

ప్రకృతి ఆహారం

ప్రకృతి ఆహ్వానం సేంద్రియ ఆహారం 
మనుషుల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహ 
మున్ముందు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత

60 ఏళ్ల కిందటి మాట. పెరుగుతున్న జనాభాను తట్టుకోవడానికి 1950-1960ల మధ్య కాలంలో హరిత విప్లవం వచ్చింది. ఎరువులు, పురుగు  మందులు, హైబ్రీడ్‌ విత్తనాలు వాడి.. రైతన్న భారీ  దిగుబడులు సాధించడం మొదలుపెట్టాడు. దీనివల్ల ఉత్పత్తులైతే పెరిగాయి కానీ.. రసాయన ఎరువుల విచక్షణా రహిత వినియోగం వల్ల భూసారం క్షీణిస్తూ వచ్చింది. పంటలు, వాటిని  వినియోగిస్తున్న మనుషుల ఆరోగ్యం దెబ్బతింది. పండ్లు, కూరగాయలు తాజాదనాన్ని కోల్పోయి.. రసాయన మయమైపోయాయి. ప్రస్తుతం పంజాబ్‌లోని మాల్వా ప్రాంతాన్ని క్యాన్సర్‌ బెల్ట్‌ అంటారు. దీనికి కారణం అక్కడ పత్తికి విపరీతంగా పురుగు మందులు వాడడమే. ఈ ప్రమాదాలే రైతుల్ని తిరిగి సేంద్రియ వ్యవసాయం వైపు ఉసిగొల్పుతున్నాయి. మరోవైపు యువత వ్యవసాయ రంగంలో ఉపాధిని వెతుక్కుంటోంది. ఉన్నత విద్యావంతులు సైతం అటువైపు మళ్లుతున్నారు. వ్యవసాయరంగం కొత్త ఏడాది వీరికో అవకాశాల వేదికగా నిలుస్తోంది.

ప్రకృతి ఆహారం

‘‘ఆదాయంపై తక్షణం దెబ్బ పడుతుంది కాబట్టి.. సేంద్రియ వ్యవసాయం వైపు వెంటనే మళ్లాలంటూ రైతును మెప్పించడం కష్టమవుతోంది. ‘స్వచ్ఛ ఆహారం’ అవసరాన్ని అతనికి తెలియజెప్పి.. నెమ్మదిగా అటువైపు మళ్లించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాలు, ఇటు సమాజంపై ఉంది’’

-ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ)

‘సేంద్రియ’ అవసరం, ఉపయోగాలు
 

వ్యవసాయానికి ప్రకృతి అత్యుత్తమ మార్గదర్శి. దీనికి ఎలాంటి ప్రేరకాలు అక్కర్లేదు. సేంద్రియ వ్యవసాయాన్ని పూర్తిగా సహజ వాతావరణంలో చేస్తారు.  
మొక్కలు, పంటలకు ఎలాంటి కృత్రిమత్వాన్ని జోడించరు.  
వాణిజ్య, పారిశ్రామిక పంటల్లో మాదిరిగా ఎరువులు, పురుగుమందులు, యాంటిబయాటిక్స్‌, హార్మోనుల్లాంటి వాటిని అస్సలు వాడరు.  
నీటి వనరులు, భూగర్భజలాల్లోకి ఎరువులు, పురుగుమందుల అవశేషాలు కలవవు కాబట్టి.. నీరు కలుషితం కాదు. నేల, గాలీ కూడా. 
భూసారం కోసం పశువుల పేడ, ఇతరత్రా జీవసంబంధ పదార్థాల్ని వాడతారు కాబట్టి మేలైన, ప్రకృతి హితమైన పంటలు పండుతాయి. రసాయన ఎరువుల వాడకంలోలాగా భూసారానికి నష్టం వాటిల్లదు.  
కంపోస్ట్‌ అధికంగా ఉండే సేంద్రియ నేల దాదాపు 60 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉపయోగకరమైన బ్యాక్టీరియాను, 15 రకాల జీవుల్ని కలిగి ఉంటుంది. ఇవన్నీ భూసారానికి ఇతోధికంగా దోహదపడతాయి.  
అడ్డగోలుగా నీటి వినియోగం అవసరం ఉండదు. భూమి కోతకు గురికాదు. 
పండించిన పంటల్నే వచ్చే ఏడాది తిరిగి విత్తనాలుగా వాడతారు.  
సేంద్రియ వ్యవసాయం కార్బన్‌డైఆక్సైడ్‌ను తగ్గించి.. వాతావరణ మార్పుల వేగాన్ని నెమ్మదిస్తుంది.  
పురుగుమందులు వాడని రోజుల్లో కీటకాలు, పక్షుల శబ్దాలతో పంటపొలాలు కళకళలాడేవి. రసాయనాలు ఎక్కువయ్యే కొద్దీ అవి పంటలకు దూరమయ్యాయి. సేంద్రియ వ్యవసాయం అటు పక్షులు, ఇటు పశువుల ఆరోగ్యానికి దోహదపడుతుందని, జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

సమస్యలూ ఎక్కువే...

ప్రకృతి ఆహారం

ప్రభుత్వ విధాన లోపాలు, ఇన్‌పుట్‌ వ్యయాలు పెరగడం, పరిమిత మార్కెట్‌ వల్ల సేంద్రియ రైతులు  ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.  
ఎరువులు, పురుగుమందులు వాడిన పంటల్లాగా సేంద్రియ పంటలు భారీ దిగుబడులు ఇవ్వవనే వాదన ఉంది. పూర్తిస్థాయి సేంద్రియ రాష్ట్రంగా రికార్డుకెక్కిన సిక్కింలోని రైతులు కూడా ఇదే ఫిర్యాదుచేశారు. దేశంలో జనాభా పెరుగుదలను తట్టుకోవాలంటే అధిక దిగుబడులు కావాలి. సేంద్రియ వ్యవసాయంతో ఆ లక్ష్యాన్ని అందుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
పురుగు మందులు వాడం కాబట్టి చీడపీడల సమస్య ఎక్కువ ఉంటుంది.  
పశు సంతతే క్షీణించిపోతున్న ఈ రోజుల్లో పశువుల పేడ, కంపోస్ట్‌లాంటి వాటిని రైతు సమకూర్చుకోవడం కష్టంతో, ఖర్చుతో కూడుకున్న పని. ఈ పంటలకు కూలీలు, లోడింగ్‌, ప్యాకేజింగ్‌, నిల్వ ఖర్చులూ ఎక్కువే. 
సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటల ధరలు ఎక్కువగా ఉంటాయి.    స్థానికంగా ఇంత ఖరీదు పెట్టి కొనేవారు ఉండరు.వినియోగదారుడు సేంద్రియ ఆహారం వైపు మళ్లాలంటే అదనపు ఖర్చుకు సిద్ధంగా ఉండాలని అసోచామ్‌ సర్వే తేల్చింది.  
సేంద్రియ పంటలకు ఎక్కువగా మెట్రో నగరాల్లో డిమాండు ఉంటుంది. కానీ మెట్రోలకు సమీపంలో సేంద్రియ పంటలు పండించడానికి అనువైన భూమి అందుబాటులో ఉండదు.  
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతుల్లో సేంద్రియ పంటలు పండించే రైతులకు అధిక శిక్షణ అవసరమవుతుంది.  
పండించిన పంటలు పూర్తిగా సేంద్రియమైనవేనని సంబంధిత బోర్డులు నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేషన్‌ విధానం కాలహరణం, సంక్లిష్టం, ఖర్చుతో కూడుకున్నది. ఎగుమతులు చేయాలంటే అంతర్జాతీయ సంస్థలూ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. 

ఈ ఆహారాన్నే ప్రజలు ఎందుకు ఇష్టపడుతున్నారు?

ప్రకృతి ఆహారం

సేంద్రియ ఆహారంలో విటమిన్లు, మాంసకృత్తులు అధికంగా ఉంటాయి.  మనిషి ఆరోగ్యానికి ఇవి ఎంతో అవసరం.  
ఆహార పంటల ఉత్పత్తిలో రసాయనాలేవీ వాడరు కాబట్టి ఆహార సంబంధ ఆరోగ్య సమస్యలేమీ రావు. ప్రమాదకర హార్మోన్లేవీ వీటిలో ఉండవు. 
పండ్లు, కూరగాయల్లాంటివి తాజాగా ఉంటాయి కాబట్టి.. జనం వాటిని ఎక్కువగా ఇష్టపడతారు.  
సేంద్రియ పంటల్లో జన్యుమార్పిడికి అవకాశం లేదు కాబట్టి అవి సహజసిద్ధంగా ఉంటాయి.  
మిగతా ఉత్పత్తులతో పోల్చుకుంటే సేంద్రియ ఆహారం చాలా రుచిగా ఉంటుంది.  
ఎరువులు, రసాయనాల ఆహారం స్త్రీ, పురుషుల్లో సంతానరాహిత్యానికి  కారణమవుతుంది. శిశు జనన సమస్యలూ ఉంటాయి. అందువల్ల సేంద్రియ ఆహారం అవసరమవుతోంది.

ప్రకృతి ఆహారం

ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో.. అంటే దాదాపు 30% సేంద్రియ రైతులు భారతదేశంలో ఉన్నారు. కానీ ప్రపంచంలో సాగయ్యే 5.78 కోట్ల హెక్టార్ల సేంద్రియ పంటల్లో భారత్‌లో సాగవుతున్నది కేవలం 15 లక్షల హెక్టార్లలోనే(2.59%)! 

మొట్టమొదటి సేంద్రియ రాష్ట్రంగా సిక్కిం

ప్రకృతి ఆహారం

కేవలం సేంద్రియ పద్ధతుల్లోనే పంటలు పండిస్తున్న తొలి రాష్ట్రంగా సిక్కిం ప్రసిద్ధికెక్కింది. 2003 నుంచే ఈ రాష్ట్రంలో రైతులు ఎరువులు, పురుగుమందులు వాడటం మానేశారు. కేరళ, రాజస్థాన్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లాంటి మరికొన్ని రాష్ట్రాలు కూడా శీఘ్రగతిన సేంద్రియం వైపు మళ్లుతున్నాయి. ప్రపంచంలో ఓషియానా, ఐరోపా, లాటిన్‌ అమెరికా దేశాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని ఎక్కువగా చూడొచ్చు. 

విస్తరిస్తున్న జీరో బడ్జెట్‌ వ్యవసాయం

ప్రకృతి ఆహారం

సాగు ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్న- స్వల్ప ఖర్చుతో సహజ పద్ధతుల్లో చేసే వ్యవసాయం(జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌)పై ఇప్పుడు ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు జీరోబేస్డ్‌ వ్యవసాయం శరవేగంగా విస్తరిస్తోంది. రసాయనాల్లేకుండా ప్రకృతి ఆధారంగా చేసే వ్యవసాయం ఇది. ఒక్క కర్ణాటకలోనే దాదాపు లక్ష మంది రైతులు జీరో బడ్జెట్‌ వ్యవసాయం చేస్తున్నట్లు అంచనా. ‘జీవామృత’, ‘బీజామృత’, ‘మల్చింగ్‌’, మాయిశ్చర్‌ తదితర ప్రక్రియల ద్వారా జీరో బడ్జెట్‌ వ్యవసాయం చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. 

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.