close

ప్ర‌త్యేక క‌థ‌నం

అంతరిక్షయానానికి కౌంట్‌డౌన్‌

అంతరిక్షయానానికి కౌంట్‌డౌన్‌

భారతదేశం మొట్టమొదటిసారిగా చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్రకు ‘కౌంట్‌డౌన్‌’ మొదలైంది. దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ఇది సాకారమైతే అంతరిక్షంలోకి మానవుడిని పంపిన నాలుగో దేశంగా భారత్‌ అవతరిస్తుంది. 

అంతరిక్షయానానికి కౌంట్‌డౌన్‌

ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టును 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరిగే 2022లో  చేపట్టనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మానవసహిత యాత్రలో తోడ్పాటు కోసం రష్యా, ఫ్రాన్స్‌లతో భారత్‌ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. సన్నాహకంగా రెండు మానవరహిత యాత్రలను చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. ఇందులో మొదటిది 2020 డిసెంబర్‌ కల్లా నిర్వహించాలనుకుంటోంది. 
ఎందుకు? 
భవిష్యత్‌లో అంతరిక్ష యుగం మొదలవుతుంది. ఎలాంటి విపత్తులు ఎదురైనప్పటికీ మానవాళి మనుగడను కొనసాగించేలా చూడటానికి ఇతర గ్రహాల్లో అన్వేషణలు, భూమికి ప్రత్యామ్నాయ గ్రహాన్ని కనుగొనడం చాలా కీలకం. మానవసహిత యాత్రల వల్ల భారత్‌ ఆ దిశగా ముందడుగు వేస్తుంది.

 

అంతరిక్షయానానికి కౌంట్‌డౌన్‌

ఇవే కీలకం 
మానవసహిత అంతరిక్ష యాత్ర చాలా సంక్లిష్టం. ఇందుకోసం అనేక పరిజ్ఞానాలు అవసరం. ఇందులో ముఖ్యమైనవి వ్యోమగాములుండే క్రూ మాడ్యూల్‌, వారికి తోడ్పాటు అందించే సర్వీస్‌ మాడ్యూల్‌. ఈ రెండింటిని కలిపి ఆర్బిటల్‌ మాడ్యూల్‌ అంటారు. రోదసిలోకి వెళ్లేది ఈ భాగమే. 
క్రూ మాడ్యూల్‌లో వ్యోమగాముల మనుగడకు అవసరమైన వాతావరణ నియంత్రణ వ్యవస్థను సిద్ధం చేయాలి. వారి రక్షణకు స్పేస్‌సూట్‌ అవసరం. 
ప్రయోగ సమయంలో ప్రమాదం తలెత్తితే వ్యోమగాములు తప్పించుకోవడం కోసం క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ అవసరం. దీనివల్ల రాకెట్‌ నుంచి ఆర్బిటల్‌ మాడ్యూల్‌ క్షేమంగా విడిపోయి, సముద్రంలో పడుతుంది. 
రోదసి నుంచి తిరిగొచ్చేటప్పుడు వాతావరణ రాపిడి వల్ల 1600 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి తలెత్తే ఉష్ణోగ్రతను ఎదుర్కోవడం కీలకం. అందుకోసం వ్యోమనౌకలకు ప్రత్యేక ఉష్ణ కవచాన్ని ఏర్పాటు చేస్తారు. ఇందులో తలెత్తిన లోపం వల్ల 2003లో అమెరికాకు చెందిన కొలంబియా వ్యోమనౌక ధ్వంసమైంది. అందులో ఉన్న భారత అమెరికన్‌ వ్యోమగామి కల్పనా చావ్లా సహా ఆరుగురు మరణించారు.
కక్ష్యలో ప్రయోగాలు 
తొలి యాత్రలో భాగంగా దిగువ భూ కక్ష్యలో సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో వైద్య పరికరాలు, జీవపరమైన ఎయిర్‌ ఫిల్టర్లు, బయో సెన్సర్లు వంటి వాటిని వ్యోమగాములు పరీక్షించనున్నారు. జీవాధార వ్యవస్థ, బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ, విషతుల్య వాయువుల పర్యవేక్షణ తదితర అంశాలకు చెందిన పది ప్రయోగాలను నిర్వహించాలని ఇస్రో భావిస్తోంది.
ఒక్కొక్కటిగా.. 
ఈ యాత్రకు అవసరమైన కీలక పరిజ్ఞానాల అభివృద్ధి కోసం ఇస్రో 2004 నుంచే కసరత్తు మొదలుపెట్టింది.  2007లో స్పేస్‌ కాప్స్యూల్‌ రికవరి ఎక్స్‌పెరిమెంట్‌ ద్వారా భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే పరిజ్ఞానాన్ని పరీక్షించింది. నాడు 550 కిలోల వ్యోమనౌకను రోదసిలోకి ప్రవేశపెట్టి, తిరిగి భూమి మీదకు తీసుకొచ్చారు. ఆ ప్రయోగంలో తేలికపాటి ఉష్ణరక్షణ సిలికాన్‌ టైల్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. 
2014లో ‘క్రూ మాడ్యూల్‌ అట్మాస్పియరిక్‌ రీ ఎంట్రీ ఎక్స్‌పెరిమెంట్‌’ (కేర్‌)ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఇందులో 3745 కిలోల స్పేస్‌ క్యాప్స్యూల్‌ (వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యూల్‌కు సంబంధించిన నమూనా)ను జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 రాకెట్‌ ద్వారా వాతావరణంలోకి ప్రయోగించి, ఆ తర్వాత బంగాళాఖాతానికి క్షేమంగా రప్పించింది. 
ఈ ఏడాది జులై 5న ప్యాడ్‌ అబార్ట్‌ పరీక్షను ఇస్రో నిర్వహించింది. ప్రయోగ సమయంలో ప్రమాదం జరిగితే వ్యోమగాములను క్షేమంగా తప్పించడం దీని ఉద్దేశం. ఇందులో 12.5 టన్నుల బరువైన క్రూ మాడ్యూల్‌ రాకెట్‌ నుంచి విజయవంతంగా విడిపోయింది. 
వ్యోమగాములకు ఆహారాన్ని మైసూర్‌లోని రక్షణ ఆహార పరిశోధన లేబొరేటరీ రూపొందిస్తుంది. 
భారత వ్యోమగాములను వ్యోమనాట్‌ లేదా గగన్‌నాట్‌గా వ్యవహరించాలని భావిస్తున్నారు.
యాత్ర ఇలా.. 
7 టన్నుల బరువుండే ఆర్బిటల్‌ మాడ్యూల్‌ను భారీ ‘బాహుబలి రాకెట్‌’ జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3పై అమరుస్తారు. 
శ్రీహరికోట నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగిస్తారు. ప్రయోగించిన 16 నిమిషాలకు ఆర్బిటల్‌ మాడ్యూల్‌ దాదాపు 300-400 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ భూకక్ష్యలోకి చేరుతుంది. 
ఆ కక్ష్యలో ఏడు రోజుల పాటు వ్యోమనౌక ఉంటుంది. భూమిని పరిభ్రమిస్తూ ఉంటుంది. అందులోని వ్యోమగాములు నిర్దేశిత ప్రయోగాలు నిర్వహిస్తారు. 
ఏడో రోజు క్రూ మాడ్యూల్‌ తిరుగు ప్రయాణానికి సన్నద్ధమవుతుంది. గంటకు దాదాపు 28వేల కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అహ్మదాబాద్‌కు సమీపంలో అరేబియా సముద్రంలో కానీ బంగాళాఖాతంలో కానీ అవసరమైతే నేలపై కానీ దించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
బోలెడు ప్రయోజనాలు 
మానవసహిత యాత్ర వల్ల దీర్ఘకాలంలో 15వేల ఉద్యోగాలను సృష్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో 13వేల ఉద్యోగాలు పరిశ్రమల్లోను, మిగతావి విద్యా సంస్థల్లోను వస్తాయని అంచనా. 
దేశంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటాయి. ఈ ప్రాజెక్టు కోసం అభివృద్ధి చేసే పరిజ్ఞానాలు వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక భద్రత, కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ; నీరు, ఆహార వనరుల నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడతాయి. 
భవిష్యత్‌లో విశ్వాన్వేషణ కార్యక్రమంలో అమెరికా, రష్యా వంటి దేశాలతో కూడిన అంతర్జాతీయ కూటమిలో భాగస్వామిగా చేరడానికి వీలవుతుంది. అంతరిక్ష పర్యాటకం కోసం వాణిజ్య ప్రాతిపదికన పర్యాటకులను రోదసిలోకి తీసుకెళ్లే సామర్థ్యం సమకూరుతుంది. దీనివల్ల భారీగా ఆదాయం లభిస్తుంది.
స్పేస్‌సూట్‌ సిద్ధం 
వ్యోమగాముల కోసం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)తో కలసి స్పేస్‌సూట్‌ను ఇస్రో సిద్ధం చేసింది. ఇందులో ఒక ఆక్సిజన్‌ సిలిండర్‌ ఉంటుంది. వ్యోమగామికి 60 నిమిషాల పాటు ప్రాణవాయువును అందిస్తుంది.
వ్యోమగాముల ఎంపిక 
అంతరిక్షయానం చేసే వ్యోమగాముల ఎంపికను ఇస్రో మొదలుపెట్టనుంది. ఇందుకోసం భారత వైమానిక దళం, బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌ సంస్థతో కలసి పనిచేయనుంది. శిక్షణకు మూడేళ్లు పడుతుంది. మొదటి యాత్రలో కేవలం వైమానిక దళ పైలట్లనే ఎంపిక చేసే అవకాశం ఉంది. వ్యోమగాములకు మొదట భారత్‌లోను, ఆ తర్వాత రష్యాలోను శిక్షణ ఇవ్వనున్నారు. 
మానవసహిత యాత్రలు చేసిన దేశాలు 
1. సోవియట్‌ యూనియన్‌ 
2. అమెరికా  3. చైనా

భారత్‌ నుంచి ఇప్పటి వరకూ

రోదసిలోకి వెళ్లిన ఏకైక వ్యక్తి రాకేశ్‌ శర్మ.

1984 ఏప్రిల్‌ 2న ఆయన రష్యాకు చెందిన సోయజ్‌ టి-11 వ్యోమనౌక ద్వారా ఈ యాత్ర చేపట్టారు.

*భారత వ్యోమగాములను వ్యోమనాట్‌ లేదా 
గగన్‌నాట్‌గా వ్యవహరించాలని భావిస్తున్నారు.
-ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.