close

ప్ర‌త్యేక క‌థ‌నం

సడలనీకుమా.. నమ్మకం!

సడలనీకుమా.. నమ్మకం!

సడలనీకుమా.. నమ్మకం!

బ్యాంకులను నమ్మి మన డబ్బు వాటిలో దాచుకుంటాం.  డాక్టర్లను నమ్మి ఏకంగా మన ప్రాణాలే వాళ్లకు అప్పగించేస్తాం. మన రోజు మొత్తం ఇలా నమ్మకాల మీదే నడుస్తోంది.  కానీ ఇప్పుడీ నమ్మకాలు సడలి- విశ్వాసమన్నది కొత్త రూపం తీసుకుంటోంది.

నమ్మకం... మన సమాజానికి ఆయువుపట్టు!
మ్మకం లేకుండా మనకు రోజు కాదు గదా... క్షణం కూడా గడవదు. కానీ ఇటీవలి కాలంలో వ్యక్తుల మీదా, వ్యవస్థల మీదా ఈ నమ్మకం ఎక్కడో సడలిపోతోంది. ఆసుపత్రుల్లో గొడవలు, బ్యాంకుల మీద భయాలు, ఎటు చూసినా అనుమానాలు, అపనమ్మకాలు.. సమస్యగానే తయారవుతున్నాయి. మరోవైపు వాట్సాప్‌లో కుప్పలుతెప్పలుగా వస్తున్న సందేశాల్నేమో నిస్సంకోచంగా నమ్మేస్తున్నాం. ఇంటి పక్క దుకాణం కంటే ముక్కూముఖం తెలీని ఆన్‌లైన్‌ అమ్మకాలపై విశ్వాసం పెంచుకుంటున్నాం. నెట్‌లో కలిసే ఓ అపరిచిత బంధంపై విశ్వాసంతో సర్వం సమర్పిస్తున్నాం. వైద్యం నుంచి సినిమాల వరకూ ‘రేటింగ్‌’లు చూసి నమ్మటం అలవాటు చేసుకుంటున్నాం. మొత్తమ్మీద ఆన్‌లైన్‌ ప్రభంజనంలో కొట్టుకుపోతూ.. మనం సాటి మనుషుల కంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్నే ఎక్కువగా విశ్వసిస్తుండటం పెద్ద పరిణామం. ఇలా మనుషుల మధ్య ‘నమ్మకం’ సడలుతుండటం.. మనల్ని ఎటు తీసుకుపోతోంది? ఈ నూతన సంవత్సర ఆగమన ఘడియల్లో మన విశ్వాసాలను ఒక్కసారి తరచి చూసుకుని.. మన జీవితాల్ని మరింత భద్రం చేసుకుందామా??


నమ్మక తప్పదు..‘ఈ-మాయ’నీ!

సడలనీకుమా.. నమ్మకం!

లోకం ‘ఆన్‌లైన్‌’ మీద నడుస్తోందని నమ్ముతున్నాం. కానీ నిజం చెప్పాలంటే ఆన్‌లైన్‌ మీద కాదు.. ఆన్‌లైన్‌ మీద మనకున్న ‘నమ్మకం’ మీద నడుస్తోంది! ఎంత ఖరీదైన వస్తువైనా ఆన్‌లైన్లో బుక్‌ చేస్తాం. మంచిదే వస్తుందని నమ్ముతాం. ఒకప్పడు మనుషుల మీద ఉన్న నమ్మకాన్ని ఇప్పుడు దాదాపుగా ఇంటర్నెట్‌ మీద పెట్టేస్తున్నాం. ఇలా కళ్ల ముందున్న మన లోకం కంటే కూడా.. ఊరూవాడా లేని ఆన్‌లైన్‌ ప్రపంచాన్ని నమ్ముతుండటం ఆశ్చర్యమే. అందుకే ఈ విచిత్ర వైఖరిపై ఇప్పుడు అంతర్జాతీయంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అంత వరకూ ఫర్వాలేదుగానీ.. ఇప్పుడు మనం మరో మనిషిని నమ్మాలన్నా.. మరొకరు మనల్ని నమ్మాలన్నా కూడా.. ఆన్‌లైనే దిక్కయ్యే రోజు రావటం కీలకాంశం. ఈ పరిస్థితుల్లో మనం ‘విశ్వాస’ జీవులుగా.. ‘నమ్మకాన్ని’ సాంకేతిక పరిజ్ఞానం మనకు సాటి మనుషులను మించిన విశ్వాసాన్నీ, భరోసానూ ఇస్తోందా? అయితే  మనం దాన్ని గుడ్డిగా నమ్మగలమా? నిలబెట్టుకునేదెలా?

క్కసారి గూగుల్‌లో.. ‘హౌ టు ట్రస్ట్‌..’ అని టైప్‌ చేసి చూడండి.. కంపెనీని నమ్మేదెలా? టీమ్‌ను నమ్మేదెలా? అమ్మాయిని నమ్మేదెలా? కస్టమర్లను నమ్మేదెలా? ఇలా ఎంతోమంది వెతుక్కున్న వందలాది ప్రశ్నలు మన ముందు తెరుచుకుంటాయి. ‘ట్రస్ట్‌’ అన్నది నేటి సమాజం ముందున్న పెద్ద సవాల్‌ అని అర్థం చేసుకునేందుకు ఈ ప్రశ్నలకు మించిన పెద్ద నిదర్శనాలేం అక్కర్లేదు! ఎక్కడెక్కడి మనుషులనూ, సంస్థలనూ కలుపుతున్న ఆన్‌లైన్‌ వేదికలు పెరిగిన తర్వాత ‘నమ్మకం’ అన్నది మరింత సంక్లిష్టంగా తయారైంది. ఎదురుగా ఉన్న సాటి మనిషిని చూసి.. వాళ్ల ప్రవర్తన, మాటతీరు వంటివి గమనించి వారిని నమ్మటమా? లేదా? అన్నది గ్రహించటం మనకు జన్యుపరంగా, పరిణామంలో వచ్చిన కళ అంటారు శాస్త్రవేత్తలు. మనలో ఇలా క్షణాల్లో స్పందించే యంత్రాంగం ఉంది. దీనికి శాస్త్రీయమైన ఆధారాలూ ఉన్నాయి. ఇదంతా కూడా తరతరాలుగా, ముఖాముఖీ చూసుకోవటం వల్ల మనకు అబ్బిన విద్యలాంటిది. ఆన్‌లైన్‌కు వచ్చేసరికి ఈ విద్య ఎందుకూ పనికి రావటం లేదు. మరి ఈ ఆన్‌లైన్‌ యుగంలో మన నమ్మకం ఏమవుతోంది?

నమ్మకం ఒక సైన్స్‌!

సడలనీకుమా.. నమ్మకం!

విశ్వాసం అనేది ఒక మానసిక భావనే కావచ్చుగానీ.. దీనికి శాస్త్రీయమైన పునాది ఉంది. ఆదిమ మానవులు క్రూర మృగాల మధ్య బృందాలుగా తిరుగుతున్నప్పుడు ఒకరినొకరు నమ్మక తప్పని పరిస్థితి. నాటి నుంచీ కూడా మనుషుల మనుగడలో, మన సమాజ నిర్మాణంలో విశ్వాసానిదే కీలక పాత్ర! అందుకే మనం మరొకరిని బలంగా నమ్మినప్పుడు మన ఒంట్లో ఆక్సిటోసిన్‌ అనే హార్మోను విడుదలై, మనకు ఎంతో భరోసాగా, సంతృప్తిగా అనిపిస్తుంది. కాలిఫోర్నియాకు చెందిన క్లేర్‌మౌంట్‌ గ్రాడ్యుయేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు జక్‌ దాదాపు 15 ఏళ్ల పాటు క్రీడాకారులను, పలురకాల వృత్తుల వారిని తీసుకుని.. వాళ్లు ఇతరులను విశ్వసించినప్పుడు వారిలో ఆక్సిటోసిన్‌ స్థాయులు గణనీయంగా పెరుగుతున్నాయని గుర్తించారు. అప్పుడప్పుడు పొరబడినా.. మొత్తమ్మీద ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదన్నది పరిణామంలోనే మనకు ఒంటబట్టిన విద్య అని నిర్ధారణకు కూడా వచ్చారు.

విశ్వాసం మారిందిలా!

‘‘పూర్తిగా మన పనులన్నీ మనమే చేసుకోలేం! అందుకే మన సమాజం నమ్మకాల మీదే నిర్మాణమైంది’’ అంటారు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్నెట్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు లూసియానో ఫ్లోరిడి! మరో మాటలో చెప్పాలంటే.. విశ్వాసం లేకపోతే మన సమాజం, జీవితం కుప్పకూలిపోతాయి. ఆదిమకాలంలో చిన్నచిన్న సమాజాల్లో ఒకరినొకరు ముఖాముఖీ చూసుకున్నారు, విశ్వాసం నేర్చారు. కానీ పారిశ్రామిక విప్లవం తర్వాత మార్కెట్లు విస్తరించటంతో దానికి ఆధారం దొరక్కుండా పోయింది. అందుకే మధ్యవర్తులు, దళారులు, లాయర్లు, బీమా కంపెనీల వంటి వారంతా తెరపైకి వచ్చారు. క్రమేపీ మార్కెటింగ్‌ బృందాలు రంగంలో దిగి కంపెనీలు, బ్రాండ్లను నిర్మించటం మొదలుపెట్టాయి. విశ్వాసం వ్యక్తుల మీది నుంచి సంస్థలు, బ్రాండ్ల మీదకు మళ్లింది. ఆ కంపెనీల్లో మనకెవరూ తెలియకపోయినా వాళ్ల ఉత్పత్తులను నమ్మటం మొదలుపెట్టాం. ఆన్‌లైన్‌ విస్తరణతో ఈ-బే, అమెజాన్‌ వంటి కంపెనీలు మార్కెట్లోకి వచ్చి, ‘ఆన్‌లైన్లో అమ్మకాలను కూడా నమ్మొచ్చు’ అన్న కొత్త విశ్వాసం బలంగా నిలబడేలా చేశాయి. ‘ట్రస్ట్‌ బిల్డింగ్‌’ అన్న ప్రత్యేక విభాగాలే రంగంలో దిగాయి. ఇలా ఆధునిక కాలంలో ప్రజల విశ్వాసాన్ని ఇంటర్నెట్‌ విపరీతంగా ప్రభావితం చేయటం ఆరంభించింది. ఒకప్పటిలా ఇప్పుడు ప్రభుత్వం చెప్పిందనో, నిపుణులు చెప్పారనో ఒకదాని పట్ల విశ్వాసం పెంచుకోవటమన్నది తగ్గింది. ఆన్‌లైన్‌ రేటింగ్‌లు, పాజిటివ్‌ రివ్యూలు, ఫీడ్‌బ్యాక్‌లు, వాట్సాప్‌ సందేశాలు, బ్లాగ్‌ వ్యాఖ్యానాల వంటివన్నీ కీలకమవుతున్నాయి. ఈ ఆన్‌లైన్‌ వేదికలు.. ‘‘ముఖపరిచయం లేకపోయినా మళ్లీ ఒకప్పటిలా ప్రజలే ఒకరికొకరు సమాచారం ఇచ్చిపుచ్చుకునేలా చూస్తున్నాయి’’ అంటున్నారు ఆన్‌లైన్‌ అధ్యయనవేత్తలు. వ్యక్తిగత విశ్వాసాలకు కూడా ఇదే ఇప్పుడు పునాది అవుతుండటం విస్మరించలేని వాస్తవం.

వ్యక్తిగతం.. ఇక వట్టి గతం!

ఇంటర్నెట్‌ యుగంలో ‘వ్యక్తిగతం’ అనేదేమీ ఉండదు! మన జీవితమంతా ప్రొఫైల్స్‌, పిక్చర్స్‌, కామెంట్లు, లైక్‌లు, సీవీలు, బయోల రూపంలో ఆన్‌లైన్లో ఎక్కడో చోట నమోదైపోతోంది. ఈ డిజిటల్‌ జీవితం ఆధారంగా ఎవరైనా, ఎక్కడ నుంచైనా మన గురించి తెలుసుకోవచ్చు. అందుకే ఆన్‌లైన్లోనే మనుషుల గురించి వెతకటం ఎక్కువైపోతోంది. ఇలా ఇతరుల గురించి మనం, మన గురించి ఇతరులు అన్నీ తెలుసుకుని ‘నమ్మకం’ పెంచుకునే వీలు చిక్కుతోంది! అంతేకాదు కోటానుకోట్ల పేజీలను వెతికి మనమేంటో పట్టుకునే ‘ట్రూలీ’ వంటి సాఫ్ట్‌వేర్‌లు రంగం మీదికి వస్తున్నాయి. రకరకాల కార్డులు, ఖాతాల నుంచి, సోషల్‌ మీడియా, పోలీసు రికార్డుల నుంచి, ఇంటర్నెట్‌లో ఎక్కడెక్కడో ఉండే సమాచారం మొత్తం గాలిస్తాయీ సాఫ్ట్‌వేర్లు. అసలు ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడన్నది కూడా ముందే ఊహించి, ఎవరిని నమ్మచ్చో, నమ్మకూడదో కూడా ఈ సాఫ్ట్‌వేర్లే మనకు చెప్పే రోజులు వస్తున్నాయి. దీనివల్లే మనం ముక్కూమొహం తెలీని వాళ్ల కారులో నమ్మకంగా ఎక్కచ్చు, ఆన్‌లైన్లో ఎవరెవరికో నమ్మకంగా అమ్ముకోవచ్చు. కానీ రేపటి రోజున మన మధ్య పరస్పర విశ్వాసానికి, సాటి మనుషుల్ని నమ్మేందుకు కూడా ఇలా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌నే నమ్మే పరిస్థితి రావటం ఆందోళనకరమే అయినా అనివార్యం అంటున్నారు నిపుణులు!

యంత్రుడే దిక్కనుకుంటే..?

సడలనీకుమా.. నమ్మకం!

రోబోలూ, కృత్రిమ మేధ పరిజ్ఞానం మన మధ్య విస్తరిస్తున్న కొద్దీ.. మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా నమ్మక తప్పదు. ఉదాహరణకు డ్రైవర్‌ రహిత కార్లు! బిక్కుబిక్కు మంటూ కాదు.. ఎంతో నమ్మకంగా వాటిలో కూర్చుని ప్రయాణం చెయ్యాల్సి వస్తుంది. అలాగే వ్యాధులను నిర్ధారించే సాఫ్ట్‌వేర్లు, అల్గోరిథమ్స్‌, మనకు సంబంధించిన రకరకాల నిర్ణయాలు తీసుకునే రోబోలు పెరుగుతున్నాయి. ఇవి విస్తరించే కొద్దీ మనం యంత్రాల మీద నమ్మకం పెంచుకోక తప్పదు. అలాగని ఈ సాంకేతికతను అతిగా నమ్మితే మనకే నష్టం. 2017 చివర్లో జరిగిన ఒక అధ్యయనంలో.. జనం అత్యవసర సమయంలో ఒక రోబో చూపిన దారిలో వెళ్లేందుకే ఎక్కువగా ఇష్టపడ్డారు... అది తప్పు దారి చూపిస్తున్నా కూడా! అందుకే దేన్నీ గుడ్డిగా మన్మకుండా మన జాగ్రత్తలో మనం ఉండటం ముఖ్యమంటున్నారు రేచల్‌ బోట్స్‌మన్‌, ‘హూ కెన్‌ యు ట్రస్ట్‌’ రచయిత.

విశ్వాసానికి బాధ్యత!

సడలనీకుమా.. నమ్మకం!

* వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రేమలు, సామాజిక బంధాలన్నింటికీ మన ‘డిజిటల్‌ జీవితమే’ కీలకం కాబోతోంది. మనం ఏనాడో ఎక్కడెక్కడో చేసిన వ్యాఖ్యానాలు, రాతల వంటివన్నీ నెట్‌ మాళిగల్లోంచి ఎక్కడెక్కడి నుంచో తవ్వితీసే అత్యాధునిక   సాఫ్ట్‌వేర్లు వస్తున్నాయి.
* అప్పుల నుంచి బిల్లుల వరకూ ప్రతిదీ మనం సమయానికి కడతామా? లేదా? అన్నది తేల్చి చెప్పి.. వ్యక్తులుగా మనం ఎలాంటి వారమన్నది తేలికగా నిర్ధారించే రోజు వచ్చేసింది. మనం చూసే వీడియోల నుంచి కొనే పుస్తకాల వరకూ ప్రతిదీ మన గురించి, మన అభిరుచుల గురించి ఎంతోకొంత చెబుతుంది.
* వ్యక్తులుగా మన ‘విశ్వసనీయత’ను సాఫ్ట్‌వేర్లే నిర్ధారించే రోజు వస్తోంది. కాబట్టి ఆన్‌లైన్‌లో  గడిపే ప్రతి క్షణం మనం బాధ్యతాయుతంగా ఉండటం చాలా అవసరం.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.