close

ప్ర‌త్యేక క‌థ‌నం

రాజకీయ రణరంగంలో బయోపిక్‌ల సందడి

ప్రముఖ రాజకీయ నేతలపై డజను వరకు
సిద్ధమవుతున్న చలన చిత్రాలు

న్నికల వేళ మాటల తూటాలు, ప్రచార ఆర్భాటాలు, జెండాలు, అజెండాలతో నెలకొనే కోలాహలం అందరికీ తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో సరికొత్త సందడి కనిపించనుంది. అవే.. బయోపిక్‌లు. దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలకు సంబంధించి డజనుదాకా బయోపిక్‌లు వెండితెరపై కనువిందు చేయనున్నాయి. కొందరు నేతలపై ఏకంగా రెండు మూడు సినిమాలు వస్తుండటం విశేషం. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై రూపొందించిన చిత్రం ఇప్పటికే ఆరోపణలు, ప్రత్యారోపణలకు తెరలేపింది. ఈ క్రమంలో బాక్సాఫీసు డైలాగులు, వ్యంగ్యాస్త్రాలతో వేడెక్కనుంది.

మన్మోహన్‌సింగ్‌
‘ద యాక్సిడెంటల్‌ ప్రైమ్‌మినిస్టర్‌’ పేరిట రూపొందించిన ఈ బయోపిక్‌ జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

జయలలిత
తమిళనాట ‘అమ్మ’గా రాజకీయాలను శాసించిన అన్నాడీఎంకే నాయకురాలు, దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ల పర్వం కూడా ఆసక్తి రేపుతోంది. ఆమె జీవితం ఆధారంగా ఇప్పటికే మూడు చిత్రాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. జయలలితగా ప్రముఖ కథానాయిక నిత్యా మేనన్‌ నటిస్తున్న ‘ఐరన్‌ లేడీ’, ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ రూపొందించబోతున్న మరో చిత్రంతోపాటు రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారిగా గౌతమ్‌ మేనన్‌ చేస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌ జయలలిత జీవితాన్ని ఆవిష్కరించబోతున్నాయి.

బాల్‌ ఠాక్రే
మరాఠా రాజకీయ దిగ్గజం, శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే జీవితకథతో రూపొందించిన ‘ఠాక్రే’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఠాక్రే పాత్రలో బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రం ఇటీవలే బయటికొచ్చింది. అప్పుడే వివాదాలు కూడా మొదలయ్యాయి. దక్షిణాది వారిని ద్వేషించేలా సంభాషణలున్నాయంటూ తమిళ కథానాయకుడు సిద్ధార్థ్‌ ట్విటర్‌ వేదికగా నిరసన వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలపై సెన్సార్‌ బోర్డు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది.

నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్‌ కూడా తెరపైకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ నటుడు, భాజపా నేత పరేష్‌ రావల్‌ ఈ చిత్రం గురించి ఈ ఏడాదే వెల్లడించారు. ఆయన మోదీ పాత్రలో నటించబోతున్నారు. ప్రధానిగా మోదీ పనితీరును కీర్తించేలానే ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌

తెదేపా వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన దివంగత ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా రెండు బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్‌ రూపొందిస్తున్న ‘ఎన్టీఆర్‌’ రెండు భాగాలుగా విడుదలవుతుండగా, రామ్‌గోపాల్‌వర్మ ‘లక్ష్మీస్‌ఎన్టీఆర్‌’ పేరుతో మరో చిత్రాన్ని తీసుకొస్తున్నారు.

వైఎస్‌ఆర్‌

మ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన దివంగత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రధానంగా ఇందులో వైఎస్సార్‌ చేసిన పాదయాత్రను చూపనున్నారు. వైఎస్‌ పాత్రను మలయాళ నటుడు మమ్ముట్టి పోషిస్తున్నారు.

కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ‘తెలంగాణ దేవుడు’ పేరిట రూపొందిస్తున్న చిత్రంలో కేసీఆర్‌ పాత్రను కథానాయకుడు శ్రీకాంత్‌ పోషిస్తున్నారు. ‘ఉద్యమసింహం’ పేరిట మరో చిత్రం సిద్ధమైంది. ఇవి కాకుండా మరి కొన్ని చిత్రాలు రానున్నట్లు తెలుస్తోంది.
- ఈనాడు, సినిమా విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.