close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఈ టైమ్‌ మీదే

ఈ టైమ్‌ మీదే

..‘సారీ నాకు టైమ్‌ లేదు’.. ‘ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి’..  ‘డెడ్‌లైన్‌ను అందుకోలేనేమోనని భయంగా ఉంది’... ఈ రోజుల్లో ఎవర్ని కదిపినా వినిపించే మాటలివి. ఉరుకుల పరుగుల యుగం సృష్టించిన జీవన అనివార్యత ఇది. కాలం వంతెనపై నుంచి కాంతిమయ జీవితాన్ని అందుకునేందుకు మనిషి పడుతున్న ఆరాటమిది. ఒక్కో క్షణాన్ని సద్వినియోగం చేసుకునే తీరు మన భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. సమయంతో సంబంధం లేకుండా ఏ పనీ జరగదు. అంతటి విలువైన సమయాన్ని మనం ఎంత సమర్థంగా వినియోగించుకుంటున్నాం? ఎంతటి ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తున్నాం? అని ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయం ఇది. ఇంకో కొత్త ఏడాది వచ్చింది. ప్రతి క్షణాన్ని ప్రయోజనకరంగా మలచుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెబుతోంది. సమయం సరిపోదంటూ ఆందోళన చెందొద్దని, ఉన్న టైమ్‌ను నిర్మాణాత్మకంగా వినియోగించుకోవాలని హితబోధ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏ పనికి ఎంత సమయం కేటాయించాలి? ఏ పనిని మొదట పూర్తిచెయ్యాలి? ఏది లక్ష్యం కావాలి? దేన్ని అలక్ష్యం చేయాలి?

ఈ టైమ్‌ మీదే

సమయం ఉంది మిత్రమా!

టైమ్‌ మేనేజ్‌మెంట్‌... అమ్మో నా వల్ల కాదు!
ఆ సమయపాలన సూత్రాలన్నీ ఎవరు వింటారు.. లక్ష్యాలను రాసుకోమని.. రోజూ పొద్దునే వాటిని చూసుకోమని.. ఏవేవో చెబుతుంటారు.. అవన్నీ పాటించటం సాధ్యమయ్యేదేనా? అసలు నాకు టైమ్‌ ఉంటేనే కదా.. మేనేజ్‌ చేసుకోవటానికి? టైమ్‌ చాలక చస్తుంటే మధ్యలో ఈ గోల ఒకటా..?

* * * 

ఈ వ్యాఖ్యానాలకు.. ప్రశ్నలకు.. కామెంట్లకు అంతు ఉండదు. ఎవరిని కదిపినా టైమ్‌ చాలటం లేదు.. టైమ్‌ ఎక్కడుందండీ.. అనేవాళ్లే. ఒకవైపు టైమ్‌ లేదంటుంటారు.. మరోవైపు ‘టైమ్‌ మేనేజ్‌మెంట్‌’ గురించి చెబితే మాత్రం వినటానికి ఇష్టపడరు.

* * * 

ఎవరికైనా రోజులో ఉండేది 24 గంటలే. ఈ భూమ్యాకాశాలు బద్దలైనా కాల ప్రవాహం మాత్రం ఆగదు. పరుగులుపెట్టే టైమ్‌ను మనం తల్లకిందులుగా తపస్సు చేసినా పెంచలేం.. ఉన్న దాన్ని సద్వినియోగం చేసుకోవటం తప్పించి! అందుకే అవునన్నా కాదన్నా.. మనందరం టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నేర్చుకోవాల్సిందే!

* * * 

కాకపోతే గుడ్డిగా పనులు చేసుకుంటూ పోతుంటామా... లేకపోతే ఈ రంగంలో ఇప్పటికే విస్తృతంగా కృషి చేసిన వాళ్ల అనుభవం నుంచి ఎంతోకొంత నేర్చుకుని మన జీవితాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దుకుని, సంతోషంగా ఉంటామా? అన్నది కీలకం.

* * * 

ఒకప్పుడు ఒక పని చెయ్యాలనుకుంటే మనసు పూర్తిగా దానిపైనే లగ్నం చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కూర్చుంటామో లేదో.. ఫోన్‌ మోగుతుంది. టింగున వాట్సాప్‌ పలకరిస్తుంది. ఇంతలో టీవీలో సీరియల్‌ ఆరంభమవుతుంది. ఇలా ఒకప్పటి కంటే ఇప్పుడు మన టైమ్‌ను హరించి వేసే వ్యవహారాలు ఎక్కువే అయ్యాయి. అందుకే నేడు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ మీద దృష్టి పెట్టకపోతే.. ఏళ్లూపూళ్లూ గడిచిపోయిన తర్వాత చివరికి మనం అనుకున్నవేం చెయ్యలేకపోయామే.. అంతా వృథా అయిపోయిందే.. అన్న చింత మొదలవుతుంది. అందుకే ‘టైమ్‌ మేనేజ్‌మెంట్‌’ గురించి మనం తప్పనిసరిగా ఆలోచించాల్సిందే. అందుకు ఈ కొత్త సంవత్సర ఆరంభ ఘడియలను మించిన మంచి ముహూర్తం ఏముంటుంది...?

ఈ టైమ్‌ మీదే

సంకెళ్లు కాదు..

చాలామంది టైమ్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో ఒక ప్రణాళిక వేసుకుంటే జీవితంలో స్వేచ్ఛ అంతా పోతుందని, అనవసరమైన హడావుడి పెరుగుతుందని భావిస్తుంటారుగానీ అది నిజం కాదు. సమయ పాలన సరిగ్గా ఉంటే పనులన్నీ సమర్థంగా అయిపోతూ.. మనకు మరింత స్వేచ్ఛాసమయం చిక్కుతుంది. దానివల్ల హడావుడి తగ్గి, ఏకాగ్రత పెరిగి.. మరింత సమర్థంగా  పని చేసుకోగలుగుతాం!

21 రోజులు!

మనం దైనందిన జీవితంలో ఏదైనా కొత్త అలవాటు స్థిరపడటానికి కనీసం 21 రోజులు పడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఉదయాన్నే లేవటం నుంచి రోజూ పుస్తకం చదవటం వరకూ ఏదైనా కొత్త పని అలవాటు చేసుకోవాలంటే నిదానంగా, రోజూ చేస్తూ ఉండటం ముఖ్యమని గుర్తించాలి!

చిట్కాలు కాదు.. సిద్ధాంతాలు!

టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి  స్టీఫెన్‌ కవి వంటి అంతర్జాతీయ నిపుణులు చెప్పే సూత్రాలు బోలెడన్ని వినపడుతుంటాయి. పైకి ఇవన్నీ చిన్నచిన్న చిట్కాలుగా అనిపించినా టైమ్‌ మీద ఎంతో సమయం వెచ్చించి, పరిశోధించి నిపుణులు గుర్తించిన సిద్ధాంతాలివి. వీటిలో అందరికీ అన్నీ పాటించటం కుదరకపోవచ్చు.. కానీ కుదిరినవాళ్లు వీటిని వినియోగించుకుంటే సత్ఫలితాలనే అందుకోవచ్చు!

పోమోడొరో విధానం: కాలంతో పోటీ పడి దానికి వ్యతిరేకంగా పరుగెత్తే ప్రయత్నం చెయ్యొద్దు.. ఉన్న సమయాన్నే సమర్థంగా వినియోగించుకోండని ప్రోత్సహించటం ఈ విధానం ప్రత్యేకత. మన పని గంటలు మొత్తాన్ని 25 నిమిషాల చొప్పున విడగొట్టుకుని.. ప్రతి 25 నిమిషాల తర్వాతా 5 నిమిషాల బ్రేక్‌ తీసుకుని మళ్లీ పనిలో నిమగ్నమవ్వమని చెప్పే విధానం ఇది. ఆ మధ్య వ్యవధులనే ‘పోమోడొరోస్‌’ అంటారు. ప్రతి 4 పోమోడొరోస్‌ తర్వాత దాదాపు 15-20 నిమిషాల లాంగ్‌ బ్రేక్‌ తీసుకోమని సూచిస్తారు. చదువు, ఆఫీసు పని ఒత్తిడి వంటివి ఎక్కువగా ఉన్నప్పుడు అద్భుతంగా ఉపయోగపడే విధానం. మధ్యమధ్య మనం తీసుకునేది విరామమే అయినా.. అది గడిచిపోతున్న సమయాన్ని మనకు గుర్తుచేస్తుంటుంది. పని పూర్తి చెయ్యటానికి మనకు రోజంతా టైముంది కదా.. అన్న బేఖాతర్‌ ధోరణి దరి జేరకుండా చూస్తుంది. పైగా విరామం తీసుకుంటూ ఉంటాం కాబట్టి అలిసిపోయిన భావనా దరి జేరదు.

కాన్‌ మారీ విధానం: జపాన్‌కు చెందిన ఆర్గనైజింగ్‌ కన్సల్టెంట్‌ మారీ కాండో సూచించిన ఈ విధానం ప్రధానంగా ఇంటినీ, ఆఫీసునూ సమర్థంగా నిర్వహించుకునేందుకు ఉద్దేశించినదైనా దీన్ని టైమ్‌ మేనేజ్‌మెంట్‌కు కూడా ఉపయోగించుకోవటం మంచిదని చెబుతున్నారు నిపుణులు. మన జీవితాల్లో సంతోషాన్నీ, సంతృప్తినీ ఇవ్వని వస్తువులూ, పనులన్నింటినీ నిర్దాక్షిణ్యంగా మన కళ్ల ముందు నుంచి తీసిపారెయ్యటం ఈ విధానం ప్రత్యేకత. మనం వేసుకునే బట్టల నుంచి వంటగదిలోని సామాన్ల వరకూ.. పుస్తకాల నుంచి పేపర్ల వరకూ.. మనకు సంతోషాన్నీ, తృప్తినీ ఇవ్వని వ్యర్థాలన్నింటినీ తీసేయాలి. మెయిళ్లు, మెసేజ్‌లు, ఫోన్లు, టీవీల వంటివి కూడా దీని కిందికే వస్తాయి. వాటిని తీసెయ్యటం వల్ల మన దృష్టి కేవలం అవసరమైన, తృప్తినిచ్చే వాటి మీదే తదేకమవుతుంది, మనసును మరింతగా లగ్నం చెయ్యగలుగుతామన్నది సూత్రం. ముఖ్యంగా తరచూ సమయం వృథా చేసే వ్యసనాలు, మనం ఏదైనా మిస్సవుతున్నామేమో.. (ఫోమో - ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌) అన్న నెగిటివ్‌ భావన తొలగిపోతాయి. అవన్నీ లేకపోయినా జీవితానికేం నష్టం ఉండదు, పైగా నిశ్చింతగా ఉంటుందన్న భావన వల్ల మనం పనికొచ్చే విషయాల మీద మెరుగ్గా దృష్టి పెట్టగలుగుతాం.

కవి చెప్పిన సూత్రం: మనం చేయాల్సిన పనుల్లో కొన్ని అత్యవసరం అయినవి, కొన్ని అత్యవసరం కానివి... అలాగే ముఖ్యమైనవి, ముఖ్యంకానివి ఉంటాయి. ఏది అత్యవసరంగా చేయాలి? దేన్ని నింపాదిగా చేయొచ్చు? దేన్ని పూర్తిగా పరిహరించొచ్చు? అనేది ప్రణాళికా బద్ధంగా నిర్ణయించుకుని.. పని ప్రాధాన్యానికి అనుగుణంగా సమయ విభజన చేసుకుంటే అనుకున్న లక్ష్యాల్ని సాధిస్తామని చెబుతారు ప్రముఖ మేనేజ్‌మెంట్‌ నిపుణుడు స్టీఫెన్‌ ఆర్‌.కవి. అందుకోసం ఆయన అత్యవసరంగా చేయాల్సిన ముఖ్యమైన పనులు(క్వాడ్రంట్‌ 1), అంత అత్యవసరం కాని ముఖ్యమైన పనులు(క్వాడ్రంట్‌ 2), అవసరమే కానీ.. ముఖ్యంకాని పనులు(క్వాడ్రంట్‌ 3), అత్యవసరమూ, ముఖ్యమూ కాని పనులు(క్వాడ్రంట్‌ 4) అంటూ ఓ ప్రాధాన్య మాత్రిక (ప్రయారిటీ మ్యాట్రిక్స్‌) తయారుచేశారు. వీటిలో మొదటి క్వాడ్రంట్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన సూచన. అత్యవసరమూ, ముఖ్యమూ రెండూ కాని పనుల్ని సాధ్యమైనంత వరకు మినహాయిస్తే ఉత్తమం. అనేక పనుల్ని ముందేసుకుని.. దేనికీ నిరిష్ట సమయాన్ని కేటాయించకలేకపోవడం పెద్ద లోపమని ఆయన చెబుతారు.

1 లేవాలంటే లేవాలి. అంతే!

జీవితంలో మనం వాయిదా వెయ్యటానికి అవకాశమున్న తొట్టతొలి అంశం- లేవటం! కాస్సేపాగి లేద్దాంలే.. అని అలారం కట్టేసి.. వాయిదా వేసుకుంటూ పోవటంతో రోజు మొదలైతే.. ఆ రోజంతా మనకు తెలియకుండానే అన్నీ ఎంతోకొంత వాయిదా పడిపోతుంటాయి. అందుకే టైముకి లేవటం.. సమయ పాలనలో మొదటి మెట్టు.

2 ముగింపు సమయం!

చాలామంది ప్రణాళిక వేసుకుంటారుగానీ.. మొదటి పనితోనే రోజంతా గడిచిపోతుంది. దాన్నుంచి ముందుకే వెళ్లరు. ప్రతి పనీ.. అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే తీసుకుంటూ ఉంటుంది. దానర్థం ప్రణాళిక సరిగా లేకపోయి ఉండాలి, లేదా అనవసరంగా ఎక్కువ సమయమైనా తీసుకుంటూ ఉండాలి. ప్రణాళిక ప్రకారం పనులు ముగించటం.. సమయపాలనకు కీలకం. దేనికి ఎంత సమయం పడుతుందో ఉజ్జాయింపుగానైనా అంచనా వెయ్యగలగటం.. మొత్తం సమయ పాలనకే కీలకం.

3 వెనక్కి లాగేవి గుర్తించాలి

రోజూ ఫోన్‌ ఛార్జరో, పుస్తకమో, బస్‌ పాసో  మర్చిపోతుంటాం, దాని కోసం మళ్లీ వెనక్కి వెళుతుంటాం. అలాగే చదువుకునేటప్పుడు తరచూ పేర్లు, తారీఖలు మర్చిపోతూ మళ్లీ పాతపేజీలే తిరగేస్తుంటాం. ఇలా మనల్ని రోజూ వెనక్కి లాగుతున్నవేమిటో గుర్తించి వాటిని దిద్దుకోవటం వల్ల సమయం చాలా ఆదా అవుతుంది.

4 మన ముహూర్తం మనదే

కొందరు రాత్రి, కొందరు ఉదయం.. ఇలా రోజులో ఏదో ఒక సమయంలో బాగా పని చేయగలుగుతుంటారు. అలాగే ఒక్కో రకం పని ఒక్కో సమయంలో బాగా చెయ్యగలుతుంటారు. తమ సామర్థ్యం ఏ సమయంలో బాగుంటుందో గుర్తించి ప్రణాళిక వేసుకోవటం పెద్ద ముందడుగు!

5 నేడు నిన్నే సిద్ధం!

ఉదయాన్నే లేవగానే అల్పాహారం ఏం తినాలో నిన్న రాత్రి భోజనం ముగించుకుని, పడుకునే సమయంలోనే ఆలోచించి పెట్టుకుంటే పొద్దున్నే తర్జనభర్జన ఉండదు, సమయం ఆదా అవుతుంది. ఇది ఒక్క ఉదయపు అల్పాహారానికే కాదు.. రేపటి ప్రణాళిక ఈ రాత్రే సిద్ధంగా ఉంటే మన పనులన్నీ టకటకా అయిపోతుంటాయి.

6 ఇంకొక్కటి... అనొద్దు

మెయిల్సో, వీడియోలో చూస్తుంటాం. సమయానికి నిర్దాక్షిణ్యంగా ఆపెయ్యాలి. ఇంకొక్కటి చూద్దామని అనుకుంటూ సమయాన్ని విస్తరించుకుంటూ పోయామో.. టైమ్‌ మన అదుపు తప్పుతుంది! ఒకదాని ప్రభావం మరో పని మీద పడి మొత్తం ప్రణాళికే తప్పుతుంది. అంతిమంగా అసంతృప్తి భావన మిగులుతుంది.

7 సమయానికీ ఖరీదు ఉంటుంది

ప్రతి వస్తువుకూ ధర ఉన్నట్లే జీవితంలో మనం గడిపే ప్రతి క్షణానికీ విలువ ఉంటుంది. పైగా ఇది వృధాగా పోతే మళ్లీ తిరిగిరాని సంపద. అయితే సమయం చూసుకుంటూ విపరీతమైన ఆందోళన పెంచుకోవటం కాకుండా.. అంతిమంగా మనకు సంతోషాన్నిచ్చే పనిలో గడపాలి.

ఈ టైమ్‌ మీదే

ఈ టైమ్‌ మీదే

 
 
 
 
 
 
 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.