close

ప్ర‌త్యేక క‌థ‌నం

‘ఆయుష్మాన్‌’తో ఎక్కడైనా వైద్యసేవలు

పథకానికి ఎన్టీఆర్‌ ట్రస్టు  సేవల స్ఫూర్తి
ట్రస్టు సేవల రుసుముల్లో  60% కేంద్రం చెల్లింపు
ఏపీలో 55లక్షల మందికి వర్తింపు
ఆయుష్మాన్‌ భారత్‌  సీఈవో ఇందు భూషణ్‌తో  ‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూ
ఈనాడు - అమరావతి

యుష్మాన్‌ భారత్‌-ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన(పీఎం-జేఏవై) పరిధిలో అర్హులు దేశవ్యాప్తంగా వైద్యసేవలు పొందవచ్చని ఆ పథకం సీఈవో డాక్టర్‌ ఇందుభూషణ్‌ వెల్లడించారు. ఇప్పటికే నిత్యం ఈ పథకం ద్వారా కనీసం పదివేలమంది రోగులు ప్రయోజనం పొందుతున్నట్లు చెప్పారు. నేటివరకు ఏడులక్షల మంది పేదలకు రూ.800కోట్ల విలువైన వైద్యసేవలు అందినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్మాన్‌ భారŸత్‌ పథకం ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆయన ఆదివారం ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత సెప్టెంబరు 23న దేశవ్యాప్తంగా మొదలైన ఈ పథకం త్వరలో వంద రోజులు పూర్తి చేసుకోబోతున్నట్లు చెప్పారు. ఒడిశా, దిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ పథకం ప్రారంభమైతే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లేనని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ భేష్‌!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు ద్వారా 1.25 కోట్ల కుటుంబాలకు ఏటా 2.5లక్షల విలువైన ఉచిత వైద్యసేవలు అందుబాటులో ఉండడం స్వాగతించాల్సిన విషయం. దీని ప్రభావం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం రూపకల్పనపై ఉంది. రాష్ట్రంలో ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా అందుతున్న వైద్యసేవల తీరును అధ్యయనం చేశాం. పటిష్ఠ సాంకేతిక విధానాన్ని ఇక్కడ అమలుచేస్తున్నారు. ఈ పథకం మార్గదర్శకాలనూ పరిగణనలోకి తీసుకున్నాం. ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభం కావడం సంతోషాన్నిస్తోంది.

16వేల ఆసుపత్రుల్లో వైద్యసేవలు
ఆయుష్మాన్‌ భారత్‌ కింద రాష్ట్రంలో 55లక్షల కుటుంబాలకు ఏడాదికి రూ.5లక్షల విలువైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సలు అందుతున్నాయి. కేంద్రం ఎంపికచేసిన 55లక్షల కుటుంబాలు 1.25కోట్ల కుటుంబాల్లోనే ఉన్నాయి. ఈ 55లక్షల కుటుంబాల్లో ఎవరైనా వైద్యసేవలు పొందితే అందుకయ్యే మొత్తంలో 60% వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెల్లిస్తోంది. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం తగ్గుతుంది. దేశవ్యాప్తంగా 16వేల ఆస్పత్రుల్లో ఆయుష్మాన్‌ సేవలు అందుతున్నాయి.ఇందులో ప్రైవేట్‌ ఆసుపత్రుల సంఖ్య 8807.

3, 4 కుటుంబాలకే రూ.5లక్షల సేవలు
ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి నేటివరకు రూ.5లక్షల విలువైన వైద్యసేవలు పొందినవి కేవలం మూడు, నాలుగు కుటుంబాలే. రూ.50వేల వైద్యసేవలు పొందినవే ఎక్కువ. రూ.800కోట్ల వైద్యసేవలను పేద రోగులు పొందారు. ఇందులో కార్డియాలజీ, కార్డియో థొరాసిక్‌, వాస్క్యులర్‌, యాంజియోప్లాస్టీ, వాల్వు రీప్లేస్‌మెంట్‌ వంటి వైద్యసేవలకు అయిన మొత్తం దాదాపు రూ.297 కోట్లు. రూ.5లక్షల బీమా సౌకర్యం అందజేయటం ద్వారా పేదలకు ధీమా లభిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడుల్లో ఈ పథకం చురుగ్గా సాగుతోంది. ఉచిత పథకమే లేని ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఆయుష్మాన్‌ గురించి ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతోంది. ఇన్‌పేషంట్లకు మాత్రమే ఈ వైద్యసేవలు అందుతాయి.

30లక్షల మందికి ఈ-కార్డులు
ఆయుష్మాన్‌కి అర్హులైనవారు ఏ రాష్ట్రంలోనైనా అనుబంధ గుర్తింపున్న ఆసుపత్రుల నుంచి వైద్యసేవలు పొందవచ్చు. దీనివల్ల అన్ని రాష్ట్రాలు ఈ పథకం అమలుకు సహకరిస్తే పేదలకు ప్రయోజనాలు లభిస్తాయి. ఒడిశా, తెలంగాణ, దిల్లీలో రాజకీయ కారణాల వల్ల పథకం అమల్లో జాప్యం జరుగుతోంది. త్వరలో పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాం. ఆయుష్మాన్‌ కింద అర్హులైన వారిలో 30 లక్షల మందికి ఈ-కార్డుల మంజూరు వివిధ దశల్లో ఉంది.

అందుబాటులోకి 1383 వైద్యసేవలు-60% చెల్లింపు
ఆయుష్మాన్‌ భారత్‌ కింద 1383, ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున 1044 రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసి, వైద్యసేవల రుసుములు(ప్యాకేజీ) ఖరారుచేశాం. ఈ రుసుములు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ట్రస్టు ద్వారా వైద్యసేవలు ప్రజలకు అందుతున్నాయి. వీరు ఖరారుచేసిన వైద్యసేవల రుసుముల కంటే మావి తక్కువన్నది నిజమే. ధరలు పెంచాలని మాకు ప్రైవేట్‌ ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. అసలు ఏ వైద్యసేవ పథకమూ అమలులేనిచోట ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఇంకో రకం పరిస్థితులున్నాయి. అందువల్లే ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున జరిగే చెల్లింపుల ఆధారంగానే కేంద్రం కూడా తన వాటా(60%) ఇవ్వనుంది. సిజేరియన్‌(ప్రసవం)కు మేం రూ.9,000 ఖరారు చేయగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.14వేలకు పైనే ఉంది. దీనివల్ల ఇలాంటి రాష్ట్రాల్లో వైద్యసేవల రుసుముల అంశం సమస్యగా లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.