close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఇవేమీ ఎరుగరు ఈ బిడ్డలు

ఇవేమీ ఎరుగరు ఈ బిడ్డలు

సుదీర్ఘ ప్రయాణాలు 
భాషల చికాకులు 
డ్రైవింగ్‌ లైసెన్స్‌లు.. 
ఇప్పుడు పుట్టే బిడ్డలకు 
ఇవన్నీ గత చరిత్రే! 


ఈ ఏడాది  పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఎలాంటి అనుభవాలను ఎదుర్కోబోతున్నారు?ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవచ్చుకానీ నేడు మనం చూస్తున్న చాలా సర్వసాధారణ అంశాలు వాళ్లకు పాత కాలపు వింతలు, విడ్డూరాలే కానున్నాయి! 


ఒకప్పుడు మొబైల్‌ ఫోన్‌ వాడకం అత్యంత విలాసవంతమైన వ్యవహారం! 
నేడు.. అతి సామాన్య విషయం. అప్పట్లో ఇంట్లో సినిమా చూడాలంటే.. కలర్‌ టీవీ, వీసీఆర్‌ వంటివి అద్దెకు తెచ్చుకోవాలి. సమయం మించిపోకుండా కంగారుగా సినిమా చూసేసి అప్పగించాలి! నేడు కేవలం మొబైల్‌ ఫోన్‌లోని యూట్యూబ్‌లో మనకు నచ్చిన సినిమా చూసి ఆనందించగలుగుతున్నాం. 
ఈ మార్పు అంతా సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమే. ఇదే పరిజ్ఞానం.. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయనుంది. ఎంతలా అంటే.. 2019లో జన్మించిన పిల్లల్లో చాలా మంది పెద్దయ్యాక (25, 30 ఏళ్లు వచ్చే సరికి) మనకి ఇప్పుడు అనుభవంలోఉన్న పలు అంశాలను గత చరిత్రగా భావించేంతలా..

ఇవేమీ ఎరుగరు ఈ బిడ్డలు

సుదీర్ఘ ప్రయాణాలు మాయం

ఇవేమీ ఎరుగరు ఈ బిడ్డలు
 

విమానాల్లో సుదీర్ఘ ప్రయాణాల సమయంలో మనల్ని.. మొబైల్‌ పరికరాలు, విమానంలోని వినోద వ్యవస్థలు కొంతమేర ఓలలాడిస్తున్నాయి. కారణం ఏదైనా కావొచ్చు, 2003లో సేవల నుంచి ఉపసంహరించిన ఇవేమీ ఎరుగరు ఈ బిడ్డలుకాంకర్డ్‌ విమానం మినహా.. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సౌకర్యార్థం వాయు రవాణా వేగం పెంచడానికి మనం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అక్కడక్కడా బుల్లెట్‌ రైళ్లు తప్ప.. మన ఉపరితల రవాణా వేగం కూడా అంతంత మాత్రమే. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న వివిధ పరిణామాల కారణంగా.. భవిష్యత్తులో రవాణా ప్రక్రియలో వేగం పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఇప్పటి పిల్లలకు భవిష్యత్తులో వెన్ను నొప్పిపెట్టేంతలా ఉండే సుదీర్ఘ రోడ్డు, విమాన ప్రయాణాల ఇబ్బందుల నుంచి విముక్తి లభించొచ్చు. ఈ క్రమంలో సూపర్‌సోనిక్‌ విమానాలు అందుబాటులోకి వచ్చి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. ఫలితంగా బ్రిటన్‌ నుంచి కెనడా లేదా అమెరికాకు కేవలం 3.5 గంటల సమయంలో చేరుకోవచ్చు. వీటి తయారీకి విపరీతంగా ఖర్చు అవుతుండడం వల్ల ప్రధానస్రవంతి ప్రయాణికులు ఖర్చు భరించే పరిస్థితి ఉండకపోవచ్చు. అందువల్ల తొలుత అత్యంత సంపన్నవర్గం వారే ఈ విమాన ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు.  
హైపర్‌లూప్‌ సాంకేతిక పరిజ్ఞానం.. ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గించే విషయంలో అనుసరణీయ మార్గాన్ని చూపనుంది. ఇప్పటికే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గంటకు 387 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలున్నట్లు వెల్లడైంది.

కరెన్సీ నోటుకు కాలం చెల్లు

ఇవేమీ ఎరుగరు ఈ బిడ్డలు

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ఆగమనంతో నగదు నోట్ల  (పేపర్‌ కరెన్సీ) వినియోగానికి సంబంధించి తొలి దెబ్బ పడింది. ప్రస్తుతం పేపర్‌ కరెన్సీ.. పేపాల్‌, వెన్మో, యాపిల్‌ పే, ఇతర చెల్లింపు ఐచ్ఛికాలతో పోరాడుతోంది. ప్రస్తుతం పుట్టే పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యేసరికి ఈ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకుని.. నగదు పూర్తిగా కనుమరుగైపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. నగదును తొలగించడంలో క్రిప్టో కరెన్సీలు ముందు వరుసలో ఉండనున్నాయి. బ్లాక్‌చెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానం ఆర్థిక వ్యవహారాలకు అవసరమైన భద్రతను అదనంగా చేకూర్చుతోంది.

మరో గ్రహం దిశగా అడుగులు!

ఇవేమీ ఎరుగరు ఈ బిడ్డలు

మనిషి భావవ్యక్తీకరణను మెరుగుపరుస్తున్న సాంకేతిక పరిజ్ఞానం మన ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అదే సమయంలో మనం ఇతర గ్రహాల జీవులతో సంభాషించడానికి ఓ మార్గాన్ని గుర్తించాల్సిన అవసరం నెలకొంది. ఇటువంటి భవిష్యత్తుకు అవసరమైన మార్గానికి సంబంధించిన తొలి మైలురాయి రానున్న కొన్ని దశాబ్దాల్లోనే పడొచ్చు. మరోవైపు, మానవులను అంగారకుడిపై చేర్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా ఎలాన్‌ మస్క్‌ తన అంతరిక్ష అన్వేషణ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. 2024కల్లా అరుణ గ్రహంపైకి తన సిబ్బందిని చేర్చగలనని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2019లో జన్మించిన పిల్లలు పెద్దయ్యేసరికి మానవుడి ఆవాసాలు భూగ్రహంతోపాటు అంగారకుడిపైనా కనిపించినా ఆశ్చర్య పోనవసరం లేదు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌..కనబడితే ఒట్టు

పెద్దవాళ్లం అవుతున్న క్రమంలో వాహనాలు నడిపేందుకు లైసెన్స్‌లు తీసుకోవడం అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరికి తప్పనిసరి వ్యవహారం అయిపోయింది. అయితే 2019లో పుట్టినవారికి 16, 17 ఏళ్లు వచ్చేసరికి పూర్తిస్థాయిలో డ్రైవర్‌ రహిత వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల వాహనాలను నడపడంలో మానవ ప్రమేయం ఉండదు. 
సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) వెలువరించిన గణాంకాల ప్రకారం.. ఒక్క 2015లోనే వాహనాలు ఢీకొనడం వల్ల 16 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సుగల వారు రోజుకు ఆరుగురు చొప్పున మరణించారు. చాలా ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణం అవుతున్నాయి. వాహనాలను నడిపే ప్రక్రియలో మానవ ప్రమేయం లేకుండా చేస్తే.. చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. కాబట్టి స్వయంప్రతిపత్తి గల వాహనాల తయారీ చాలా మందికి అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. తమ ఎలక్ట్రిక్‌, పాక్షిక స్వయంప్రతిపత్తి (ప్రస్తుతం) గల కార్ల తయారీ కంపెనీ రెండు మూడేళ్లలో పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తిగల కార్లను తయారుచేస్తుందని టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ చెబుతున్నారు.

డిజిటల్‌ ప్రపంచం మరింత భద్రం

ఇవేమీ ఎరుగరు ఈ బిడ్డలు

ప్రస్తుతం డిజిటల్‌ భద్రత అనేది ఆందోళనకు సంబంధించిన ప్రధాన అంశంగా మారింది.  హ్యాకింగ్‌ అంతర్జాతీయస్థాయిలో చోటుచేసుకుంటోంది. సున్నితమైన వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించడంలో గృహోపకరణాల్లో అనేక బలహీనతలు ఉంటున్నాయి. మరోవైపు, డిజిటలైజేషన్‌ని విస్తరించడంతోపాటు, బయోమెట్రిక్స్‌, ఆర్‌ఎఫ్‌ఐడీ వంటివాటితో భద్రతను పెంచడానికి నిపుణులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఈ భద్రత ఇప్పటికీ కీలకమైన ఎన్‌స్క్రిప్షన్‌ సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడుతోంది. దీనిని సులువుగా విచ్ఛిన్నం చేయగలుగుతుండడం ఆందోళనకర అంశం. క్వాంటమ్‌ కంప్యూటర్ల ఆగమనంతో.. మెరుగైన భద్రతా వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటింగ్‌ శక్తి గణనీయంగా పెరిగింది. 2019లో పుట్టే పిల్లలు పెద్దవారు అయ్యేసరికి అత్యంత వేగంతో కూడిన క్వాంటమ్‌ ఎన్‌స్క్రిప్షన్‌.. డిజిటల్‌ ప్రపంచం గమనాన్ని హ్యాకింగ్‌ రహితం చేయనుంది.

ఏఐదే హుషారు

ఇవేమీ ఎరుగరు ఈ బిడ్డలు

కృత్రిమ మేధ(ఏఐ) అభివృద్ధికి సంబంధించి స్వయం చోదక వాహనాలు ఒక ఉదాహరణ మాత్రమే. చదరంగం ఆడడం, పునర్వినియోగ వస్తువులను వర్గీకరించడం వంటి కొన్ని నిర్దుష్ట విధుల్లో మానవులకు ప్రత్యర్థులుగా నిలవగలిగే లేదా మానవులను వెనక్కినెట్టే సామర్థ్యంగల ఏఐ వ్యవస్థలు నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. మానవ మేధకు పూర్తిస్థాయి ప్రత్యర్థిగా నిలిచే జ్ఞానం గల ఏఐ వ్యవస్థలు కేవలం దశాబ్దాల వ్యవధిలోనే అందుబాటులోకి వస్తాయని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే హాన్సన్‌ రోబోటిక్స్‌కు చెందిన సోఫియా మనుషులకు, యంత్రాలకు మధ్య గీతను కనీకనిపించనట్లుగా మార్చేసింది. రానున్న రోజుల్లో ఈ గీత పూర్తిగా చెరిగిపోవడం తథ్యం. ఈ క్రమంలో 2019లో జన్మించిన శిశువులకు పెద్దయ్యాక ఇప్పట్లోలా శ్రామికశక్తిలో చేరడం, కళాశాలకు వెళ్లడం వంటివి తెలియకపోవచ్చు.

కంప్యూటింగ్‌ సరికొత్తగా..

ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న చాలా డిజిటల్‌ పరికరాలు సమాంతర తెర (ఫ్లాట్‌ స్క్రీన్‌)తో ఉన్నవి. భవిష్యత్తులో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లు.. మరింత క్రియాశీలంగా మారనున్నాయి. ఈ ఏడాది జన్మించే శిశువులు పెద్దయ్యాక గతంలో ఒకే తెర, కీబోర్డ్‌తో కంప్యూటర్లు ఉన్నట్లు గుర్తే ఉండకపోవచ్చు. వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), అగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌) అభివృధ్ధి రూపావళినే మార్చనున్నాయి.  ఈ సాంకేతిక పరిజ్ఞానాల్లో నవకల్పనలు.. మన కంప్యూటింగ్‌ అనుభూతిలో కొత్త సామర్థ్యాలను చేర్చనున్నాయి. సంజ్ఞల గుర్తింపు, లాంగ్వేజ్‌ ప్రోసెసింగ్‌, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు.. మనం మన పరికరాలతో మరింతగా అనుసంధానం అయ్యే అవకాశాన్ని కల్పిస్తాయి. హాలీవుడ్‌ చిత్రం మైనారిటీ రిపోర్ట్‌ తరహాలో అన్నమాట.

భాష తెలియదుకానీ.. సంభాషిస్తారు

కృత్రిమ మేధ వల్ల ఒనగూరే మరో ఉపయోగం సమాచార మార్పిడి. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల భవిష్యత్తులో భూమిపై భాషా పరమైన అడ్డంకులు కనుమరుగవనున్నాయి. సమాచార ప్రసార సాధనాలైన స్కైప్‌ వంటివి ఇప్పటికే.. తక్షణం అనువదించగలిగే సామర్థ్యాలను ఏర్పాటుచేశాయి. దీనివల్ల వినియోగదార్లు వాస్తవ పరిస్థితుల్లోలాగానే కొన్ని భాషలకు సంబంధించి సంభాషణలు నెరపవచ్చు. టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన హెడ్‌ఫోన్లలో అనువాద సామర్థ్య సాధనాలను ఇప్పటికే చేర్చింది. ఈ నేపథ్యంలో 2019లో భూమ్మీదకు వచ్చే శిశువులకు 20, 25ఏళ్లు వచ్చేసరికి భాష రానప్పటికీ.. ఏ దేశస్థులతోనైనా చక్కగా సంభాషించగలరు. ఫలితంగా విదేశీ భాష నేర్చుకోవడం అనే ఉపాయం.. పూర్తిగా విదేశీ ఉపాయంగానే మిగిలిపోనుంది.

మరింత ఇరుకుగా నగరాలు

రోజురోజుకు జనాభా పెరిగిపోయి భూమి కిక్కిరిసిపోతోంది. మానవులు వీలైనంత త్వరగా అనంత విశ్వంలో మరో గ్రహాన్ని (ఆవాస యోగ్యమైన) వెతుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దశాబ్దాల కాలంగా.. పట్టణీకరణ అనేది భూమ్మీద కీలక సమస్యగా ఉంటోంది. ఫలితంగా ధ్వని కాలుష్యం పెరుగుతోంది. ధ్వని కాలుష్యం రానున్న రోజుల్లో ప్రజారోగ్యాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తుందని నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2100 కల్లా ప్రపంచ జనాభా 10.8 బిలియన్‌ కోట్లకు చేరుతుందని, ఈ జనాభాలో 84% మంది నగరాలు, పట్టణాల్లో ఉంటారని ఐరాస అంచనా. కాబట్టి ప్రస్తుతం మనం ఆస్వాదిస్తున్న ప్రశాంత వాతావరణం.. 2019లో జన్మించనున్న శిశువులకు లభించపోవచ్చు.

అదిగదిగో ఆకలి లేని ప్రపంచం

ఇవేమీ ఎరుగరు ఈ బిడ్డలు

పట్టణీకరణ.. సంప్రదాయక వ్యవసాయానికి స్థలం లభ్యతను తగ్గించవచ్చు. అదే సమయంలో వ్యవసాయంలో చోటుచేసుకుంటున్న నవకల్పనల కారణంగా.. ఆహారం కొరత అనేది గతానికి సంబంధించిన అవశేషంగా మిగలనుంది. పట్టణ వ్యవసాయం ప్రధాన పరిశ్రమగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో తాజా, శుద్ధిచేయని (ప్రోసెస్‌ చేయని) ఆహారం ఊసే లేని నగరాలు, పట్టణాల్లో తాజా ఆహారం, చేపలు పుష్కలంగా దొరకనున్నాయి. అంతస్తుల్లో చేసే వ్యవసాయం (వర్టికల్‌ ఫార్మింగ్‌) వల్ల పట్టణాల్లో గతంలో ఊహకే అందని ప్రాంతాలు వ్యవసాయ క్షేత్రాలుగా మారతాయి. నగరాల్లోని ఆకలికి చరమగీతం పాడే అవకాశాలు విస్తరిస్తాయి. మరోవైపు, కంపెనీలు ఆహార వృథాను తగ్గించేందుకు నవకల్పన విధానాలు అభివృద్ధిచేస్తున్నాయి. ఇదే దోరణి కొనసాగితే, 2019లో జన్మించే పిల్లలు.. భూమ్మీద ప్రతిఒక్కరు ఆరోగ్యకరంగా, సంతోషంగా జీవించేందుకు అవసరమైన ఆహారం పొందే వీలున్న అద్భుత ప్రపంచాన్ని కనులారా చూడగలరు.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.