close

ప్ర‌త్యేక క‌థ‌నం

చలితో జరభద్రం

గుండెపోటు తీవ్రత అధికం
రక్తంలోనూ చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు
  చర్మం పొడిబారడంతో ఇన్‌ఫెక్షన్లు
పిల్లలు, వృద్ధులకు మరీ ప్రమాదం
  అప్రమత్తత అవసరమంటున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా పగలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు కనీసం రెండంకెలు కూడా చేరడం లేదు. ఉదయం పది దాటితేగాని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక పోతున్నారు. రాత్రి కాకముందే ఇళ్లకు చేరుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్‌లు స్వైర విహారం చేస్తున్నాయి. చలి తీవ్రత పెరగడంతో ఫ్లూ జ్వరాలతో ఆసుపత్రులకెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. మున్ముందు చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలుండడంతో.. పొంచి ఉన్న చలి ముప్పును తప్పించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఎవరిలో ఎక్కువ ప్రమాదం?
* ఐదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు
* అవయవ మార్పిడి శస్త్రచికిత్స పొందినవారు
* మధుమేహులు
* క్యాన్సర్‌, గుండెజబ్బు, ఆస్థమా, సీఓపీడీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు

ముందస్తు జాగ్రత్తలు
* చలి తీవ్రంగా ఉన్న సమయంలో నడక మంచిది కాదు. తగ్గాక అయినా వ్యాయామం చేస్తేనే మంచిది.
* చలి సమయంలో బయటకు వెళ్తే.. శరీరమంతటినీ కప్పి ఉంచేలా దళసరి వస్త్రాలు ధరించాలి.
* చర్మం పొడిబారకుండా తేమను పెంచే లేపనాలు, కొబ్బరినూనె, ఆలీవ్‌ నూనె వంటి వాటిని చర్మానికి పట్టించాలి.
* చలి తీవ్రంగా ఉన్నప్పుడు చేతులు పట్టుతప్పుతాయి. అందువల్ల రాత్రిళ్లు వాహనాలు నడపకపోవడమే మంచిది.
* చలిగా ఉందనే కారణంతో తాగునీటిని తగ్గిస్తుంటారు. ఇది సరికాదు. నీటిని తగు మోతాదులో తీసుకోవాల్సిందే.

మధుమేహులు అప్రమత్తంగా ఉండాలి
-డాక్టర్‌ పీవీ రావు,  ప్రముఖ మధుమేహ నిపుణులు

చలి తీవ్రతకు మధుమేహుల్లో వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. ముఖ్యంగా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు విజృంభిస్తాయి. మహిళల్లో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు వేధిస్తుంటాయి. చలి ఎక్కువగా ఉంటే మన శరీరంలో ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచడానికి జీవక్రియలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఆకలి ఎక్కువవుతుంది. ఒకవైపు చలి కారణంగా వ్యాయామాన్ని తగ్గించడం మరోవైపు ఎక్కువగా తినడం వల్ల బరువూ పెరుగుతారు. ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకునేవారిలో రక్తంలో చక్కెర స్థాయుల్లో తరచూ హెచ్చుతగ్గులుంటాయి. ఈ విషయాన్ని గుర్తించి నియంత్రణలో ఉంచుకోవాలి.

గుండెకు ముప్పు
-డాక్టర్‌ రమేశ్‌ గూడపాటి, గుండె వ్యాధినిపుణులు

చలి తీవ్రతకు గుండెలోని రక్తనాళాలు కుచించుకుపోతాయి. గుండెకు రక్తం సరఫరా సరిగా జరగదు. రక్తంలో ‘కెటాకెలోమిన్స్‌’ హార్మోన్‌ స్థాయి పెరుగుతుంది. దీంతో గుండె రక్తనాళాల్లో అప్పటికే పూడికలుంటే.. ఆ పూడికలపై రక్తం గడ్డకట్టి గుండెపోటుకు దారితీసే ప్రమాదముంది. చలిని తట్టుకునేందుకు కొందరు ధూమపానం, మద్యపానం మోతాదుకు మించి తీసుకుంటుంటారు. దీనివల్ల గుండె స్పందనల్లో లయ తప్పుతుంది. అత్యంత వేగంగా కొట్టుకుంటుంది. దీన్ని ‘అర్రిథ్‌మియా’ అంటారు. ఈ పరిస్థితుల్లో చాలామంది తెలియకుండానే నిద్రలోనే చనిపోతుంటారు. చలికాలంలో కొలెస్ట్రాల్‌ స్థాయి కూడా పెరుగుతుంది. అందుకే ధూమపానం ఆపేయాలి. మద్యపానాన్ని మోతాదుకు మించి తీసుకోవద్దు.

చర్మ సమస్యలు
-డాక్టర్‌ పార్థసారథి, చర్మవ్యాధి నిపుణులు

ఈ కాలంలో వాతావరణంలో తేమ తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం నుంచి నీరు ఆవిరవుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గడంతో చర్మం పూర్తిగా పొడిబారిపోతుంది. కాళ్లలో పగుళ్లు వచ్చి దురదలొస్తాయి. నొప్పులుంటాయి. ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. మధుమేహుల్లో ఇది ప్రమాదకరంగా మారుతుంది. దీన్ని నివారించడానికి చర్మంపై తేమను పెంచే లేపనాలు ఉపయోగించాలి. కొబ్బరినూనె, ఆలీవ్‌ నూనె వంటి వాటిని చర్మానికి పట్టించాలి. ఈ కాలంలో చుండ్రు కూడా వేధిస్తుంది. చుండ్రును తగ్గించే ఔషధ షాంపులను వైద్యుల సలహాతో వాడాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.