close

ప్ర‌త్యేక క‌థ‌నం

వేగం.. సురక్షిత ప్రయాణం

ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యం
అధిక ఛార్జీల భారం కొద్దిమందిపైనే
అంతర్జాతీయ ప్రమాణాలతో  భారతీయ రైల్వే అభివృద్ధి
మార్చిలోగా దేశ వ్యాప్తంగా  68 రైల్వే స్టేషన్ల అభివృద్ధి
కొత్త మార్గాల్లో తొలుత   సింగిల్‌ లైనే, తర్వాతే రెండోది
‘ఈనాడు’ ముఖాముఖిలో   రైల్వే బోర్డు నూతన ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌
ఈనాడు - హైదరాబాద్‌

వేగం.. సురక్షిత ప్రయాణం

‘రైల్వే వ్యవస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు చేరువ కావడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రయాణికులను గమ్య స్థానాలకు క్షేమంగా, వేగంగా చేర్చడం మా తదుపరి ధ్యేయం. అందులో భాగంగా రైళ్ల సగటు వేగాన్ని పెంచేందుకు కృషి చేస్తాం’ అని రైల్వే బోర్డు నూతన ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. భారతీయ రైల్వేను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని, ఆ దిశగా ఇప్పటికే సాగుతున్న ప్రయత్నాలను వేగవంతం చేస్తామని చెప్పారు. రైల్వే బోర్డు ఛైర్మన్‌గా నియమితులైన వినోద్‌కుమార్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలోని జీఎం కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జోన్‌ పరిధిలోని ఆరు డివిజన్ల అధికారులతో వీడియో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఈనాడు’తో ముఖాముఖి మాట్లాడారు.

ప్రత్యేక రైళ్లలో అధిక ఛార్జీలు, ముఖ్యంగా సువిధ ప్రత్యేక రైళ్లలో మూడు రెట్ల వరకు అదనంగా వసూలు చేయడం సమర్థనీయమని భావిస్తున్నారా?
ప్రయాణికుల అవసరాలు, గిరాకీకి అనుగుణంగా అవసరమైన మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నాం. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 100 ప్రత్యేక రైళ్లను ప్రకటించాం. అందులో సువిధ రైళ్లు తొమ్మిదే. మొత్తం రైలు ప్రయాణికుల్లో 1 శాతం మందిపైనే అధిక ఛార్జీల భారం పడుతోంది. 99 శాతం మంది సాధారణ ఛార్జీలతోనే ప్రయాణం చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లు, వాటిలో వసూలు చేస్తున్న ఛార్జీలు తదితర పరిస్థితుల గురించి రైల్వే మంత్రికి ఇప్పటికే వివరించా. దీన్ని త్వరలో సమీక్షిస్తాం.

సాధారణ రైళ్లలోనూ ప్రీమియం తత్కాల్‌ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు? వీటి మాటేమిటి?
చాలా రోజుల ముందుగా కాకుండా కొందరు అప్పటికప్పుడు, అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వారి కోసం కొన్ని టికెట్లను ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం. కొద్ది గంటల ముందు కూడా అందించే ఈ తరహా వాటికే ప్రత్యేక ధరలు ఉంటున్నాయి.

వేగం.. సురక్షిత ప్రయాణం

రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. రైళ్ల సగటు వేగం కూడా తక్కువే. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది?
రైళ్ల సమయ పాలనను క్రమంగా మెరుగుపరుస్తున్నాం. సగటు వేగాన్ని గణనీయంగా పెంచడంపై భారతీయ రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. దీని కోసమే సెమీ హైస్పీడ్‌, హైస్పీడ్‌ కారిడార్‌ ప్రాజెక్టులు చేపడుతున్నాం. సరకు రవాణాకు ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు పనుల్ని వేగవంతం చేస్తున్నాం. అనతి కాలంలో అన్ని రైళ్ల సగటు వేగం పెరుగుతుందని ఆశిస్తున్నాం.పనిలో పనిగా దేశ వ్యాప్తంగా 68 రైల్వే స్టేషన్ల అభివృద్ధిపనులు కొనసాగుతున్నాయి. మార్చి నాటికి వాటినీ పూర్తిచేస్తాం.

ఇంజిన్‌ లేకుండా అత్యంత వేగంతో ప్రయాణించే ట్రైన్‌ 18 సేవలు ద.మ.రైల్వేకి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?
దిల్లీ నుంచి నడిపిన ట్రైన్‌ 18 ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. ఇది త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. భవిష్యత్తులో ఈ వేగవంతమైన రైలు సేవల్ని ఇతర నగరాల నుంచి కూడా విస్తరిస్తాం.

సికింద్రాబాద్‌-చెన్నై, కాజీపేట-నాగ్‌పుర్‌ సెమీ హైస్పీడ్‌ కారిడార్ల పరిస్థితి ఏంటి?
ప్రధాన మార్గాల్లో రైళ్ల వేగం పెంచే సెమీ హైస్పీడ్‌ కారిడార్ల అభివృద్ధికి తొలుత ప్రాధాన్యం ఇస్తాం. ఈ రెండు ప్రాజెక్టులపైనా దృష్టి పెడతాం.

రైల్వేలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పనిభారం పెరుగుతోందని ఉద్యోగులు అంటున్నారు? దీనికి పరిష్కారం చూపుతారా?
ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో లక్ష ఉద్యోగాల భర్తీకి భారతీయ రైల్వే ప్రకటనలు ఇచ్చింది. పలు పోస్టులకు ఇప్పటికే రాత పరీక్షలు జరిగాయి. ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ ఎంపిక ప్రక్రియను వీలున్నంత వేగంగా పూర్తిచేస్తాం. వాళ్లు అందుబాటులోకి వస్తే ఈ సమస్య దాదాపు పరిష్కారమవుతుంది.

అమరావతిని రైలు మార్గంతో అనుసంధానించే ప్రాజెక్టులపై వివక్ష చూపుతున్నారని, ఎర్రుపాలెం-నంబూరును సింగిల్‌ లైన్‌తో ప్రతిపాదించారని, మిగిలిన రెండు లైన్లను తాత్కాలికంగా పక్కన పెట్టారనే విమర్శలున్నాయి.  మీరేమంటారు?
అమరావతి రైలు ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన సమగ్ర అంచనా వ్యయం తాలూకూ ప్రతిపాదనలు రైల్వేబోర్డు వద్ద ఉన్నాయి. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త రైల్వే ప్రాజెక్టు ఏదైనా సింగిల్‌ లైన్‌తోనే మంజూరవుతుంది. భూసేకరణ మాత్రం రెండు లైన్లకు సరిపడా ఒకేసారి జరుగుతుంది. ప్రయాణికుల రద్దీ పెరుగుదల ఆధారంగా రెండో లైను మంజూరవుతుంది.

 


రైల్వే బోర్డు ఛైర్మన్‌గా మీ ప్రాధాన్యాలు ఏమిటి?

  ప్రయాణికుల భద్రతకే తొలి ప్రాధాన్యం. రైలెక్కిన ప్రతి వ్యక్తినీ గమ్యస్థానానికి క్షేమంగా చేర్చే దిశగా  శాఖాపరంగా అన్ని చర్యలు చేపడతాం. స్టేషన్లలో, రైళ్లలో ప్రయాణికులకు అసౌకర్యాలు లేకుండా చూస్తాం. కొన్ని మార్గాల్లో సామర్థ్యం కంటే ఎక్కువ రైళ్లు నడుస్తున్నాయి. అదనపు రైలు మార్గాలు నిర్మించడమే ఈ సమస్యకు పరిష్కారం. అందులో భాగంగా ఇలాంటి పలు మార్గాల్లో ఇప్పటికే సింగిల్‌ లైన్‌ ఉన్నచోట రెండోలైను, రెండులైన్లు ఉన్న మార్గాల్లో మూడో లైన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఆ పనుల్ని వేగవంతం చేస్తాం. ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించే దిశగా ఆహార నాణ్యత, క్యాటరింగ్‌ సేవలపైనా దృష్టి సారిస్తాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.