close

ప్ర‌త్యేక క‌థ‌నం

టెక్నాలజీతో చదువులు బాగవుతున్నాయా?

టెక్నాలజీతో చదువులు బాగవుతున్నాయా?

* కొద్ది సంవత్సరాలుగా పిల్లల చదువుల్లో టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరుగుతోంది. దానివల్ల చదువులు నిజంగానే మెరుగవుతున్నాయా?
* విద్య, వైద్యం వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానంతో చాలా ప్రయోజనాలున్నాయిగానీ.. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఈ టెక్నాలజీని వాడటం ఎలా?
ఈ రెండూ ప్రస్తుతం మన ముందున్న కీలక సవాళ్లని వ్యాఖ్యానించారు బిల్‌ గేట్స్‌! సాధారణంగా కొత్త సంవత్సర తీర్మానాలకు దూరంగా ఉండే తాను.. ఈ 2019లో మాత్రం వీటి మీద గట్టి కృషి చేయాలని తీర్మానించుకున్నట్టు వెల్లడించారు.
2018లో తాను సాధించిన పురోగతి గురించీ, తనను అమితంగా ఆకట్టుకున్న 5 పుస్తకాల గురించీ, తన కొత్త సంవత్సర తీర్మానాల గురించీ తన బ్లాగ్‌లో సవివరంగా చర్చించారు బిల్‌ గేట్స్‌.

అప్పట్లో ఈ ప్రశ్నలడిగితే నవ్వేవాడినేమో!
-  బిల్‌గేట్స్‌

టెక్నాలజీతో చదువులు బాగవుతున్నాయా?

‘‘నా చిన్నప్పుడు అమ్మానాన్నా ప్రతి క్రిస్మస్‌కూ ఆ ఏడాది మా కుటుంబం చేసిందేమిటో రాసి అందరికీ కార్డులు పంపేవాళ్లు. చాలామంది దాన్ని పాతచింతకాయ పచ్చడి అనుకునేవాళ్లుగానీ నాకు మాత్రం ఆ సంప్రదాయం ఇష్టం. అందుకే ప్రతి ఏడాది చివర్లోనూ.. నాకు బాగా సంతోషాన్నిచ్చిందేమిటి? నేనింకా దేన్నైనా బాగా చేసి ఉండాల్సిందా? అన్నది ఆలోచిస్తుంటాను.

చిత్రమేమంటే 20 ఏళ్ల వయసులో నేను వేసుకున్న ప్రశ్నలకూ.. ఈ 63 ఏళ్ల వయసులో వేసుకుంటున్న ప్రశ్నలకూ చాలా తేడా వచ్చేసింది. అప్పట్లో.. ఈ ఏడాది ‘వ్యక్తిగత కంప్యూటర్‌’ స్వప్నాన్ని సాకారం చెయ్యటంలో మా మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ముందడుగు వేసిందా? లేదా? అది తప్పించి మరో ఆలోచన ఉండేది కాదు.

కానీ ఇప్పుడు.. ఈ ఏడాది కుటుంబానికి తగినంత సమయం ఇవ్వగలిగానా? కొన్నైనా కొత్త విషయాలు నేర్చుకున్నానా? కొత్త స్నేహాలు పెంచుకున్నానా? పాత స్నేహాలను బలోపేతం చేసుకున్నానా? ఇలా జీవితానికి సంబంధించిన చాలా ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటున్నాను. బహుశా, ఇవే ప్రశ్నలు 25 ఏళ్ల వయసులో గనక నన్నెవరైనా అడిగి ఉంటే నవ్వుకునే వాడినేమో! వయసు పెరిగిన కొద్దీ ఆ ప్రశ్నలెంత అర్థవంతమైనవో తెలుస్తోంది. ఈ విషయంలో నా ఆలోచనలు విస్తృతం కావటానికి మెలిండా ఒక కారణం. 
దీనిలో వారెన్‌ బఫెట్‌ పాత్రా ఉంది. ఆయనెప్పుడూ ‘‘మీరు ఎవరి మీదైతే శ్రద్ధ పెడుతున్నారో వాళ్లంతా మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తున్నారా?’’ అన్నది చూసుకోవాలంటుంటారు..

అంటూ తాజాగా బిల్‌గేట్స్‌ తన బ్లాగులో రాసుకున్న ఆసక్తికరమైన సమీక్షా వ్యాసం ప్రపంచ వ్యాప్తంగా పలువురిని ఆకట్టుకుంటోంది. వివరాలు ఆయన మాటల్లోనే...

వ్యాధులపై పోరు నుంచి జీవన ప్రమాణాల వైపు!

ఒకప్పుడు మన చరిత్ర అంతా కూడా వ్యాధులను ఎదుర్కొని, అందరికీ తిండి దొరికేలా చూడటం ఎలాగన్న దాని చుట్టూనే తిరిగేది. మందులు, టీకాలు, పారిశుద్ధ్యం వంటివి మెరుగుపడటంతో ఆయుర్దాయాలు పెరిగాయి. దీనిలో సాంకేతిక రంగం పెద్ద పాత్రే పోషించింది. ఇప్పటికీ ఊబకాయం, మలేరియా వంటి వాటికి పరిష్కారాలు కనుక్కోవాల్సిందేగానీ మొత్తమ్మీద వ్యాధులతో పోరాటం నుంచి మనం ఇప్పుడు జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కదులుతున్నాం. మున్ముందు టెక్నాలజీ రంగం ఈ దిశగానే కొత్తకొత్త ఆవిష్కరణలను పట్టుకురాబోతోంది. ఉదాహరణకు మనకు బాలేదనుకోండి.. వెంటనే ఆ విషయం గుర్తించి, మనం ఏం తినాలి, ఏం చెయ్యాలన్న సూచలనివ్వటం, అవసరమైతే మన మిత్రులకు తెలియజేయటం వంటి పనులన్నీ చేసే పరిజ్ఞానం వచ్చేస్తోంది. సాంకేతిక ఆవిష్కరణల వల్ల ఇదంతా సాధ్యమని చెబితే చాలామంది నమ్మరుగానీ గత ఏడాది పరిశోధనలు చూస్తే అవి మనందరి జీవితాలనూ మెరుగుపరుస్తాయన్న నమ్మకం బలపడుతోంది. ఉదాహరణకు ప్రపంచానికి పెద్ద సమస్యగా మారబోతున్న ఆల్జిమర్స్‌ వ్యాధిని నిలువరించేందుకు, ముందే గుర్తించేందుకు చాలా కృషి జరుగుతోంది.

* సౌర, పవన ఇంధనం చౌక అవుతుండటం సంతోషకర పరిణామం. అణు ఇంధనం విషయంలోనూ కొత్త ఆవిష్కరణలు రాబోతున్నాయి.
* చాలామంది మానవాళికి ఉగ్రవాదం, పర్యావరణ మార్పుల వంటి వాటి నుంచే పెను ఉత్పాతాలు రాబోతున్నాయని నమ్ముతుంటారుగానీ, నిజానికి మనకు.. తక్కువ సమయంలో కోట్లాది మందిని కబళించే ఫ్లూ తరహా వ్యాధుల ముప్పే ఎక్కువగా ఉంది. మొత్తం ఫ్లూ వ్యాధులన్నింటికీ పనికొచ్చేలా ఒకే టీకా తయారు చెయ్యాలన్న లక్ష్యం కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

* నవంబరులో చైనా శాస్త్రవేత్త పిండ దశలోనే జన్యు ఎడిటింగ్‌ చేసి ఇద్దరు బిడ్డలను పుట్టించినట్టు ప్రకటించారు. ఆయన కాస్త ఎక్కువ దూరం వెళ్లారన్న వాదనతో నేను ఏకీభవిస్తానుగానీ.. మొత్తమ్మీద జన్యు ఎడిటింగ్‌ గురించి మరింత మంది చర్చించేందుకు, కృషి చేసేందుకు ఆయన పని స్ఫూర్తినివ్వటం తథ్యం.

2019.. రెండు సాంకేతిక లక్ష్యాలు!

కొత్త సంవత్సర తీర్మానాలన్నది నాకు అలవాటు లేదుగానీ.. లక్ష్యాలు నిర్దేశించుకోవటం, వాటిని సాధించేందుకు ప్రణాళిక వేసుకోవటం నాకెప్పుడూ ఇష్టమే. ఈ 2019 కోసం ప్రత్యేకించి 2 లక్ష్యాలు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ రెండూ కూడా మన జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించాలన్నవే. సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు వస్తున్న కొద్దీ ప్రజల వ్యక్తిగత గోప్యతను కాపాడుతూనే విద్య, వైద్యం వంటి రంగాలకు సంబంధించిన కీలక సమాచారం అందుబాటులోకి తేవటం ఎలాగన్నది మొదటిది. ఉదాహరణకు పేద పిల్లలకు మంచిగా చదువు చెబుతున్న స్కూళ్లేవి? న్యాయంగా ఫీజులు తీసుకుని మంచి వైద్యం చేస్తున్న డాక్టర్లెవరు?.. గోప్యతకు భంగం లేకుండా ఇలాంటి సమాచారాన్ని సాధ్యం చేసేదెలా అన్నది చూడాలి. రెండోది- కొన్నేళ్లుగా సాఫ్ట్‌వేర్లు, టెక్నాలజీల వల్ల చదువులు గొప్పగా మారిపోతున్నాయని చాలా మంది చెప్పుకోవటం చూస్తున్నాం. నిజమేనా? అని దీన్ని అనుమానించే వాళ్లూ ఉన్నారు. మొత్తానికి టెక్నాలజీ అన్నది మన పిల్లల చదువులను ఎంత వరకూ మెరుగుపరుస్తుందన్నది కచ్చితంగా అంచనా వేసుకునే దశకైతే చేరుకున్నాం మనం. అందుకే ఈ సంవత్సరం దీని మీద కూడా దృష్టిపెట్టాలనుకుంటున్నాను.

(1)  ఎడ్యుకేటెడ్‌ రచయిత: టారా వెస్టోవర్‌ 

టెక్నాలజీతో చదువులు బాగవుతున్నాయా?

ఆమె ఎన్నడూ స్కూలుకు వెళ్లింది లేదు. కనీసం డాక్టరు దగ్గరకు వెళ్లింది కూడా లేదు. కేవలం చదువుకోవాలన్న ఒకే ఒక్క బలమైన ఆశతో 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయింది. చివరికి కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ సాధించిన వైనం గురించి ఆమె అద్భుతంగా రాస్తుంటే.. నేనూ, మిలిండా ఎంతో చలించిపోయాం. ఆమె బాల్యాన్ని చదువుతూ మాకు తెలియకుండానే మా జీవితాలనూ ఎంతో తరచి చూసుకున్నాం.

(2) ఆర్మీ ఆఫ్‌ నన్‌ రచయిత: పాల్‌ షెరె

టెక్నాలజీతో చదువులు బాగవుతున్నాయా?

కృత్రిమ మేధతో నడిచే ఆయుధాలు, యుద్ధతంత్రాలు వస్తాయని మనం ఇప్పుడే ఊహించటం లేదుగానీ.. ఈ పుస్తకాన్ని చదవటం ఆరంభిస్తే కళ్లు తిరిగే కొత్తలోకం మన ముందు ఆవిష్కృత మవుతుంది. ఎంతో సంక్లిష్టమైన ఈ అంశం మీద కూడా షెరె మంచీ, చెడూ.. రెండు పార్శ్వాలనూ తడుముతూ ఆధునిక యుద్ధతంత్రాన్ని కళ్లకు కట్టారు.

(3) బ్యాడ్‌ బ్లడ్‌ రచయిత: జాన్‌ కారిరొ

టెక్నాలజీతో చదువులు బాగవుతున్నాయా?

చుక్క రక్తంతోనే బోలెడన్ని వ్యాధుల సమాచారం చెప్పేస్తామంటూ సంచలనం సృష్టించి లక్షల కోట్లకు పడగలెత్తిన థెరనోస్‌ కంపెనీ. ఆ తర్వాత పెద్ద బూటకంగా ఎలా తేలిందీ.. ఆ నేపథ్యంలో చోటుచేసుకున్న భారీ కార్పొరేట్‌ కుంభకోణాలూ, వివాదాల గురించీ అద్భుతంగా చెప్పే పుస్తకం ఇది.

(4)   21 లెసన్స్‌ ఫర్‌ 21 సెంచరీ రచయిత: యువల్‌ నోవా హరారి

టెక్నాలజీతో చదువులు బాగవుతున్నాయా?

సెపియన్స్‌ పుస్తకంతో ఇప్పటికే అంతర్జాతీయ పాఠకులను ఆకట్టుకున్న హరారి రాసే ప్రతి రచనకూ నేనో పెద్ద అభిమానిని. గతంలో మానవ పరిణామం గురించి రాసిన ఆయన ప్రస్తుతం మన సమాజం ఎదుర్కొంటున్న 21 సవాళ్ల గురించి వస్తున్న వార్తలనూ, సమాచారాన్నీ అమోఘంగా విశ్లేషించారు.

(5)  ద హెడ్‌స్పేస్‌ రచయిత: ఆండీ పెడికోంబె

టెక్నాలజీతో చదువులు బాగవుతున్నాయా?

25 ఏళ్ల వయసులో ఈ పుస్తకం నా చేతిలో పెట్టి ఉంటే కచ్చితంగా నవ్వి ఉండే వాడినే! కానీ ఇప్పుడు నేనూ, మెలిండా ధ్యానం ప్రాశస్త్యాన్ని పూర్తిగా గుర్తించాం. యూనివర్సిటీ విద్యార్థి నుంచి బౌద్ధ సన్యాసిగా మారిన పెడికోంబె ప్రయాణం మాకో కొత్త లోకాన్ని పరిచయం చేసింది.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.