close

ప్ర‌త్యేక క‌థ‌నం

త్రీడీ ముద్రితం.. ఎముకకు రూపం!

సిరామిక్‌, పాలిమర్స్‌ కలిపి ‘స్మార్ట్‌ మెటీరియల్‌’ రూపకల్పన
ఐఐటీ హైదరాబాద్‌ వేదికగా సరికొత్త ఆవిష్కరణ
ఈనాడు - సంగారెడ్డి

త్రీడీ ముద్రితం.. ఎముకకు రూపం!

రహదారి ప్రమాదాల్లో ముఖానికి తీవ్ర గాయాలై ఎముకలు విరిగినప్పుడు బాధితులు ఇబ్బందులు పడుతుంటారు. దెబ్బతిన్న ముఖాకృతిని సరిదిద్దడానికి ఎన్నో శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. పైగా ఫలితం ఆశాజనకంగా ఉండదు. ముఖాకృతి మునుపటిలాగా ఉండకపోవడంతోపాటు ఇన్ఫెక్షన్లూ బాధిస్తాయి. కొన్నిసార్లు క్యాన్సర్‌ కారణంగా దవడ ఎముకలోని కొంత భాగం తీసేయాల్సి వస్తుంది. అప్పుడూ ముఖాకృతి దెబ్బతింటుంది. ఇలాంటి వారికి ప్రయోజనం చేకూర్చేలా హైదరాబాద్‌ ఐఐటీ వేదికగా పరిశోధకులు నూతన ఆవిష్కరణకు రూపమిచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటికంటే మెరుగైన పదార్థం(మెటీరియల్‌)ను కనిపెట్టారు. సిరామిక్‌, పాలిమర్స్‌ను కలిపి తాము రూపొందించిన ‘స్మార్ట్‌ మెటీరియల్‌’ బాధితులకు వరంగా మారుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏవైనా అనూహ్య ఘటనల కారణంగా శరీరం నుంచి ఎముకలను తీసేయడం, సరిచేయాల్సి వస్తే...ప్రస్తుతం అదే వ్యక్తి శరీరంలో ఇతర చోట నుంచి ఎముకను సేకరిస్తున్నారు. దాన్ని దెబ్బతిన్న భాగంలో అమర్చుతున్నారు. ఇంతచేసినా అక్కడ సరిగ్గా సరిపోదు. మునుపటి ఆకృతిని తీసుకురావడమూ కష్టమవుతోంది. కృత్రిమంగా బోన్‌ గ్రాఫ్టింగ్‌ విధానంలో ప్రస్తుతం సిరామిక్‌ పదార్థాన్ని ఉపయోగించి పాడైపోయిన ఎముకల స్థానంలో అమర్చుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువసార్లు శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తోంది. పైగా చాలా సందర్భాల్లో విరిగిన రెండు ఎముకలను అనుసంధానించడానికి లోహాలను వాడుతుంటారు. వీటికంటే మెరుగైన విధానాన్ని కనిపెట్టి బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనే లక్ష్యంతో పరిశోధకులు ఈ బయో ఆక్టివ్‌ ఫిలమెంట్‌(స్మార్ట్‌ మెటీరియల్‌)ను అభివృద్ధి చేశారు. సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాలలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ ఎన్‌.విజయ్‌కుమార్‌ ఈ ఆవిష్కరణలో కీలక భూమిక పోషించారు. ఇదే అంశమై ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆయనకు ఐఐటీకి చెందిన డాక్టర్‌ సుబా నారాయణ్‌ రథ్‌, డాక్టర్‌ ఫాల్గుణిపతిలతోపాటు పరిశోధక విద్యార్థి(రీసెర్చ్‌ స్కాలర్‌) శిబు, ఎంటెక్‌ విద్యార్థి రాఘవ్‌ సహకారం అందిస్తున్నారు.

త్రీడీ ప్రింటర్‌తో ముద్రించేస్తారు

సిరామిక్‌, పాలిమర్స్‌తో పాటు శరీరానికి హానికరం కాని కొన్ని రసాయనాలను కలిపి వీరు ఈ మెటీరియల్‌ను తయారు చేశారు. తొలగించిన, దెబ్బతిన్న ఎముక ఆకృతిని ముందే తీసుకొని దాని ప్రకారమే త్రీడీ ప్రింటర్‌ సాయంతో కృత్రిమ ఎముకను రూపొందిస్తారు. దీనిని సరిగ్గా తొలగించిన ఎముక స్థానంలో అమర్చుతారు. నూటికి నూరుశాతం ముఖ ఆకృతి మునుపటితో సరిపోలడంతోపాటు అసలు కృత్రిమ ఎముకను తన శరీరంలో ఉంచారనే విషయమూ బాధితుడు కనిపెట్టలేని విధంగా ఫలితాలు ఉంటాయంటున్నారు ఆవిష్కర్తలు. పాలిమర్స్‌ క్రమంగా కరిగిపోతూ సిరామిక్‌ ఎముక మాదిరిగా మారిపోవడమే ఇందుకు కారణమంటున్నారు. ఈ ఆవిష్కరణకు సంబంధించి పేటెంట్‌ కోసం దరఖాస్తు చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో ‘త్రీడీ స్కెలిటన్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ పేరుతో మూడు నెలల క్రితం అంకుర సంస్థనూ ప్రారంభించారు. ఈ పరిశోధన చేయడానికి గాను విజయ్‌కుమార్‌కు ప్రధానమంత్రి ఫెలోషిప్‌ లభించింది.

అతి త్వరలో విపణిలోకి

మేం ఏడాదిన్నరగా ఈ అంశమై పరిశోధనలు సాగిస్తున్నాం. సిరామిక్‌, పాలిమర్లను విడివిడిగా చికిత్సల సమయాల్లో కొన్నేళ్లుగా వాడుతున్నారు. మేం ఈ రెండింటినీ ఉపయోగించి ఈ స్మార్ట్‌ మెటీరియల్‌ను అభివృద్ధి చేశాం. వీలైనంత త్వరగా మార్కెట్లోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించాం. జంతువులపై ప్రయోగాలు పూర్తికావస్తున్నాయి. ఇప్పటి వరకు మంచి ఫలితాలు వచ్చాయి. వెన్నెముక గాయాలు, డెంటల్‌ బోన్‌ గ్రాఫ్టింగ్‌, ఫేషియల్‌ సర్జరీలు ఇలా అన్నింటిలోనూ ఈ మెటీరియల్‌ను వాడుకోవచ్చు. దీనిని చవకగా అందుబాటులోకి తెచ్చే అంశంపైనా మేం దృష్టిసారించాం.

- డాక్టర్‌ ఎన్‌.విజయ్‌కుమార్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.