close

ప్ర‌త్యేక క‌థ‌నం

డీజిల్‌ తాగారు.. క్షయ నిధులనూ మింగారు!

జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయాల లీలలెన్నెన్నో
ఏ పని జరగాలన్నా ముడుపులు చెల్లించాల్సిందే
కొందరు వైద్యాధికారులపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
డీఎంహెచ్‌ కార్యాలయాల్లో వ్యక్తిగత సహాయకులదే పెత్తనం
సర్కారుకు బాధితుల ఫిర్యాదులు
 ఈనాడు, హైదరాబాద్‌

డీజిల్‌ తాగారు.. క్షయ నిధులనూ మింగారు!

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని నెలల కిందట వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి కుమార్తె వివాహానికి ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రూ.10 వేల చొప్పున దాదాపు రూ.3 లక్షల వరకూ వసూలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డబ్బుల్లేకుండా దస్త్రం కదలదని ఫిర్యాదులు రావడంతో ఇటీవలే ఆ అధికారిపై బదిలీ వేటుపడింది.

* జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ వైద్యాధికారి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారికి నేరుగా రూ.20 లక్షలు ముడుపులు ఇవ్వచూపారు. దీంతో ఆ అధికారి బదిలీకి ప్రభుత్వం సిద్ధపడింది.

* ఓ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇటీవల తనిఖీలు చేసిన వైద్యాధికారులు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూళ్లకు పాల్పడ్డారని సమాచారం. సిద్దిపేట, మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉందని పేర్కొంటూ ప్రైవేటు ఆసుపత్రుల సంఘం నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే ఫిర్యాదు చేసింది.

* ఆసిఫాబాద్‌లో కొద్దికాలం కిందట పనిచేసిన ఒక వైద్యాధికారి రూ. 12 లక్షల క్షయ వ్యాధి నిధులు స్వాహా చేశారనే ఆరోపణలొచ్చాయి. చివరికి ఆశా కార్యకర్తలకిఇవ్వాల్సిన ప్రోత్సాహక నగదును కూడా వాడుకున్నారని ఫిర్యాదులొచ్చాయి. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అంబులెన్సులు లేకపోయినా.. వాటికి డిజిల్‌ ఖర్చు అయినట్లుగా లెక్కలు చూపి సొమ్ములు చేసుకున్నారు. ఈ ఘటనలో బదిలీ వేటు పడింది.

వైద్యఆరోగ్య రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చి కేసీఆర్‌ కిట్‌, కంటి వెలుగు వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా.. ఆరోగ్యశాఖను మాత్రం అవినీతి చీడ పట్టి పీడిస్తూనే ఉంది. ముఖ్యంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి(డీఎంహెచ్‌వో) కార్యాలయాలు అక్రమాల పుట్టగా మారాయనే ఆరోపణలున్నాయి. ఒప్పంద వైద్యునికి వేతనం అందాలన్నా.. ఏఎన్‌ఎం బదిలీ జరగాలన్నా.. ముడుపులు చెల్లించాల్సిందే! డీఎంహెచ్‌ కార్యాలయాల్లో అధికారుల వ్యక్తిగత సహాయకులదే దళారి పాత్ర. డబ్బులు వసూలు చేయడమే వీరి పని. ఈ అక్రమాలపై  ప్రభుత్వానికి ఇటీవల పెద్దఎత్తున ఫిర్యాదులందాయి.

అడ్డగోలు నియామకాలు
అవసరమున్నా లేకపోయినా కొందరు జిల్లా వైద్యాధికారులు సర్దుబాట్లు(డిప్యుటేషన్లు) పేరిట తమకు అనుకూలమైన వారిని నియమించుకుంటున్నారు. ఉదాహరణకు నల్గొండ జిల్లాలో గణాంకాలు లెక్కించే అధికారి నియామకంలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక హెల్త్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారి స్థాయి ఉద్యోగిని సర్దుబాటు పేరుతో జిల్లా వైద్యాధికారి, ఉప వైద్యాధికారులు ప్రత్యేక సహాయకులుగా కూడా నియమించుకున్నారు. సూర్యాపేటలోనూ జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో కోదాడ నుంచి అక్రమంగా సర్దుబాటు చేశారని ప్రచారం జరుగుతోంది. ఒక అధికారికి కొద్ది నెలల కిందట మెదక్‌లో ‘డిప్యూటీ డిస్ట్రిక్‌ ఎక్స్‌టెన్షన్‌ అండ్‌ మీడియా ఆఫీసర్‌’గా పోస్టింగ్‌ ఇవ్వగా.. అదే రోజు సాయంత్రానికి మేడ్చల్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లారు. కొద్ది రోజుల్లోనే రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి చేరి చక్రం తిప్పుతున్నారు.

ప్రైవేటులో తనిఖీలంటే
పైసా వసూలే!
డీఎంహెచ్‌వోలు నిర్వహించే ప్రధాన విధుల్లో ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులివ్వడం, పర్యవేక్షించడం, తనిఖీలు నిర్వహించడం వంటివి ముఖ్యమైనవి. ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారం అంటే పైసా వసూలు కార్యక్రమమేననే భావన డీఎంహెచ్‌ కార్యాలయ వర్గాల్లో ఉంది. తనిఖీలు, అనుమతుల సందర్భాల్లో ఏ చిన్న తప్పు దొరికినా.. జిల్లా వైద్యాధికారులను భారీగా సంతృప్తి పర్చాల్సిందేనన్న విమర్శలున్నాయి. ఇటీవల వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు వికటించిన సంఘటనలో 18 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, ఇందులో ఇద్దరు కంటిచూపు కూడా కోల్పోయారు. ఈ సంఘటనపై విచారించిన ప్రభుత్వ వైద్య బృందం శస్త్రచికిత్స గది ఎంత అధ్వానంగా ఉందో నివేదికలో పొందుపర్చింది. ఇలాంటి వాటిని తరచూ తనిఖీల ద్వారా గుర్తించి చక్కదిద్దాల్సిన డీఎంహెచ్‌వోలు ముడుపులకు తలొగ్గుతున్నారనే విమర్శలున్నాయి. ఎక్కడ ఎక్కువ ప్రైవేటు ఆసుపత్రులున్నాయో ఆ జిల్లాకే పోస్టింగ్‌ ఇవ్వాలని కొందరు డీఎంహెచ్‌వోలు భారీగా పైరవీలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం తదితర జిల్లాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

నిధులు స్వాహా
* జాతీయ ఆరోగ్యమిషన్‌ నిధులను వినియోగించేది డీఎంహెచ్‌వోలే. వారు అడ్డగోలు లెక్కలు చూపించి పథకాల ప్రచారానికిచ్చే నిధులను స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అసలు ఈ నిధుల వినియోగంపై ఇప్పటి వరకూ తనిఖీలే నిర్వహించలేదని సమాచారం.
* ఒక్కో జిల్లాకు అత్యవసర ఔషధాల కొనుగోళ్లకు ప్రభుత్వం సుమారు రూ.70-80 లక్షల నిధులను డీఎంహెచ్‌వోలకు ఇస్తుంది. ఈ నిధులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అవసరాలకు తగ్గట్లుగా వినియోగించాలి.  ఏటా మార్చి నెలాఖరులో హడావిడిగా డీఎంహెచ్‌వోలే ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరం లేకపోయినా తాము కొనుగోలు చేసిన వాటినే సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో టెండరు నిబంధనలేమీ పాటించకుండా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులున్నాయి.
* కొన్ని జిల్లాల్లో కంటి వెలుగు పథకం అమల్లోనూ అక్రమాలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. పథకం అమలుకు అవసరమైన టెంట్లు, కుర్చీలు, ఇతర సామగ్రి కొనుగోలులోనూ చేతివాటం చూపుతున్నారనే ఆరోపణలున్నాయి.


అవినీతి అధికారులపై కఠిన చర్యలు

డీజిల్‌ తాగారు.. క్షయ నిధులనూ మింగారు!


ప్రజారోగ్య సంచాలకుల విభాగాన్ని ప్రక్షాళన చేసే దిశగా దృష్టి సారించాం. జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల కార్యాలయాల్లో అవినీతిపై ఫిర్యాదులు వస్తున్న మాట వాస్తవమే. వీటిపై ఇప్పటికే విచారణ జరిపి సంబంధితులపై బదిలీ వేటు వేశాం. మరికొందరిపైనా విచారణ జరుపుతున్నాం. ప్రజారోగ్య సంచాలకుల రాష్ట్ర కార్యాలయంలోనూ క్రమశిక్షణ చర్యలు చేపట్టాం. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలితే ఉపేక్షించేది లేదు. జిల్లా అధికారుల్లోనూ స్పష్టమైన పని విభజన చేస్తున్నాం. అధికార వికేంద్రీకరణ ద్వారా మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆన్‌లైన్‌లోనే అనుమతులు మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. బాధితులెవరైనా నేరుగా రాష్ట్ర కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.

- డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.