close

ప్ర‌త్యేక క‌థ‌నం

కశ్మీర్లో బాల మిలిటెంట్లు

ప్రేరేపిస్తున్న ఉగ్రమూకలు

కశ్మీర్లో బాల మిలిటెంట్లు

అది 2018 నవంబరు 24వ తేదీ అర్ధరాత్రి. కశ్మీర్‌లోని షోఫియాన్‌ జిల్లా బల్సూ గ్రామం. 14 ఏళ్ల నుమాన్‌ అస్రాఫ్‌ భట్‌కు వాట్సాప్‌ సందేశం వచ్చింది. ‘ఉమర్‌ మజీద్‌ గనాయ్‌ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి’ అనేది దాని సారాంశం. గనాయ్‌ కశ్మీరీ యువతలో భారీగా క్రేజ్‌ ఉన్న ముష్కరుడు. అతని అనుచరుల్లో నుమాన్‌ అస్రాఫ్‌ కూడా ఒకడు. గనాయ్‌ ఫొటోలు, వీడియోలను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని తరచూ చూస్తుండేవాడు. అతను భద్రతాదళాల వలలో చిక్కుకున్నాడని తెలుసుకున్న మరుక్షణం నుమాన్‌ బైక్‌పైకెక్కి.. ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న బటాగుండ్‌ గ్రామానికి చేరుకున్నాడు. గనాయ్‌ని కాపాడటం కోసం అతను దాక్కున్న ఇంటి వద్దకు చేరుకుని రక్షణగా నిలబడటానికి ప్రయత్నించాడు. భద్రతా బలగాల బుల్లెట్లకు హతమయ్యాడు.
అది 2018 ఆగస్టు 31వ తేదీ.  శ్రీనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని హజిన్‌ గ్రామానికి చెందిన 14 ఏళ్ల ముదసర్‌ రషీద్‌ ప్యారీ, 16 ఏళ్ల సఖీబ్‌ బిలాల్‌ షేక్‌లు గ్రామం నుంచి కనిపించకుండా పోయారు. ఊరికి అనుకుని ఉన్న కంచెను దాటుకుని అవతలివైపు తమకోసం వేచిచూస్తున్న వ్యక్తి బైక్‌పైకెక్కి వెళ్లిపోయారు. సరిహద్దు ఆవల ఉగ్రముష్కరుల పంచన చేరారు. అది జరిగిన దాదాపు వంద రోజుల తర్వాత అంటే.. డిసెంబరు 9వ తేదీన భద్రతాదళాలతో జరిగిన ఎన్‌కౌంటర్లో ఓ పాకిస్థానీ తీవ్రవాదితో సహా.. ముదసర్‌ రషీద్‌, సఖీబ్‌ బిలాల్‌లు కూడా హతమయ్యారు. మూడు దశాబ్దాల కశ్మీరీ తీవ్రవాద నెత్తుటి చరిత్రలో ప్రాణాలు కోల్పోయిన అతిపిన్న వయస్కుడు ముదసర్‌ రషీద్‌ ప్యారీ.

అది 2017 మార్చి నెల. ఫైజాన్‌(15 ఏళ్లు), ఫర్దీన్‌(17 ఏళ్లు) అనే ఇద్దరు టీనేజీ కుర్రాళ్లు ఉగ్రవాదం వైపు ఆకర్షితులై తుపాకీ చేతబట్టారు. ఉగ్రవాదిగా మారిన రెండు నెలల్లోనే మే నెలలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఫైజాన్‌ హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని భద్రతాబలగాల శిబిరంపై ఆత్మాహుతి దాడి జరిపి హతమైన ఉగ్రవాదుల్లో ఫర్దీన్‌ ఒకడు.

కశ్మీర్లో  ముక్కుపచ్చలారని బాలలు ఉగ్రవాదం వైపు ఎంతగా ఆకర్షితులు అవుతున్నారనే దానికి మచ్చుతునకలు ఇవీ..

గ్రవాద సంస్కృతి విషపు కోరల్లో చిక్కుకొని కశ్మీరీ బాల్యం బుగ్గవుతోంది. పట్టుమని 14 ఏళ్లు కూడా నిండని బాలలు తుపాకీ చేతబట్టే జాడ్యం ఇటీవల విపరీతంగా పెరిగిపోయింది. కశ్మీర్‌ యువతలో భారీగా క్రేజ్‌ ఉన్న తీవ్రవాద కమాండర్‌ బుర్హాన్‌ వనీని 2016లో భద్రతా బలగాలు మట్టుబెట్టిన తర్వాత- ఈ పెడ పోకడ మరీ ఎక్కువయింది. వనీ సైతం తన 15వ ఏటనే ఉగ్రవాదిగా మారిపోయాడు. ఈ బాల తీవ్రవాదులు ఇప్పుడు భద్రతా బలగాలకు సరికొత్త సవాలు విసురుతున్నారు. ఎవరైనా తీవ్రవాది ఎన్‌కౌంటర్లో హతమైతే వేల మంది యువత అక్కడికి చేరుకుని అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్‌ జెండాలు చేతబట్టి భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. భద్రతా బలగాలతో వీధిపోరాటాలకు దిగుతున్నారు.

కశ్మీర్లో బాల మిలిటెంట్లు

ఎందుకు ఇలా జరుగుతోంది?
కశ్మీర్లో బాల మిలిటెంట్లుకశ్మీరీ స్వయం నిర్ణయాధికారం కోసం సుదీర్ఘకాలంగా సాగుతున్న పోరాటం పట్ల యువత మరీ ముఖ్యంగా.. తెలిసీ తెలియని వయసులో ఉన్న బాలలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. తుపాకీ చేతబడితేనే తమ లక్ష్యాన్ని చేరుకోగలమనే విశ్వాసాన్ని  ఉడుకురక్తం ఉన్న బాలల్లో తీవ్రవాదులు నూరిపోస్తున్నారు. వారిని తమకు రక్షణ కవచాలుగా వాడుకుంటున్నారు. బాలల్ని ఇన్‌ఫార్మర్లుగానూ వినియోగించుకుంటున్నారు. పదేళ్ల లోపు పిల్లల్ని సైతం ఈ దిశగా మళ్లిస్తున్నట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి. సరిహద్దు ఆవలి నుంచి పాకిస్థానీ ముష్కరులు వీరికి అండగా నిలుస్తున్నారు. నిరుపేద కశ్మీరీ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటూనే.. వారి పిల్లలకు ఆయుధాలు అందిస్తూ.. శిక్షణ ఇస్తూ.. భారత భద్రతా బలగాలపైకి ఉసిగొల్పుతున్నారు. సమస్యకు రాజకీయ పరిష్కారం పక్కనబెట్టి.. తీవ్రవాద నిరోధక చర్యలపైనే భారత భద్రతా బలగాలు ఎక్కువగా దృష్టిపెడుతున్నాయి. దీంతో హింస మరింతగా ప్రజ్వరిల్లుతోంది. తమ సహచరుల దేహాల్లో బుల్లెట్లను చూసిన యువత మరింతగా రెచ్చిపోతోంది.

కొనసాగుతున్న నియామకాలు
ఉగ్రవాదుల పీచమణిచేశామని, వాళ్లు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలో మాత్రమే ఉన్నారని భారత భద్రతా బలగాలు చెబుతున్నప్పటికీ.. టీనేజీ కుర్రాళ్లు ఉగ్రవాద సంస్థల్లో చేరకుండా నిరోధించలేకపోతున్నారు. బుర్హాన్‌ వనీ హత్య తర్వాత డజన్ల కొద్దీ పాఠశాలలు ధ్వంసమయ్యాయి. దీంతో చాలా మంది పిల్లలు మదర్సాల బాట పట్టారు. అక్కడ బాలలకు తీవ్రవాదాన్ని నూరిపోస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిన్న చిన్న నేరాలకు అలవాటుపడిన నిరుపేద కుటుంబాల వారు త్వరగా లక్ష్యమవుతున్నారు. బాలలపై సైనిక దాడుల్ని ఖండిస్తున్న కశ్మీర్‌ వేర్పాటువాద నాయకులు మాత్రం- తమ పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా చూసుకుంటున్నారు.

జెనీవా ఒప్పందం ఏం చెబుతోంది?
15 ఏళ్లలోపు పిల్లల్ని సాయుధ పోరాటాలకు ఉసిగొల్పకుండా, వారిని పోరాట గ్రూపుల్లో నియమించకుండా జెనీవా ఒప్పందంలోని అదనపు ప్రొటోకాల్‌ నిషేధిస్తోంది. బాలల హక్కులకు ఉద్దేశించి రూపొందించిన 1989 ఒప్పందానికి ప్రపంచం మొత్తం మద్దతు తెలిపింది. ఈ ఒప్పందానికి కశ్మీరీ తీవ్రవాదులు తూట్లు పొడుస్తున్నారు.

ప్రభుత్వం ఏం చేస్తోంది?
బాలలు తీవ్రవాదంవైపు మొగ్గకుండా ప్రభుత్వం పెద్దఎత్తున కార్యకలాపాలను ప్రారంభించింది. ఉపాధ్యాయులు సరైన రీతిలో బోధనలు చేయాలని విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. బాలల్ని ఎల్లప్పుడూ విద్యా సంబంధ విషయాల్లో ఉంచడం కోసం ఆటలు, వర్క్‌షాప్‌లు, స్టడీటూర్లు లాంటివి నిర్వహిస్తున్నారు. హింసలో ధ్వంసమైన పాఠశాలల్ని పునర్‌ నిర్మిస్తున్నారు. చదువుకోవడానికి అన్ని రకాల సదుపాయాలూ కల్పిస్తున్నారు. సాధ్యమైనంత వరకు మదర్సాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. కశ్మీరీల్లో స్థిరపడిన స్వయం నిర్ణయాధికార భావన- వారి పిల్లల్ని తీవ్రవాదం వైపు మళ్లకుండా నివారించలేకపోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. కశ్మీరీ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారి కుటుంబాలు మెరుగైన జీవితాలు గడిపేలా సహాయం చేయాలని, కశ్మీరీ మహిళలపై అకృత్యాలను ఆపాలని సూచిస్తున్నారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.