close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆదాయం, ఆదర్శం.. ఆమె

11.49 లక్షల కుటుంబాల్లో నెలకు రూ.10వేల ఆదాయం
88% పట్టణ పేదల్లో మెరుగైన ఆర్థిక పరిస్థితి
ప్రభుత్వ సాయాన్ని సమర్థవంతంగా    వినియోగించుకుంటూ స్వయం ఉపాధి
ఏపిట్కో తాజా సర్వేలో వెల్లడైన అంశాలు
- ఈనాడు, అమరావతి

ఇల్లాలు ఇంటికి వెలుగవుతోంది.  ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితులను అధిగమించిన మహిళ నేడు కుటుంబానికి ప్రధాన జీవనాధారంగా మారుతోంది. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను చక్కగావినియోగించుకుంటూ మహిళలు ఆదాయాన్ని సముపార్జిస్తున్నారు.  తమ ప్రతిభతో భర్తతో సమానంగా  సంపాదించగలమని వారు  నిరూపిస్తున్నారు. అందుకు అద్దంపడుతోంది ఎపిట్కో సర్వే.

రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్‌ (ఎపిట్కో) తాజా సర్వేలో పట్టణ పేద మహిళల్లో 88 శాతం మంది నెలకు రూ.10 వేల ఆదాయాన్ని పొందుతున్నట్లు వెల్లడించింది. నాలుగేళ్ల వ్యవధిలో 74శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్రంలోని 2లక్షల పట్టణ స్వయం సహాయక సంఘాలు ప్రభుత్వం నుంచి బ్యాంకు భాగస్వామ్య రుణం కింద రూ.11,805 కోట్లు, పసుపు కుంకుమ కింద (పెట్టుబడి నిధి) రూ.1,568.70 కోట్లు, సంస్థాగత సంస్థల నుంచి కార్పస్‌ రూ.1,400 కోట్లు, స్త్రీ నిధి కింద మరో రూ.550.75 కోట్లు అందుకున్నాయి. ప్రధానంగా నాలుగు రంగాల్లో మహిళలు ఆర్థికంగా దూసుకెళ్తూ అనేక మందికి ఉపాధి చూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆహార రంగం  48%


ఇందులో బేకరీ ఉత్పత్తులు, కేటరింగ్‌, పాల ఉత్పత్తులు, అల్పాహార, ఆహార కేంద్రాలు

వస్త్ర, చేనేత రంగం 39%


ఫ్యాషన్‌ డిజైన్‌, దుస్తుల తయారీ, కలంకారి, వస్త్ర వ్యాపారం

హస్త కళలు 5%


అగర్‌బత్తీల తయారీ, వెదురు ఉత్పత్తులు, వస్త్ర, జూట్‌ సంచుల తయారీ, పేపర్‌ ప్లేట్లు

సేవలు 8%


బ్యూటీ పార్లర్‌/సెలూన్‌, దోబి/లాండ్రీ, పిండి మర, ఫొటో స్టాట్‌ సెంటర్‌, పుస్తక దుకాణం

కూలీ నుంచి మగ్గాలు కొనేస్థాయికి..

‘ఒకప్పుడు కూలీగా నేత చీరలు తయారీకి వెళ్లేదాన్ని. నేడు సొంత మగ్గాలపై ఇంటి వద్దనే నేత చీరలు తీసుకొస్తున్నాను. స్వయం, సహాయక సంఘంలో చేరాక బ్యాంకు భాగస్వామ్యం రుణం కింద సమకూర్చిన డబ్బును పెట్టుబడిగా పెట్టి మగ్గాలు కొన్నాను. తయారు చేసిన నేత చీరలను మెప్మా బజార్లలో విక్రయిస్తున్నా. జాతీయ డ్వాక్రా బజార్లలోనూ ఉచితంగా స్టాల్‌ కేటాయించి విక్రయించుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. నైపుణ్యాలు పెంచుకునేలా ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నారు. ఇప్పుడు ఆర్థికంగా పరిస్థితి మెరుగైంది’
- నాగమణి, రామాంజనేయ స్వయం, సహాయక సంఘ సభ్యురాలు, ప్రొద్దుటూరు, కడప జిల్లా

పట్టుదలను  గుర్తించి ప్రోత్సహించారు..

‘బ్యాంకు భాగస్వామ్య రుణంతో రాగి, ఇత్తడి వస్తువులు శుభ్రం చేసే ‘క్లీనింగ్‌ లిక్విడ్‌ యూనిట్‌’ని ప్రారంభించాం. చక్కని ఫలితాలు సాధిస్తున్నాం. మొదట్లో తగిన పెట్టుబడి లేకపోవడంతో యూనిట్‌ పెట్టాలన్న ఆశ చాన్నాళ్ల వరకు నెరవేరలేదు. స్వయం, సహాయక సంఘంలో చేరాక పట్టుదలను గుర్తించి అధికారులు ప్రోత్సహించారు. మెప్మా బజార్లు, జాతీయ డ్వాక్రా బజార్లతో ఉత్పత్తులను పెట్టి విక్రయిస్తున్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది’
- రాజు దుబా, శివాని మహిళా పొదుపు సంఘ సభ్యురాలు, జ్ఞానాపురం, విశాఖపట్నం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.