close

ప్ర‌త్యేక క‌థ‌నం

విద్యార్థి నాడి పడదాం

కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులపై పార్టీల దృష్టి
వారితో ముచ్చటించేందుకు అగ్రనేతల ఆసక్తి
తమ విధానాలు వివరించడం ద్వారా ఆకట్టుకునే యత్నాలు
రాష్ట్రంలో ఓటుహక్కు అర్హత కలిగిన విద్యార్థులు 30 లక్షల మంది

విద్యార్థి నాడి పడదాం

రాష్ట్రంలో త్వరలో శాసనసభతో పాటు లోక్‌సభ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు వివిధరకాలుగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులను వచ్చే ఎన్నికల్లో కీలకమైన ఓటర్లుగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు పరిగణిస్తున్నాయి. ఈ నవతరం ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమ పార్టీ పట్ల విద్యార్థుల్లో సానుకూల దృక్పథం నెలకొనేలా తెదేపా, వైకాపా, జనసేన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, వైకాపా అధ్యక్షుడు జగన్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నేరుగా విద్యార్థుల వద్దకే వెళ్లి వారితో ముచ్చటిస్తున్నారు. వివిధ రూపాల్లో సాగుతున్న ఆయా పార్టీల అధినేతల జిల్లా పర్యటనల్లో... విద్యార్థులను కలవడం ఒక ప్రాధాన్యాంశంగా ఉంటోంది. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, డిగ్రీ కోర్సులు, పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వీరు సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్ఞానభేరి, వైకాపా నిర్వహించిన యువభేరి కార్యక్రమాలు, జనసేన కాలేజీల్లో విద్యార్థులతో నిర్వహిస్తున్న సమావేశాలు ఈ కోవలోనివే.
తెదేపా టీఎన్‌ఎస్‌ఎఫ్‌

మరోపక్క తెదేపా అనుబంధ విద్యార్థి విభాగం టీఎన్‌ఎస్‌ఎఫ్‌... విద్యార్థుల్ని తమ పార్టీవైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి 20 మంది విద్యార్థి నాయకుల్ని ఎంపిక చేసి శిక్షణనిస్తోంది.

జ్ఞానభేరి ద్వారా ఇలా

* రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్ఞానభేరి పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం.
* ప్రపంచంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో, ఉద్యోగాల్లో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పుల గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించడం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వారిని సంసిద్ధం చేయడం, వారిలో స్ఫూర్తిని, పోటీతత్వాన్ని నింపడం, పరిశోధనల పట్ల ఆసక్తి రేకెత్తించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
* జ్ఞానభేరిలో రాజకీయాల ప్రస్తావన ఎక్కడా ఉండకపోయినా... అంతర్లీనంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్ని వివరించి, వారిని ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యం.

వైకాపా యువభేరి

* ప్రధాన ప్రతిపక్షం వైకాపా యువభేరి పేరుతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించింది.
* జగన్‌ పాదయాత్ర మొదలవకముందు రాష్ట్రంలో 3-4 చోట్ల ఈ కార్యక్రమాలు జరిగాయి.
* వైకాపా కూడా రాజకీయాల్ని ప్రస్తావించకుండా... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం, రాకపోతే జరిగే నష్టాల్ని విద్యార్థులకు వివరించి, వారిలో అవగాహన కల్పించడం లక్ష్యంగా యువభేరి నిర్వహిస్తున్నట్టు చెప్పింది.
* జగన్‌ పాదయాత్రలో కూడా ఒకటి రెండు చోట్ల విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
* ఆ పార్టీ విద్యార్థి విభాగం రాజకీయ కార్యకలాపాల ద్వారా విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

జనసేన ఇలా

* జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌... తన జిల్లా పర్యటనల్లో భాగంగా భీమవరం, రాజమహేంద్రవరం, అమలాపురం, జంగారెడ్డిగూడెం, ఏలూరు వంటి చోట్ల విద్యార్థులతో సమావేశాలు నిర్వహించారు.
* యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిలో యువత పాత్ర, తమ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఏం చేస్తుంది? అన్న అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు.
* భగత్‌సింగ్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఆ పార్టీ విద్యార్థి విభాగం వీటిని సమన్వయం చేస్తోంది.

విద్యార్థులపైనే చూపు ఎందుకు?

* సాధారణంగా ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసుకునేసరికి విద్యార్థులకు ఓటు హక్కు లభిస్తుంది.
* విద్యార్థులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో... కొత్త ఓటర్లు ఎక్కువగా పెరుగుతున్నారు.
* రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసుకుంటున్నారు. వీరిలో ఐదు లక్షల మంది రాష్ట్రంలో చదువుతున్నారనుకున్నా... రాష్ట్రంలోని వివిధ డిగ్రీ, వృత్తివిద్యా కోర్సులు, పీజీ కోర్సులు చదువుతున్నవారి సంఖ్య సుమారు 25-30 లక్షల వరకు ఉంటుంది.
* విద్యార్థులంతా నవతరం కాబట్టి... ఏదో ఒక ప్రభావానికిలోనై ఓట్లు వేసేవారు తక్కువగా ఉంటారన్న భావన ఉంది. ఎక్కువ మంది స్వతంత్రంగా ఆలోచించి ఓటు వేసేందుకు అవకాశముంది.
* విద్యార్థులతో రాజకీయాల గురించి మాట్లాడకుండా... వారితో ఉపాధి, ఉద్యోగావకాశాలు వంటి ఇతర అంశాల్ని చర్చించడం ద్వారా ఆకట్టుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
- ఈనాడు, అమరావతి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.