Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

పల్లెకు పోదాం.. పండగ చేద్దాం

పల్లెకు పోదాం.. పండగ చేద్దాం

సంక్రాంతి.. ప్రకృతి పండగ. 
మనిషికీ మట్టికీ.. మనిషికీ ప్రకృతికీ.. ముఖ్యంగా మనిషికీ సూర్యుడికీ మధ్యనున్న అన్యోన్య సంబంధాన్నీ, అవినాభావ అనుబంధాన్నీ నొక్కిచెప్పే పండగ. 
ఈ భూమి మీది ప్రతి జీవికీ ప్రత్యక్ష దైవమైన సూర్యుడి మకర ప్రవేశం.. రైతన్నలు కష్టించి పండించిన ధాన్యలక్ష్మి గృహప్రవేశం... ఈ రెండు శుభాల సంగమ సంరంభం సన్‌క్రాంతి! 
అందుకే సంక్రాంతి అనగానే ఒక్కసారిగా మన కళ్ల ముందు పల్లె తల్లి మెదులుతుంది. గడపగడపకూ కళకళలాడుతూ వేలాడే కొత్త కంకుల సౌభాగ్యాలు గుర్తుకొస్తాయి.

పల్లెలు మన పునాదులు. దేశ ఆర్థిక రంగానికే కాదు.. మన సంస్కృతికీ, సామాజిక జీవితానికీ పట్టుగొమ్మలు. మారిన కాలంతో పాటే మనం పట్టణాలను నమ్ముకుని ఎంత పైపైకి ఎదిగినా.. ఎన్ని పదుల అంతస్తులెక్కినా.. మన తల్లి వేర్లు మాత్రం పల్లె ఒళ్లోనే ఉన్నాయి. మన భాష, మన భావం, మన సామెతలు, మన ఆలోచనలు, మన అనుబంధాలు, మన అనురాగాలు.. అన్నీ పల్లెపట్టుల్లో సంక్రాంతి ముగ్గుల్లా అందంగా ఆరబోసుకుని ఉన్నాయి. 
అందుకే మనం వేర్లు తెగిన చెట్లం కాకుండా ఉండేందుకు.. మన పిల్లలకు ఆ పునాదులను పరిచయం చేసేందుకు.. వాళ్లను తీసుకువెళ్లి ఆ పల్లె ఒడిలో కూర్చోబెడదాం. నులి వెచ్చటి సూర్యకిరణ స్పర్శలో.. ఆ భోగిమంటల వెలుగులో.. వాళ్లు కళ్లు ఇంతింత చేసుకుని కోళ్లనూ, కాడెద్దు జోళ్లనూ చూస్తూ.. గడ్డివాములనూ, గంగిరెద్దులనూ పలకరిస్తూ.. మూలాలతో ముడివేసుకుంటూ.. ఆత్మీయతలను పెనవేసుకుంటూ.. పచ్చటి ప్రకృతితో మమేకమవుతుంటే.. అదెంత కన్నుల పండువ! దానికి ఈ సంక్రాంతిని మించిన సుముహూర్తం ఏముంటుంది..? ఈ ప్రకృతి పండగను మించిన పర్వదినం ఏముంటుంది..?

పల్లెకు పోదాం.. పండగ చేద్దాం

సంక్రాంతి.. పెద్ద పండగ! తెలుగువాళ్లంతా గాదెలు నిండిన ఆనందంతో.. గుండెల నిండుగా నాలుగు రోజులు సంతోషంతో జరుపుకునే అపురూపమైన ప్రకృతి పండగ!

ప్రకృతికీ, మనకూ మధ్యనున్న అవినాభావ సంబంధాన్ని.. ఊరంతా కలిసి.. సకల జనులూ ఎంతో సంబరంగా, మరెంతో కళాత్మకంగా వ్యక్తీకరించుకునే నిండైన పండగ! మన ప్రకృతి, మన పంటలు, మన పశువులు.. మన సంపదలు, మన కళలు, మనవైన ప్రత్యేక వంటలు... ఇలా ఎన్నో అంశాలను పెనవేసుకున్న పండగ కాబట్టే పల్లెపట్టులన్నీ ఈ పండగకు మెరిసిపోతాయి. ఇళ్లన్నీ కొత్త అల్లుళ్లతో, కొత్త శోభతో కళకళలాడిపోతుంటాయి. మన పిల్లలకు ఇవన్నీ పరిచయం చేయటానికి ఇంతకు మించిన అద్భుత అవకాశం ఉండదు.

పల్లెకు పోదాం.. పండగ చేద్దాం

భోగితో మొదలు.. ముక్కనుమతో ముగింపు! 
ఇల్లు చేరిన భోగభాగ్యాలకు గుర్తుగా ఇంటి ముందు భోగి మంటలతో.. పిల్లలందరికీ భోగిపండ్లు పోయటంతో.. భోగి రోజున ఆరంభమయ్యే సంబరాలు.. ప్రధాన సంక్రాంతి పండగ రోజునే కాదు.. ఆ తర్వాత కనుమ, ముక్కనుమల వరకూ విస్తరిస్తాయి! 
బంగారంలాంటి పంటపొలాల్నీ, కడుపు నింపే దిగుబడినీ తలచుకుని సంబరపడే రైతన్న శ్రమకు, సంపదకు గొప్ప స్థానమిచ్చే పండగ ఇది. బీదాగొప్పా తేడా లేకుండా.. ఇంటిల్లిపాదీ ఒకచోట చేరి ఆనందంగా జరుపుకొనే పండగ కాబట్టే.. సంక్రాంతి వచ్చిందంటే ఊళ్లలో ఎక్కడ లేని సందడీ మొదలవుతుంది. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు సైతం సకుటుంబ సపరివార సమేతంగా పల్లెకు చేరుకుని సంతోషంగా పండుగ చేసుకోవడం ఆనవాయితీ. ముగ్గులు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, భోగిపళ్లు, భోగి మంటలు, అరిసెలు, అల్లుళ్లు, గంగిరెద్దులు, కొత్త ధాన్యాలు, హరిలో రంగ హరి.. ఇలా ఎన్నెన్నో..! ఎనెన్నో విశిష్ఠ సంప్రదాయాలు, ఆచారాలకు నెలవు ఈ పండుగ.

భోగి.. తొలినాటి శోభకు అద్దం పడుతుంది. ఇళ్ల ముందు సరదాగా మంటలు వేస్తూ.. వాటి చుట్టూ వెచ్చ కాగుతూ.. నాట్యాలు చేస్తూ.. ఆనందంగా ఆరంభమయ్యే రోజు ఇది! ఇంట్లోని పిల్లలందరికీ రేగుపండ్లు, అక్షతలు.. పూలు కలిపి నెత్తిన పోస్తూ.. బాలారిష్టాలేవైనా ఉంటే తొలగిపోవాలని ఆశీర్వదించే భోగిపండ్ల ఘట్టం.. పిల్లలకు వినోదాన్నీ, పెద్దలకు గొప్ప తృప్తినీ పంచుతుంది. నెత్తిన పడే రేగుపళ్లు, చిల్లర పైసలను పట్టుకునేందుకు పిల్లలు చేసే అల్లరి పెద్ద హైలైట్‌!

పల్లెకు పోదాం.. పండగ చేద్దాం

పెద్దల పండుగ 
సంక్రాంతి పశువులకే కాదు.. మన జీవానికి ఆధారాన్నిచ్చిన పెద్దలను, తరతరాల వారినీ తల్చుకుని..వారికి పూజలు అందించటం, వారి పేరిట వాయినాలూ, దానాలూ చేయటం ద్వారా కృతజ్ఞతలు చెప్పుకునే రోజు కూడా!

కనుమ.. రైతు సంతోషం కనుమా..! 
మన మనుగడకు సహకరించే పశువులకు కృతజ్ఞతలు చెప్పుకునే రోజుది! అందుకే రైతన్నలంతా పశువులనూ, వాటి కొట్టాలనూ శుభ్రంగా కడిగి.. పశువుల కొమ్ములకు రకరకాల రంగులద్ది.. వాటిపైన వయ్యారంగా బంతిపూలు గుచ్చి.. వాటిని పూజించి మురుసుకునే అద్భుత సందర్భానికి తెర తీస్తుంది కనుము. వాటి సహకారంతోనే మన బతుకు పండుతుందని గుర్తు చేసుకునే రోజిది. అంతే కాదు, ఇంటి వాకిట కట్టిన కంకుల కోసం వచ్చి కిచకిచలాడుతూ గింజలు తినిపోయే పక్షులను చూడటం ఒక సౌందర్యాత్మక దృశ్యం. ఈ రోజు పశువుల కొట్టాల్లోనే పొంగలి వండి నైవేద్యం పెడతారు. ఆ పొంగలిలో పసుపు, కుంకుమ కలిపి పొలాల్లో ‘పొలి’ చల్లుతారు. పండి ఉన్న పంట పొలాలకు గుమ్మడికాయ పగులగొట్టి దిష్టితీస్తారు. పొంగలిని పశువులకు తినిపిస్తారు. చేలల్లో ఉన్న కొత్త పంటను ఈ రోజే ఇళ్లకు తీసుకువస్తారు. సాయంత్రం పశువుల్ని అలంకరించి మేళతాళాలతో ఊరేగిస్తారు.  ఇక తిండి తిప్పలంటారా.. ‘కనుము రోజు మినుము తినాలన్న’ సామెత ఉండనే ఉంది! రకరకాల మాంసాలతో పిండి వంటలతో ఇళ్లన్నీ ఘుమఘుమలాడిపోవటం ఖాయం!

ముక్కనుమ 
సంక్రాతి సంబరాల్లో చివరి రోజైన నాలుగో రోజు ముక్కనుమ. పండగకు కొనసాగింపుగా.. ఊరూవాడా అంతా తిరిగి.. దొరికినన్ని కాయగూరలన్నీ పోగుచేసి.. రకరకాల ముక్కలతో వండే దప్పళాలు.. రకరకాల మాంసాలతో పండగ వాతావరణాన్ని కొనసాగిస్తారు. ఇక కొందరైతే రథం ముగ్గు వేసి .. దాని తాడును పక్కింటి వాళ్ల రథానికి కలుపుతూపోగా.. పోగా.. ఆ రథాల తాళ్లతో ఊరంతా అందంగా అల్లుకున్న పొదరిల్లులా మారిపోతుంది.

పల్లెకు పోదాం.. పండగ చేద్దాం

నమో సూర్యాయ!

రాశికి 30 రోజుల చొప్పున సూర్యుడు 12 రాశులలో సంచరిస్తూ.. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి లేదా సంక్రమణం. ధనూరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభ సందర్భాన్నే సంక్రాంతి పర్వదినంగా భావిస్తాం. సరిగ్గా జనవరి 13, 14 తేదీల్లో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మనకు ఏడాదికి పన్నెండు సంక్రాంతులు వస్తాయి. కానీ అన్నింటికన్నా సుదీర్ఘమైన పుణ్యకాలం ప్రారంభమయ్యేది మకర సంక్రాతి తర్వాతే. క్రాంతి అంటే వెలుగు. సంక్రాంతి అంటే కొత్త వెలుగు. అందుకే సంక్రాంతి కేవలం పండుగే కాదు, గొప్ప సదాచారం కూడా.

అద్భుత కిరణ స్పర్శ

పల్లెకు పోదాం.. పండగ చేద్దాం

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ‘సన్‌’క్రాంతి ఘడియలు.. ఈ భూమ్మీద మన జీవం, ప్రాణం, ఆరోగ్యం.. సమస్తం శక్తిస్వరూపుడైన ఆ సూర్యభగవానుడితోనే ముడిపడి ఉన్నాయని అనాదిగా మనం గుర్తు చేసుకుంటూ.. కొత్త ఉత్తేజాన్ని ఆవాహన చేసుకుంటున్న పర్వదిన ఘడియలు! ప్రపంచం మొత్తానికీ సూర్యుడే శక్తి కేంద్రం. ఆ కిరణ స్పర్శ లేకపోతే లేకపోతే మన మనుగడే కష్టం. రెండుమూడు రోజులు మన కంటికి సూర్యుడు కనబడకపోతే జీవితం నిరాసక్తంగా, మందకొడిగా, చైతన్య రహితంగా తయారవుతుంది. నిద్ర-మెలకువలను నియంత్రించేదీ, మనలో ఉత్సాహాన్ని ప్రేరేపించేదీ, కీలక విటమిన్లను అందించేదీ సూర్యుడి వెలుగే. మనమూ, మన పిల్లలూ నెలల తరబడి ఎండ ముఖం చూడకుండా కాలం గడిపేస్తున్న ఈ కృత్రిమ కాలంలో.. ఈ పండుగ ప్రాముఖ్యం మరింత పెరుగుతోందని వేరే చెప్పాలా!

కోడి పందేలు, ఎద్దుల పోటీలు

పల్లెకు పోదాం.. పండగ చేద్దాం

కనుమ రోజే కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు, ఎద్దుల పోటీలు అలరిస్తాయి. మొదట్లో సరదా కోసం ఆరంభమైన ఈ పందేలు రాన్రానూ జూదంగా మారి.. ఈ సమయంలో పెద్ద చర్చనీయాంశంగానూ తయారయ్యాయి.

అబ్బురపరిచే గొబ్బెమ్మలు

ఆవు పేడతో గొబ్బెమ్మలు సంక్రాంతి స్పెషల్‌! రంగురంగుల రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మను ఉంచి.. పసుపు కుంకుమ, పూలతో అలంకరించి.. దానిపై చిరుధాన్యాలు చల్లటం.. తెల్లవారు జామున పెట్టిన గొబ్బెమ్మలను అసుర సంధ్యవేళ తీసి.. పిడకలు చేస్తారు. నెల రోజుల పాటు పెట్టిన గొబ్బెమ్మల పిడకలను పండుగ రోజు పొయ్యి కింద పెట్టి ఆ మంటతో పాయసం చేస్తారు.

సందడిగా పతంగులు

సంక్రాంతి సీజన్‌ వచ్చిందంటే తెలంగాణలో ఎక్కడచూసినా పతంగుల రెపరెపలు కనిపిస్తాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా చిన్నాపెద్దా అంతా చెర్కాలు, డోరీ పతంగులతో సందడి చేస్తారు. ఈ వాతావరణం పండుగకు నెల రోజుల ముందు నుంచే ప్రారంభమవుతుంది. ఊర్లో ఎవరు పెద్ద గాలిపటం ఎగురవేశారు.. ఎవరు ఎన్ని పతంగులకు పేంచీ (తెంపేయడం) వేశారనేది ఓ పోటీలా సాగిపోతుంటుంది.

అరిసెలు.. సకినాలు.. నువ్వులుండలు..

పల్లెకు పోదాం.. పండగ చేద్దాం

సంక్రాంతి పండుగ వస్తే ఇంట్లో నేతిఅరిసెలు ఘుమఘుమలాడాల్సిందే. కొత్త బియ్యంతో అరిసెలు చేస్తారు. ఈ పిండి వంటల సమయంలో ఇరుగు పొరుగు మహిళలు వచ్చి వీటిని తయారు చేయడంలో సహకరిస్తుంటారు కూడా. తెలంగాణ సుప్రసిద్ధ పిండి వంటకాల్లో ఒకటైన సకినాలను సంక్రాంతికి ప్రతి ఇంట్లోనూ చేస్తుంటారు. సకినాలను చుట్టడం ఓ కళ. కొందరు మహిళలు ఇందులో సిద్ధహస్తులుగా ఉంటారు. పద్ధతి ప్రకారం చేసిన సకినాలు కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి. ఇక పండుగ సందర్భంగా చేసే తీపి పదార్థం నువ్వుల ఉండలు. బెల్లం, నువ్వులతో చేసే ఈ ఉండలను పర్వదినాన పెద్దలు చిన్నవారికి ఇచ్చి ‘నువ్వులుదిని నూరేళ్లు బతుకు..’ అని దీవిస్తుంటారు.

బొమ్మరిళ్లు..

కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా తమ చిన్నారుల కోసం ఇంటి ప్రాంగణంలో బొమ్మరిల్లు నిర్మిస్తుంటారు. ఒక వరుస ఇటుకలతో దీన్ని అందమైన పొదరిల్లుగా తీర్చిదిద్దుతారు. అందులోనే చిన్న పొయ్యి, ఇతర ఏర్పాట్లు అచ్చంగా ఓ ఇంట్లో ఉన్నట్లు చేస్తారు. సంక్రాంతి రోజున సాయంత్రం ఇరుగు పొరుగు ఇళ్లలోని చిన్నారులంతా అక్కడికి చేరుకొని ‘చిరు’తిళ్లతో సందడి చేస్తారు.

పాలపొంగులు..

సంక్రాంతి రోజున ఇంటి ప్రధాన గుమ్మం ముందు పాలు పొంగించడం కొన్ని చోట్ల పరిపాటి. ముందుగా ఆ ప్రాంతాన్ని జాజు, సున్నంతో అలికి.. చుట్టూ గొబ్బెమ్మలు పెట్టి ఓ దారం కడతారు. ఓ వైపున దేవుడి పటం పెట్టి.. మధ్యలో పిడకలపై గురిగి పెట్టి అందులో పాలు పొంగిస్తారు. పాలచుట్టూ కూరగాయలు, మిర్చీ ఇతర పదార్థాలు నివేదిస్తారు.

నోములు..

సంక్రాంతి పండుగకు ఏదైనా ఓ నోము నోచుకోవడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇరుగు పొరుగువారు, స్నేహితురాళ్లు, బంధువుల మధ్య చక్కని సంబంధ బాంధవ్యాలు పెంపొందించేందుకు ఈ నోములు ఉపకరిస్తాయి. ముఖ్యంగా పెళ్లయ్యాక మొదటి నోము అతివలకు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తుంటారు. కొత్త కుండలను సైతం నోముకుంటారు. ఏవైనా స్టీల్‌, రాగి, ప్లాస్టిక్‌ వస్తువులు 13 సెట్లు తయారుచేసుకొని వాటికి ప్రత్యేక పూజ చేస్తారు. ఆ తర్వాత ముత్తయిదువులకు పంచుతారు. వీటితోపాటు పసుపు, కుంకుమ, నువ్వుల ఉండలను కూడా ఇస్తారు. తులసివనం, బృందావనం, కుచేల మూటలు, తమ్మునికి తలంబ్రాలు-మరదలికి మాణిక్యాలు.. ఇలా పలు ఆకర్షణీయమైన పేర్లతో నోములు ఉంటాయి. ఈ సారి మొక్కలను నోముకొని పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదామంటూ ఈ మధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లో అతివల మధ్య చర్చ జరగడం విశేషం.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.