close

ప్ర‌త్యేక క‌థ‌నం

యువ హృదయం.. జర పదిలం

యుక్త వయసులో గుండెపోటు ప్రాణాంతకం
అమెరికాతో పోల్చితే హృద్రోగాలు మన దగ్గర   ఐదింతలు ఎక్కువ
బ్రిటన్‌, అమెరికాల్లో కుటుంబ వైద్యుడికే పట్టం
అవసరమైతేనే స్పెషలిస్టు వైద్యుని వద్దకు..
ఆపీ సదస్సు   కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీని గంగసానితో ‘ఈనాడు’ ముఖాముఖి
ఈనాడు - హైదరాబాద్‌

మెరికాతో పోల్చితే మన దేశంలో గుండెజబ్బులు ఐదింతలు ఎక్కువని, ముఖ్యంగా యుక్తవయసులో గుండెపోటు వస్తే తీవ్రత ప్రాణాంతకంగా ఉంటుందని అమెరికాలోని అట్లాంటాలో గుండె వైద్యనిపుణులుగా రాణిస్తున్న డాక్టర్‌ శ్రీని గంగసాని చెప్పారు. మన దగ్గర కుటుంబ వైద్యుడి విధానం కనుమరుగవుతున్న పరిస్థితుల్లో.. బ్రిటన్‌, అమెరికాలాంటి పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికీ దీన్ని ఆదరిస్తున్నారని చెప్పారు. అమెరికాలో భారతీయ మూలాలున్న వైద్యుల సంఘం (ఆపీ) నిర్వహిస్తున్న 37వ వార్షికోత్సవ సదస్సుకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీని గంగసాని ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. ఆయనతో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి.

ఆపీ ఎప్పుడు ఏర్పడింది? దీని లక్ష్యాలేమిటి?
భారతీయ మూలాలున్న వైద్యులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సంఘటితంగా పరిష్కరించుకునేందుకు 1982లో డెట్రాయిట్‌లో ఆపీగా ఏర్పడ్డారు. ఇప్పుడు దీనిలో లక్ష మంది సభ్యులున్నారు. వీరిలో దాదాపు 30 శాతం మంది తెలుగువారే. ఆపీ వైద్యుల విశిష్టత ఏంటంటే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రతి ఏడుగురు రోగుల్లో ఒకరికి వైద్యసేవలందించేది భారతీయ వైద్యులే. న్యూజెర్సీ, ఇలినాయిస్‌ వంటి రాష్ట్రాల్లో అయితే ప్రతి నలుగురిలో ఒకరికి వైద్యం చేసేది మనవారే కావడం విశేషం.

ఉన్నత విద్య కోసం అమెరికా వస్తున్న వైద్యవిద్యార్థులకు అవకాశాలెలా ఉన్నాయి?
భారత్‌ నుంచి వచ్చే వైద్యవిద్యార్థులకు మెరుగైన అవకాశాలే ఉన్నాయి. అక్కడ నిర్వహించే పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలి. వైద్యపరిశోధనలపై పట్టు పెంచుకుంటే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.

మన దేశంలో యుక్తవయసులోనే గుండెజబ్బుల బారిన పడుతున్నారు. దీనికి పరిష్కారమేంటి?
మన వాళ్లలో ఇప్పుడు 20 ఏళ్ల వయసుల్లోనూ గుండెజబ్బులు బారినపడిన వారిని చూస్తున్నాం. అమెరికన్లతో పోల్చితే భారతీయ మూలాలున్న వ్యక్తుల్లో గుండెజబ్బులు ఐదింతలు అధికం. ప్రపంచ దేశాల్లో 40 ఏళ్లలోపు వారిలో 5 శాతం మంది గుండెపోటుతో మరణిస్తుండగా.. భారతీయుల్లో అది 20-25 శాతంగా ఉంది. ఇందుకు సగం కారణం మన జన్యువులే. మధుమేహం, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ వంటివి మిగిలిన కారణాలు. చిన్నప్పుడు పాఠశాలకు నడిచి వెళ్లేవాళ్లం. ఇప్పుడది తగ్గిపోయింది. నిల్వ ఆహారం తినడం, ధూమపానం, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, పని ఒత్తిడి తదితరాలు కూడా ప్రమాదాన్ని పెంచుతున్నాయి. గుండె రక్తనాళాల్లో 20-30 శాతం పూడికలున్నప్పుడు కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయినా, ధూమపానం, చెడు కొలెస్ట్రాల్‌ తదితర కారణాల వల్ల ఎప్పుడైనా సరే.. ఒక్కసారిగా రక్తనాళం బద్ధలై పూడిక వందశాతంగా మారిపోతుంది. దీంతో 5-10 నిమిషాల్లోపే ప్రాణాలు కోల్పోతుంటారు. అందుకే ఎక్కువగా చెమటలు పట్టినా, నడుస్తుంటే ఆయాసంగా అనిపించినా, ఛాతీలో పట్టేసినట్లుగా అనిపిస్తున్నా వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. ముఖ్యంగా యుక్తవయస్కుల్లో గుండెపోటు వస్తే తీవ్రత అధికంగా ఉంటుంది. క్యాన్సర్‌ కణాలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయో.. గుండె రక్తనాళాలు కూడా అంతే వేగంగా పూడుకుపోతాయి.

గుండె మార్పిడి చికిత్సల్లో అమెరికాలో దాతలు ముందుకొస్తుంటారా?
అమెరికాలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇచ్చేటప్పుడే అవయవదానంపై అనుమతి కోరతారు. అంగీకారమిచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో జీవన్మృతుడిగా మారితే.. వెంటనే అవయవాలను సేకరిస్తారు. అయినా కూడా ఇప్పటికీ అమెరికాలో గుండె మార్పిడి చికిత్సలు ఏటా సుమారు 50 వేల మందికి అవసరమవుతుంటే 2,500 మందికి మాత్రమే జరుగుతున్నాయి. గుండెమార్పిడి జరిపితే పదేళ్ల జీవితకాలం పెరుగుతుంది. మన దగ్గర కూడా ఈ శస్త్రచికిత్సలు బాగానే చేస్తున్నారు. అవయవదానంపై చైతన్యం మరింత పెరగాలి.

అమెరికాలో ప్రాథమిక వైద్యం ఎలా ఉంటుంది? అక్కడ కుటుంబ వైద్యుడి వ్యవస్థ ఉందా?
యూఎస్‌లో ప్రాథమిక వైద్యం పక్కాగా అమలవుతోంది. ప్రతి రోగికి నివాస ప్రాంతంలో కుటుంబ వైద్యుడు (ఫ్యామిలీ ప్రాక్టీషనర్‌) ఉంటారు. వారిని ‘ప్రైమరీ గేట్‌ కీపర్‌’ అంటారు. రోగి కుటుంబ వైద్యుడి వద్దకు వెళ్తే.. సమస్యను పరిశీలించి అవసరమైతే స్పెషలిస్టు వైద్యుని వద్దకు పంపిస్తారు. ఉదాహరణకు ఛాతీలో నొప్పి ఉంటే అది గుండెనొప్పా? ఛాతీలో మంటా? కండరాల నొప్పా? అనేది కుటుంబ వైద్యుడు గుర్తించి, అవసరమైతేనే ఉన్నత స్థాయి వైద్యానికి పంపిస్తారు. అయితే ఈ క్రమంలో స్పెషాలిటీ వైద్యుడి దగ్గరికి వెళ్లడం కొంచెం ఆలస్యమవుతుంది.

మన వైద్య వ్యవస్థలో లోటుపాట్లను చక్కదిద్దడంపై మీ సూచన?
ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. సాంకేతిక పరిజ్ఞానంతో స్పెషాలిటీ వైద్య సేవలను పల్లెలకు అందించాలి. టెలీ వైద్యం విధానాన్ని మరింత విస్తరించాలి.

మన దగ్గర కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అనవసర పరీక్షలు చేయిస్తుంటారనే ఆరోపణలున్నాయి. అక్కడెలా ఉంటుంది?
అమెరికాలో అత్యధిక సందర్భాల్లో అవసరమైన పరీక్షలే చేయిస్తుంటారు. స్పెషలిస్టు వైద్యుని వద్దకు వెళ్తే సంబంధిత అవయవానికి సమగ్ర పరీక్షలు చేయిస్తారు. రోగికి ఫలానా పరీక్ష చేయించకపోవడం వల్ల జబ్బును గుర్తించలేకపోయాం, అందువల్లే నష్టం జరిగిందంటే న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతాయి. వైద్యులు తప్పుడుగా వ్యవహరిస్తే కఠిన చర్యలే తీసుకుంటారు. అయితే అక్కడ భౌతిక దాడులు, ఆసుపత్రి ధ్వంసం వంటివి ఉండవు.

శ్రీని వ్యక్తిగతం

* శ్రీని గంగసాని స్వస్థలం తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌.
* నల్గొండ జిల్లాలోని ‘సర్వైల్‌’ గురుకుల విద్యాలయంలో చదివారు.
* కర్నూలు వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ వైద్యవిద్య అభ్యసించారు.
* 1993లో పీజీ వైద్యవిద్యకు అమెరికా వెళ్లి, తర్వాత గుండె వైద్యంలో పట్టా పొందారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.