
ప్రత్యేక కథనం
పోటీ చేయడానికి ఓటర్లు కరవు
మరికొన్ని చోట్ల ఉప సర్పంచులే సర్పంచులు
రిజర్వేషన్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిత్రమైన పరిస్థితి
ఈనాడు-ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల రిజర్వేషన్లలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ సామాజిక వర్గాలకు పాలనలో సమానత్వం, పారదర్శకత కల్పనకు ఏర్పాటు చేసిన రిజర్వేషన్ల వల్ల కొన్ని చోట్ల కొత్తచిక్కులొచ్చి పడ్డాయి. జిల్లాలో 1508 గ్రామ పంచాయతీలుండగా..వాటిలో 613 ఎస్టీలకు రిజర్వు చేశారు. ఎస్టీలకు కేటాయించిన కొన్ని గ్రామ పంచాయతీల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లేకపోవడం విశేషం. కొన్ని చోట్ల ఉప సర్పంచులే సర్పంచులుగా చలామణి అయ్యే అవకాశం ఉండగా.. మరికొన్ని చోట్ల సగం వార్డుల్లో రిజర్వు చేసిన వర్గాల ఓటర్లు లేకపోవడంతో అక్కడ ఉప సర్పంచుల ఎన్నిక కూడా జరగని పరిస్థితి. ఏజెన్సీ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కొన్ని పంచాయతీల సర్పంచి స్థానాలు పూర్తిగా ఎస్టీలకే కేటాయిస్తున్నారు. ఆయా గ్రామాల్లోనూ ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో పాతిక ముప్పై ఏళ్ల నుంచి పంచాయతీ ఎన్నికలు జరగడంలేదు. కొత్త పంచాయతీల ఏర్పాటు, రిజర్వేషన్ల కేటాయింపు వంటి పరిణామాలతో కొన్ని చోట్ల సర్పంచి, వార్డుల స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులే లేకుండా పోయారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
* తలమడుగు మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన రుయ్యాడి సర్పంచి పదవిని ఎస్టీ మహిళకు కేటాయించారు. 10వార్డుల్లో సగం అదే సామాజిక వర్గానికి రిజర్వు అయ్యాయి. అయితే ఆ గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేరు. నామినేషన్లు వేయడానికి ఎస్టీ ఓటరే లేకున్నా..1987లో ఏజెన్సీ చట్టం అమల్లోకి వచ్చినప్పటినుంచి వారికే కేటాయిస్తున్నారు. ఉప సర్పంచి ఎన్నికకు సరిపడా వార్డు సభ్యులు లేకపోవడంతో ఆ ఎన్నిక కూడా జరగడంలేదు. అనాదిగా ఆ గ్రామంలో అయిదుగురు వార్డు సభ్యులు మాత్రమే ఎన్నికవుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో..
* దండేపల్లి మండలం ఏజెన్సీ ప్రాంతంలోని గూడెం గ్రామపంచాయతీని 30 ఏళ్లుగా ఎస్టీలకు కేటాయిస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో ఆనాటి నుంచి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగడంలేదు. పది వార్డుల్లో సగం వరకు ఎస్టీలకే కేటాయించడంతో ఉప సర్పంచి ఎన్నికకు సరిపడా వార్డు సభ్యులు లేక ఆ వార్డులకు కూడా ఎవరూ నామినేషన్లు వేయడం లేదు. ఇది ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతోంది.
ఎస్సీలు ఒక్కరు కూడా లేరు..
* మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం రాజారం పంచాయతీలో వింత పరిస్థితి నెలకొంది. తప్పుడు నివేదికల కారణంగా ఈసారి ఇక్కడ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి. రాజారంలో మొత్తం 302 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 202 మంది గిరిజనులు కాగా, ఇతరులు 100 మంది ఉన్నారు. గ్రామంలో ఎస్సీలు ఒక్కరూ లేరు. కానీ ఈ పంచాయతీని ప్రస్తుతం ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. సర్పంచితో పాటు పలు వార్డులను ఎస్సీలకు కేటాయించడంతో వాటికి ఎన్నికలు జరగని పరిస్థితి నెలకొంది.
నిర్మల్ జిల్లా..
* మామడ మండలం అనంతపేటలోని ఒకటో వార్డులో 107 మంది ఓటర్లుండగా దీనిని ఎస్టీకి రిజర్వు చేశారు. కానీ.. ఈ వార్డులో ఎస్టీ ఓటరు ఒక్కరు కూడా లేరు.
ఉపసర్పంచూ కరవే కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని రహపెల్లి పంచాయతీని 2001 నుంచి ఎస్టీలకు రిజర్వు చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్టీ మహిళకు కేటాయించారు. ఇక్కడ 904 మంది ఓటర్లు, 8 వార్డులు ఉన్నాయి. ఒకటి నుంచి నాలుగు వార్డుల వరకు ఎస్టీలకు కేటాయించారు. కానీ.. ఈ ఊరిలో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేరు. దీంతో ఈ గ్రామానికి సర్పంచి ఉండరు. ఎస్టీలకు కేటాయించిన నాలుగు వార్డులకు సైతం ఎన్నికలు ఉండవు. ఉప సర్పంచి ఎన్నికకు సరిపడా వార్డు సభ్యులు లేకపోవడం వల్ల ఆ ఎన్నిక కూడా కష్టమే.* వాంకిడి మండలంలోని ఖిరిడి పంచాయతీ నుంచి తేజాపూర్ విడిపోయి కొత్త పంచాయతీగా ఏర్పడింది. ఇక్కడ సర్పంచి స్థానాన్ని ఎస్టీ మహిళకు, 3,7,4,6 వార్డులు ఎస్టీలకు కేటాయించారు. కానీ.. ఇక్కడ ఆ సామాజికవర్గ ఓటర్లు లేరు. పది వార్డుల్లో ఆరు వార్డులు ఎస్టీయేతరులకు కేటాయించడంతో ఆయా వార్డు సభ్యుల నుంచే ఎన్నుకున్న ఉప సర్పంచి.. సర్పంచిగా చలామణి అవుతారు. * కాగజ్‌నగర్ చింతగూడ పంచాయతీలో విభిన్నమైన పరిస్థితి ఉంది. సర్పంచి స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఈ పంచాయతీ మొత్తంలో ఒకే ఒక ఎస్టీ పురుష ఓటరు ఉన్నారు. నాలుగు వార్డులను ఎస్టీలకు కేటాయించారు. ఒకే ఓటరు ఉండటంతో ఇక్కడ వార్డులకు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. దీంతో సర్పంచి స్థానం ఏకగ్రీవం కావడం అనివార్యంగా మారింది. |
మరిన్ని

దేవతార్చన
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!