close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఈ ప్రమాదకర యాప్‌లు... మీ ఫోన్‌లో లేవు కదా!

ప్రయోజనకర సాఫ్ట్‌వేర్ల ముసుగులో కోట్లాది చరవాణులపై ‘యాడ్‌వేర్‌’ పంజా!
ప్లే స్టోర్‌ నుంచి 85 అప్లికేషన్లను తొలగించిన గూగుల్‌

ఈ ప్రమాదకర యాప్‌లు... మీ ఫోన్‌లో లేవు కదా!

ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌లో గేమ్స్‌.. టీవీ.. రిమోట్‌ కంట్రోల్‌.. ఇలాంటి ఎన్నో అప్లికేషన్లు సరికొత్త ఫీచర్లతో మనల్ని కట్టిపడేస్తుంటాయి. వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకుని, ఉల్లాసంగా వాటిని వాడేయాలనుకుంటాం. కానీ... తస్మాత్‌ జాగ్రత్త! ప్రయోజనకర యాప్స్‌ ముసుగులో ఇవి మీ ఫోన్లను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నట్టు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి 85 యాప్‌లను సాంకేతిక దిగ్గజం ‘గూగుల్‌’ తాజాగా ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది.

అసలు ఏం చేస్తాయివి?
ఈ యాప్‌లు ఫోన్లను తమ నియంత్రణలోకి తెచ్చుకుని.. తెర నిండుగా ప్రకటనలు చూపిస్తాయి. ఒకవేళ మీరు స్క్రీన్‌ను మూసివేసేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండదు! మీరు తప్పకుండా ఆ ప్రకటనను ఆద్యంతం చూసి తీరాల్సిందే! పైగా ఒక పేజీని మూసివేసేందుకు ప్రయత్నిస్తే... మరికొన్ని పేజీలు తెరుచుకుంటాయి. పైగా వాటి నిండా ప్రకటనలే ఉంటాయి. చివరకు యాప్‌ స్తంభించిపోయే వరకూ ఇలా జరుగుతూనే ఉంటుంది. మరికొన్ని యాప్‌లైతే బఫర్‌ అవుతున్నట్టు చూపించి, ఆ తర్వాత మాయమైపోతుంటాయి. కానీ, ఇవి ఫోన్‌లో అంతర్గతంగా పనిచేస్తూ... ప్రతి అరగంట లేదా గంటకు తెరపై కొన్ని సెకెన్లపాటు కనిపిస్తాయి. అంతలోనే మళ్లీ కనుమరుగైపోతాయి. ప్లేస్టోర్‌ నుంచి ఇలాంటి యాప్స్‌ సుమారు కోటి సార్లు డౌన్‌లోడ్‌ అయినట్టు నిపుణులు గుర్తించారు. ఇలాంటివి మొత్తం 85 అప్లికేషన్లు ఉన్నాయనీ, వీటన్నింటిలోనూ ‘ఈజీ యూనివర్సల్‌ టీవీ రిమోట్‌’ అన్న యాప్‌ను సుమారు 5 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని వారు వెల్లడించారు. పోలీస్‌ ఛేజ్‌, రేసింగ్‌ కార్‌ త్రీడీ గేమ్స్‌, బస్‌ డ్రైవర్‌, ఏసీ రిమోట్‌, టీవీ వరల్డ్‌ తదితర యాప్‌లు కూడా లక్షల సంఖ్యలో డౌన్‌లోడ్‌ అయినట్టు తెలిపారు.

ఈ ప్రమాదకర యాప్‌లు... మీ ఫోన్‌లో లేవు కదా!

వివిధ అప్లికేషన్లు లభ్యమయ్యే ఆండ్రాయిడ్‌ ‘ప్లే స్టోర్‌’లో ప్రమాదకర యాప్‌లు ఉన్నట్లు ఇటీవల పలువురు సాంకేతిక పరిశోధకులు గుర్తించారు. ‘ట్రెండ్‌ మైక్రో’ బ్లాగ్‌స్పాట్‌కు చెందిన నిపుణులు తొలుత ఈ విషయాన్ని బహిర్గతం చేయడంతో గూగుల్‌ సంస్థ ఉలిక్కిపడింది! ఇవన్నీ ‘యాడ్‌వేర్‌’ సాఫ్ట్‌వేర్లే కావడం గమనార్హం. గేమ్స్‌, టీవీ, రిమోట్‌ కంట్రోల్‌ తదితర ప్రయోజనకర అప్లికేషన్ల ముసుగు వేసుకునే ఈ యాప్‌లు... డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత తమ అసలు నైజాన్ని ప్రదర్శిస్తున్నాయి.

ఒక్క చోట నుంచే వస్తున్నాయా?
పైకి ఒక్కోటి ఒక్కో ప్రయోజనార్థం రూపొందించినట్టు కనిపిస్తున్నా... వాటి లక్ష్యం మాత్రం ఒక్కటే! ఫోన్‌లపై పంజా విసిరి యాడ్స్‌ను గుప్పించడం. వీటిని వివిధ సంస్థలు అభివృద్ధి చేస్తున్నా... వాటి యంత్రస్థాయి సంకేతాలు (సోర్స్‌ కోడ్‌) మాత్రం ఒకేలా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి 13 యాప్స్‌ను గూగుల్‌ గత నవంబరులో తొలగించింది. ఆ తర్వాత మరో 22 నకిలీ యాప్స్‌ను, తాజాగా ఇప్పుడు మరో 85 అప్లికేషన్లను తొలగించింది.

ఈ ప్రమాదకర యాప్‌లు... మీ ఫోన్‌లో లేవు కదా!

నిజమైన యాప్‌లను గుర్తించడమెలా?
గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉన్నంత మాత్రాన అన్ని యాప్‌లు అసలైనవని అనుకోవడానికి లేదు. యాంటీ వైరస్‌, గేమ్స్‌ పేరుతో ఉన్న మాల్‌వేర్‌, యాడ్‌వేర్‌ తదితర అప్లికేషన్లను ఆ సంస్థ ఎప్పటికప్పుడు తొలగిస్తూనే ఉంది. ఇంకా ఇలాంటివెన్నో ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటున్నాయి. మరి నిజమైన యాప్‌లను గుర్తించడమెలా అంటే...
1. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు దాని తయారీ సంస్థ గురించి తెలుసుకోవాలి. ఆ సంస్థ తప్పకుండా తమ వెబ్‌సైట్‌ చిరునామా ఇస్తుంది.
2. దానిని అప్పటికే వినియోగించినవారి అభిప్రాయాలను తెలుసుకోవాలి.
3. చిన్నపాటి అక్షరాల మార్పుతో నకిలీ యాప్‌లు అందుబాటులో ఉన్నందున అప్లికేషన్‌ పేరును సరిచూసుకోవాలి.
4. యాప్‌ తేదీని పరిశీలించండి. ‘అప్‌డేట్‌ ఆన్‌’ అనే లేబుల్‌ తప్పకుండా ఉంటుంది. చాలా నకిలీ యాప్‌లలో ఇది కనిపించదు.
5. నిజమైన యాప్‌లు అడ్డగోలుగా షాపింగ్‌ డిస్కౌంట్‌లను ప్రకటించవు. ఒకవేళ అలా ప్రకటించదలిస్తే ముందుగానే తమ వెబ్‌సైట్లలో స్పష్టంగా వెల్లడిస్తాయి.
6. బ్రౌజర్‌ లేదా అధికారిక వెబ్‌సైట్‌లోని ‘గెట్‌ అవర్‌ యాప్‌’పై క్లిక్‌ చేయడం ద్వారా నిజమైన యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.