close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఈ తరంగాలు గ్రహాంతర జీవులవేనా?

ఒకే చోట నుంచి పదే పదే వస్తున్న ఎఫ్‌ఆర్‌బీలు
గుర్తించిన కెనడా శాస్త్రవేత్తలు
ఈ బృందంలో భారత సంతతి పరిశోధకులు

ఈ తరంగాలు గ్రహాంతర జీవులవేనా?

భూమి మీదున్న జీవకోటిలో సాంకేతిక సామర్థ్యం మానవుడి సొంతం. మన ఊహకూ అందని రీతిలో మానవుడి కన్నా ఎన్నో లక్షల రెట్లు ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిన గ్రహాంతర జీవులు ఈ సువిశాల విశ్వంలో ఉన్నాయా? మనకు 150 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెప్పపాటు కాలంలో మెరుపులా మెరిసిన ఒక శీఘ్ర రేడియో తరంగ విస్ఫోటం (ఎఫ్‌ఆర్‌బీ) గ్రహాంతర జీవుల ఉనికిపై చర్చకు తెరలేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ తరంగం ఏకంగా నక్షత్ర మండలాలనూ దాటి వచ్చేంత అపార శక్తి కలిగి ఉంది. సుదూర విశ్వంలో ఉండొచ్చని భావిస్తున్న బుద్ధిజీవులే దీన్ని సృష్టించాయా అన్నదానిపై విశ్లేషణలు మొదలయ్యాయి.

ఈ తరంగాలు గ్రహాంతర జీవులవేనా?

సుదూర విశ్వం నుంచి వెలువడుతున్న ఒక ‘శీఘ్ర రేడియో తరంగ విస్ఫోటాన్ని’ (ఎఫ్‌ఆర్‌బీ) కెనడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో విశేషమేమిటంటే సదరు వనరు నుంచి ఈ తరంగాలు పదేపదే పునరావృతమవుతున్నాయి. ఇలా తరచూ ఎఫ్‌ఆర్‌బీలను వెలువరించే మూలాలు ఇప్పటివరకూ రెండు మాత్రమే వెలుగు చూశాయి. దీంతో మానవుడి కన్నా అత్యంత అధునాతన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న గ్రహాంతర జీవుల ఉనికికి ఇది నిదర్శనమన్న సిద్ధాంతాలకు బలం చేకూరింది. తాజా పరిశోధన బృందంలో అరుణ్‌ నాయుడు సహా భారత మూలాలున్న పలువురు పరిశోధకులు ఉన్నారు.

ఈ తరంగాలు గ్రహాంతర జీవులవేనా?ఏమిటీ ఎఫ్‌ఆర్‌బీలు?
మన పాలపుంత గెలాక్సీకి వెలుపల వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి ఎఫ్‌ఆర్‌బీలు వెలువడుతున్నాయి. ఇవి 1-5 మిల్లీ సెకన్లు మాత్రమే మనుగడలో ఉండే రేడియో తరంగ విస్ఫోటాలు. అలా రెప్పపాటు కాలం మేరే అవి ఉనికిలో ఉన్నప్పటికీ వాటిలో శక్తి అపారం. సూర్యుడు 10వేల సంవత్సరాల్లో వెలువరించే శక్తిని ఇవి ఒక మిల్లీ సెకనులోనే ఉత్పత్తి చేస్తాయి. 2007లో తొలిసారిగా వాటిని కనుగొన్నారు. ఇప్పటివరకూ 60కిపైగా ఎఫ్‌ఆర్‌బీలు వెలుగు చూశాయి.
* 2015లో ప్యూర్టో రికోలోని ఆరెసిబో రేడియో టెలిస్కోపు ఒక వింత ఎఫ్‌ఆర్‌బీని కనుగొంది. దాని నుంచి పదేపదే ఈ తరంగాలు వెలువడుతున్నాయి.
* తాజాగా ‘కెనడియన్‌ హైడ్రోజన్‌ ఇంటెన్సిటీ మ్యాపింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌’ (చైమ్‌) అనే రేడియో టెలిస్కోపు ఇలాంటి మరో ఎఫ్‌ఆర్‌బీ మూలాన్ని కొనుగొంది. 150 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఈ ప్రదేశం నుంచి అనేక దఫాలుగా ఎఫ్‌ఆర్‌బీలు వచ్చాయి. గత ఏడాది మూడు వారాల వ్యవధిలోనే 13 విస్ఫోటాలను ఈ టెలిస్కోపు కనుగొంది. అందులో ఇదొక్కటే పదేపదే ఎఫ్‌ఆర్‌బీలను వెలువరించింది. దానికి ‘ఎఫ్‌ఆర్‌బీ 180814’ అని పేరు పెట్టారు.

ఈ తరంగాలు గ్రహాంతర జీవులవేనా?

తక్కువ పౌనఃపున్యాల్లోనూ..
చాలా అధిక పౌనఃపున్యాల్లోనే ఈ ఎఫ్‌ఆర్‌బీలు ఉత్పత్తవుతాయని గతంలో కొన్ని సిద్ధాంతాలు సూత్రీకరించాయి. చైమ్‌ టెలిస్కోపు గుర్తించిన రేడియో తరంగాల్లో అనేక రకాల పౌనఃపున్యాలు ఉండటం విస్మయాన్ని కలిగిస్తోందని పరిశోధనలో పాలుపంచుకున్న కెనడాలోని మెక్‌ గిల్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుడు అరుణ్‌ నాయుడు చెప్పారు.
* లోగడ సూత్రీకరించిన దాని కన్నా తక్కువ పౌనఃపున్యాల్లోనూ తరంగాలు వచ్చాయి.
* అంత తక్కువ పౌనఃపున్యంలోని తరంగాలు వాటి మూలాల్లోని వాతావరణ అవరోధాలను ఎలా అధిగమిస్తున్నాయన్నది శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అక్కడి వాతావరణం కారణంగా ఎక్కువగా చెల్లాచెదురుకాకుండా భూమి మీద గుర్తించగలిగే స్థాయిని కలిగి ఉండటం విస్మయాన్ని రేకెత్తిస్తోంది.

అద్భుత టెలిస్కోపు

బ్రిటిష్‌ కొలంబియాలోని ఒకాన్‌గాన్‌ లోయలో చైమ్‌ టెలిస్కోపును ఏర్పాటు చేశారు. దీన్ని కెనడా ఖగోళశాస్త్రవేత్తలు రూపొందించారు. విశ్వం నుంచి వచ్చే రేడియో సంకేతాలను ఇందులోని వేలాది యాంటెన్నాలు నమోదు చేస్తాయి. ప్రపంచంలో మరే ఇతర టెలిస్కోపులో లేని భారీ సంకేత ప్రాసెసింగ్‌ వ్యవస్థ దీనికి ఉంది. ఫలితంగా  ఆకాశంలో ఏకకాలంలో విస్తృత ప్రాంతాలను శోధించగలదు.

సుదూర అంతరిక్ష యాత్రల కోసమేనా?

ఈ తరంగాలు గ్రహాంతర జీవులవేనా?

ఎఫ్‌ఆర్‌బీల మూలాలపై భిన్న సిద్ధాంతాలు వ్యాప్తిలోకి వచ్చాయి. భారీ కృష్ణబిలాల నుంచి, నక్షత్రాలు అంతమయ్యే సమయంలో చోటుచేసుకునే సూపర్‌నోవా విస్ఫోటాల వంటి శక్తిమంతమైన ఖగోళభౌతిక ప్రక్రియల్లో ఇవి జనిస్తాయని పలువురు శాస్త్రవేత్తలు సూత్రీకరించారు.
* కొన్ని ఎఫ్‌ఆర్‌బీల తీరుతెన్నులను విశ్లేషిస్తే అవి ఎవరో అభివృద్ధి చేసిన కృత్రిమ వనరుల నుంచి కూడా రావొచ్చని 2017లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు మనస్వి లింగం, అబ్రహం లోబ్‌లు విప్లవాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మానవుల కన్నా సాంకేతికంగా చాలా పురోగతి సాధించిన గ్రహాంతర జీవులు వీటిని ఉత్పత్తి చేస్తుండొచ్చని తెలిపారు.

* వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించి వచ్చేంత శక్తిమంతమైన ఎఫ్‌ఆర్‌బీలను కృత్రిమంగా సృష్టించడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. భూమికి రెట్టింపు పరిమాణంలో ఒక భారీ కర్మాగారాన్ని నిర్మించి, దాని ద్వారా సౌరశక్తిని ఒడిసిపట్టి, ఈ స్థాయి రేడియో తరంగాలను సృష్టించొచ్చని వారు గణిత సూత్రాల ఆధారంగా సూత్రీకరించారు. దీని నుంచి వెలువడే శక్తిమంతమైన ఎఫ్‌ఆర్‌బీలను ఆ గ్రహాంతర జీవులు.. సుదూర నక్షత్రాల వద్దకు ప్రయాణమయ్యేందుకు ఉపయోగిస్తుండొచ్చని చెప్పారు. తెరచాపలతో కూడిన వ్యోమనౌకలపైకి వీటిని ప్రసరింపచేసి, వాటిని ముందుకు నడిపిస్తుండొచ్చని చెప్పారు. దాదాపు 10 లక్షల టన్నుల బరువును ముందుకు నెట్టడానికి ఈ శక్తి సరిపోతుందన్నారు.

పదేపదే ఎఫ్‌ఆర్‌బీలను వెలువరించే రెండో వనరును తాజాగా గుర్తించడాన్ని బట్టి ఇలాంటివి మరిన్ని ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటిని విశ్లేషించడం ద్వారా ఈ వింత తరంగాల గుట్టుమట్లను విప్పేందుకు మార్గం సుగమమైందంటున్నారు. అంటే.. అవి గ్రహాంతర జీవుల నుంచి వస్తున్నాయా అన్నది తేలిపోనుంది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.