close

ప్ర‌త్యేక క‌థ‌నం

కలిసే.. కలిసే.. అద్భుత క్షణాలు..!

కలిసే.. కలిసే.. అద్భుత క్షణాలు..!

చలి మంచు తెరల మధ్య నుంచి నులివెచ్చటి సంక్రాంతి సూరీడు కొద్దిగా పైకొస్తూనే.. వాకిట్లో పేద్ద ముగ్గు వేస్తున్న పెద్దమ్మ కొంగుపట్టుకుని గుమ్మడి పూలు గుచ్చిన గొబ్బెమ్మలు పెట్టటం.. 
లోపల పిల్లలంతా కలిసి కూర్చుని.. అత్త నయగారంగా చెబుతున్న చిన్ననాటి కబుర్లు వింటూ   కరకరలాడే అరిసెల్నీ, సకినాలనీ ఓ పట్టుపడుతుండటం... 
వంటింట్లోంచి వస్తున్న పండగ వంటల ఘుమఘుమల మధ్య వరండాలో తోడికోడళ్లంతా కూర్చుని గలగలా కబుర్లాడుకుంటూ వైనవైనాలుగా కూరగాయలు కోస్తుండటం.. 
పెరట్లో తాతాబామ్మలు హడావుడి పడుతూ.. పిల్లలందరికీ కొత్తబట్టలు ఎప్పుడివ్వాలా అని గుసగుసలాడుకుంటుండటం.. 
ఇంట్లో అక్కలూ, బావలూ, పిన్నులూ, బాబాయిలంతా ఒకళ్ల మీద ఒకళ్లు చెణుకులేసుకుంటూ చెతుర్లాడుతుంటే.. ఇంతలో బయట డోలు సన్నాయి మోగుతూనే.. పిల్లగ్యాంగ్‌ అంతా పొలో మంటూ వాకిట్లోకి పోయి.. ముఖం విప్పార్చుకుని గంగిరెద్దు ముందు నిలుచోటం...

వహ్‌... ఇదో కళకళలాడుతున్న తెలుగింటి సంక్రాంతి సంబర దృశ్యం! పండగకు అందరం కలుస్తున్నామని అనుకుంటున్నాం. కానీ నిజానికి అందరూ కలవటమే పెద్ద పండగ! కుటుంబం మొత్తం కలవటమే గొప్ప అనుభూతి. అప్పుడప్పుడైనా కుటుంబం ఇలా కలవటం.. మన ఆనందానికే కాదు.. ఆరోగ్యానికీ, ఆయుర్దాయానికీ, ముఖ్యంగా రేపటి తరం అభ్యున్నతికి కూడా అవసరమని గుర్తిస్తోంది యావత్‌ ప్రపంచం! మరి పండగలూ పబ్బాల్లో ఇలా కుటుంబం కలవటానికి ఉన్న ప్రాభవం ఏమిటి? దీంతో దక్కే లాభం ఏమిటి?

అంతా కలవటమే అసలు పండగ!

కలిసే.. కలిసే.. అద్భుత క్షణాలు..!

ఆనందం 
ఆరోగ్యం 
ఆయుర్దాయం 
ఆలంబన 
అభ్యున్నతి

పండగొచ్చింది! 
పిల్లాపాపా ఇంటికొచ్చి.. కుటుంబం మొత్తం కలిసి సంతోషంగా గడిపే అద్భుత సమయమొచ్చింది!! సంక్రాంతి అంటే కుటుంబం మొత్తం కలిసి చేసుకునే ఓ చిన్న సంబురం. తాతాబామ్మలు, అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, బావలు, అత్తలు, మావలు, అల్లుళ్లు, కోడళ్లు.. మధ్యలో పిల్లలు.. ఇలా ఇల్లంతా కోలాహలంగా మారిపోతే ఎంత పాత ఇంటికైనా కొత్త కళ రాకుండా ఉంటుందా? ఎంత వయసు మీదపడినా మనసు గంతులెయ్యదా? ఇలా అప్పుడప్పుడు  కుటుంబం మొత్తం కలవటం, ఇంటిల్లిపాదీ ఆనందంగా గడపటమన్నది ఓ అద్భుత సంప్రదాయమని, దీన్ని మనం ఏమాత్రం విస్మరించటానికి వీల్లేదని శాస్త్ర రంగం నొక్కి చెబుతుండటం విశేషం.

న ఆశలు, అవసరాలు మారిపోయిన ఈ ఆధునిక కాలంలో.. ‘చిన్న కుటుంబం చింతలేని కుటుంబం’ అని మనం గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉండొచ్చేమోగానీ.. నిజానికి అది పూర్తి నిజం కాదు. చిన్న
కుటుంబాల్లో పిల్లల పెద్దల ఆలనాపాలన నుంచి మానసిక భరోసా వరకూ ఎన్నో కొరవడుతూ వాటికుండే చింతలు వాటికి చాలానే ఉంటున్నాయి. అలాగని పొట్ట చేతబట్టుకుని ప్రపంచమంతా తిరుగుతున్న ఈ
కలిసే.. కలిసే.. అద్భుత క్షణాలు..!ప్రపంచీకరణ యుగంలో ఇప్పటికిప్పుడు ఉమ్మడి కుటుంబాలే ఉత్తమం అనుకుంటూ మళ్లీ వాటికి మళ్లే అవకాశమూ లేదు. అందుకే పండగలకైనా కుటుంబం మొత్తం కలవటమన్నది ఇప్పుడు కీలకంగా మారుతోందని సామాజిక అధ్యయనవేత్తలంతా అంటున్నారు.
 
మనం వెళ్లింది ముందుక్కాదు! 
ఇప్పుడు కుటుంబ సభ్యులంతా తరచూ మాటామంతీ కలుపుకొనేందుకు ఫోన్లు, ఫేస్‌టైమ్‌, వాట్సాప్‌ వంటివెన్నో వచ్చాయి. అయినా కూడా ఒకప్పటి కంటే ఇప్పుడే మనుషుల మధ్య దూరాలు ఎక్కువగా ఉంటున్నాయనీ, ముఖాముఖీ కలవటానికి ఇవేవీ ప్రత్యామ్నాయాలు కావని చెబుతున్నారు పరిశోధకులు. పిల్లలను దగ్గరకు తీసుకోవటం, వీపు తట్టటం, పెద్దల పక్కన కూర్చోవటం, వాళ్లను హత్తుకోవటం, మన గురించి వాళ్లు చెప్పే కథలు వినటం, అంతా కలిసి ఉమ్మడిగా స్పందించటం.. ఇవన్నీ మాధ్యమాల్లో సాధ్యం కాదు. అసలు మనమేమిటో ఇంట్లో అందరికీ తెలిసేది కూడా ఇలా అందరం కలిసే సందర్భాల్లోనే! మన వికాసానికి ఇవన్నీ అవసరమని గట్టిగా చెబుతున్నారు ‘పాజిటివ్‌ సైకాలజీ’ నిపుణులు.

మీ జీవిత చరమాంకంలో.. మరొక్క పరీక్ష పాసయ్యుంటే బాగుండేదనో, ఇంకో కేసు గెలుచుకుని ఉండాల్సిందనో లేక ఇంకేదో వ్యాపార ఒప్పందం కుదుర్చుకోలేకపోయామనో మీరేం చింతించరు. కుటుంబంతోనూ, స్నేహితులతోనూ మరికాస్త సమయం గడపలేకపోయామే అన్న చింత ఒక్కటే మిగులుతుంది!
- బార్బారా బుష్‌ (అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్‌ బుష్‌ భార్య)
మన కుటుంబాన్ని మనం ఎంచుకోం. అది మనకు దేవుడిచ్చిన బహుమతి!
- డెస్మండ్‌ టుటు (నోబుల్‌ శాంతి బహుమతి గ్రహీత)

మనతోటే ఇజ్రాయెల్‌!

ఇజ్రాయెల్‌ ప్రజల సగటు ఆయుర్దాయం.. 85 ఏళ్లు 
ప్రపంచ సంతోష సూచిలో..11వ స్థానం 
మ్మడి కుటుంబాలు తగ్గుతున్నా కూడా ఇప్పటికీ మన భారతీయ కుటుంబ వ్యవస్థ మూలాలు బలంగా ఉండటాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రత్యేకంగా చెప్పుకుంటోంది. అంతే కాదు, ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లో ప్రజల ఆయుర్దాయం బాగుండటానికి, సంతోష సూచికల్లో ఆ దేశం పైనుండటానికి కూడా అక్కడ కుటుంబ బంధాలు బలంగా ఉండటమే కారణమని పరిశోధకులు గుర్తిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో సంప్రదాయంగా కుటుంబాలు కాస్త పెద్దగా, సన్నిహితంగా కూడా ఉంటాయి. అక్కడి ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటానికి- వాళ్ల దగ్గర సంపద ఎక్కువగా ఉండటం, వైద్య ఖర్చులను భరించే స్థోమతు ఉండటం, చక్కటి పోషకాహారం తీసుకోవటం, మద్యం అలవాటు తక్కువుండటం వంటి చాలా అంశాలను పరిశీలించారు. అయితే ఈ అంశాలు చాలా దేశాల్లో కనబడుతున్నాయిగానీ అక్కడ ఆయుర్దాయాలేం గొప్పగా లేవు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ను కుటుంబ వ్యవస్థ, సామాజిక బంధాలు, సాంస్కృతిక విలువలే భిన్నంగా ఉంచుతున్నాయని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. అందుకే పాశ్చాత్య దేశాల్లో కూడా ‘అప్పుడప్పుడు కుటుంబం కలుస్తుండటం (ఫ్యామిలీ రీ యూనియన్‌) అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వస్తోంది. దీనిలోని సంతోష మాధుర్యాల గురించి మనకు మరొకరు చెప్పాలా!

కలిసికట్టుగా పండగ.. ఏం చెయ్యొచ్చు?

కుటుంబం కలవటమంటేనే సరదా, సంతోషాల వ్యవహారం. దీన్ని మరింత ఆనందభరితం చేసుకోవటానికి చాలా మార్గాలున్నాయి. 
సరదాగా పాత ఫోటోలు, పూర్వీకుల చిత్రాలు, వాళ్లు వాడిన వస్తువులు, డైరీలు, లేఖల వంటివి బయటకు తీసి భద్రపరచటం వంటివి చెయ్యొచ్చు. మన తాతగారు వాడిన గడియారమో, అమ్మమ్మ వాడిన ఇత్తడి పోపుల పెట్టె.. ఇలాంటివి (హైర్‌లూమ్స్‌) ఎంతో అపురూపంగా ఉండి, మనకు అనిర్వచనీయమైన అనుభూతిని మిగులుస్తాయి. వాటిని డిజిటల్‌ ఫోటోలు తీసి, వాటితో చిన్న వీడియో రూపొందించటం.. వంటివన్నీ కుటుంబాన్ని మరింత సన్నిహితం చేస్తాయి. 

కలిసే.. కలిసే.. అద్భుత క్షణాలు..!కుటుంబం మొత్తం కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ.. పాముల పటం, పచ్చీసు వంటివి ఆడుకోవచ్చు. పండగ రోజున ఇంట్లోనే కూర్చుని ఆడుకునేందుకు వీలైన ఈ ‘బోర్డ్‌ గేమ్స్‌’.. గొప్ప కాలక్షేపాన్నీ, మర్చిపోలేని అనుభూతులను మిగులుస్తాయి.
బెలూన్లకు గాలికొట్టి, పెరట్లో వాటితో బాస్కెట్‌బాల్‌లా ఆడుకోవటం, స్ట్రాతో ఒక సాసర్లోని గోళీలను మరో సాసర్లోకి మార్చటం, ఇంట్లో దాచిపెట్టిన వస్తువులను కనుక్కోవటం (ట్రెజర్‌హంట్‌) వంటి ఆటలు పిల్లలనూ, పెద్దలనూ చాలా సరదాగానే దగ్గర చేస్తాయి. 
మంట లేకుండా వంట, రంగురంగుల పండ్లు కూరగాయలు వాడుతూ అందంగా అలంకరించటం వంటి సరదా పోటీలు ఇంటిల్లిపాదికీ వినోదాన్నిస్తాయి. వీటివల్ల ఇంటి వాతావరణం మొత్తం సరదాగా మారిపోతుంది. 
ఇంట్లో ప్రతి ఒక్కరూ.. ఇంకొకరికి సంబంధించిన సరదా కథ, జరిగిన సంఘటన వంటిది చెప్పొచ్చు. ఇంట్లో ఎవరు, ఎప్పుడు పుట్టారు.. ఎప్పుడెప్పుడు కీలక ఘటనలు జరిగాయన్న పెద్ద పట్టిక తయారు చెయ్యొచ్చు. ఈ పని పిల్లలకు అప్పగిస్తే దీన్నో సరదా ప్రాజెక్టులా చేస్తారు కూడా! 

అందరికీ గుర్తుండిపోయేలా చిన్నచిన్న బహుమతులు ఇవ్వచ్చు. 

కలిస్తే కలదు లాభం!

ఈ ఆధునిక కాలంలో ఎవరికి వారు పనుల్లో కూరుకుపోయి.. కొన్నిసార్లు నెలలూ, ఏళ్లూ కూడా కుటుంబ సభ్యులను చూసే పరిస్థితి ఉండటం లేదు. కుటుంబం ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా ఏడాదిలో ఒకటిరెండు సార్లైనా అంతా కలవటం, ప్రత్యక్షంగా గడపటం వల్ల సంబంధ బాంధవ్యాల మధ్య ఎడం రాకుండా ఉంటుంది. 

కలిసే.. కలిసే.. అద్భుత క్షణాలు..!

మనకూ ఒక చరిత్ర ఉంది: మనకు ఎంత వయసైనా రానీయండి.. మన కుటుంబం అంతా ఒక్కసారి కలిసిందంటే చాలు, మనకు తెలియని, మనకు సంబంధించిన ఏవో కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. చిన్నప్పుడు మనం చేసిన అమాయకపు పనో, తెలిసీ తెలియని వయసులో మనం సృష్టించిన చిన్నపాటి సంచలనమో.. ఇలా ఏదో ఒకటి వినటం తథ్యం! ‘అరె, ఆ విషయం నాకస్సలు తెలీదే!’ అనిపించే సందర్భాలు ఉంటూనే ఉంటాయి. వీటిని వింటూ ఇంటిల్లిపాదీ నవ్వులు పూయిస్తుంటే ఆ సందోహమే వేరు. ఇక చిన్నపిల్లలైతే తమకు సంబంధించిన కథలను పెద్దల నోటి నుంచి వింటుంటే ఎంత ఆనందం అనుభవిస్తారో మాటల్లో చెప్పలేం. వాళ్లకు ఇంకెవ్వరూ చెప్పలేని విషయాలివి, అందుకే ఇలా ఇంటిల్లిపాదీ కలవటం చాలా ముఖ్యం! అలాగే ప్రతి కలయికలోనూ మళ్లీ కుటుంబమంతా పదిలంగా చూసుకునేందుకు కొన్ని ఉమ్మడి జ్ఞాపకాలూ మిగులుతాయి. 
* తరాల మధ్య బంధం: సంబంధాలే మన జీవితాలకు మూలం. ఆ సంబంధాలన్నింటికీ కుటుంబం మూలం! కాబట్టి కుటుంబం అంతా కలిసి గడిపే ఈ సమయంలో.. ఒకరితో ఒకరు ప్రత్యేక బంధాన్ని పెనవేసుకోవచ్చు. పిల్లలు తాతలతో మామలతో కలిసి పొలానికి పోవటం, అత్తలూ పెద్దమ్మలతో ఇంట్లో పని చేయటం, అలాగే పెద్దలు కూడా పిల్లలతో కలిసి పనుల చేయటం వల్ల వ్యక్తిగతంగా ఇంట్లోని వివిధ తరాల మధ్య బంధం బలపడుతుంది. 
కొత్త ప్రదేశం, కొత్త అనుభవం: రోజువారీ పనులకు దూరం జరిగి, కుటుంబం అంతా మరో కొత్త ప్రదేశానికి వెళ్లటమనేది కొత్త అనుభూతులను సొంతం చేసుకునేందుకు అద్భుత అవకాశం. 
కనిపించని సంపద: మన పిల్లలు తల్లిదండ్రుల నుంచే కాదు.. ఇంట్లో అత్తయ్య, మామయ్య, బాబాయి, పిన్ని.. ఇలా అందరి నుంచీ ఎన్నో విషయాలు, విలువలు, అలవాట్లు నేర్చుకుంటారు. ముఖ్యంగా రేపటి తరం పిల్లల మధ్య అనుబంధాలు పెరుగుతాయి. ఇది మనం వారికి ఇవ్వగలిగిన గొప్ప సంపద అనుకోవచ్చు. అంతా కలిసి గడపటం వల్ల జీవితంలో మనకు ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా కుటుంబం మొత్తం మనకు అండగా ఉంటుందన్న నిశ్చింత, భరోసా కలుగుతాయి. 
పిల్లలు పెద్దలయ్యేది ఇక్కడే: పిల్లలు సమాజంతో కలవటం, సామాజిక సంప్రదాయాలను నేర్వటానికి కుటుంబం అన్నది మొట్టమొదటి వేదిక. ఒకరినొకరు గౌరవించుకోవటం, ఆత్మీయతలను పంచుకోవటం, కోపాలను నియంత్రించుకోవటం, ఎవరి వస్తువును వాళ్లు జాగ్రత్త చేసుకోవటం.. ఇవన్నీ కుటుంబంలోనే నేరుస్తారు. అంతిమంగా పిల్లలకు ప్రోత్సాహం, సలహాలు, భరోసా వంటివన్నీ ఇంట్లోనే దక్కుతాయి. దీనివల్ల పిల్లల్లో బిడియం, సభాపిరికితనం వంటివన్నీ పోయి.. తేలికగా నలుగురిలోకి వెళ్లగలుగుతారు. ఈ నైపుణ్యాలు ఉద్యోగాల్లో, ఇతరత్రా రంగాల్లో ఉపకరిస్తాయి. కుటుంబం ఇచ్చే మద్దతుతోనే పిల్లలు బయట ఉండే పెద్ద ప్రపంచంలో అడుగుపెట్టి, ‘పెద్ద’లుగా ఎదుగుతారు. 
కుటుంబ వారసత్వం: కేవలం ఆస్తిపాస్తులే కాదు, ప్రతి కుటుంబానికీ తనదైన చరిత్ర, అమూల్య వారసత్వ సంపద ఉంటుంది. దాన్ని పంచుకోవటం, పిల్లలకు అందజేయటానికి వీలు చిక్కుతుంది. అంతా కలిసినప్పుడు పాత జ్ఞాపకాలన్నీ తిరగేసుకుంటాం.. అవి మరింత బలపడతాయి. పిల్లలకు ఇవి తెలియటం వల్ల తమ కుటుంబం సమాజంతో ఎలా పెనవేసుకుని ఉందో, మనం ఎక్కడి నుంచి వచ్చామో.. కుటుంబానికి ఉన్న గుర్తింపు ఏమిటో అర్థమవుతుంది. తాము ఏ దిశలో వెళ్లొచ్చన్న స్పష్టత కూడా వస్తుంది. 
* పొరపొరపొచ్చాలు పోతాయి: చాలా కుటుంబాల్లో సమస్యలకు చిన్నచిన్న అపార్ధాలే కారణమంటారు ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణులు స్టీఫెన్‌ కవి. అందుకే కుటుంబంలో అంతా ఒకరి అవసరాలు, అభిప్రాయాల గురించి మరొకరు మనసువిప్పి, అరమరికలు లేకుండా మాట్లాడుకోవటం వల్ల.. అభిప్రాయ భేదాలనే కాదు, తమ మధ్యనున్న ప్రేమాభిమానాలను కూడా తెలియజేసుకునే అవకాశం చిక్కుతుంది. కుటుంబం మొత్తం ఒక్కటన్న ఐకమత్య భావన.. అది ఇచ్చే భరోసా.. ఎన్ని సంపదలున్నా, ఎంత డబ్బు పెట్టినా దొరికేది కాదు.

ఏ కుటుంబమూ ‘పర్‌ఫెక్ట్‌’ కాదు!

పువ్వుల్లాగే... ఈ ప్రపంచంలో ఏ రెండు కుటుంబాలూ కూడా అచ్చం ఒకలా ఉండవు. కుటుంబం అనగానే అంతా మంచే అని పొగిడి, పొంగిపోవాల్సిన పనేం లేదు. ప్రతి కుటుంబంలోనూ ఏవో సమస్యలు సహజం. అవి ఉండటం కూడా తప్పేం కాదు. పాత తగాదాలు, ఈర్ష్యాసూయల వంటివన్నీ మామూలే. ఇలా లోపల్లోపల ఎన్ని వైరుధ్యాలున్నా కూడా ఒక స్థాయికి వచ్చేసరికి మళ్లీ మనమంతా ఒక్కటన్న భావనతో కలిసి ఉండటమన్నది ఒక్క కుటుంబంలోనే సాధ్యం. అదే కుటుంబ వ్యవస్థకు ఉన్న విశిష్టత! అందుకే మనకు ‘కుటుంబం నేర్పినంత మరే బంధం నేర్పలేదంటారు’ నిపుణులు.

అతిశయాలను పక్కనబెట్టి..

కుటుంబం అంతా కలిసిందంటే.. తినటం, ఏదో ఉబుసుపోని కబుర్లు చెప్పుకోవటమేగదా.. అనొచ్చు. చూడటానికి ఇది పిచ్చాపాటీ వ్యవహారంగా అనిపించొచ్చుగానీ.. వాస్తవానికి ఇది మన అస్తిత్వానికి, మనుగడకు కూడా దోహదం చేస్తుంది! అసలు కుటుంబం మొత్తం కలుస్తోందంటేనే సహజమైన అభిజాత్యాలన్నింటినీ పక్కనబెట్టి.. కుటుంబం అంతా పాజిటివ్‌ అంశాల కోసం ఆశపడుతోందని అర్థం. ఇది మిగిల్చే ‘పాజిటివ్‌’ జ్ఞాపకాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

ఈ జ్ఞాపకాలు మంచివి!

కలిసే.. కలిసే.. అద్భుత క్షణాలు..!

సాధారణంగా మనకు చెడ్డ విషయాలే ఎక్కువగా గుర్తుంటాయంటారు వెబ్‌ఎండీ పరిశోధకులు జెన్నిఫర్‌ వార్నర్‌. భయం, కోపం, దుఃఖం వంటి ప్రతికూల భావోద్వేగాలు మన మెదడులో జ్ఞాపకాలను భద్రపరిచే ప్రాంతాన్ని మరింత చురుకెత్తిస్తాయి. అందుకే మంచివాటికన్నా అవి తేలికగా జ్ఞాపకాలుగా స్థిరపడతాయి, చాలా వివరంగా కూడా గుర్తుంటాయి. ఇవి మన మెదడులో ఎక్కువ భాగం ఆక్రమించకుండా ఉండాలంటే- మనం ‘మంచి జ్ఞాపకాలను పదిలపరచుకోవటానికి ఎక్కువ సమయం, శక్తి వెచ్చించాలి. అయినా కూడా అది ప్రయోజనకరమే’ అంటారు ‘ద హ్యాపీనెస్‌ ప్రాజెక్ట్‌’ రచయిత గ్రెట్‌ఛెన్‌ రుబిన్‌. ఇందుకు కుటుంబంలో సరదా అనుభవాలను తరచూ గుర్తు చేసుకోవటం, పాత సంఘటలనల ఫోటోలు, వీడియోల వంటివన్నీ దోహదం చేస్తాయి.

ఇదో చక్ర బంధం

కలిసే.. కలిసే.. అద్భుత క్షణాలు..!

మాట్లాడుకుంటే బంధాలు బలపడతాయి. బంధాలు బలపడితే తరచూ కుటుంబాలు కలవాలన్న ఆలోచన పుంజుకుంటుంది. కలిసిన ప్రతిసారీ మళ్లీ మాట్లాడుకుని, బంధాలను బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడ్డాయి కాబట్టి దీన్నో ‘కుటుంబ చక్రం’ అనుకోవచ్చు!

కలిసే.. కలిసే.. అద్భుత క్షణాలు..!

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.