close

ప్ర‌త్యేక క‌థ‌నం

మాంసం ధరలు పైపైకి

కిలో రూ.500 నుంచి 620కి పైనే
నాలుగు నెలల్లోనే రూ.60 పెరుగుదల
మహారాష్ట్ర, తమిళనాడుల్లో తగ్గిన గొర్రెలు
హైదరాబాద్‌ వచ్చి కొనుగోలు చేస్తున్న చెన్నై వ్యాపారులు
రాష్ట్రంలోనూ పెరుగుతున్న వినియోగం
ఈనాడు - హైదరాబాద్‌

మాంసం ధరలు పైపైకి

తెలుగు రాష్ట్రాల్లో గొర్రె, మేక మాంసానికి డిమాండ్‌ ఏర్పడింది. కిలో ధర గత నాలుగు నెలల్లోనే ప్రాంతాల వారీగా రూ.40 నుంచి రూ.60 దాకా పెరిగింది. కొన్ని నగరాల్లో కిలో ధర రూ.500 నుంచి రూ.620 దాకా ఉంది.  దేశవ్యాప్తంగా గొర్రెలు, మేకల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు సైతం హైదరాబాద్‌కు వచ్చి కొని తీసుకెళుతున్నారు.

గతంలో మహారాష్ట్ర నుంచి గొర్రెలు, మేకలు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు తెచ్చి అమ్మేవారు. ఇప్పుడు అక్కడి నుంచి రావడం తగ్గిందని మాంసం వ్యాపారులు తెలిపారు. జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు ప్రకారం ప్రతి వ్యక్తి ఏటా 11 కిలోల దాకా మాంసం తినాలి. తెలుగు రాష్ట్రాల్లో తలసరి వినియోగం 7.5 కిలోలే ఉన్నా మాంసం ధరలు ఏటా కనీసం 10 శాతం పెరుగుతుండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో మాంసం వినియోగం పెరుగుతుండడమే ఇందుకు కారణం.

దేశవ్యాప్తంగా ఏటా గొర్రెలు, మేకల మాంసం డిమాండ్‌ 20 శాతం వరకూ పెరుగుతోందని కేంద్ర పశుసంవర్థక శాఖ అంచనా. కానీ ఈ స్థాయిలో ఈ జీవాల పెంపకంపై దృష్టి పెట్టడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తప్ప ఇతర రాష్ట్రాల్లో ఈ జీవాల పెంపకానికి సరైన ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. మహారాష్ట్రలో ఒకప్పుడు గొర్రెల సంఖ్య అధికంగా ఉండేది. కొల్హాపూర్‌, షోలాపూర్‌, విదర్భ, ముంబయి, పుణె, నాగ్‌పుర్‌ల నుంచి తెలంగాణకు పెద్దయెత్తున నిత్యం లారీల్లో అమ్మకానికి వచ్చేవి. ఆయా నగరాల్లో గొర్రెల సంఖ్య తగ్గుతుండడంతో పొరుగునున్న తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలకు పంపడం బాగా తగ్గిందని మహారాష్ట్ర అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికల సమయంలో సభలు, సమావేశాల సందర్భంగా మాంసాన్ని భారీగా వినియోగించారు. కొన్నిచోట్ల అభ్యర్థులు ఊరికి ఇన్నని జీవాలను ఇచ్చి విందులు ఏర్పాటు చేయించారు. దీంతో జీవాల సంఖ్య తగ్గడం, డిమాండ్‌   పెరగడంతో ధర చుక్కలనంటుతోంది.

పెంపకం తీరు మారడమూ కారణమే
సాధారణంగా గ్రామాల్లో మేకలు, గొర్రెలను ఆరుబయట మేతకు తీసుకెళ్లి పెంచుతారు. కూలీల కొరత, పచ్చిక ప్రాంతాలు తగ్గడం, అడవుల్లోకి మేకల ప్రవేశాన్ని నిషేధించడం వంటి కారణాలతో ఈ తరహా పెంపకం తగ్గుతోంది. మరోవైపు ఏట మాంసానికి నగరాలు, పట్టణాల్లో భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు గొర్రెలు, మేకల పెంపకం క్షేత్రాలు ఏర్పాటు చేసి రోజంతా దాణా వేసి పెంచుతున్నారు. క్షేత్రంలో నిర్మాణాలు, దాణా కొనుగోలు, కూలీల ఖర్చులన్నీ కలిపి పెంపకం ఖర్చు ఏటికేడు భారీగా పెరిగిపోతుంది. దీంతో మాంసం ధరకూ రెక్కలొస్తున్నాయి.

ప్రపంచ సగటుకన్నా ఎక్కువ
గొర్రెలు, మేకల మాంసం వినియోగం తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ సగటుకన్నా అధికంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా తలసరి మాంసం వినియోగం 2014లో 43 కిలోలుంది. కానీ అందులో మేక, గొర్రెల మాంసం తలసరి వినియోగం 2 కిలోలే. కానీ తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల మాంసాలు కలిపి 7.5 కిలోల తలసరి వినియోగం ఉంటే అందులో సగభాగం మేక లేదా గొర్రె మాంసమే ఉంటోందని పశుసంవర్థక శాఖ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం గతేడాది 74 లక్షల గొర్రెలను రాయితీపై పంపిణీ చేసింది. వాటికి 50 లక్షల పిల్లలు పుట్టాయి. దీంతో బయటి నుంచి కొనుగోలు చేయడం తగ్గింది ‘‘తెలుగు ప్రజల్లో మాంసం వినియోగం బాగా పెరుగుతోంది. గతంలో హైదరాబాద్‌కు రోజూ 600 దాకా లారీల్లో గొర్రెలు, మేకలు తెచ్చేవారు. ఇప్పుడు ఆ లారీల సంఖ్య తగ్గింది’’ అని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ లక్ష్మారెడ్డి చెప్పారు.

మాంసం ధరలు పైపైకి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.