close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆశ్రిత చిన్నారులకు రక్షణేదీ? 

బాలల సంరక్షణ గృహాల్లో ప్రమాణాలు కరవు 
క్రమశిక్షణ పేరిట పిల్లలకు ఆహారం బంద్‌ 
వైద్య, విద్య రికార్డుల నిర్వహణ లేదు 
బాల, బాలికలకు ఒకే భవనంలో ఆశ్రయం 
అధ్యయన కమిటీ నివేదికలో వెల్లడి

ఆశ్రిత చిన్నారులకు రక్షణేదీ? 

సంరక్షణ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాలల పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని బాలల సంరక్షణ కేంద్రాల (సీసీఐ) కేంద్ర అధ్యయన కమిటీ అభిప్రాయపడింది. పుట్టినపుడే తల్లిదండ్రులు వదిలేసిన పసి కందులు, ఎవరూ లేని అనాథలు, వేధింపులకు గురైన బాధితులు, ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే అభాగ్యులు.. నిస్సహాయ స్థితిలో దేశవ్యాప్తంగా ఉన్న సంరక్షణ కేంద్రాలకు చేరుతున్నారు. 91% సంరక్షణ కేంద్రాలు, గృహాలన్నీ స్వచ్ఛంద సంస్థల అధీనంలోనే ఉన్నాయని, వీటిలో బాలలన్యాయ (జ్యువనైల్‌ జస్టిస్‌ - జేజే)చట్టంలోని కనీస ప్రమాణాలు పాటించడం లేదని వెల్లడించింది. క్రమశిక్షణ పేరిట పిల్లలను కొట్టడం, తిట్టడం, అన్నం పెట్టకుండా కడుపు మాడ్చటం వంటి సంఘటనలను గుర్తించింది. తెలంగాణలోనూ ఇవే పరిస్థితులు ఉన్నట్లు వివరించింది. లైంగిక వేధింపులు, నీలిచిత్రాల బాధితులు రాష్ట్రంలో ఎక్కువగా నమోదు కావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సంరక్షణ కేంద్రాల్లో బాలబాలికలకు వేర్వేరు భవనాలు ఉండాలనే నిబంధన అమలు కావడం లేదని, పలుచోట్ల వారికి ఒకేభవనంలో ఆశ్రయం కల్పిస్తున్నారని పేర్కొంది. సంరక్షణ కేంద్రాల్లో తగిన సంఖ్యలో సిబ్బంది లేరని, నిర్వాహకులకు చట్టంపై కనీస అవగాహన లేదని వెల్లడించింది. పిల్లల వైద్య, విద్య, వ్యక్తిగత వివరాల నివేదికలు ఎప్పటికప్పుడు సిద్ధం చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది.

నివేదికలో ఏముంది? 
తెలంగాణలో నీలిచిత్రాల బాధితులు (35 మంది), లైంగిక వేధింపులకు గురైనవారు (127 మంది), బాలకార్మికులుగా అక్రమ రవాణాకు గురైనవారు..  సంరక్షణ కేంద్రాల్లో ఎక్కువగా ఉన్నారు. ఇవన్నీ జిల్లా కేంద్రానికి 20 కి.మీ దూరంలోనే ఉన్నాయి. బాల్యవివాహాల నుంచి రక్షించిన చిన్నారుల్లో ఇద్దరు పదేళ్లలోపువారు కావడం గమనార్హం. 
* పుట్టిన వెంటనే చిన్నారులను వదిలివేయడం లేదా ప్రభుత్వ సంరక్షణ గృహాల్లో అప్పగిస్తున్న కేసులు అధికం. అధ్యయనంలో కర్ణాటక, తెలంగాణలో దాదాపు 500 మంది చిన్నారులున్నారు. దేశంలోనే అత్యధికంగా ట్రాన్స్‌జెండర్‌ చిన్నారులు 31 మంది తెలంగాణలో ఆశ్రయం పొందుతున్నారు. 
* ఇళ్లలో పని చేయించేందుకు అక్రమంగా రవాణా అవుతున్న బాధితుల్లో బాలికలు ఎక్కువ. అత్యధిక వేతనాలు, మంచి జీవితం పేరిట గ్రామీణ ప్రాంతాల పేద కుటుంబాల పిల్లలను తీసుకువస్తున్నారు. బాలికలకు మాయమాటలు చెప్పి, లైంగిక వ్యాపారానికి రొంపిలోకి దింపుతున్నారు. ఈ తరహా బాధితుల్లో దేశంలోనే తెలంగాణ నాలుగోస్థానంలో ఉంది. వీరిని డ్రగ్స్‌, ఇతర అసాంఘిక కార్యకలాపాల్లో పావులుగా వినియోగిస్తున్నారు. ఇలాంటి వారికి మరింత రక్షణ కల్పించాల్సిన అవసరముంది. 
కనీస సౌకర్యాలు అంతంతమాత్రం 
*చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, సౌకర్యాలు, తాగునీరు, వైద్యపరీక్షలు ఆశించిన స్థాయిలో లేవు. పరిశుభ్రతపై అవగాహన కల్పించడం లేదు. వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో సంరక్షణ కేంద్రాలు విఫలమయ్యాయి. పరిస్థితులు బాలల న్యాయచట్టం ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉన్నాయి. చివరకు ఆశ్రయం పొందుతున్న పిల్లల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు సరైన వ్యవస్థలు లేవు. పిల్లల సంరక్షణ, పర్యవేక్షణ సిబ్బంది తగిన సంఖ్యలో లేరు. దాదాపు 35% ఖాళీలున్నాయి. 
* ఆశ్రయం పొందుతున్న చిన్నారులను క్రమశిక్షణ పేరిట దండిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్రాల నిర్వాహకులు అంగీకరిస్తున్నారు. చిన్నారులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఇలా దండించడం బాలల న్యాయచట్టం కింద పెద్దనేరం. తెలంగాణలో బంధించడం, ఆహారం అందించకపోవడం, బెదిరించడం, అవమానించడం, కొట్టడంలాంటి దండనలు విధిస్తున్నారు. చిన్నారులు జబ్బుపడినపుడు సంరక్షణకు ‘ప్రత్యేక గది’ నిబంధన అమలు మూలనపడింది. స్నానపుగదులు, టాయిలెట్లు తగిన సంఖ్యలో లేవు. 


 ఆశ్రిత చిన్నారులకు రక్షణేదీ? 

ఆశ్రిత చిన్నారులకు రక్షణేదీ? 

 

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.