close

ప్ర‌త్యేక క‌థ‌నం

సీసీఈ విధానం.. అమలు నిదానం!

 ‘పది’ పరీక్షల్లో ఈ ప్రత్యేక పద్ధతి 
ప్రశ్నపత్రం చదవడానికి 15 నిమిషాల అదనపు సమయం 
వినియోగించుకోని విద్యార్థులు 
ఇప్పటి నుంచే ఈ విధానం అలవాటు చేస్తే మంచిదంటున్న నిపుణులు 
సీసీఈ విధానం.. అమలు నిదానం!

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో ప్రశ్నపత్రాలను క్షుణ్నంగా చదివి అర్థం చేసుకోవడానికి పదో తరగతి పరీక్షల్లో ఇస్తున్న 15 నిమిషాల అదనపు సమయాన్ని విద్యార్థులు అందుకు కేటాయించడం లేదు. దీనిపై అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయులూ శ్రద్ధ చూపడం లేదు. ప్రశ్నలోని అంతర్గత భావాన్ని అర్థం సుకోవడం చాలా ముఖ్యమని... అలా అర్థం చేసుకొని ప్రశ్న ప్రకారమే జవాబులు రాస్తే విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పది పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్న ఈ తరుణంలో ఈ అంశంపై ప్రత్యేక దృష్టిసారించాలంటున్నారు.

ఇదీ జరుగుతోంది 
ప్రశ్నపత్రాన్ని ఇవ్వగానే విద్యార్థులు మూడు నాలుగు నిమిషాల్లోనే జవాబులు రాయడం మొదలు పెడుతున్నారు. కనీసం 5 నిమిషాలు కూడా చదవని వారే గరిష్ఠ శాతం మంది ఉంటున్నారని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. మొత్తం మీద 10-15 నిమిషాలు ప్రశ్నపత్రం చదివిన తర్వాత ప్రారంభించే వారు 25-30 శాతం లోపే. ఏ ప్రశ్నకు ఎంత సమయం పడుతుందో తెలియక...సమయం సరిపోదని, అందుకే వెంటనే రాస్తున్నామని ఎక్కువ మంది విద్యార్థులు చెబుతున్నారు.

ఏమిటీ సీసీఈ విధానం? 
బట్టీ విధానానికి స్వస్తి పలికి...విద్యార్థుల్లోని అసలైన ప్రతిభను వెలికితీసేందుకు అవలంబిస్తున్న సీసీఈ విధానాన్ని 2014-15 విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. 2015-16 నుంచి పూర్తిగా అమలు చేస్తున్నారు. ఈ విధానంలో విద్యార్థి ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటూ...తనకు తాను విశ్లేషించుకుంటూ...విషయ పరిజ్ఞానాన్ని క్రమంగా పెంపొందించుకోవాలి. నిత్య అభ్యాసకునిగా...నిత్య అన్వేషిగా ప్రతి విషయాన్ని అన్వయించుకుంటూ ముందుకెళ్లాలి. విషయాన్ని అర్థం చేసుకోవడం, అన్వయించడం, అమలు పరచడం ఈ విధానంలో ముఖ్యం. దీనివల్ల ప్రశ్నలు ఏ విధంగా అడిగినా జవాబులు రాయడానికి వీలవుతుంది. ‘మీ నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు యాత్ర గురించి రాయండి’ అని గతంలో ప్రశ్న ఇస్తే సీసీఈలో మాత్రం ‘మీరు పాఠ్య పుస్తకంలో చదువుకున్న దానికి, యాత్రలో గమనించిన దాన్ని విశ్లేషిస్తూ రాయండి’ అని అడుగుతారు. ప్రవేశ, ఉద్యోగ పోటీ పరీక్షల్లోనూ ఇదే తరహాలో ప్రశ్నలుంటాయి.
గతంలో 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటే...సీసీఈ విధానంలో ఒక్కో సబ్జెక్టులో 20 మార్కులు అంతర్గత పరీక్షలు, 80 మార్కులకు చివరి పరీక్ష నిర్వహిస్తారు. హిందీ తప్ప మిగిలిన సబ్జెక్టులకు రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌ 40 మార్కులకు ఉంటుంది. కొత్త విధానంలో పాఠం వెనక ఉండే ప్రశ్నలు, ఉదాహరణలు, మాదిరి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశాలు ఉండవు. ఫలానా ప్రశ్న వస్తుందని నిర్దిష్టంగా చెప్పలేరు. ప్రశ్న అడిగే విధానంలోనే మార్పు, చేర్పు, కూర్పులుంటాయి. అందుకే ప్రశ్నలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రశ్నలను విశ్లేషిస్తూ జవాబులు రాయాల్సి ఉండటంతో ప్రశ్నపత్రం చదవడానికి విద్యాశాఖ 15 నిమిషాలు అదనంగా కేటాయించింది. 2.30 గంటల పరీక్షకు మరో 15 నిమిషాలు కలిపి 2.45 గంటల సమయం ఇస్తున్నారు. అయితే విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవకుండానే జవాబులు రాస్తున్నారు. దీనివల్ల మార్కులు నష్టపోతున్నారని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

ప్రశ్నలు నేరుగా ఉండవు 

 

సీసీఈ విధానం.. అమలు నిదానం!పాఠాలు...జవాబులు గతంలోనివే. కాకపోతే సీసీఈ విధానం అమలవుతున్నందున ప్రశ్నలు గతంలో మాదిరిగా నేరుగా ఇవ్వరు. విద్యార్థులు ఎంత వరకు సబ్జెక్టు విషయాలను ఆకళింపు చేసుకున్నారో తెలుసుకోవడానికి ప్రశ్నలు ఇస్తారు. అందుకు వారు మొదట ప్రశ్నపత్రాన్ని సమగ్రంగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ప్రభుత్వం 15 నిమిషాలు అదనపు సమయం ఇస్తోంది. ఈ విషయమై అవగాహన కల్పించడంలో చాలా మంది ఉపాధ్యాయులూ శ్రద్ధ తీసుకోవడం లేదు.

 -  ఎం.ప్రభు దయాళ్‌, ప్రధానోపాధ్యాయుడు, మధిర, ఖమ్మం జిల్లా

 

అలవాటు చేయాలి సీసీఈ విధానం.. అమలు నిదానం!

సీసీఈ విధానం వల్ల ప్రశ్నలు పొడవుగా ఉంటాయి. ప్రత్యక్ష ప్రశ్నలు ఇవ్వరు. విద్యార్థి సబ్జెక్టును పరిశీలించేందుకు ప్రశ్నల్లో మెలిక ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోకుండా రాస్తే పూర్తి మార్కులు రావు. నా అనుభవం ప్రకారం ప్రశ్నపత్రాన్ని కనీసం 10 నిమిషాలు కూడా చదవని వారే 70 శాతానికి పైగా ఉంటున్నారు.

 శంకర్‌రావు, ఉపాధ్యాయుడు, రావెల, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.