close

ప్ర‌త్యేక క‌థ‌నం

నగరానికి భవన కాంతులు! 

హరిత భవనాలు నిర్మిస్తేనే అనుమతి 
సౌర విద్యుత్తుకూ ప్రాధాన్యం 
గవర్నర్‌ సూచనతో రంగంలోకి దిగిన బల్దియా

ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నిర్ణయం 
సర్కార్‌ ఆమోదిస్తే అమలుకు కార్యాచరణ 
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

నగరానికి భవన కాంతులు! 

రాజధాని నగరంలో హరిత భవనాల నిర్మాణంపై హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) దృష్టి సారించింది. ఈ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ సూచించిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపాలని బల్దియా నిర్ణయించింది. ప్రభుత్వం ఆమోదిస్తే దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్‌ నగరంలో 14 లక్షల మంది భవన యజమానులు ఆస్తి పన్ను చెల్లిస్తుండగా..నగర పరిధిలో ప్రతి రోజూ 2,800 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ ఉంది. వేసవిలో నగర వాసులకు విద్యుత్తు సరఫరా ప్రభుత్వానికి సవాలుగా మారింది. మరోవైపు కాలుష్యం నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హరిత భవనాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా రెండు సమస్యలకు చక్కని పరిష్కారం చూపవచ్చని నిపుణులు ఎప్పట్నుంచో చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,692 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. నగరంలోని భవనాలపై సౌర పలకలు ఏర్పాటు చేస్తే 1,730 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. కొద్ది రోజుల క్రితం తనను కలిసిన బల్దియా కమిషనర్‌ దాన కిషోర్‌తో హరిత భవనాల విషయమై గవర్నర్‌ నరసింహన్‌ చర్చించారు. ‘సౌర విద్యుత్తుతో కూడిన హరిత భవనాల నిర్మాణానికే అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకుంటే కాలుష్యాన్ని చాలా వరకు కట్టడి చేయవచ్చనే’ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై సమగ్ర నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించాలని, ఆయన సానుకూలంగా స్పందిస్తే దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

విధానం అమల్లోకి వస్తే 
ప్రతి భవన నిర్మాణదారుడు(కొత్తగా నిర్మించే) తాను వినియోగించే విద్యుత్తులో కనీసం 30 శాతం వరకు భవనంపై సౌర పలకలు అమర్చుకోవడం ద్వారా ఉత్పత్తి చేసి భవన అవసరాలకు వినియోగించుకోవాలి. 
ప్రతి భవన నిర్మాణ యజమాని తప్పనిసరిగా భవన ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించాలి. 
అనుమతి తీసుకునే సమయంలో ఈ మేరకు హామీ ఇవ్వాలి. 
ఈ నిబంధనలను పూర్తి చేస్తేనే సంబంధిత భవనాలకు నివాస యోగ్య పత్రం (ఓసీ) ఇస్తారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.