close

ప్ర‌త్యేక క‌థ‌నం

హుందాగా నడిపిస్తా 

సభ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంపొందిస్తా 
రాజకీయాలుండవు.. అర్థవంతమైన చర్చలకు పెద్దపీట 
సభాపతి పదవి దక్కడం అదృష్టం 
సీఎం అన్నివిధాలా ఆలోచించే అవకాశమిచ్చారు 
ప్రజా సమస్యలు, రైతుల అంశాలపై ఎక్కువ చర్చ జరగాల్సి ఉంది 
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో తెలంగాణ నూతన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి 
ఈనాడు - హైదరాబాద్‌

శాసనసభ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడతానని.. సభను హుందాగా నడిపిస్తానని తెలంగాణ శాసనసభ నూతన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సభలో రాజకీయాలుండవని, ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. సభాపతి పదవి దక్కడం తన అదృష్టమన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి తనకు ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్‌కు సదా కృతజ్ఞుడినై ఉంటానన్నారు. కేసీఆర్‌ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా సభను నడిపిస్తానన్నారు. సభాపతి పదవిపై తనకేమీ అసంతృప్తి లేదని, ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఈ పదవిలో ఓడిపోతామనేది మూఢనమ్మకమని, దాన్ని తాను విశ్వసించడం లేదని చెప్పారు. శుక్రవారం సభాపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పోచారం శ్రీనివాస్‌రెడ్డి ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
హుందాగా నడిపిస్తా 

సహకార సంఘం అధ్యక్ష పదవి నుంచి సభాపతి స్థాయికి ఎదిగారు? దీనిపై మీరేమనుకుంటున్నారు? 
నేను రైతుబిడ్డను. పల్లెటూరి నుంచి వచ్చాను. ప్రజాస్వామ్యంలో చట్టసభలైన పార్లమెంటు, శాసనసభలు రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడినవి. ఎంతో పవిత్రమైనవి. నైతిక విలువలు గలవి. ఇలాంటి సభకు సీఎం కేసీఆర్‌ నన్ను సభాపతిగా ఎంపిక చేశారు. కేసీఆర్‌ లోతుగా ఆలోచించి, నా మీద నమ్మకంతో ఈ పదవిని అప్పగించారు. ఆయన విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తా. అన్ని పక్షాలు నేను ఏకగ్రీవం కావడానికి సహకరించాయి. అందరికీ కృతజ్ఞతలు.

మీరు మంత్రి పదవుల జాబితాలో ఉన్నారు. ఈ పదవి రావడంపై మీరెలా ఉన్నారు? 
సభాపతిగా ఎన్నిక కావడంపై నేను పూర్తి సంతోషంగా ఉన్నాను. నాకు ఏ పదవి అప్పగించాలో కేసీఆర్‌దే నిర్ణయం. గత ప్రభుత్వంలో నాకు వ్యవసాయ శాఖను అప్పగించారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను చేపట్టారు. వాటిని నేను అమలు చేశాను. ఈ పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఈ ఘనత కేసీఆర్‌దే.

సభాపతి పదవిలో ఉన్న వారు ఓడిపోతారనే భావనతో వెనుకంజ వేశారంటున్నారు? మీ భావనేమిటి? 
నాకు అలాంటి నమ్మకాలు లేవు. ముందస్తు ఎన్నికలకు వెళ్లినవారు ఓడిపోతారని కొందరు ఊహాగానాలు అల్లారు. కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్లి అఖండ విజయం సాధించారు. సభాపతి పదవిలో ఉండి ఎన్నికలకు వెళ్లడంపైనా ఇలాంటివే పుట్టిస్తున్నారు.

సభాపతిగా మీ ప్రాధాన్యాలేమిటి? 
ప్రజల సమస్యలు, రైతులకు సంబంధించిన అంశాలపై ఎక్కువ సమయం చర్చించాలి. ఇప్పటికే తెరాస ప్రభుత్వం నిరుపేదలు, అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తోంది. వాటిని కొనసాగించేందుకు సభ నుంచి సహకారం అందించాలి.

సభ ద్వారా ఎలాంటి ప్రయోజనాలుంటాయి? 
శాసనసభ ఎంతో ఉన్నతమైంది. పాలనకు ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. ప్రజలకు సంబంధించిన అంశాలను ఇక్కడ చర్చించి, మీడియా ద్వారా వారికి సందేశం ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. దీనిని అందరూ ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వులైనా మార్చవచ్చు కానీ సభలో చేసే చట్టాలను ఎవరూ మార్చలేరు. సవాలు చేయలేరు. 
చట్టసభల్లో సభాపతులు పార్టీ ఫిరాయింపులపై అధికారపక్షానికి అనుకూలంగా ఉంటారనే విమర్శలకు మీ సమాధానం? 
ఎవరైనా చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. నేను అదే దారిలో పయనిస్తాను.

వ్యవసాయశాఖతో అనుబంధం కొనసాగిస్తారా? 
సభాపతిగా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోను. పరిధి మేరకు ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తాను.

హుందాగా నడిపిస్తా 

సభతో మీ అనుబంధం ఎలా ఉంది? 
1994లో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టాను. ఇదో దేవాలయం. ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నాను. ఎన్నో సమస్యలను ప్రస్తావించాను. తెరాస హయాంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉద్యమ ప్రభావాన్ని చాటాను. ఇప్పుడు సభాపతిగా అత్యున్నత పీఠంపై కూర్చోవడం మధురానుభూతి. ఎందరో సభాపతులను చూశాను. వారి నుంచి స్ఫూర్తిని పొందాను.

ఇప్పటి వరకు మీరు ప్రజలతో కలిసిమెలిసి ఉన్నారు. సభాపతిగా ఏమైనా పరిమితులు ఉంటాయని భావిస్తున్నారా? 
సభాపతికి ఎలాంటి పరిమితులు లేవు. రాజకీయపరమైనవి తప్పితే అన్ని సభలు, సమావేశాల్లో పాల్గొనవచ్చు. ప్రజల దగ్గరకు వెళ్లొచ్చు. వారితో కలిసి నడవవచ్చు. నేను సభా సమయాల్లో తప్పితే మిగిలిన రోజులు యథాతథంగా ప్రజల మధ్యే ఉంటాను.

సభలో తమకు సమానావకాశాలు కల్పించాలని విపక్షాలు కోరుతున్నాయి కదా? 
సభలో పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా అవకాశాలు ఇవ్వడమనేది ఆనవాయితీ. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలపై చర్చ జరగాలి. రాజకీయాలు మాట్లాడితే సభా సమయం వృథా అవుతుంది. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలుండాలి. అంశాల ప్రాతిపదికన అందరికీ అవకాశాలు కల్పిస్తాం. కొత్త శాసనసభ్యులు, మహిళా ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.