close

ప్ర‌త్యేక క‌థ‌నం

చదివించే వాతావరణం విజయ సోపానం 

పరీక్షల సమయంలో విద్యార్థులకు అండగా నిలవాలి 
తల్లిదండ్రులదీ కీలక పాత్రే అంటున్న నిపుణులు 
ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి

చదివించే వాతావరణం విజయ సోపానం 

రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివేవారు తప్ప మిగిలిన విద్యార్థులు పాఠశాల్లో గడిపేది రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు మాత్రమే. మిగిలిన సమయంలో ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి, వాళ్లు చదువులో రాణించేందుకు ఇంటి వాతావరణం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కనీసం పరీక్షలకు ముందు రెండు నెలలపాటైనా చదివేందుకు తగిన వాతావరణం కల్పిస్తూ తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షల సన్నద్ధతకు ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా చూడాలని సలహా ఇస్తున్నారు. ఈ కొద్దిరోజులు పిల్లలకు అండగా నిలిస్తే పరీక్షల్లో నెగ్గుకొస్తారని చెబుతున్నారు. తెలంగాణలో మార్చి 16 నుంచి, ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అంటే ఇక రెండు నెలల సమయం కూడా లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్షలకు మొత్తం సుమారు 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు నిపుణులు ఇస్తున్న సూచనలివీ..

వినోదాలకు దూరంగా.. 
విద్యార్థులు ఇంటివద్ద చదివేటపుడు.. వీలైనంతవరకూ వారిని టీవీ, కంప్యూటర్‌వంటి ఉపకరణాలకు, వినోదాలకు దూరంగా ఉంచాలి. వారిముందు సెల్‌ఫోన్‌ సంభాషణలు సరికాదు. పిల్లలకు ప్రత్యేక గది లేని ఇంట్లో పరీక్షల ముందు కేబుల్‌ కనెక్షన్‌ తొలగించడం అవసరం.

పరీక్షల ముందు విందులు, వినోదాలు, శుభకార్యాలకు విద్యార్థులను తీసుకెళ్లొద్దు. విద్యార్థికి సమయంతోపాటు ఏకాగ్రత కూడా ఎంతో ముఖ్యం.

కుటుంబ సమస్యలను పిల్లల ఎదుట చర్చిస్తే.. అది వారిని మానసిక ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది.

ఆత్మవిశ్వాసం పెంపొందించేలా.. 
పిల్లల ఆత్మవిశ్వాసం పెంచేలా మాట్లాడాలి. ‘చాలా తెలివైనవాడివి.. అనుకుంటే ఏదైనా సాధిస్తావు..’ లాంటి పదాలను వాడుతూ ప్రోత్సహించాలి.

ఏకాగ్రతను పెంచుకునేందుకు, ఒత్తిడిని అధిగమించేందుకు కొంత సమయం ఇంటి వద్ద యోగా, ధ్యానం చేయించాలి. కనీసం 30 నిమిషాలైనా ఆడుకోనివ్వాలి. కుటుంబ సభ్యులు కలిసి ఆడితే ఇంకా మంచిది. శారీరక వ్యాయామంద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చు.

ఒంట్లో నలతగా ఉంటే ఆ ప్రభావం చదువుపై పడుతుంది. పరీక్షల సమయంలో చిన్న అనారోగ్యం కలిగినా, జాప్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

కనీసం ఆరు గంటల నిద్ర తప్పనిసరి. 
ప్రతిభావంతుడైన స్నేహితుడితో కలిసి చదువుకోవడమూ ప్రయోజనకరమే.

చదివించే వాతావరణం విజయ సోపానం 

ఆందోళన పెంచొద్దు

చదివించే వాతావరణం విజయ సోపానం 

పరీక్షల గడువు దగ్గరపడుతోందని పిల్లలు అసలే ఆందోళన పడుతుంటారు. అలాంటి వారిని కొందరు తల్లిదండ్రులు తమ మాటలతో మరింత ఆందోళనకు గురి చేస్తారు. పిల్లలకు అండగా ఉంటూ.. నైతిక బలం ఇవ్వాలి తప్ప ‘అత్యధిక మార్కులతోనే భవిష్యత్తు..’ అంటూ కంగారు పెట్టకూడదు. కొందరు పిల్లలు కొద్ది సమయం చదివినా బాగా నేర్చుకుంటారు. గంటల తరబడి చదువుకోమని ఒత్తిడి చేయటం తగదు. భయం ఎక్కువైతే చదివింది కూడా మరిచిపోయే పరిస్థితి వస్తుంది. 
- రాధిక ఎన్‌ ఆచార్య, క్లినికల్‌ సైకాలజిస్టు, హైదరాబాద్‌

పనులు చెప్పొద్దు

చదివించే వాతావరణం విజయ సోపానం 

పరీక్షల ముందు ఇంటి, బయటి పనులు పిల్లలకు చెప్పకూడదు. విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో వారి ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా చూడాలి. పరీక్షలు పూర్తయ్యేంత వరకు పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి ప్రయాణాలు పెట్టుకోవద్దు. 
- ఎం.ప్రతాప్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, నల్లగొండ ఉన్నత పాఠశాల,  కరీంనగర్‌ జిల్లా

ప్రశాంత వాతావరణం కల్పించాలి

చదివించే వాతావరణం విజయ సోపానం 

పిల్లలు అలసిపోకుండా ఉండేందుకు పౌష్టికాహారం అందించాలి. పునశ్చరణ సమయం చాలా ముఖ్యమైంది. ప్రణాళికాబద్ధంగా చదివితే అధిక మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. తోటి విద్యార్థులతో కలిసి అభ్యసనం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
- బట్టు సురేష్‌, ప్రధానోపాధ్యాయుడు, నిడమానురు, విజయవాడ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.