close

ప్ర‌త్యేక క‌థ‌నం

ముదిమి మీదపడుతోంది! 

తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికం 
దేశంలో 27 కోట్ల మంది వయోధికులు 
2050 నాటికి అంచనాలు

ముదిమి మీదపడుతోంది! 

ఈనాడు, దిల్లీ: భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాప్య జనాభా రేటు పెరగనుంది. రెండు రాష్ట్రాల్లోనూ ‘ఒకరు లేదా ఇద్దరు’ అన్నట్లు ప్రజలంతా కుటుంబ నియంత్రణ సూత్రాన్ని అనుసరిస్తుండటంతో జనాభా వృద్ధిరేటు తగ్గి వయోధికుల సంఖ్య పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈమేరకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఆధ్వర్యంలోని ఆర్థిక పరిశోధన విభాగం తాజాగా నివేదిక రూపొందించింది. 2050 నాటికి తెలుగు రాష్ట్రాల్లో 30.1% మంది వృద్ధులు ఉండబోతున్నట్లు అంచనా వేసింది. 2001, 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్‌బీఐ ఈ విశ్లేషణ జరిపింది. కుటుంబ నియంత్రణ విధానాలు పక్కాగా అమలవుతున్న దక్షిణాది రాష్ట్రాలన్నింటా భవిష్యత్తులో వయోధికుల శాతం ఎక్కువగా ఉండనుంది. దేశాల పరంగా చూస్తే మాత్రం అమెరికా, చైనాల కంటే భారత్‌లోనే అప్పటికి యువకులు అధికంగా ఉంటారు. భారత్‌లో 2011 నాటికి 5.5% ఉన్న వయోధికుల జనాభా దాదాపు 3 రెట్లు పెరగనుంది. స్థూలంగా చూస్తే దీనివల్ల పెద్ద సమస్యలేమీ తలెత్తే అవకాశం లేకున్నా.. రాష్ట్రాల వారీగాను, దేశంలోని అంతర్గత పరిస్థితులను చూస్తే మాత్రం కొంత సంక్లిష్టంగా కనిపిస్తున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో ఎదురయ్యే జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి గాను ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే ప్రోత్సాహం ప్రారంభించింది. అయితే తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటును పెంచడం అంత సులభమేమీ కాదని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది.

2050 నాటికి భారత జనాభా 178 కోట్లకు చేరుతుంది. అందులో 27 కోట్ల మంది 65 ఏళ్లకు పైబడిన వారుంటారు. 
దేశ సగటు వృద్ధుల శాతం భారత్‌లో 15.2, చైనాలో 32.6, అమెరికాలో 23.2గా ఉండనుంది. 
భారత్‌లో హరియాణా యువరాష్ట్రంగా నిలవనుండగా.. తెలుగు రాష్ట్రాల్లో వయోధికుల శాతం ఎక్కువగా ఉంటుంది.

 

సంక్లిష్టతలు 
యువ, వయోధిక జనాభా మధ్య అంతరాలు పెరగడం వల్ల సంపద పంపిణీలో అసమానతలు అధికం కానున్నాయి. 
దక్షిణాదిలో పనిచేసేవారు తగ్గిపోవడం వల్ల ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల నుంచి కార్మికుల వలస పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా దక్షిణాది మౌలిక వసతుల పరంగా ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అది సామాజికంగా, భౌతికంగానూ ఉంటుంది. 
వయోధికులు పెరిగే కొద్దీ దక్షిణాది రాష్ట్రాల్లో పొదుపు తగ్గిపోతుంది. అంతా పింఛన్ల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఇది ఆయా రాష్ట్రాల జీఎస్‌డీపీపై ప్రభావం చూపుతుంది. అందువల్ల భవిష్యత్తులో భారతీయ బ్యాంకులన్నీ కొత్త లైఫ్‌సైకిల్‌ ఆధారిత డిపాజిట్‌ స్కీమ్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. 
యువత ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో కార్మికుల అవసరం ఎక్కువగా ఉండే పరిశ్రమలను ఏర్పాటుచేసి పని కల్పించాల్సి ఉంటుంది.

ముదిమి మీదపడుతోంది! 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.