close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఉల్లంఘనులకు ఇక వణుకే 

ఎన్ని కల కేసులు చకచకా

22 కేసుల్లో శిక్షలు

ఉల్లంఘనులకు ఇక వణుకే 

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులంటే అందరికీ అలుసే. ఎన్నికలప్పుడు కేసులు పెడతారు.. ఆ తర్వాత అంతా మర్చిపోతారని ఎక్కువమంది భావిస్తుంటారు. అందుకే ఎన్ని నిబంధనలు ఉన్నా యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉంటారు. కానీ ఈసారి పరిస్థితి మారిపోయింది. కేసుల దర్యాప్తు శరవేగంగా పూర్తి చేస్తున్న పోలీసులు వాటిలో శిక్షలు కూడా పడేటట్లు చూస్తున్నారు. తద్వారా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడానికి నాయకులు భయపడే పరిస్థితి తెస్తున్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల సందర్భంగా నమోదు చేసిన వాటిలో ఇప్పటికే 200 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయడం పోలీసుల వేగానికి నిదర్శనం. వీటిలో 22 కేసుల్లో శిక్షలు కూడా పడటం గమనార్హం. 
విమర్శలకు చెక్‌ పెట్టాలనే.. 
ఎన్నికల నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నా ఉల్లంఘించేందుకు ఎవరూ జంకడం లేదు. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,900 కేసులు నమోదయ్యాయి. 2014 ఎన్నికల్లో నమోదయిన 1,650 కేసుల కంటే ఈసారి 250 కేసులు ఎక్కువ నమోదవడం గమనార్హం. ఎన్నికలు పూర్తవగానే పోలీసులు కూడా కేసులు గురించి పెద్దగా పట్టించుకోకపోవడమే ఉల్లంఘనలకు ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి. దీంతో పోలీసులు ఈసారి వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎన్నికలు పూర్తయిన నెల రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రాలు దాఖలు చేయడం మొదలుపెట్టారు. గత నెల 7న తెలంగాణలో పోలింగ్‌ జరిగింది. ఈ నెల 10 వరకూ 200 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశారు. తూతూమంత్రంగా దర్యాప్తు జరిగినట్లు కాకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తున్నారు. దాంతో ఇప్పటికే 22 కేసుల్లో న్యాయస్థానం శిక్షలు కూడా విధించింది. మిగతా కేసుల్లో న్యాయవిచారణ కొనసాగుతోంది. మిగతా 1,700 కేసుల్లోనూ మరో నెల రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రాలు దాఖలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. 
సార్వత్రికంపై దృష్టి 
పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేలోపు ఈ కేసులను కొలిక్కి తేవాలని అధికారులు భావిస్తున్నారు. ఎక్కువ కేసుల్లో శిక్షపడితే రాజకీయ నాయకుల్లోనూ భయం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావం పార్లమెంటు ఎన్నికపై ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించేందుకు నాయకులు వెనుకాడతారని, తద్వారా తమకు పనిభారం కూడా తగ్గుతుందని వారు విశ్లేషిస్తున్నారు. 
ఆదాయపు పన్ను శాఖకు లేఖ 
ఎన్నికల సమయంలో రాష్ట్రంలో రూ.98 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంచేందుకే వీటిని సిద్ధం చేశారన్నది పోలీసుల అభియోగం. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది తేల్చే బాధ్యత ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న డబ్బు చట్టబద్ధమైనదేనని నిందితులు నిరూపించుకోగలితే సొమ్ము తిరిగి ఇచ్చేస్తారు. దీనికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ దర్యాప్తులో వెల్లడయిన అంశాలు తమకు తెలపాలని కోరుతూ డీజీపీ కార్యాలయం ఇదివరకే ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాసింది. స్వాధీనం చేసుకున్న డబ్బుకు ఆధారాలు లేని పక్షంలో దాన్ని ఓటర్లకు పంచేందుకే తెచ్చినట్లు  భావించాల్సి ఉంటుంది. ఇది నేరం కాబట్టి ఆ డబ్బుకు బాధ్యులైన వారందరిపైనా పోలీసులు కేసులు నమోదు చేస్తారు. ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాధానం వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.