close

ప్ర‌త్యేక క‌థ‌నం

చేరువైనా.. ప్రయాణికులకు దూరమేనా? 

కీలక ప్రత్యామ్నాయంగా మోటుమర్రి- విష్ణుపురం సెక్షన్‌ 
సికింద్రాబాద్‌- విజయవాడ మధ్య 40 కి.మీ. తగ్గిన దూరం 
ఏడాదిన్నర క్రితమే పూర్తిస్థాయిలో అందుబాటులోకి 
గూడ్సు రైళ్లనే అనుమతిస్తున్న రైల్వేశాఖ 
ప్యాసింజర్‌ రైళ్లపై వినతులు పట్టని రైల్వే బోర్డు 
ఈనాడు - హైదరాబాద్‌

చేరువైనా.. ప్రయాణికులకు దూరమేనా? 

తెలుగు రాష్ట్రాల్లో కీలక నగరాలైన సికింద్రాబాద్‌, విజయవాడల మధ్య రెండు ప్రధాన రైల్వే మార్గాలున్నాయి. నిత్యం విపరీతమైన రద్దీగా ఉండే ఈ రెండు లైన్లను అనుసంధానం చేసేందుకు ఖమ్మం సమీపంలోని మోటుమర్రి నుంచి మిర్యాలగూడ దగ్గరలోని విష్ణుపురం వరకు సెక్షన్‌ నిర్మించారు. ఏడాదిన్నర కిందటే ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే కీలకమైన ఈ ప్రత్యామ్నాయ మార్గంలో సరకు రవాణా చేసే గూడ్స్‌ రైళ్లు మాత్రమే నడుపుతున్నారు. ప్రయాణికుల రైళ్లు నడపాలని ప్రయాణికులు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా రైల్వే బోర్డు పట్టించుకోవడం లేదు. 
ప్రయోజనాలు ఎన్నో.. 
సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లేందుకు రెండు రైలు మార్గాలున్నాయి. వయా కాజీపేట, ఖమ్మం ఒకటి. వయా నల్గొండ, గుంటూరు మరొకటి. విజయవాడతో పాటు కాకినాడ, విశాఖపట్నం, కోల్‌కతా, గౌహతి వైపు వెళ్లే రైళ్లతో.. చెన్నై, తిరువనంతపురం వైపు వెళ్లే రైళ్లతో ఈ మార్గాలు కిటకిటలాడుతుంటాయి. ఇంత రద్దీగా ఉన్న రెండు మార్గాలను అనుసంధానం చేసే మోటుమర్రి- విష్ణుపురం సెక్షన్‌ను నాలుగు దశల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి వచ్చే రైళ్లు వయా నడికుడి మార్గంలో గుంటూరు మీదుగా విజయవాడకు వెళుతున్నాయి. మిర్యాలగూడ తర్వాత వచ్చే విష్ణుపురం నుంచి రైళ్లను మళ్లిస్తే.. జాన్‌పహాడ్‌, మఠంపల్లి మేళ్లచెరువు, జగ్గయ్యపేట, మోటుమర్రి మీదుగా విజయవాడకు చేరుకోవచ్చు. కాజీపేట మీదుగా కంటే విష్ణుపురం- మోటుమర్రి మార్గంతో విజయవాడకు 40 కి.మీ.కి పైగా దూరం తగ్గుతుంది. 
సికింద్రాబాద్‌- కాజీపేట- విజయవాడ, సికింద్రాబాద్‌- గుంటూరు- విజయవాడ మార్గాలపై ఒత్తిడి తగ్గుతుంది. రైళ్ల వేగం పెరుగుతుంది. అదనంగా మరికొన్ని రైళ్లు ప్రవేశపెట్టొచ్చు. 
ఒక్క కాపలాగేటు కూడా లేకుండా నిర్మించిన తొలి మార్గమిది. దీంతో లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. 
ఏడాదికి రూ.1800 కోట్ల ఆదాయం 
మోటుమర్రి- విష్ణుపురం మార్గంలో ప్రముఖ సిమెంటు పరిశ్రమలున్నాయి. ఈ మార్గం నుంచి హైదరాబాద్‌ వైపు, విజయవాడవైపు నిత్యం 8 గూడ్సు రైళ్లు వెళుతుంటాయి. ఇక్కడ తయారయ్యే సిమెంటు ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు వెళుతుంది. ఈ కంపెనీలకు రామగుండం నుంచి బొగ్గు వస్తుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు స్టీల్‌, నౌకాశ్రయాల నుంచి ఎరువులు, ఇతరత్రా దిగుమతులు, రవాణా ఖర్చు తగ్గుతుందని ఈ మార్గం గుండానే తీసుకెళుతున్నారు.  ఈ సెక్షన్‌ ద్వారా నిత్యం రూ.5 కోట్లు అంటే ఏడాదికి 1,800 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు అంచనా. 
ఇంకెప్పుడు ప్రయాణికుల రైళ్లు? 
మోటుమర్రి- విష్ణుపురం మధ్య ప్యాసింజర్‌ రైళ్లు నడపాలని, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఈ మార్గంలో మళ్లించాలన్న డిమాండ్లు చాలాకాలంగా వస్తున్నాయి. ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే నిర్వహించే సమావేశాల్లో నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు ఈ విషయాన్ని లేవనెత్తారు. అయినా ప్రయోజనం సున్నా. ‘‘ఎంతో ఖర్చుపెట్టారు. పూర్తయిన రైలు మార్గంలో ప్రయాణికుల రైళ్లు ఎందుకు నడపరు?’ అని హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో స్థిరపడ్డ నెల్లూరుకు చెందిన విశ్రాంత ఎంఈఓ ప్రశ్నించారు.

రైల్వే అధికారులు ఏమంటున్నారు? 

ఈ సెక్షన్‌ను మంజూరు చేసిందే సరకు రవాణా కోసం. ప్రయాణికుల రైళ్లు నడిపేందుకు ప్రస్తుతం సాంకేతికంగా అనువైంది కాదు. మార్పులు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. ప్రయాణికుల రైళ్ల వేగానికి అనుగుణంగా సాంకేతిక మార్పులు చేయాల్సి ఉంది. 

నిపుణుల వాదన ఏమిటి?

ఒక్కోటి 5,500 టన్నుల సామర్థ్యంతో, రోజు 8 గూడ్సు రైళ్లు వెళుతున్నా ఈ మార్గంలో ట్రాక్‌ తట్టుకుంటోంది. 1,500 టన్నుల బరువుండే ప్యాసింజర్‌ రైళ్లను ఎందుకు నడపలేరు?  
స్లీపర్లను కాసింత బలోపేతం చేసి, వాటికి ఆధారంగా ఉండే కంకరను పెంచితే సరిపోతుంది. ఇదేమీ వ్యయప్రయాసలతో కూడింది కాదు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.