close

ప్ర‌త్యేక క‌థ‌నం

శుద్ధి భద్రమేనా!

శుద్ధికి రసాయనాల వాడకం సాధారణం 
మంచి రంగు, ఆకర్షణ కోసం ఇది తప్పనిసరి 
పీసీబీ సూచనలు బేఖాతరు 
రిఫైన్డ్‌ నూనె గుండెకు మంచిదని భావిస్తున్న ప్రజలు 
ఇందులో వాస్తవం లేదంటున్న నూనె పరిశోధన శాస్త్రవేత్తలు

శుద్ధి భద్రమేనా!

ఇటీవల కాలంలో వంట నూనె ప్యాకెట్లపై ‘డబుల్‌ రిఫైన్డ్‌’ అని ముద్రించి అమ్ముతున్నారు. నూనెను ఒకసారి శుద్ధి చేయడానికి 4 రకాల రసాయనాలు వాడుతారు. నిజానికి రెండోసారి శుద్ధి చేయడం అనేది పెద్దగా ఉండదు. ప్రజలను ఆకర్షించడానికే డబుల్‌ రిఫైన్డ్‌ అని రాస్తుంటాం. 
రసాయనాలతో కాకుండా భౌతిక శుద్ధి మంచిదని మాకూ తెలుసు. కానీ అలా చేస్తే ఆ నూనె ముదురు రంగులో ఉంటుంది. అలాంటి నూనెలను ప్రజలు కొనరు. అందుకే రసాయనాలతో శుద్ధి చేస్తున్నాం.
హైదరాబాద్‌కు చెందిన ఓ చీఫ్‌ కెమిస్ట్‌

ప్రతి ఇంటా వంటలకు నూనెల వాడకం తప్పనిసరి. నెలకు ఇంట్లో కుటుంబ సభ్యుల్ని బట్టి మూడు నాలుగు కిలోల నూనె అవసరమవుతుంది. ఇందుకు వివిధ రకాల నూనెలను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో శుద్ధి చేసిన నూనెలు మార్కెట్లో క్రయవిక్రయాలు ఎక్కువయ్యాయి. ఈ నూనెలు అయితేనే గుండెకు మంచిదన్న అపోహ అనేకమందిలో ఉంది. వంటకు ఏ నూనె వాడినా అందులో పోషకాలు ఉండేలా చూసుకోవాలని.. కల్తీ కాని వాటిని వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. విడి నూనెలను కొనకపోవడమే మంచిదంటున్నారు. వంటలకు నూనెలను తరచూ మార్చడం మంచిదని అందువల్ల వాటిలోని పోషకాలన్నీ శరీరానికి అందుతాయని పేర్కొంటున్నారు.. నూనెల తయారీ.. శుద్ధి, ఏయే నూనెల వల్ల ఎలాంటి లబ్ధి చేకూరుతుంది.. తదితరాల గురించి తెలుసుకుంటే పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

వంట నూనెల్లో అపోహల మంట

శుద్ధి భద్రమేనా!

నూనెలను ప్యాకెట్లలో కాకుండా.. విడిగా అమ్మేవారు ఎక్కువగా కల్తీ చేస్తున్నారు. విడిగా అమ్మే నూనెలు ఎవరూ కొనవద్దు. 
రోడ్లపై మిర్చి బజ్జీలు, ఇతర వంటకాలు అమ్మేవారు విడి నూనెలను టోకుగా ఎక్కువగా కొంటున్నారు. అలాంటి చోట్ల తినకపోవడం మంచిది.
  - నూనె పరిశోధన శాస్త్రవేత్తలు

నూనె గింజల నుంచి తొలుత తయారయ్యే ముడి నూనెలను రసాయనాలతో శుద్ధి చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఏ నూనెను ఎన్ని రసాయనాలతో శుద్ధి చేస్తున్నారు, ఈ ప్రక్రియలో ఆహార భద్రత శుద్ధి భద్రమేనా!ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అన్నది పీసీబీ అధికారులు, ఆహార భద్రత విభాగం వారు తనిఖీ చేయాలి. ‘భారత ఆహార భద్రత ప్రమాణాల మండలి’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సూచించిన ప్రకారం వంట నూనెల శుద్ధిలో మిల్లులు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న స్థాయి మిల్లుల్లో నూనెల శుద్ధి సక్రమంగా జరగడం లేదు. పేరున్న కంపెనీల మిల్లుల్లో అధునాతన పరిజ్ఞానంతో నూనె శుద్ధి పక్కాగా జరుగుతోంది. ఇటీవల కాలంలో వంట నూనెను కంటితో చూస్తే మన ప్రతిబింబం కనిపించేంతగా పల్చని నీరులా.. మంచి రంగుతో కనిపించేలా తయారుచేసి ప్యాకెట్లలో అమ్ముతున్నారు. ఎక్కువగా శుద్ధి చేయాలంటే అంతేస్థాయిలో అధికంగా రసాయనాలు వాడాల్సిందేనని నూనె గింజల పంటల పరిశోధన శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 
అన్ని నూనెలకూ శుద్ధి అవసరం లేదు 
మన పూర్వీకులు స్వచ్ఛమైన నెయ్యి, వేరుసెనగ, కొబ్బరి, నువ్వులు, ఆవనూనెలను వంటలకు వాడేవారు. ఇటీవల కాలంలో రిఫైన్డ్‌ నూనెలనే వాడాలన్న ప్రచారం అధికమైంది. గత 30 ఏళ్లుగా దేశంలో రిఫైన్డ్‌ వంట నూనెల వాడకం బాగా పెరిగింది. వేరుసెనగ, ఆవ, నువ్వుల నూనెలను గానుగలో తయారుచేసి వడపోసి (ఫిల్టర్‌) మలినాలను తొలగించి విక్రయిస్తారు. వీటిని కూడా డబుల్‌ ఫిల్టర్‌ అని, డబుల్‌ రిఫైన్డ్‌ అని ఇటీవల అమ్ముతున్నారు. పీసీబీ నిబంధనల ప్రకారం వంట నూనెలను రసాయనాలతో శుద్ధి చేయడం వల్ల కాలుష్యం ఎక్కువవుతోంది. భౌతిక శుద్ధి చేయాలని చెప్పినా కొన్ని చిన్న సంస్థలు పట్టించుకోవడం లేదు. పొద్దుతిరుగుడు, సోయా, పామాయిల్‌ తదితర నూనెలను భౌతిక శుద్ధి, రెండోది రసాయనాల ద్వారా శుద్ధి చేస్తారు. 

శుద్ధి భద్రమేనా!

నాలుగు రసాయనాల వాడకం 
పొద్దుతిరుగుడు నూనె రసాయన శుద్ధి విధానాన్ని పరిశీలిస్తే.. తొలుత పొద్దుతిరుగుడు గింజలను మిల్లులో గానుగాడితే ముడి నూనె వస్తుంది. ఇందులో జిగురు, మలినాలు  ఉంటాయి. వీటిని తొలగించడానికి తొలుత ఫాస్ఫారిక్‌ ఆమ్లంతో శుద్ధి చేస్తారు. తరువాత సోడియం హైడ్రాక్సైడ్‌ను, నీటిని కలిపి భారీ యంత్రాలపైకి పంపి వడపోస్తారు. అలా వచ్చిన నూనెను రానున్న ఆరునెలల పాటు నిల్వ చేసి అమ్మేందుకు వీలుగా సిట్రిక్‌ ఆమ్లాన్ని కలుపుతారు. ఇటీవల కాలంలో వంట నూనె మరీ ఆకర్షణీయంగా కనిపించాలని బ్లీచింగ్‌ ఎర్త్‌ పొడిని కలిపి శుద్ధి చేస్తున్నారు. వంట నూనె ప్యాకెట్లపై ‘డబుల్‌ రిఫైన్డ్‌’ అని ఇటీవల కాలంలో ముద్రించి అమ్ముతున్నారు. ఒకసారి శుద్ధి చేయడానికి 4 రకాల రసాయనాలు వాడుతున్నారు. రెండోసారి శుద్ధి చేయడం అనేది పెద్దగా ఉండదని హైదరాబాద్‌కు చెందిన ఓ భారీ వంట నూనెల శుద్ధి మిల్లు ముఖ్య రసాయన నిపుణుడు(చీఫ్‌ కెమిస్ట్‌) ‘ఈనాడు’కు చెప్పారు. రసాయనాలతో కాకుండా భౌతిక శుద్ధి మంచిదని తమకూ తెలుసునని, అలా చేస్తే ఆ నూనె ముదురు రంగులో ఉంటుందన్నారు. 

శుద్ధి భద్రమేనా!

ఆర్థికంగా నష్టం రాదు 
వంట నూనెల తయారీలో లాభం కోసం కల్తీకి పాల్పడుతున్నట్లు ఇటీవల ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.  కిలో వేరుసెనగ గింజల ధర రూ.90కి పైగా ఉంది. మూడు కిలోల పల్లీలను గానుగాడితే కిలో నూనె వస్తోంది. మరి రూ.270 దాకా ఖర్చు పెట్టి పల్లీలు కొని కిలో నూనెను రూ.100కే ఎలా అమ్ముతున్నారనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ వాదన తప్పు అని నూనె మిల్లుల యాజమాన్యాలు తెలిపాయి. గతేడాది వేరుసెనగ క్వింటా మద్దతు ధర రూ.4450. ఈ ధరకన్నా తక్కువకే రైతుల నుంచి నూనె మిల్లులు నేరుగా పంటను కొన్నాయి. ఇందులో నాణ్యమైన పల్లీలను వేరుచేసి ఎగుమతి మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారు. నాణ్యత తక్కువగా ఉండే 2 లేదా 3వ రకం పల్లీలను నూనె తయారీకి వాడుతున్నారు. వాటి ధర కిలోరూ.50 లోపే ఉంది. నూనె తయారీ తరువాత మిగిలే వ్యర్థాల చెక్కను పశువుల దాణాకు అమ్ముతున్నారు. ఈ లెక్కలన్నీ పోగా లీటరు నూనెను రూ.80 నుంచి 90 రూపాయలకు చిల్లర వ్యాపారులకు విక్రయిస్తున్నామని ఓ నూనె మిల్లు యజమాని చెప్పారు.

శుద్ధి భద్రమేనా!

శుద్ధి భద్రమేనా!

మన వంటల విధానానికి ఆలివ్‌ సరికాదు

శుద్ధి భద్రమేనా!

టీవల కాలంలో ఆలివ్‌ నూనె మంచిదనే ప్రచారంతో అధిక ధర చెల్లించి కొని మరీ వంటలకు వాడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. మన వంటలు వండే విధానానికి ఇది సరికాదు. పైగా ఆలివ్‌నూనెలో అన్ని పోషకాలూ ఉండవు. జపాన్‌ వాసులు తవుడు నూనెను (రైస్‌ బ్రాన్‌) అధికంగా వాడుతున్నారు. ఇది వారి దీర్ఘాయుష్షుకు ఒక కారణమని చెప్పాలి. తవుడులో ఉండే పోషకాలు ఈ నూనె ద్వారా శరీరానికి అందుతాయి.

కొబ్బరి నూనె ఒక్కటే వాడకూడదు
శుద్ధి భద్రమేనా!

కేరళ వాసులు వంటలకు పూర్తిగా కొబ్బరి నూనె వాడతారు. కానీ దానివల్ల శరీరానికి కీలకమైన మ్యూఫా, కొవ్వులు అందవు. ఈ రెండింటినీ పొందడానికి కేరళవాసులు ఎక్కువగా చేపలు, ఇతర మాంసాహారం తింటారు. 
పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఆవనూనె వాడుతున్నారు. కానీ కొబ్బరినూనెలో ఉండే సాచురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలు ఇందులో తక్కువ. అందువల్ల వారు కూడా చేపలు, ఇతర మాంసాహారం ఎక్కువగా తినడం ఆనవాయితీ. దీనివల్ల ఆవనూనెలో లేనివి సైతం ఇతర ఆహారంలో సమకూరతాయి. 
ఐరోపా, అమెరికా దేశాలతో పాటు, మన ఉత్తరాది రాష్ట్రాల్లో సోయా చిక్కుడు నూనె వాడకం అధికం. కానీ అందులో కీలకమైన సాచురేటెడ్‌, మ్యూఫాలు ఉండవు. అందువల్ల ఉత్తర భారతంలో పల్లీలు, వెన్న, ఆవునెయ్యి వాడకం అధికం. సోయాలో లేనివి వీటిద్వారా శరీరానికి అందుతున్నాయి.

70 శాతం దిగుమతి

భారతదేశంలో ప్రజలు నిత్యం వినియోగించే వంట నూనెల్లో రసాయనాల అధిక వాడకానికి, కల్తీలకు, ఇతర సమస్యలకు ప్రధాన కారణం దేశంలో నూనె గింజల పంటల సాగు, నూనె తయారీ తగ్గిపోవడమే. ప్రజలు వాడే వంట నూనెల్లో 70 శాతం వరకూ విదేశాల నుంచే కొని తెస్తున్నారు. ఏటా నవంబరు నుంచి మరుసటి అక్టోబరు దాకా ‘నూనెల ఏడాది’గా పరిగణిస్తారు. గతేడాది మొత్తం 1.45 కోట్ల టన్నులు దిగుమతి చేసుకున్నారు. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో కోటిన్నర టన్నులు వచ్చింది. దేశంలో ఏటా మొత్తం 2.30 కోట్ల టన్నుల వంట నూనెల డిమాండు ఉన్నట్లు అంచనా.

శుద్ధి భద్రమేనా!

ఉక్రెయిన్‌, రష్యాల నుంచి దిగుమతి

పొద్దుతిరుగుడు నూనెను ఎక్కువగా ఉక్రెయిన్‌, రష్యాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మనదేశంలో గతేడాది పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర రూ.4100.  100 కిలోల గింజలను గానుగాడితే   30 నుంచి 35 కిలోల దాకా ముడి నూనె వస్తుంది. దాన్ని శుద్ధి చేసి అమ్మాలంటే లీటరు కనీసం రూ.125 అవుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ‘విజయ’ పొద్దుతిరుగుడు నూనె లీటరు ధర రైతుబజార్లలో రూ.87గా ఉంది. ఉక్రెయిన్‌లో కిలో పొద్దుతిరుగుడు నూనె టోకు ధర రూ.49.42గా ఉంది. అక్కడి నుంచి తెప్పిస్తున్నందునే లీటరు   రూ.87కు ఇవ్వగలుగుతున్నాం.
- రాజేశం, సీనియర్‌ మేనేజర్‌ ,రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య

వంట నూనెల్లో నాణ్యత ముఖ్యం

స్వచ్ఛమైన నెయ్యితో వండిన వంటలు అప్పుడప్పుడు మనం తినవచ్చు. నెయ్యిలో ఉండే పోషక విలువలు శరీరానికి అవసరం. నూనెలు, నెయ్యి ఇలా మారుస్తూ వంటలకు వాడాలి. ఏవైనా రెండు రకాల నూనెలను కలిపి వంటకు వాడితే మంచిది. పోషక విలువలు అందాలంటే గానుగలో తయారుచేసిన వేరుసెనగ లేదా శుద్ధి చేసిన తవుడు నూనె(రైస్‌ బ్రాన్‌) మంచిది. తరచూ పెద్ద మిల్లుల వారు తాము తయారు చేసిన నూనెలను మా వద్ద పరీక్ష చేయిస్తున్నారు.
- డాక్టర్‌ బి.ఎల్‌.ఎ.ప్రభావతీ దేవి, సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ భారత రసాయనాల పరిశోధన సంస్థ, హైదరాబాద్‌
- ఈనాడు, హైదరాబాదు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.