
ప్రత్యేక కథనం
సమీపిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షలు
ప్రభుత్వ బడుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు
అధిక సమయం పాఠశాలల్లోనే గడుపుతున్న విద్యార్థులు
దాతలు ముందుకొచ్చిన చోటే అల్పాహారం, చిరుతిళ్ల అందజేత
ప్రభుత్వ బడుల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు ఆకలి బాధ తప్పడం లేదు. ఉత్తీర్ణత శాతం పెంచటం, ఉత్తమ శ్రేణుల సాధన లక్ష్యంగా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున ఉదయం అల్పాహారం, సాయంత్రం చిరుతిళ్లు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలన్న పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల అమలు కొన్ని పాఠశాలలకే పరిమితమవుతోంది. ప్రధానోపాధ్యాయులు క్రియాశీలంగా పనిచేస్తున్న చోట దాతలు ముందుకు వస్తుండగా మిగిలిన చోట్ల ఖాళీ కడుపులతో పిల్లలు అవస్థలు పడుతున్నారు. కలెక్టర్లు నిధులు విడుదల చేయడం లేదా దాతలు ముందుకొస్తే తప్ప ఈ సమస్య తీరేలా కనిపించడం లేదు.
పదో తరగతి విద్యార్థులకు ప్రతియేటా నవంబరు నుంచే ఉదయం, సాయంత్రం గంట చొప్పున అదనపు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలిస్తోంది. దీని ప్రకారం ఉదయం 8.30- 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45- 5.45 వరకు, కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ సమయమే విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. సందేహాలు తీరుస్తూ పునశ్ఛరణ చేయిస్తున్నారు. ఉదయం అల్పాహారం తినకుండా బడికి వచ్చే వాళ్లూ చాలా మంది ఉంటున్నారని మూడేళ్ల క్రితం కేంద్ర కమిటీ పర్యటనలో వెల్లడైంది. సొంతూరులో ఉన్నత పాఠశాల ఉంటే కొంత వరకు ఇబ్బంది లేదు. పొరుగు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు మాత్రం అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్న భోజనం (12.30 గంటలు) తర్వాత సాయంత్రం 6 గంటల వరకూ ఏమీ తినకపోవటం వల్ల ఆకలి బాధతో చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఖర్చును భరిస్తూ సాయంత్రం పూట విద్యార్థులకు చిరుతిళ్లు అందిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు.. దాతలను గుర్తించి వారి ఆర్థిక సహకారంతో ఉదయం అల్పాహారంతో పాటు సాయంత్రం చిరుతిళ్లు సమకూరుస్తున్నారు.
కలెక్టర్లు ఉత్తర్వులు ఇస్తున్నా జాడలేని నిధులు కొన్ని జిల్లాల్లో చిరుతిళ్ల కోసం నిధులు ఇస్తామని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాంతో పలువురు ప్రధానోపాధ్యాయులు నిధులు వస్తాయనే భరోసాతో గత ఏడాది సొంత డబ్బులు ఖర్చు చేశారు. చివరకు ఆ నిధులు రాలేదు. నిజామాబాద్ జిల్లాలో అదే జరిగింది. ఉత్తర్వులిచ్చిన కలెక్టరుతో పాటు జిల్లా విద్యాశాఖాధికారి బదిలీ అయ్యారు. నిధులు కూడా రాలేదు. ‘మా పాఠశాలలో 250 మంది పదో తరగతి పిల్లలున్నారు. సొంత డబ్బులు ఖర్చు చేయాలన్నా ఇబ్బందే. అంతమంది ఉండే సరికి దాతలు కూడా వెనకడుగు వేస్తున్నారు’ అని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు. తక్కువ మంది పిల్లలున్న చోట ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా పెద్ద సమస్య కాదని చెబుతున్నారు.* ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.5 చొప్పున 100 రోజులకు నిధులు ఇస్తామని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. * మెదక్ జిల్లాలో ఫిబ్రవరి నుంచి ఒక్కో విద్యార్థికి రూ.5 చొప్పున ఖర్చు చేయనున్నారు. * వరంగల్ గ్రామీణ జిల్లాలో జనవరి 8వ తేదీ నుంచి ఒక్కొక్కరికి రూ.5 చొప్పున వ్యయం చేసేందుకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. * కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో గత ఏడాది నుంచి సరస్వతీ ప్రసాదం పేరిట సుమారు 45 రోజులపాటు చిరుతిళ్లు అందించేందుకు కార్పొరేషన్ ముందుకొచ్చింది. ఈసారి కూడా అమలు చేయాలని ఇటీవల తీర్మానించారు. |
దాతలు, ఉపాధ్యాయులు ముందుకొచ్చిన చోటే ![]() * కరీంనగర్ జిల్లా నల్లగొండలో ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్‌రెడ్డి చొరవతో గత ఏడాది నుంచి నల్లగొండ గ్రామానికి చెందిన (బ్రిటన్‌లో ఉంటున్న) ధన్నమనేని సంపత్ కృష్ణారావు అల్పాహారం ఖర్చు మొత్తాన్ని భరిస్తున్నారు. గత ఏడాది రూ.20 వేలు ఇవ్వగా ఈసారి రూ.30 వేలు అందించారు. దాంతో వారంలో ఆరు రోజుల పాటు ఇడ్లి, ఉప్మా, చపాతి/అటుకులు, సాయంత్రం ఒక్కో బిస్కెట్ ప్యాకెట్ చొప్పున ఇస్తున్నారు. * ఖమ్మం జిల్లా మధిర సీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు దయాళ్, ఉపాధ్యాయులు సాయంత్రం బిస్కెట్లు, అరటి పండ్లు లాంటివి అందజేస్తున్నారు. సత్తుపల్లి పాత సెంటర్ ఉన్నత పాఠశాలలోనూ ఉపాధ్యాయుల సహకారంతో అల్పాహారం అందిస్తున్నారు. * సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో పలు చోట్ల ప్రధానోపాధ్యాయుల చొరవతో విద్యార్థుల ఆకలి తీరుతోంది. |
![]() |
మరిన్ని

దేవతార్చన
- 20న వేటూరి విగ్రహావిష్కరణ
- భైంసాలో విషాదం.. 500 మందికి అస్వస్థత
- ఆశ్చర్యపరుస్తున్న వింత చేప
- భారీగా ఎర్రచందనం స్వాధీనం
- డబ్బుపోయిందంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యే రోదన
- శ్రీశైలానికి.. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెస్తాం
- 15 అడుగుల బొంగు చికెన్ తయారీ
- ఉపరాష్ట్రపతి రాకకు రైల్వేస్టేషన్ ముస్తాబు
- చట్ట వ్యతిరేక పనులను ఉపేక్షించం: కాగ్నిజెంట్
- గుండ్రేవులపై నివేదిక ఇవ్వండి