close

ప్ర‌త్యేక క‌థ‌నం

తాయిలాలు ఉండేనా! 

కేంద్ర బడ్జెట్‌లో జనాకర్షక పథకాలు ప్రకటిస్తారా? 
సర్వత్రా నెలకొన్న ఆసక్తి 
ఈనాడు - దిల్లీ

సిక్సర్లకా? సంప్రదాయాలకా? రానున్న బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం దేనికి ప్రాధాన్యం ఇస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ‘సిక్సర్లు’లాంటి జనాకర్షక పథకాలను ప్రకటిస్తామని ఇప్పటికే మంత్రులు వెల్లడించారు. ఎన్నికల ముందు తాత్కాలిక బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉందని, అందువల్ల దీంట్లో కీలక విధానపర నిర్ణయాలను ప్రకటించడం సంప్రదాయం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ఏ నిర్ణయం తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బడ్జెట్‌ విషయంలో మోదీ ప్రభుత్వం చాలా సంప్రదాయాలను మార్చివేసిందని, అందువల్ల కీలక ప్రకటనలు చేయకూడదన్న ఆనవాయితీని కూడా ఉల్లంఘిస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సంప్రదాయం కాగా, దాన్ని కాదని మొదటి తేదీన ప్రవేశపెడుతోంది. సాధారణ బడ్జెట్‌, రైల్వే బడ్జెట్‌లు వేర్వేరుగా ఉండగా, ఆ రెండింటినీ విలీనం చేసింది. ఆ పద్ధతిలోనే ప్రస్తుతం నడుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. 
పూర్తి స్థాయి బడ్జెట్‌ ఎందుకు ఉండదు? 
ఎన్నికల ముందు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకూడదన్నది కాలపరీక్షకు నిలిచిన సంప్రదాయంగా మారింది. మూడు నాలుగు నెలల పాటు ప్రభుత్వ వ్యయాలకు వీలు కలిగించే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ను మాత్రమే రూపొందిస్తారు. ఒక వేళ పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే... ఎన్నికల్లో అదే పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎలాంటి సమస్యా లేదు. వేరే పార్టీ గెలిస్తే ఇబ్బందులు తప్పవు. మార్పులు చేసే విషయంలో కొత్త ప్రభుత్వానికి తలనొప్పులు ఎదురవుతాయి. అంతిమంగా పన్ను చెల్లింపుదారులు సమస్యలు ఎదుర్కొంటారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కూడా నైతిక విలువలకు కట్టుబడి ఉండాలన్న సంప్రదాయం ఉంది. తాజా పరిస్థితులను పరిశీలిస్తే.. కొత్త ప్రభుత్వం మే 22లోగా ఏర్పాటు కానుంది. జులైలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందువల్ల నాలుగు నెలల వ్యయానికి అనుమతిస్తూ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ను ప్రవేశపెడితే సరిపోతుంది. దీనిపై భాజపా తిరుగుబాటు నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తగదని చెప్పారు. మరో మాజీ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ ‘‘గతంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో చిన్న చిన్న ప్రకటనలకు పరిమితమయ్యేవారు. ఈ ప్రభుత్వం సంప్రదాయాలను పట్టించుకోవడం లేదు’’ అని అన్నారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తాత్కాలిక బడ్జెట్‌లో పన్నుల చట్టాలను సవరించరాదన్న సంప్రదాయాన్ని ఉల్లంఘించి 2014-15లో పరోక్ష పన్నుల్లో మార్పులను ప్రకటించారు. 
ఎలాంటి సిక్సర్లు ఉంటాయి? 
రైతుల ప్రయోజనం కోసం రైతుబంధులాంటి పథకాన్నిగాని, మధ్యప్రదేశ్‌లో అమలు చేస్తున్న భవంతర్‌ భుగటన్‌ యోజనలాంటిదిగానీ, రెండింటిని సమ్మిళితం చేసేదిగానీ ప్రకటించే వీలుంది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది.

పూర్తిస్థాయి బడ్జెట్‌ను వ్యతిరేకిస్తాం: కాంగ్రెస్‌

దిల్లీ: పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ఎన్డీయే సర్కారు ప్రయత్నిస్తే పార్లమెంటు లోపల, వెలుపలా తీవ్రంగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే హక్కు ప్రభుత్వానికి లేదని పార్టీ అధికార ప్రతినిధి మనీష్‌ తివారీ తెలిపారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.