close

ప్ర‌త్యేక క‌థ‌నం

గుడ్డు పగలగొడతామా?

కోడిపిల్ల కష్టపడకుండా బయటకు రావాలని మనం గుడ్డును పగలగొడితే ఏమవుతుంది? మొక్క సులువుగా మొలకెత్తుతుందని విత్తనాన్ని మనమే చీలిస్తే జరిగేదేమిటి?
ఈ ప్రశ్నలు చూసి ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ప్రస్తుతం ఎంతోమంది తల్లిదండ్రుల వ్యవహారశైలి సరిగ్గా ఇలాగే ఉంటోంది. తమ పిల్లలకు ఎక్కడ ఏ కష్టం ఎదురవుతుందోనని నిరంతరం కళ్లన్నీ వాళ్ల మీదే పెట్టుకుని చూస్తూ.. వాళ్లకు ఏ చిన్న సమస్య ఎదురైనా వెంటనే రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోతున్నారు. వాటిని తామే పరిష్కరించేస్తున్నారు. పిల్లలకు ఏ కష్టం రాకుండా చూడాలని భావిస్తూ నిరంతరం ‘హెలికాప్టర్లలా’ వాళ్లను వెన్నంటి ఉంటున్న తల్లిదండ్రులు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నారనీ, దీనివల్ల పిల్లలకు మేలు జరగకపోగా వాళ్ల భవిష్యత్తు మరింత అగమ్యంగా తయారవుతోందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఈ రకం పెంపకానికి ప్రత్యేకంగా ‘హెలికాప్టర్‌ పేరెంటింగ్‌’ అని పేరుపెట్టి మరీ విశ్లేషిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీల దశ దాటి.. చివరికి ఇంటర్వ్యూలు, ఉద్యోగాల్లో కూడా పిల్లలను వెన్నాడి ఉంటూ వాళ్లకు జీవితంలో కష్టం, నష్టం, ఇబ్బంది, సవాళ్ల వంటివేమీ తెలియకుండా చేస్తున్న ఈ తరహా పెంపకం వల్ల జరుగుతున్నదేమిటి? ఇలా పెరుగుతున్న పిల్లలు నేటి కొత్త తరం ఉద్యోగాల్లో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారు?

ఈ ఆధునిక సాంకేతిక యుగంలో అతిపెద్ద పెంపక సమస్యగా తయారవుతున్న హెలికాప్టర్‌ పేరెంటింగ్‌పై సమగ్ర కథనం..


 

మీరు హెలికాప్టరా?

డ్యాన్స్‌ క్లాసు, మ్యూజిక్‌ క్లాసు, డ్రాయింగ్‌ క్లాసు, ఫ్రెంచ్‌ క్లాసు, జర్మన్‌ క్లాసు, స్కేటింగ్‌ క్లాసు, కరాటే, తైక్వాండో...
ఎంసెట్‌, ఐఐటీ, జేఈఈ... కాలేజీలు, కోచింగులు, లాంగ్‌టర్మ్‌, షార్ట్‌టర్మ్‌, హాస్టళ్లు, డేకేర్లు..
క్యాంపస్‌ ఇంటర్వ్యూలు, టెక్నికల్‌, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలు, అగ్రిమెంట్లు, ఆన్‌ సైట్‌, ఆఫ్‌ సైట్‌,
అంతేనా.. ప్రేమలు, పెళ్లిళ్లు..

... ఒకటా రెండా..!

పిల్లల్ని పెంచటమన్నది ఒకప్పటి కంటే ఇప్పుడు ‘పెద్ద వ్యవహారంగా’ తయారైన మాట వాస్తవం. పసికూన పుట్టిన దగ్గర నుంచీ తల్లిదండ్రులు వాళ్ల మీదే ఒక కన్నేసి ఉంచి.. వాళ్లు ఎటుపోతున్నా ‘హెలికాప్టర్లలా’ వాళ్ల నెత్తినే తిరుగుతూ.. వాళ్లకు ఏ ఇబ్బంది ఎదురైనా ఆగమేఘాల మీద వాలిపోవటమన్న ధోరణి పెరిగిపోతోంది. ముఖ్యంగా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఇదో ‘ఫ్యాషన్‌’గా కూడా తయారై, ఇప్పుడిదో పెద్ద సామాజిక సమస్య స్థాయికి చేరిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దీనివల్ల రేపటి తరం స్వతంత్రంగా జీవిస్తూ, సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండటం లేదు. మరోవైపు ఉద్యోగాల్లో మాత్రం వాళ్లు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా? వాళ్లకు సారధ్య సామర్ధ్యం ఉంటోందా? లేదా? అన్నది పట్టిపట్టి చూస్తున్నారు. ఇలా పెద్దల పెంపకమే పిల్లలకు ‘పెద్ద సమస్య’గా తయారవుతున్న నేపథ్యంలో దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే మొదలైంది.

ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో.. ఉద్యోగం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి 10 మందిలో ఏడుగురు ఉద్యోగానికి ఆమోదం తెలిపే ముందు తప్పనిసరిగా తమ తల్లిదండ్రులతో మాట్లాడాలని చెప్పారు. తల్లిదండ్రులను సంప్రదించటం తప్పు కాదుగానీ ఉద్యోగం చేసే వయసుకు వచ్చిన తర్వాత కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోవటమన్నది గుర్తించాల్సిన అంశమే!

ఏమిటీ ‘హెలికాప్టర్‌’ గొడవ?
పిల్లలను కాస్సేపు కూడా వదలకుండా ఎప్పుడూ వాళ్ల చుట్టూతానే తిరగుతుండటం, వాళ్లకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఎదురైనా వెంటనే జోక్యం చేసుకుని తామే పరిష్కరించేస్తుండటం.. స్థూలంగా ఇదే హెలికాప్టర్‌ పేరెంటింగ్‌! చదువుల నుంచి ఉద్యోగాల వరకూ పూర్తిగా తమ కళ్లన్నీ పిల్లల మీదే పెట్టుకుని ఉండటం వీరి ప్రత్యేకత. చిన్నతనంలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవటంలో తప్పు లేదు. కానీ పిల్లలు పెద్దవాళ్లై ‘ఉన్నత చదువులకు’ చేరుకున్న తర్వాత కూడా ఇదే ధోరణి చూపించటం సమస్యగా తయారవుతోంది. పిల్లలకు గ్రేడులు తక్కువొస్తే గొడవ చెయ్యటం, అవసరమైతే పరీక్షల్లో తమ పిల్లలకు మరికొంత సమయం ఇవ్వాలని ప్రాధేయపడటం.. జాబ్‌ మేళాలకు వెళ్లటం.. అవకాశం ఇస్తే ఇంటర్వ్యూలో తామూ కూర్చుందామన్నంత దూరం వెళుతోందీ వ్యవహారం. ఎప్పుడూ పిల్లల రక్షణ, విజయాల చుట్టే తిరుగుతూ.. వాళ్ల లోపాలను కప్పిపుచ్చటం, వాళ్లకు అసలు పరిసర ప్రపంచం తెలియకుండా చేస్తుండటం వల్ల వారిలో రకరకాల ఎదుగుదల సమస్యలు బయల్దేరుతున్నాయి. ఇదంతా తమకు ఇష్టం లేదనే వాళ్లు కూడా పక్కవారిని చూసి అనివార్యంగా ఈ ధోరణిలో పడిపోతున్నారు.

పిల్లలు పెట్టిన పేరే!

ఒక పిల్లాడు ఎప్పుడూ తనను వెన్నాడుతుండే తల్లిని ఉద్దేశించి ‘హెలికాప్టర్‌’ అనటం చూసి విస్తుబోయాడు డా।। హెయిమ్‌ గినాట్‌. ఈ స్ఫూర్తితో ఆయనే ఈ ‘హెలికాప్టర్‌ పేరెంట్‌’ అనే పదాన్ని తొలిగా 1969లో వాడారు.

హెలికాప్టర్‌ పెంపకం.. మగపిల్లల కంటే కూడా ఆడపిల్లల మీద మరీ ఎక్కువగా కనబడుతోంది.

నేటి నవ యువతరం (మిలీనియల్స్‌)లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది.

ఇలా పెరిగిన పిల్లలు ఉద్యోగాల్లో చాలా ఇబ్బందులుపడుతున్నారని 2014 అధ్యయనం ఒకటి గుర్తించింది. పెద్ద చదువులున్నా ప్రాజెక్టు లీడర్లు, సీఈవోల వంటి పెద్ద ఉద్యోగాల్లో విఫలమైపోతున్నారు.

నా తల్లిదండ్రులకు నేను కాకుండా మరో వ్యాపకం ఏదైనా ఉండుంటే బాగుండేది.
- ఓ పిల్లాడి ఆవేదన.

మీ పిల్లలు స్థిరంగా నేల మీద నిలబడాలని అనుకుంటున్నారా? వాళ్ల భుజాల మీద కొద్దిగా బరువు బాధ్యతలు మోపండి!
- ఓ నిపుణుడి సూచన

తల్లిదండ్రులుగా మన పని.. పిల్లల పనుల నుంచి సాధ్యమైనంత త్వరగా వైదొలగటం!
- ఓ విజ్ఞుడి సలహా

పెద్దల తప్పు.. పిల్లల మూల్యం

పిల్లలు తప్పుచెయ్యకుండా చూడాలని, వాళ్లు ఎలాంటి విషాదాల్లోనూ చిక్కుకోకుండా ఉండాలన్న ధోరణి వెనక ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ పిల్లల సమస్యలను ఎప్పుడూ తల్లిదండ్రులే తీర్చేస్తూ పెద్ద రక్షణ గోడలా నిలబడుతుండటం వల్ల పిల్లలకు అపార నష్టం జరుగుతోంది.

కష్టం, ఇబ్బంది తెలియకుండా పెరుగుతున్న పిల్లల్లో పరిస్థితులను అర్థం చేసుకోవటం, వాటితో తలపడటం, తమ వివేచన ఉపయోగించి వాటిని అధిగమించటమన్న నైపుణ్యం కొరవడుతోంది. జీవితంలో ఏదైనా సమస్య, కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తెలియక అయోమయంలోకి జారిపోతున్నారు. కాలేజీ దశకు వచ్చినా సొంతగా ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేరు. ఇతరులతో మాట్లాడటం కష్టం, సొంతగా ఏదైనా పనికి పూనుకోలేరు, ఏదైనా పనికి పూనుకున్నా వైఫల్యం వెన్నాడుతుందేమోనని భయం. ఆ వైఫల్యాన్ని ఎలా తీసుకోవాలో తెలియక సతమతమైపోతుంటారు. చివరకు ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో కూడా పిల్లలు ఒక నిర్ణయం తీసుకోలేని దశకు, అన్నింటికీ తల్లిదండ్రుల మీదే ఆధారపడే పరిస్థితికి చేరుకుంటున్నారు. మరోవైపేమో ఉద్యోగాల్లో నిర్ణయాత్మక శక్తికి, స్వతంత్ర ఆలోచనలకు, బృంద సారధ్యానికి, ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఉద్యోగాల్లో కూడా తీవ్ర ఇబ్బందులు, విమర్శలను ఎదుర్కొంటున్నారు.

... ఇవీ నష్టాలు
* పిల్లలు ఆధారపడటానికి అలవాటుపడిపోతారు.
* సవాళ్లను ఎదుర్కోరు కాబట్టి ఆత్మస్థైర్యాన్ని పెంచుకోలేరు.
* వైఫల్య భయం, ఎప్పటికీ బాధ్యత తెలీదు
* ఆత్మవిశ్వాసం తక్కువ, తప్పుల నుంచి నేర్చుకోరు.
* ఇబ్బందులను తట్టుకునే సామర్థ్యం తక్కువ.
* తాము చాలా ప్రత్యేకం, తమకన్నీ అందించాలన్న ధోరణి పెరుగుతుంది. ఇవి దక్కకుంటే తిక్కతిక్కగా ప్రవర్తిస్తుంటారు.
* పెద్దయిన తర్వాత కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. సంతోషం ఉండదు. పొగ, మద్యం వంటి వ్యసనాలకూ బానిసలవుతున్నారు.

పుట్టక ముందే ఆరంభం!

అసలు ఇటీవలి కాలంలో ‘హెలికాప్టర్‌ పేరెంటింగ్‌’ అన్నది బిడ్డ తల్లి పొట్టలో ఉన్నప్పుడే మొదలవుతోందంటున్నారు నిపుణులు. తల్లికి గర్భం వస్తూనే.. ‘మాంఛి బిడ్డ పుట్టేందుకు ఏం తినాలి, ఏం చెయ్యాలన్న తాపత్రయం’తో ఆరంభమవుతోంది. దీనికోసం విపరీతంగా సమాచారాన్ని సేకరించటంతో పాటు ఇక బిడ్డ పుట్టిన దగ్గర నుంచీ ప్రతిదీ వాళ్లకు ‘బెస్ట్‌’ మాత్రమే అందుబాటులో ఉంచాలని ప్రయత్నించటం, ‘రేటింగ్‌’లు చూసి ఉన్న వాటిలో ‘బెస్ట్‌ స్కూల్‌’ కోసం వెంపర్లాడటం, చేర్చిన దగ్గర నుంచీ ఒలింపియాడ్‌లు, స్పెల్‌బీలూ, స్పోర్ట్స్‌ మీట్‌లు.. ఇలా ప్రతి పోటీలోనూ పిల్లలు ‘ట్రోఫీ’లతోనే ఇంటికి రావాలని చూడటం.. ఇలా ఆశలు, ఆంక్షలు పెంచటంతో పిల్లలకు స్వేచ్ఛ అన్నది తగ్గిపోవటం మొదలవుతుంది.

ఇవీ లక్షణాలు!

పిల్లలు ఇప్పటికే చేసుకోగలిగిన, దాదాపు తామే నిర్వహించుకోగలిగిన పనులను కూడా తల్లిదండ్రులే చేసిపెడుతుండటం హెలికాప్టర్‌ పెంపకం ప్రధాన లక్షణం! మరికొన్ని..

అన్నింటా బెస్ట్‌: అన్నింటా తమ పిల్లలు అత్యుత్తమంగానే ఉండాలన్న ధోరణితో చివరికి అన్నీ తామే చేసిపెడుతుండటం. దీనివల్ల పిల్లలు సొంతగా చేసుకోవటం మానేసి.. ఉత్తమమైనవన్నీ అయాచితంగా పొందటానికి అలవాటు పడుతుంటారు.

సంప్రదింపులు: పిల్లలు తప్పులు చేస్తే చేశారు, దాన్నుంచి నేర్చుకుంటారన్న వాస్తవాన్ని విస్మరించి టీచర్లు, బాస్‌లతో మాట్లాడి పిల్లలకు కావాల్సినవి దక్కేలా చూస్తుండటం

రక్షణగా ఉండటం: సెక్యూరిటీ గార్డుల్లా ఎప్పుడూ పిల్లల వెనకే ఉంటూ వాళ్లను కొన్ని రకాల ఆటలు ఆడనివ్వకుండా చూస్తుండటం, ఇతర పిల్లలతో గొడవలొస్తే వాళ్లను ఎదుర్కొననివ్వకుండా తామే బరిలో దిగి సరిచేస్తుండటం.

అతి సాయం: హోంవర్కు వంటివన్నీ తమ జోక్యం, ప్రమేయంతోనే జరిగేలా చూడటం,  పిల్లలేదైనా మర్చిపోయి స్కూలుకు వెళితే వెంటనే వెళ్లి ఇచ్చి రావటం

అతి ఆశ: పిల్లలను రకరకాల క్లాసుల్లో చేర్చేసి, వాళ్లు ఎప్పుడేం చెయ్యాలో రోజంతా టైమ్‌టేబుల్‌ వేసి, పనుల జాబితాలు సిద్ధం చేసేస్తుండటం.

జబ్బుల భయం: కొంత తక్కువే అయినా తమ పిల్లలకు సూక్ష్మక్రిములు, జబ్బులు ఎక్కడ అంటుకుంటాయోనని అతిశుభ్రంగా చూస్తుండటం.

బయటపడేదెలా?

పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు హెలికాప్టర్‌ పేరెంటింగ్‌ మంచిది కాదన్నది అంతా అంగీకరిస్తున్న వాస్తవం. పిల్లలకు నిజంగా అవసరమైతే సాయం చెయ్యటమన్నది తల్లిదండ్రుల విధి కూడా. కానీ ఎంతవరకూ సాయం చెయ్యాలి? ఏది అతి అన్నది తేల్చుకోవటం కష్టమే అయినా అవసరం. పిల్లల పెంపకంలో మన పాత్ర ఎంత వరకూ అన్న అవగాహన ముఖ్యం.

మీరే చెయ్యకండి: వాళ్ల హోంవర్కు వాళ్లను చెయ్యనీయండి. సమాధానాలు మీరే చెప్పెయ్యకుండా వాళ్లను ఆలోచించనివ్వండి. వాళ్లనే పరిష్కారాలు కనుక్కోనివ్వండి.
పర్యవసానాలు చూడనివ్వండి: పిల్లలు ఏదైనా మర్చిపోతే పరుగెత్తుకుంటూ వెళ్లి ఇవ్వటం కాకుండా.. దాని పరిణామాలేమిటో వాళ్లనే ఎదుర్కోనివ్వండి. ఇలాంటి చిన్నచిన్న పొరపాట్ల నుంచే వాళ్ల వ్యక్తిత్వం బలపడి, ఒక రూపానికి వస్తుందని గుర్తించండి.

లక్ష్యాలు వాళ్లవే: ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో మీరే వాళ్లకు లక్ష్యాలు పెట్టటం కాకుండా.. తాము అనుకున్నది సాధించుకునేలా వాళ్లకు ఒక దారి చూపండి.

వైఫల్యం ఓకే: పిల్లలు చేసే ప్రతి తప్పూ.. కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు ఒక అవకాశం. మీరు చేసిన తప్పుల నుంచి మీరెలా నేర్చుకున్నారో వాళ్లకు వివరించి చెప్పండి.
పదును పెట్టాలి: ఏదైనా సమస్య ఎదురైతే ఇలా చెయ్యి అని చెప్పటం కాకుండా.. పిల్లలు చెప్పేది శ్రద్ధగా వింటూ ‘నువ్వేమనుకుంటున్నావ్‌?’ ‘నీ ఆలోచన ఏమిటి?’ అని అడుగుతుండాలి. పిల్లల నుంచి మరీ అతిగా ఆశించొద్దు. పర్యవసానాలు ఎలా ఉండొచ్చో చర్చిస్తూ నిర్ణయాలు తీసుకునే అవకాశం వారికే ఇవ్వటం అవసరం. పిల్లలతో కలిసి పని చేయాలి. నిజానికి ప్రతి క్లిష్టమైన సందర్భమూ పిల్లల్లోని శక్తియుక్తులను బయటకు తెస్తుంది. వాళ్ల సత్తా పెంచుతుంది. మనం పిల్లలకు రకరకాల పజిల్స్‌ వంటివి ఇవ్వటం కూడా ఇందుకే. వాటిని పరిష్కరించిన ప్రతిసారీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తమకంటూ ఓ బలమైన గుర్తింపును తెచ్చుకుంటారు.

కష్టమేగానీ..: హెలికాప్టర్లలా వెంట తిరుగుతూ పిల్లలకు సాయం చెయ్యటానికి అలవాటుపడిపోయిన తల్లిదండ్రులు.. ఒక్కసారిగా దాన్నుంచి దూరంగా జరగటమన్నది చాలా కష్టం. పైగా దూరం జరిగితే పిల్లల పరిస్థితేమిటన్న భయం కూడా వెన్నాడుతుంటుంది. కాబట్టి మెల్లగా రోజూ మీరు చేసిపెడుతున్న పనులనే క్రమేపీ పిల్లలు చేసుకునేలా ప్రోత్సహించటం మొదలు పెట్టాలి. ఆ పనులు చేసుకోవటంలో వాళ్లు కిందమీదలవుతుంటే.. అవ్వనివ్వండి. క్రమేపీ వాళ్ల మీద నియంత్రణ తగ్గించి.. వాళ్ల పని వాళ్లు చేసుకునేలా చూస్తున్న కొద్దీ వాళ్లు మరింత బాధ్యతాయుతంగా తయారవుతారు. కంగారుపడకండి.. కష్టనష్టాల్లో అండగా నిలబడే పెద్దలుగా వాళ్ల జీవితాల్లో మీ పాత్ర, అవసరం ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాబట్టి వాళ్ల జీవితాల్లో మనం అప్రధానమైపోతామేమోనని భయపడాల్సిన పనేం లేదు!
 

ప్రపంచీకరణ తర్వాత అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగిపోయింది. నేటి ప్రపంచం ‘వొలటైల్‌, అన్‌సర్టైన్‌, కాంప్లెక్స్‌, యాంబిగ్యుయస్‌’గా (వీయూసీఏ-వ్యూకా) తయారైందని అంటున్నారు నిపుణులు. ఈ అనిశ్చితి, సంక్లిష్టతల మధ్య నెగ్గుకురావాలంటే విశ్లేషణా సామర్థ్యం, పరిష్కార నైపుణ్యాలే కీలకంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో హెలికాప్టర్‌ పెంపకంలో పెరిగిన పిల్లలు తుపానులో చిక్కుకున్న నావలా కదిలిపోవటం తథ్యం!

పరువు - పెంపకం

పిల్లలు ఎక్కడా వెనకబడకూడదన్న ఆందోళన, పోటీల్లో వెనకబడితే తమ పరువు ఏమవుతుందన్న భయం, పిల్లలకు చేతనైనంత రక్షణ ఇవ్వాలన్న తాపత్రయం.. ఇవన్నీ కలిసి హెలికాప్టర్‌ పేరెంటింగ్‌ పెరిగేలా చేస్తున్నాయి. దీనికి తోడు ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా పిల్లల కదలికలను అనుక్షణం కనిబెట్టుకుని ఉండే వీలుండటం దీనికి పెద్ద ఊతమైంది. ఆర్థికంగా పిల్లల మీద బోలెడంత వెచ్చిస్తున్నాం, దానికి తగిన ఫలితం లేకపోలే ఎలాగన్న భావనా పెరుగుతోంది. వీటన్నింటినీ మించి మన పిల్లలు ముందంజలో ఉంటేనే సమాజంలో మనకు గుర్తింపు, విలువ ఉంటాయన్న భావన.. మన ప్రతిష్ఠ పెంచుకునేందుకు పిల్లల విజయాన్ని కొలమానంగా చూడటం కీలకమైన అంశాలు. పిల్లల ప్రవర్తనకు తామే బాధ్యులమని, పిల్లలకు ఎలాంటి ఒత్తిడీ లేని వాతావరణం కలిగిస్తే వాళ్లు హాయిగా పెరుగుతారని భావిస్తుండటం, పిల్లలకు ఎంత ఎక్కువ సాయం చేస్తే అంత మేలు జరుగుతుందని నమ్ముతుండటం, పిల్లలు కష్టపడుతుంటే తల్లిదండ్రులుగా చూస్తూ ఎలా ఉంటామని ఆలోచిస్తుండటం.. చిన్నతనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు తమ పిల్లలు ఎదుర్కొనకూడదన్న అత్యాశ.. ఇవన్నీ కలిసి తల్లిదండ్రులను హెలికాప్టర్లుగా మార్చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు!

* చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైనవి చేసిపెట్టటంలో సంతోషాన్ని వెతుక్కుంటారు. దీంతో పిల్లలు స్వతంత్రంగా ఎదుగుతుంటే.. పిల్లలకు ఎక్కడ తమ అవసరం లేకుండా పోతుందోనన్న భయం వెన్నాడుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు టీనేజీలోకి వెళుతున్న కొద్దీ వీరిలో ఈ ఆందోళన ఇంకా పెరుగుతుంటుంది. పిల్లలు వద్దని వారిస్తున్నా, పిల్లలు ఇష్టపడకపోతున్నా కూడా వాళ్ల వెంట ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లక్షణం.

* ఆశ్చర్యమేమంటే చాలామంది ‘హెలికాప్టర్‌’ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎవరూ చెయ్యనంతగా తాము చేస్తున్నామని, పిల్లలకు ఎక్కడా సందేహాలు, సమస్యలు లేకుండా పెంచుతున్నామని సంతోషపడుతుంటారు. కానీ ఈ ధోరణే సమస్యలన్నింటికీ మూలమని, దీనివల్ల పిల్లలు నిజ జీవితంలో తలెత్తే ‘అనిశ్చితి’ని, నెగ్గుకురాలేకపోతున్నారని నిపుణులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.

 

తల్లిదండ్రుల్లో మీరే రకం?

లాన్‌మూవర్‌ పేరెంట్‌
మన పార్కుల్లో గడ్డిలాంటివన్నీ కత్తిరించి, నేలను సాఫు చేస్తుండే ‘లాన్‌మూవర్‌’ యంత్రం తెలుసుగా.. సరిగ్గా తల్లిదండ్రుల్లోనూ అలాంటి రకం ఉంటారు! పిల్లలకు సహజంగా ఎదురయ్యే చిన్నచిన్న ఇబ్బందులు, సవాళ్లను కూడా తామే వెంటనే పరిష్కరించేసి.. వాళ్లకు ఏ ఇబ్బందీ తెలియకుండా దారి సులువు చేస్తుంటారు. ఇందుకోసం ఎంత దూరమైనా వెళుతుంటారు. పిల్లల పనులను వీళ్లే చేసిపెట్టేస్తుండటంతో.. పిల్లలు అసలు ఇబ్బందులంటే ఏమిటో కూడా తెలియకుండా పెరుగుతారు.

హెలికాప్టర్‌ పేరెంట్‌
నిరంతరం పిల్లల మీదే కన్నేసి ఉంటూ.. వాళ్లకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఎదురైనా వెంటనే ‘హెలికాప్టర్లలా’ రెక్కలు కట్టుకుని వాలిపోతూ సాయం చేసేస్తుంటారు. దీంతో ఈ పిల్లలు అసలు ముప్పులను, సవాళ్లను ఎలా ఎదుర్కొనాలన్నది తెలియకుండానే పెరిగేస్తుంటారు. నిజానికి పిల్లలు తమకు తాముగా పరిష్కరించుకోగలిగిన సమస్యల్లో కూడా తల్లిదండ్రులు వేళ్లు పెట్టేస్తుంటారు. ఈ అతి జోక్యం.. పిల్లలు కాలేజీలు, ఉద్యోగాల్లోకి వెళ్లినా కూడా కొనసాగుతోంది.

ఫ్రీ-రేంజ్‌ పేరెంట్‌
చిన్నవయసు నుంచే పిల్లల్ని కాస్త స్వేచ్ఛగా, ఒంటరిగా వదులుతుంటారు. స్కూలుకు లేదా దగ్గర్లోని పార్కుకు వాళ్లనే వెళ్లనిస్తారు. కావాల్సిన వస్తువులేవో పిల్లలే స్వయంగా కొనుక్కునేలా అనుమతిస్తారు. ఈ స్వేచ్ఛ వల్ల పిల్లలు చిన్నతనం నుంచే స్వతంత్రంగా, ఇతరుల మీద ఆధారపడకుండా పెరుగుతారన్నది వీళ్ల విశ్వాసంగానీ దీనివల్ల కొన్నిసార్లు పిల్లలు ప్రమాదాల్లో చిక్కుకోవచ్చనీ, నిర్లక్ష్యానికీ గురవ్వచ్చన్న విమర్శలున్నాయి.

అటాచ్‌మెంట్‌ పేరెంట్‌
పిల్లలతో అత్యంత సన్నిహితంగా, ఒకరకంగా ఎప్పుడూ వాళ్లను అంటిపెట్టుకునే ఉండాలని తపిస్తుంటారు. టైమ్‌ ప్రకారం పిల్లలకు కావాల్సినవి అమర్చటం కాకుండా.. వాళ్లను దగ్గరగా గమనిస్తూ, అవసరాలకు తగినట్లు స్పందిస్తుంటారు. పిల్లలకు తామే ఆదర్శంగా ఉండాలన్నది వీరి ప్రయత్నం. పిల్లలు మంచి పనులు చేస్తే బహుమతులు ఇవ్వటం, తప్పులు చేస్తే ఆ ప్రోత్సాహకాలను ‘కట్‌’ చేయటం వంటి ‘పాజిటివ్‌ డిసిప్లిన్‌’ సూత్రాలను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు.

టైగర్‌ పేరెంట్‌
అన్నింటిల్లోనూ తమ పిల్లలు అత్యుత్తమ ప్రతిభనే కనబరచాలని, ప్రతిదాన్లో వాళ్లే ‘బెస్ట్‌’గా ఉండాలని ఆదేశిస్తుంటారు. ఖాళీ సమయాల్లో కూడా పిల్లలేం చెయ్యాలన్నది వీళ్లే నిర్దేశిస్తుంటారు. పిల్లల నుంచి చాలా ఎక్కువగా ఆశిస్తూ, కొంత అధికారమూ చెలాయిస్తుంటారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు పిల్లలే స్పందించాలని భావిస్తుంటారు. తమ ప్రేమను పిల్లలే దక్కించుకోవాలన్నట్టు, అందుకు వాళ్లు అర్హత సాధించాలన్నట్టు ఉంటుంది వీళ్ల ధోరణి.

ఎలిఫెంట్‌ పేరెంట్‌
టైగర్‌ పేరెంటింగ్‌కు వీళ్లు పూర్తి భిన్నం. పిల్లలతో చాలా గాఢమైన అనుబంధాన్ని పెంచుకుని.. మానసికంగా చాలా దగ్గరగా ఉంటారు. 7, 8 ఏళ్లొచ్చినా పిల్లలను వేరుగా పడుకోబెట్టటానికిగానీ, వాళ్ల మీద ఏ సందర్భంలోనూ గొంతెత్తేందుకు గానీ ఇష్టపడరు. చదువుల్లోనూ, ఆటల్లోనూ పిల్లలను ప్రోత్సహించేందుకు, వాళ్ల విజయాలను స్ఫూర్తినిచ్చేలా మలిచేందుకు ప్రాధాన్యం ఇస్తారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.