close

ప్ర‌త్యేక క‌థ‌నం

సామాన్యుడి గూడు.. సాంకేతిక తోడు

 రెండు పడకగదుల ఇళ్లకు కొత్త పరిజ్ఞానం
 షీర్‌వాల్‌, టన్నెల్‌ ఫామ్‌, ప్రీకాస్ట్‌ విధానాల్లో నిర్మాణం
 వేగంగా, నాణ్యంగా పనుల పూర్తి
 భూకంపాలకూ చెక్కుచెదరవంటున్న నిపుణులు

 ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి భారీ సంఖ్యలో నిర్మిస్తున్న రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కొత్త సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రయోగాత్మకంగా షీర్‌ వాల్‌, టన్నెల్‌ ఫామ్‌, ప్రీకాస్ట్‌ విధానాల్లో గృహ నిర్మాణం చేపట్టారు. ఈ ఇళ్లు నాణ్యంగా ఉంటాయని, భూకంపాలకు కూడా చెక్కుచెదరవని ఇంజినీర్లు చెబుతున్నారు.

సంప్రదాయ పద్ధతిలో మొదట ఉక్కు, కాంక్రీటుతో పిల్లర్లు నిర్మిస్తారు. దానిపై శ్లాబ్‌ వేశాక ఇటుకలతో గోడలు కట్టి ప్లాస్టింగ్‌ చేస్తారు. దీనివల్ల భవన నిర్మాణం ఆలస్యమవుతుంది. మానవవనరుల అవసరమూ ఎక్కువే. వీటిని అధిగమించి ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని తెలంగాణ సర్కారు భావించింది. నూతన విధానాల్లో ఇళ్లను నిర్మించడంపై అధ్యయనం చేసేందుకు గత జనవరిలో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, చీఫ్‌ ఇంజినీరు, గృహ నిర్మాణశాఖ సీఈ, ప్రజారోగ్యశాఖ ఈఎన్‌సీ, ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆమోదం మేరకు ప్రభుత్వం కొన్ని ఇళ్లను నూతన విధానాల్లో చేపట్టింది.

ప్రీ కాస్ట్‌ పద్ధతి

భవన నిర్మాణానికి అనుగుణంగా ముందే గోడలను తయారు చేయిస్తారు. వీటిని ఒక్కొక్కటిగా క్రేన్‌ సాయంతో అమర్చి ఇంటిని పూర్తి చేస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని దుండిగల్‌లో 13 బ్లాకుల్లో 1,512 ఇళ్లను ఈ తరహాలో నిర్మిస్తున్నారు.

షీర్‌ వాల్‌ విధానంలో..

తొలుత భూమిలో రాతిపొరలు తగిలే వరకు తవ్వుతారు. అక్కడి నుంచి కాంక్రీట్‌తో పునాది వేస్తారు. దానిపై ఉక్కు చువ్వలను అమర్చి చుట్టూ అల్యూమినియం షీట్స్‌ వేస్తారు. వాటి లోపల కాంక్రీట్‌ మిశ్రమాన్ని నింపుతూ గోడలు, స్లాబ్‌ను ఏక కాలంలో నిర్మిస్తారు. అవసరమైన చోట తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు, విద్యుత్తు తీగలు, నీటి పైపుల ఏర్పాటుకు ఖాళీలు వచ్చేలా ముందుగానే డిజైన్‌ చేస్తారు. గోడల గట్టిదనాన్ని పరీక్షించాక అల్యూమినియం షీట్స్‌ను తొలగించి పై అంతస్తులను నిర్మిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని దుండిగల్‌లో 8 బ్లాకుల్లో 864 ఇళ్లను షీర్‌ వాల్‌ విధానంలో గత మార్చిలో చేపట్టారు. 60 శాతం నిర్మాణం పూర్తయింది. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో 30 ఇళ్లు ఈ విధానంలో నిర్మిస్తున్నారు.

 

మొదటిసారిగా టన్నెల్‌ ఫామ్‌

టన్నెల్‌ఫామ్‌ విధానం షీర్‌ వాల్‌ వంటిదే. ప్రభుత్వ రంగ నిర్మాణాలకు ఈ విధానాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఇక్కడ అల్యూమినియం షీట్స్‌కు బదులు ప్రత్యేకంగా రూపొందించిన టన్నెల్‌ ఫామ్స్‌ను అమరుస్తారు. పంప్‌ ద్వారా కాంక్రీట్‌ నింపుతూ మూడు వైపులా గోడలు, శ్లాబ్‌ నిర్మిస్తారు. 16 గంటల తరువాత క్రేన్‌తో టన్నెల్‌ ఫామ్స్‌ను తొలగించి పై అంతస్తుపై అమర్చి నిర్మాణాన్ని కొనసాగిస్తారు. నాలుగో వైపు ఇటుకలతో గోడను పూర్తిచేస్తారు. టన్నెల్‌ ఫామ్స్‌ను టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నారు. భవనాల డిజైన్‌ను మద్రాసు ఐఐటీలో డిజైన్‌ చేయించారు. జీహెచ్‌ఎంసీలోని రాంపల్లిలో 52 బ్లాకుల్లో 6,240 ఇళ్ల నిర్మాణానికి ఈ విధానాన్ని వినియోగిస్తున్నారు. ఒక్కో అంతస్తులో 12 ఇళ్లు ఉంటాయి. గత ఏడాది ఫిబ్రవరిలో చేపట్టిన ఈ ఇళ్లను వచ్చే మే నెలలోగా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

‌ఇవీ అనుకూలతలు

* ఒకేచోట పెద్ద మొత్తంలో ఇళ్లను నిర్మించడానికి ఈ నూతన విధానాలు అనుకూలంగా ఉంటాయి.
* భవనాలకు ఎలాంటి పగుళ్లు రావు.
* భూకంపాలనూ తట్టుకుంటాయి.
* ఇళ్లను నాణ్యంగా, వేగంగా నిర్మించవచ్చు.
* 120 గృహాలుండే ఒక్క బ్లాక్‌ను టన్నెల్‌ ఫామ్‌ విధానంలో 40 నుంచి 45 రోజుల్లో పూర్తి చేస్తున్నామని ఇంజినీర్లు చెబుతున్నారు.
ఈ ఇళ్లు ఆశాజనకంగా ఉంటే రాష్ట్రంలో మరికొన్ని చోట్ల నూతన విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం భావిస్తోంది.

తక్కువ సమయంలో ఎక్కువ ఇళ్లు

సాధారణ పద్ధతుల్లో నిర్మించే ఇళ్లకు కార్మికుల అవసరం ఎక్కువగా ఉంటుంది. సెంట్రింగ్‌ పనులు, ఇటుకలతో గోడల నిర్మాణం, ప్లాస్టింగ్‌ తదితర పనులకు ఎక్కువ సమయం పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తే తక్కువ సమయంలో నాణ్యమైన ఇళ్లను నిర్మించొచ్చు. ప్రకృతి విపత్తులు సంభవించినా ప్రాణ, ఆస్తినష్టం ఉండదు.

- వెంకటదాసు, ఎ.కృష్ణయ్య, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, గృహ నిర్మాణశాఖ, జీహెచ్‌ఎంసీ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.