close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఇది చర్చను రేపిన బడ్జెట్టూ.. 

ఓట్‌ ఆన్‌ అకౌంటా? అంతకుమించా? 
జైట్లీ వ్యాఖ్యలతో విపక్షాలకు అనుమానం

ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్న కొన్ని సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంది. దేశ విశాల హితం దృష్ట్యా- ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్‌ ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’కు మించి ఉండొచ్చు.

- అరుణ్‌జైట్లీ సంకేతాలు

మోదీ సర్కారు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. అది ఏడు దశాబ్దాలుగా పాటిస్తున్న పార్లమెంటరీ సంప్రదాయాలు, నిబంధనల్ని దారుణంగా ఉల్లంఘించడమే. ఐదేళ్ల పదవీ కాలానికి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆరో ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎలా ప్రవేశపెడుతుంది?

- కాంగ్రెస్‌ మండిపాటు 

డ్జెట్‌ వచ్చేస్తోంది. ఇది ‘తాత్కాలికానికి మించి’ ఉండొచ్చన్న అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ‘బడ్జెట్‌ ఏడాది’ మొత్తం అధికారంలో ఉండని ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను కాకుండా.. రెండు మూణ్నెల్ల కాలానికి ప్రభుత్వ ఖర్చుల కోసం ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ను ప్రవేశపెట్టడం సంప్రదాయంగా వస్తోంది. భారీ పథకాల ప్రకటన, పన్నుల్లో మార్పుల్లాంటివి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో ఉండవు. ఆ సంప్రదాయానికి భిన్నంగా.. బడ్జెట్‌లో ‘ఎన్నికల తాయిలాల’కు భాజపా సర్కారు ప్రణాళికలు వేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. నరేంద్రమోదీ సర్కారు ఇప్పటికే ఐదుసార్లు సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని, ఆరోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ సమర్పణకు ఈ సర్కారుకు ప్రజామోదం లేదనేది విపక్షాల వాదన. ..ఇంతకీ ఈ చర్చకు కారణమైన ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ అంటే ఏమిటి? దేన్ని తాత్కాలిక బడ్జెట్‌ అంటారు? పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెడతారు? అనేవి ఆసక్తికర అంశాలు.

సంచిత నిధి అంటే... 

ప్రభుత్వ రాబడుల మొత్తాల్ని జమచేసే నిధిని సంచిత నిధి అంటారు. సంచిత నిధి నుంచి ప్రభుత్వం డబ్బును వినియోగించుకోవాలంటే పార్లమెంటు ఆమోదం ఉండాలని  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 266 నిర్దేశిస్తోంది.

తాత్కాలిక బడ్జెట్‌ అంటే.. 

తాత్కాలిక బడ్జెను పూర్తిస్థాయి/తాత్కాలిక ప్రభుత్వం.. ఇలా ఎవరైనా ప్రవేశపెట్టొచ్చు. అయితే సాధారణ ఎన్నికలకు వెళుతున్న ఏడాదిలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా ఒనగూడే రాబడులు, వ్యయాల పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ తాత్కాలిక పద్దులో పొందుపరుస్తారు. అతిపెద్ద విధాన నిర్ణయాలు ఇందులో ఉండవు. 

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ అంటే... 

దీన్నీ తాత్కాలిక బడ్జెట్‌గానే పిలవొచ్చు. కాకపోతే చిన్నపాటి సాంకేతిక తేడా ఉంటుంది. తాత్కాలిక బడ్జెట్‌లో ఆదాయ, వ్యయాలు.. ఈ రెండింటి ప్రస్తావన ఉంటుంది. ‘ఓట్‌ అన్‌ అకౌంట్‌’లో ప్రభుత్వ ఖర్చుల గురించిన ప్రతిపాదనలు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వం ఎన్నికలకు వెళుతున్న సంధి సమయంలో- తాత్కాలిక ఖర్చుల కోసం సంచిత నిధి నుంచి డబ్బును విత్‌డ్రా చేయడానికి పార్లమెంటు ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతిని ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ అంటారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, రుణాలపై వడ్డీ చెల్లింపులు, రాయితీలు, పింఛన్లు.. ఇత్యాది ఖర్చుల కోసం ప్రభుత్వానికి పార్లమెంటు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సహజంగా మూణ్నెల్ల కాలానికి అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి, పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే వరకు ఈ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ అమల్లో ఉంటుంది. ప్రత్యక్ష పన్నుల్లో మార్పులు చేసే అధికారం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు ఉండదు. అందుకే కొత్త పథకాలు, పన్నుల్లో మార్పుల్లాంటి వాటిని ఓట్‌ అన్‌ అకౌంట్‌లో ప్రస్తావించరు. పైపెచ్చు ఎన్నికలకు ముందున్న ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆ తర్వాత ఏర్పడే ప్రభుత్వ ప్రాధాన్యతలు మరోలా ఉండొచ్చు. మొత్తం ఆర్థిక సంవత్సరం ఆదాయ వ్యయాల్ని ఎన్నికల కన్నా ముందుగానే అంచనావేసి.. దానిని బడ్జెట్‌లో చూపడం అసంబద్ధమవుతుంది.

తాత్కాలిక బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చా? 

ప్రత్యక్ష పన్నుల్లో ఏవైనా మార్పులు చేయాలంటే అది ఆర్థిక బిల్లు ద్వారా మాత్రమే సాధ్యం. ఆ మేరకు ఫైనాన్స్‌ బిల్లులో కేటాయింపుల్ని చూపాల్సి ఉంటుంది. ఆర్థిక బిల్లును తాత్కాలిక బడ్జెట్‌లో ప్రవేశపెట్టడం కుదరదని, కొత్త పథకాలను వ్యయాల ప్రకటనలో చూపలేమని మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌సిన్హాలాంటి వారు అంటున్నారు. ఆర్థిక బిల్లులో పన్ను మార్పులు లేదా కొత్త పథకాల్ని ప్రవేశపెట్టడం ద్వారా వ్యయ ప్రకటనలు చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమని సిన్హా అంటున్నారు. కేటాయింపుల్లేకుండా బడ్జెట్‌లో ప్రోత్సాహక ప్రకటనలు చేస్తే అది ఎన్నికల మేనిఫెస్టోలాగా ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యక్ష పన్నుల్లో మార్పులుండవు కాబట్టి.. ఆదాయపు పన్నులో మినహాయింపులాంటి ఊరటను సగటు జీవి ఆశించడం వృథా. అయితే తాత్కాలిక బడ్జెట్‌లో పరోక్ష పన్నుల్లో స్వల్ప మార్పులు చేసే వెసులుబాటు ఉంటుంది. వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లోకి వచ్చిన తర్వాత- దీనికీ ప్రాధాన్యం లేకుండా పోయింది. 

సంప్రదాయాన్ని ఆర్థికమంత్రి ఉల్లంఘిస్తారా? 

ఎన్నికలకు వెళుతున్న ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ను మాత్రమే ప్రవేశపెట్టడం రివాజు. కానీ అరుణ్‌జైట్లీ ప్రకటన తర్వాత- ఈ బడ్జెట్‌ను ఎన్నికల తాయిలాలకు వేదికగా ప్రభుత్వం మలుచుకుంటోందని, రైతులకు వరాలు, ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య పథకం అమలు, వేతన జీవికి పన్ను ఊరటలాంటి కొన్ని ప్రకటనల్ని చేయొచ్చని విపక్షాలు అనుమానిస్తున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్‌ సంప్రదాయాన్ని ఫిబ్రవరి ఒకటో తేదీకి మార్చిన ఈ సర్కారు- ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ సంప్రదాయాన్నీ ఉల్లంఘించొచ్చని విపక్షాలు అనుమానిస్తున్నాయి.

పూర్తిస్థాయి బడ్జెట్‌ అంటే.. 

ఇది కేంద్ర ప్రభుత్వ వార్షిక ఆర్థిక పత్రం. రాజ్యాంగంలోని 112వ అధికరణం ప్రకారం ఏటా ఆదాయ, వ్యయాల అంచనా పత్రాన్ని పార్లమెంటుకు ఆర్థిక మంత్రి సమర్పించాల్సి ఉంటుంది. దీనినే వార్షిక ఆదాయ వ్యయ పత్రం(యాన్యువల్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌) అంటారు. సాధారణ బడ్జెట్‌ అని కూడా దీనిని పిలుస్తారు. మొత్తం వ్యయాన్ని ప్రభుత్వం ప్రణాళిక, ప్రణాళికేతర అని రెండు పద్దుల కింద విభజిస్తుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌ ఒకటోతేదీలోగా ఫైనాన్స్‌ బిల్లు, అనుబంధ పద్దుల బిల్లును పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది.

- ఈనాడు ప్రత్యేక కథనం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.