
ప్రత్యేక కథనం
జాతీయ విద్యాసంస్థల్లో 40% బోధనా సిబ్బంది కొరత
తగ్గనున్న అధ్యాపకుల, విద్యార్థుల నిష్పత్తి
25% సీట్ల పెంపు నేపథ్యంలో అంచనాలు
ఈనాడు - హైదరాబాద్
ఆర్థిక బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్ అమలు చేయనున్న నేపథ్యంలో.. 25% సీట్లు పెంచుతున్నందున జాతీయ విద్యాసంస్థలకు మౌలిక వసతుల సమస్య ఎదురు కానుంది. ఇప్పటికే దాదాపు 40% బోధనా సిబ్బంది ఉద్యోగాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని భర్తీ చేయకుండా.. సమస్యల పరిష్కారానికి నిధులివ్వకుండా, సీట్లను పెంచితే.. విద్యాప్రమాణాలు పడిపోతాయని ఆచార్యులు ఆందోళన చెందుతున్నారు. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి మరింత తగ్గుతుందని అంటున్నారు. ఇది ప్రపంచస్థాయి ర్యాంకింగ్‌లోనూ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. విద్యార్థులకు వసతి గృహాలు, ప్రయోగశాలల సమస్యా తలెత్తనుంది. సౌకర్యాలు ఎలా ఉన్నా.. అధిక విద్యాసంస్థలు వచ్చే విద్యాసంవత్సరానికి కనీసం 10% సీట్లను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే రెండేళ్లలో ఇప్పుడున్న సీట్లను 25% పెంచాలని కేంద్రం ఆదేశించింది. ఈక్రమంలో ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సీట్లను పెంచుకునేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంటున్నాయి. ఎన్ఐటీ వరంగల్ ఇప్పటికే కేంద్ర మానవ వనరుల శాఖకు ప్రతిపాదనలు పంపింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) 2019-20 విద్యాసంవత్సరానికి 10% సీట్లను పెంచాలని ఇటీవల జరిగిన అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించింది. దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థలు ఇందుకోసం కసరత్తు చేస్తున్నాయి.
అమలు కాని ‘విద్యార్థి-అధ్యాపక’ నిష్పత్తి
నిబంధనల ప్రకారం ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు (1:10 నిష్పత్తిలో) ఉండాలి. ఇప్పటివరకు ఏ జాతీయ విద్యాసంస్థలోనూ ఈ నిబంధన అమలు కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్, ది టైమ్స్ వరల్డ్ ర్యాంకింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆ ర్యాంకింగ్‌లలో దేశంలోని రెండు లేదా మూడు విద్యాసంస్థలు మాత్రమే 200లోపు స్థానాలను దక్కించుకుంటున్నాయి. వీటిలో ఆచార్యులు, విద్యార్థుల నిష్పత్తి, పరిశోధనకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. ప్రస్తుతం ఈ అంశంలోనే భారతీయ విద్యాసంస్థలు వెనకబడి ఉన్నాయి. దేశంలో 2018 ఏప్రిల్ నాటికి సగటున 40% ఆచార్యుల ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉన్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఐఐటీల్లో 36% బోధనా సిబ్బంది కొలువులు ఖాళీగా ఉన్నాయి.
వసతి గృహాలకూ కొరత..
సీట్లు పెంచితే తక్షణం తలెత్తే సమస్య వసతి గృహాల కొరత. ఎన్ఐటీ వరంగల్‌లో ప్రస్తుతం తగినన్ని హాస్టళ్లు ఉన్నాయి. సీట్లు పెంచితే రెండు వసతి గృహాలు అవసరమవుతాయని ఆ సంస్థ సంచాలకుడు ఆచార్య ఎన్వీ రమణారావు తెలిపారు. మొత్తం మీద నిధులు రూ.200 కోట్ల వరకు అవసరం అవుతాయని చెప్పారు. ‘ఒకేసారి మొత్తం సీట్లను పెంచితే సమస్యలు ఉన్నాయని వచ్చే ఏడాది 10% పెంచాలని నిర్ణయించాం. రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, బయోకెమిస్ట్రీ లాంటి కొన్ని విభాగాల్లో ప్రయోగశాలల కొరత ఏర్పడుతుంది’ అని హెచ్‌సీయూ ఉపకులపతి ఆచార్య పొదిలె అప్పారావు చెప్పారు.
మరిన్ని

దేవతార్చన
- 20న వేటూరి విగ్రహావిష్కరణ
- భైంసాలో విషాదం.. 500 మందికి అస్వస్థత
- ఆశ్చర్యపరుస్తున్న వింత చేప
- డబ్బుపోయిందంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యే రోదన
- భారీగా ఎర్రచందనం స్వాధీనం
- 15 అడుగుల బొంగు చికెన్ తయారీ
- శ్రీశైలానికి.. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెస్తాం
- చట్ట వ్యతిరేక పనులను ఉపేక్షించం: కాగ్నిజెంట్
- ఉపరాష్ట్రపతి రాకకు రైల్వేస్టేషన్ ముస్తాబు
- జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 10మంది మృతి