close

ప్ర‌త్యేక క‌థ‌నం

పంచాయతీల ఆదాయం పెరిగేదెలా?

ప్రస్తుతానికి సొంత రాబడి వాటా 29 శాతమే
కొత్త చట్టం ప్రకారం పెంచుకొనే అవకాశం
ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పిన రాష్ట్ర సర్కారు
2019-20 బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయింపు!
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో పంచాయతీల స్వరూపం మారిపోయింది. కొత్తవాటి ఆవిర్భావంతో ఉన్నవన్నీ చిన్నవిగా మారిపోయాయి. దీంతో వాటి రాబడులూ అంతంత మాత్రంగానే ఉండబోతున్నాయి. సొంత రాబడులను పెంచుకోవటం కొత్త పాలక వర్గాలకు ఒక సవాల్‌గా మారనుంది. చిన్న పంచాయతీలకు మనుగడ కష్టమని, అలాంటి యోచన ఏ రాష్ట్రానికైనా ఉన్నట్లైతే దాన్ని ఉపసంహరించుకోవటమే ఉత్తమమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన సుమిత్‌ బోస్‌ కమిటీ స్పష్టం చేసిన సమయంలోనే.. తెలంగాణలో ఒకేసారి కొత్తగా 4,383 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. దీంతో మొత్తం సంఖ్య 12,751కి చేరింది. వీటి ఆవిర్భావంతో ఇప్పుడు రాష్ట్రంలో 95 శాతం మేర పంచాయతీలు చిన్నవిగా మారిపోయాయి. వీటి సొంత ఆర్జనలో ఆస్తి పన్ను ప్రధానమైనది. ఇళ్లు తక్కువగా ఉన్నపుడు పన్ను కూడా అంతే స్థాయిలో వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి పన్ను వార్షిక వసూళ్లు రూ.700 కోట్ల మేర ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న నిధులను కలిపి చూస్తే.. 2017-18లో గ్రామాలకు అందిన రూ.2,284 కోట్లలోను వాటి సొంత ఆదాయం వాటా 29 శాతం మాత్రమే. కానీ రాష్ట్రం ప్రత్యేకంగా నిధులిస్తేమని చెప్పినందున కొంత భరోసా లభించే అవకాశం ఉంది.

కొత్త చట్టంలో ఆదాయ వనరులు ఇవీ
పంచాయతీలో ఇంటి పన్ను విధింపుతో పాటు తూకాలు, కొలతలు ద్వారా గ్రామ ఫల సాయాలపై పన్ను వేయవచ్చు. ప్రభుత్వం అనుమతించే మరికొన్ని రకాల పన్నులను పాలక వర్గాలు వసూలు చేయవచ్చని కొత్త చట్టం చెబుతోంది. పంచాయతీ అధీనంలో ఉండే పోరంబోకు, సామాజిక భూములను ఉపయోగించుకొనే వారిపై ప్రత్యేక రుసుములు విధించవచ్చు. చావడిలు, సరాయిలతో సహా భవనాలపైనా రుసుములు రాబట్టవచ్చు. ప్రత్యేక పన్నులు, యూజర్‌ ఛార్జీలను వసూలు చేయవచ్చు. అధికారుల ముందస్తు అనుమతితో భూములపై సర్‌ఛార్జీని రాబట్టవచ్చు. గ్రామంలోని తాగునీటి వనరులు, మురుగు కాలువలు, వీధి దీపాలు తదితరాల నిర్వహణ, మరమ్మతులకు నిధుల ఆవశ్యకత ఏర్పడినపుడు సర్కారు అనుమతితో ఇళ్లపై ప్రత్యేక పన్నును పంచాయతీ రాబట్టవచ్చు. మార్కెట్లు, కబేళాలు, ప్రజల మజలీ స్థలాలు, పార్కింగ్‌ స్థలాలకు లైసెన్సుల జారీ, మార్కెట్లలోని విక్రయాలపై పన్ను.. ఇలా పన్నులు, రుసుములను పంచాయతీ రాబట్టి సొంత రాబడులను పెంచుకోవచ్చు. వీటన్నింటినీ చట్టంలో పొందుపరిచినప్పటికీ అందుకు అనుగుణమైన పరిస్థితులు కూడా అక్కడ ఉండి తీరాలి. పలు తండాలు, చిన్న గ్రామాలు సైతం పంచాయతీలుగా అవతరించినందున వాటిలో వివిధ రకాల రుసుములను విధించేందుకు ఆస్కారం ఉండదు. కనుక వాటికి ప్రభుత్వ సాయం తప్పనిసరి.

అమలు కాని 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు
పంచాయతీల రాబడులను పెంచటం లక్ష్యంగా కేంద్ర 14వ ఆర్థిక సంఘం కొన్ని సిఫార్సులను చేయగా రాష్ట్రంలో అవి ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పట్టణాలకు సమీపంలోని పంచాయతీల్లోని ఖాళీ స్థలాలపై పన్నును వసూలు చేయాలని, ప్రకటనలపై పన్ను విధింపునకు ప్రభుత్వం ఒక విధానాన్ని తేవాలని, స్థానిక ఆస్తులను పంచాయతీలకు అప్పగించి వాటిని లీజుకు ఇచ్చుకొనే సౌలభ్యాన్ని కల్పించడంవంటివి అందులో ఉన్నాయి.

15వ ఆర్థిక సంఘంపై మరిన్ని ఆశలు
స్థానిక సంస్థలకు నిధులను ఏ రీతిలో ఇవ్వాలో 15వ ఆర్థిక సంఘం త్వరలో తేల్చనుంది. దీని సిఫార్సులు 2020 ఏప్రిల్‌ మొదలుకొని అయిదేళ్ల పాటు అమలులో ఉంటాయి. ఇప్పటికంటే మెరుగైన పద్ధతుల్లో నిధులు రావచ్చని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా 2015-20 మధ్య రాష్ట్రానికి రూ.4,833 కోట్లు వస్తుండగా పంచాయతీలకు అవే ప్రధాన ఆదాయ వనరుగా మారాయి.

కొత్త బడ్జెట్‌లో నిధులు
పంచాయతీల చేయూతకు రానున్న 2019-20 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లకు పైగా కేటాయించే యోచనలో ఉంది. అప్పటికి రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదిక వస్తుంది కనుక దానిలోని సిఫార్సుల ప్రకారం నిధులు పంపిణీ అవుతాయి. ప్రస్తుత 2018-19 బడ్జెట్‌లోనూ ప్రభుత్వం స్థానిక సంస్థల పద్దులో రూ.వెయ్యి కోట్లను చూపించినప్పటికీ ఇంతవరకు నిధులు విడుదల కాలేదు. ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల మేర ఇవ్వనున్నట్లు పంచాయతీల ఆవిర్భావ సమయంలో సీఎం ప్రకటించటంతో నిధుల కొరత ఉండబోదనే భరోసా అప్పట్లో నేతల్లో నెలకొంది.

భగీరథతో కొంత వెసులుబాటు
తాగునీటి కోసం పంచాయతీలు ఇంతవరకు చేస్తున్న ఖర్చంతా మిషన్‌ భగీరథ కారణంగా ఇక ఆదా కానునుంది. నదులు, రిజర్వాయర్ల నుంచి తాగునీరు నేరుగా గ్రామంలోని ఉపరితల జలబాంఢాగారాలకు చేరుతుంది కనుక మునుపటి మాదిరిగా విద్యుత్‌ బిల్లులు, మరమ్మతు ఖర్చులు అంటూ పంచాయతీలకు ఉండబోవని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.