close

ప్ర‌త్యేక క‌థ‌నం

మీరే స్ఫూర్తి

మీ ధైర్యం.. మీ త్యాగం..
మీ భక్తి.. మీ యుక్తి..
అమరం.. అజరామరం!

శతసహస్ర శతఘ్నులు ఒకవైపు.. శతాబ్దాల సామ్రాజ్యవాదుల పాలనలో నిరుత్తరులై నిల్చున్న దాస్యజీవులు మరోవైపు... నిజానికి అదో అధర్మ సంగ్రామం!
అయినా తూటాలకు వెరవకుండా.. ధర్మమే ఆయుధంగా.. ధైర్యమే సాధనంగా సాగిన భరత జాతి విముక్తి పోరాటం.. ప్రపంచానికే ఒక కాంతిదివ్వె!
సహజమైన ఆగ్రహంతో సాహసించి ముందడుగు వేసిన సిపాయిల తిరుగుబాటులో ఆరంభమై.. తొమ్మిది దశాబ్దాల పాటు సుదీర్ఘంగా సాగిన స్వతంత్ర భారత మహోద్యమంలో.. భయమన్నది లేకుండా బందిఖానాల్లోకి దండు కట్టిన దీక్షాదక్షులూ.. ఉద్యమమే ఊపిరి అంటూ అలవోకగా ఉరికంబాలెక్కిన ఉక్కు గుండెలూ.. తూటాలను ఎదిరించి ఎదురొమ్ము చూసిన ధీరోదాత్తులూ.. లాఠీలకు వెరవక ఎదురొడ్డి నిలబడ్డ అసమాన్యులూ..
మన స్వేచ్ఛా సంగ్రామ చరిత్ర నిండా అడుగడుగునా అదే తారసబడేది వీరే! భరత మాత విముక్తి కోసం మా ప్రాణాలతో సహా ఏం పణంగా పెట్టాల్సి వచ్చినా సిద్ధమంటూ బ్రిటీషు వారిని హడలెత్తించి, వాళ్లను    కూకటి వేళ్లతో పెకలించిన భరత మాత ముద్దుబిడ్డలు వీరు!
సిపాయిల తిరుగుబాటు(1857)తో మొదలై... లాల్‌-బాల్‌-పాల్‌ల జన జాగృతితో ఊపందుకుని.. అల్లూరి, భగత్‌సింగ్‌ వంటి ఎంతోమంది వీరుల రుధిర ధారలతో పెను ప్రవాహమై.. మహాత్ముడి అహింసా పథంలో ఊరూరూ పెను ఉప్పెనలా ఉగ్రరూపమెత్తి.. చివరికి బ్రిటీషు వారిని అర్ధరాత్రి పెనుచీకటిలోకి పారద్రోలటం వరకూ.. సాగిన సుదీర్ఘ సమరంలో నేలకొరిగిన వీరులెందరో!
నేటి మన స్వతంత్రం.. వీరి అసమాన త్యాగ ఫలం. నేటి మన స్వేచ్ఛ.. ఈ వీరుల మహా ప్రసాదం! అందుకే ఈ ‘అమరవీరుల సంస్మరణ దినం’ రోజున మళ్లీ వారిని ఆవాహన చేసుకుందాం. వేలమంది అమరవీరుల్లోని కొందరు ధ్రువతారలను స్మరించుకుందాం. వారిచ్చిన స్వతంత్ర స్ఫూర్తిని మళ్లీ మన గుండెల నిండా నింపుకుందాం. ఆ మహోన్నతులే ఆదర్శంగా.. ప్రపంచ యవనిక మీద మన మువ్వన్నెల జెండాను జేగీయమానం చేద్దాం!

శాంత మూర్తి.. అమర జ్యోతి!
30 జనవరి 1948 శుక్రవారం

భరత జాతి చరిత్ర పుట.. రుధిరంతో తడిసిన రోజు! ప్రపంచ యుద్ధాలతో తడారని రక్తదాహంలో కొట్టుకుంటున్న ఆధునిక కాలానికి.. అహింసే అసలైన ఆయుధమని ప్రపంచానికి చాటిచూపిన మహోన్నతుడు.. అనవరతం శాంతి మంత్రం జపించిన మహాత్ముడు.. అనూహ్యంగా నేలకొరిగిన రోజు! అందుకే దాన్ని మనం ‘అమరవీరుల సంస్మరణ దినం’గా గుర్తుచేసుకుంటున్నాం.
సమరమేదైనా.. ప్రేమను మించిన శక్తి లేదని, అహింసతోనూ సమరం సాధ్యమేనంటూ.. ప్రపంచాన్ని నూతన ఆలోచనా ధారవైపు నడిపించేందుకే తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడి జీవితంలో... ఆఖరి ఘట్టం ఎలా వచ్చింది? ఆ రోజు ఎలా గడిచింది??

30 జనవరి 1948

స్వాతంత్య్ర సాధనతో మన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీకి సరికొత్త దిశానిర్దేశం చేసేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్న గాంధీజీ అప్పటికే కొంత అలసిపోయారు. క్షణం విరామం లేకుండా పార్టీ నిబంధనావళిని తిరగరాస్తున్న ఆయన ముందు రోజు రాత్రే సన్నిహితులతో.. ‘నేను బాగా అలసిపోయా. అయినా ఈ పని మాత్రం పూర్తి చెయ్యాల్సిందే’ అన్నారు! కాంగ్రెస్‌ పార్టీ ఇక మీదట ఏం చెయ్యాలి? అన్నదానిపై అప్పటికే ఆయన ఎంతో కసరత్తు చేశారు. 79వ ఏటకూడా గంటల తరబడి కూర్చుని ఆయన ఆ నిబంధనావళిని పలుమార్లు తిరగరాశారు. ‘కాంగ్రెస్‌ను స్థాపించిన లక్ష్యం నెరవేరింది, ఇక ఏడు లక్షల గ్రామాల సమాహారమైన భరతమాత.. తన సామాజిక, ఆర్థిక, నైతిక స్వాతంత్య్రం కోసం కృషి చెయ్యాల్సి ఉంది. ఈ స్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ఇతర రాజకీయ పార్టీలతోనూ, మత సంస్థలతోనూ అనారోగ్యకరమైన పోటీకి దిగే బదులు.. ప్రస్తుత అవతారాన్ని చాలించి ‘లోక్‌ సేవా సంఘ్‌’ రూపం ఎత్తాలి. గ్రామాభ్యుదయానికి శిక్షణనిస్తూ సమర్థ సేవా మార్గం పట్టాలి’ అని పలుమార్లు గట్టిగా వాదించటమే కాదు.. దానికి కొత్త నిబంధనావళిని రూపొందించేందుకు కూడా గాంధీజీ కృషి చేస్తున్నారు. ఇది ఒక రూపానికి వచ్చే వరకూ తనకు మనశ్శాంతి ఉండదని.. ఆ ముందు రోజు రాత్రి 9.30కి నిద్రకు ఉపక్రమించే ముందు తన మనవరాలు మనూ గాంధీతో అన్నారు. అంతే కాదు, ఉర్దూలో తనకు ఇష్టమైన కవితా పాదాలను.. ‘‘ప్రపంచ వనంలో వసంత వికాసం కొద్దిరోజులే.. వన్నె తగ్గకముందే దాన్ని విడవకుండా చూడు..’’ అని గుర్తు చేశారు. రాత్రి 12 గంటలకు తారీఖు మారింది. సరిగ్గా మూడు గంటలకల్లా గాంధీజీ దినచర్య ఆరంభమైంది. ప్రార్థన పూర్తయింది. ఎప్పటిలాగే చాలా లేఖలకు సమాధానాలివ్వాల్సి ఉంది. ఏం రాయాలో ఆయన మనూకు డిక్టేషన్‌ ఇచ్చారు. అనంతరం బాపు కొద్దిసేపు విశ్రమించారు. తర్వాత ప్రకృతి వైద్యంలో భాగమైన మర్దన జరిగింది. వెంటనే తన అనుయాయి ప్యారేలాల్‌ను పిలిచి.. నిబంధనవాళి ముసాయిదాకు తాను చెప్పిన దిద్దుబాట్లు చెయ్యటం పూర్తయిందా? అని అడిగారు. అలాగే మద్రాసు రాష్ట్రాన్ని ఇక్కట్ల పాలు చేస్తున్న ఆహార సంక్షోభంపై ‘హరిజన్‌ పత్రిక’లో ప్రచురించేందుకు ప్రత్యేకంగా నోట్‌ తయారు చేయించారు. దీనిలో- ‘ఆహార పంటలతో అలరారే మద్రాసు ప్రాంతానికి ఈ తిండి కష్టం వచ్చిందంటే మనకు వనరులను ఉపయోగించుకోవటం తెలియటం లేదనే అనుకోవాలి’ అంటూ ఆహార మంత్రిత్వ శాఖకు చురకంటించారు. అనంతరం నౌఖాలీలో హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న ఘర్షణల గురించి చర్చిస్తూ.. ఎవరూ అక్కడి నుంచి తరలి రావటం సరికాదు, కష్టమో నిష్టూరమో.. కలిసి ఉంటేనే బలహీనతలు తొలగి మనం బలవంతులమవుతాం.’’ అని గట్టిగా వాదించారు. సూర్యోదయంతోనే అంత చలిలో కూడా స్నానాదికాలు ముగించారు. సమయం ఉదయం 9.30 అయ్యింది. అప్పటికే బాపు తన రోజువారీ రచనా వ్యాసంగంలో మునిగిపోయారు. కొన్ని కొత్త బెంగాలీ పదాలు నేర్చుకున్నారు. ఉడికించిన కూరముక్కలు, నారింజ తొనలు, కొద్దిగా మేకపాలు, అల్లం-నిమ్మరసాలతో అల్పాహారం ముగించారు. అలసిన భావన రాగానే కొద్దిసేపు అక్కడే విశ్రమించారు. లేస్తూనే వరసగా సందర్శకులతోనూ, ఆందోళనతో వచ్చిన కొద్దిమంది ముస్లింలు, సింధీ శరణార్ధులతోనూ సమావేశమయ్యారు. మధ్యమధ్య.. ‘నేను బతికి ఉండగానే పరిస్థితులు చక్కదిద్దనివ్వండి’ అంటూ సరదాగా వ్యాఖ్యానాలూ చేశారు.
సాయంత్రం 4 గంటలు. సూర్యుడి కిరణాలు ఏటవాలుగా పడుతున్నాయి. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ తన కుమార్తెతో వచ్చి, రకరకాల విషయాలు ముచ్చటించారు. అనంతరం పటేల్‌, నెహ్రూల మధ్య అభిప్రాయభేదాల కారణంగా దేశం మూల్యం చెల్లించాల్సి వస్తుందా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు బాపు. ‘అయినా మీరిద్దరూ కలిసి పని చేయక తప్పదు, దీని గురించి సాయంకాల ప్రార్థన సమావేశం అనంతరం చర్చిద్దాం’ అని పటేల్‌కు చెప్పారు. ఈ సమావేశం కారణంగా 5గంటల ప్రార్థన సమావేశం కొద్దిగా ఆలస్యమైంది. అప్పటికే అక్కడ వెయ్యి మందికి పైగా ఎదురు చూస్తున్నారు. అభా, మనూల భుజాల మీద చేతులు వేసుకుని ప్రార్థన వేదిక వైపు నడక ఆరంభించారు. జనం ఆయనకు దారి ఇస్తున్నారు. ‘నేను పది నిమిషాలు ఆలస్యమయ్యానంటే.. అది మీ పొరపాటు కాదూ.. దేవుడొచ్చినా నర్సుల పని ఆగకూడదు. సమయానికి మందివ్వకుండా సందేహిస్తే రోగి చనిపోడూ! ప్రార్థనా మందు లాంటిదే. ప్రార్థనకు ఒక్క క్షణం ఆలస్యమైనా నాకు చికాకే’ అంటూ వారి భుజాల మీది నుంచి చేతులు తీసి.. వేదిక ఎక్కబోతున్నారు.. చుట్టూ అంతా నమస్కారాలు పెడుతున్నారు.. ఎదురుగా చేతులు జోడించిన వ్యక్తి మహాత్ముడికి నమస్కారం పెట్టేందుకు ముందుకు వంగాడు. మరీ దగ్గరకు వస్తున్న అతడిని పక్కకు నెట్టేందుకు ప్రయత్నిస్తోంది మనూ... అతను ప్యాంటు జేబులోంచి బెరెటా పిస్టల్‌ తీశాడు. ఆ ప్రాంగణం మూడు మార్లు తుపాకి శబ్దంతో మార్మోగిపోయింది.
ఆ శబ్దాల్లో హేరామ్‌ అంటూ సన్నటి స్వరం వినిపించింది!
ఆ తుపాకి నాథూరామ్‌ గాడ్సేది! సమయం.. 5.17.
భారత చరిత్రలో ఒక శకం ముగిసింది!
అమరజ్యోతి మిగిలింది!!

ఝాన్సీలక్ష్మీబాయి

కాశీలో సామాన్య పేద కుటుంబంలో పుట్టిన మణికర్ణిక.. తండ్రి ఉద్యోగ రీత్యా కాన్పూరు పీష్వా బాజీరావు కొలువులో పెరిగింది. భార్య చనిపోయి, మరో వివాహం కోసం చూస్తున్న ఝాన్సీ సంస్థానాధీశుడు, వయసులో ఎంతోపెద్దవాడైన గంగాధరరావును మనువాడి.. ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ అయ్యింది. భర్త మరణానంతరం దత్తపుత్రుడితో రాజ్య పాలన ఆరంభించాలని చూస్తుంటే ‘అదెప్పుడో బ్రిటీషు పాలనలో కలిసిపోయిందంటూ’ డల్హౌసీ కుతంత్రానికి తెరతీశాడు. ఝాన్సీ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఇక అక్కడి నుంచీ వితంతువుగా, పసిబిడ్డతో, ప్రజల అండతో ఆ వీరనారి సాగించిన అద్భుత పోరాటం.. భారత చరిత్రలోనే అత్యంత రోమాంచిత ఘట్టం!

భగత్‌సింగ్‌
త్యాగంతో నిద్ర లేపుతా!

మొత్తం జీవించింది 24 సంవత్సరాలు. అందులో రాజకీయ జీవితం 10 ఏళ్లు! కానీ ఆయన ప్రభావం అజరామరం!! ‘‘బ్రిటీషు వాళ్లు ఒకటిన్నర కోట్లు. మనమా 29 కోట్ల మందిమి. అందరం ఒక్కసారి గట్టిగా శ్వాస వదిలితేచాలు.. వాళ్ల చేతుల్లో తుపాకులు గాలిలోకి ఎగిరిపోవూ!’ అంటూ తండ్రి అజిత్‌సింగ్‌ నూరిపోసిన ధైర్యం 8 ఏళ్ల భగత్‌సింగ్‌ను క్షణం నిలవనివ్వలేదు. వెంటనే వందేమాతరం అంటూ ఉద్యమంలో దూకి లాలాలజపతిరాయ్‌ మరణానికి కారణమైన బ్రిటీషు అధికారి సాండర్స్‌ను ముందుండి మట్టుబెట్టారు. పార్లమెంటుపై ‘శబ్దం బాంబు’ వేసి ‘ఇంక్విలాబ్‌’ అంటూ నినదించి.. నిర్బంధానికి గురయ్యారు. దేశమంతా ఆయన ప్రాణాలను కాపాడాలని ఘోషిస్తుంటే.. ‘నా ప్రాణం కంటే దేశం ముఖ్యం. ప్రాణత్యాగంతోనే జాతిని నిద్రలేపి, స్వాతంత్య్ర నినాదాన్ని ప్రతిధ్వనింపజేస్తాను’ అంటూ ప్రతిజ్ఞ చేసి ఉరికొయ్యనెక్కాడు.. భగత్‌ సింగ్‌!

చంద్రశేఖర్‌ అజాద్‌
మాటలే బుల్లెట్లు!

1921. సహాయ నిరాకరణోద్యమం ఆరంభమైంది. గాంధీజీ పిలుపు యావద్దేశాన్నీ కదిలించింది. తోటి విద్యార్ధులతో కలిసి ఆ ఉద్యమంలో గొంతు కలిపాడు చంద్రశేఖర్‌. నేరస్తుడిగా కోర్టులో నిలిచాడు. 15 సంవత్సరాల ఆ బాలుడిని చూసి జడ్జి అడిగారు.. ‘‘నీ పేరేమిటి?’ ‘‘అజాద్‌’’ నీ తండ్రి పేరు.. ‘‘స్వాతంత్య్రం’’... నీ ఊరు... ‘‘చెరసాల.’’ బుల్లెట్లలాంటి ఆ సమాధానాలకు జడ్జి 12 బెత్తం దెబ్బల శిక్ష విధించాడు. జైలులో ఒట్టి ఒంటిపై దెబ్బలు కొడుతుంటే ‘మహాత్మా గాంధీకీ జై’ అంటూ ధైర్యంగా నినదించాడు. అప్పటి నుంచే ‘అజాద్‌ చంద్రశేఖర్‌’ అయ్యాడు. అనంతరం  సమాజ శ్రేయస్సు కోసం విప్లవ మార్గం.. ‘విజయమో, వీరస్వర్గమో’ తప్పదని భావించి.. 1931 ఫిబ్రవరి 27న సీఐడీ సూపరింటెండెంట్‌ నాట్‌ బావర్‌ తూటాల వర్షం కురిపిస్తుంటే.. శత్రువు చేత చిక్కరాదని తుపాకి తనకు తానే గురిపెట్టుకుని నేలకు ఒరిగిపోయాడు!

అల్లూరి సీతారామరాజు
అడవిలో అగ్గిరవ్వ

పసితనంలోనే తండ్రి చనిపోవటంతో ఇల్లు గడిపేందుకు తల్లి పడుతున్న పాట్లు చూసి చలించిన సీతారామరాజు.. చిన్ననాటే తుని నుంచి మనశ్శాంతి కోసం దగ్గర్లోని అడవిలోకి వెళ్లి అంతశ్శోధనలో మునిగి పోయేవాడు. అక్కడా మన్యం జీవుల దైన్యమే కనబడింది. బ్రిటీషు అధికారుల ఆగడాలు చూసి నెత్తురు మరిగిపోయింది. అలా సీతారామరాజు సారథ్యంలో మన్యం రగులుకుంది. ఆయుధాల కోసం పోలీసుస్టేషన్లపై మెరుపు దాడులు చేస్తూ.. బ్రిటీషు వారిని ఉక్కిరిబిక్కిరి చేసి.. మూడు చెరువుల నీళ్లు తాగించిన మన్యం పులి.. చివరికి వాళ్ల వంచన తూటాలకు బలైంది. ఆ పులి పేరు వింటే నేటికీ తెలుగు గుండె ఉప్పొంగుతుంది!

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.