close

ప్ర‌త్యేక క‌థ‌నం

అడవికి అభయం

స్మగ్లర్లపై సర్కారు ఉక్కుపాదం

అడవిలో అలికిడి మొదలైంది. ఇది మహావృక్షాలను నేలమట్టం చేసే గొడ్డళ్లది కాదు. ఆరునూరైనా సరే ఆ గొడ్డళ్లను అడ్డుకోవాలనే సర్కారు దృఢ సంకల్పానిది. ‘అడవుల నుంచి పూచికపుల్ల కూడా బయటికి పోవద్దు, జంగిల్‌లో అడుగుపెట్టాలంటే నేరగాళ్లు జంకాలి’ అన్న ముఖ్యమంత్రి కఠిన వైఖరి తాలూకు ప్రకంపనలివి. కింది నుంచి పైదాకా అందరినీ బదిలీ చేసి అటవీశాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ ఆలోచన అధికారుల్లో కలవరం కలిగిస్తుండగా... ఇన్‌ఫార్మర్ల ఏర్పాటు, డాగ్‌స్క్వాడ్‌లు, చెక్‌పోస్టుల పెంపు, పీడీ చట్టం ప్రయోగానికి యోచన, సామిల్లుల్లో సీసీ కెమెరాల
ఏర్పాటు లాంటి చర్యలు కలప స్మగ్లర్ల గుండెల్లో  రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఈ చర్యలన్నీ పర్యావరణ ప్రియులకు సంతోషం కలిగిస్తున్నాయి. ఈ నిర్ణయాల అమలుపై ముఖ్యమంత్రి మరింత కఠినంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో అక్రమార్కుల మార్గాలను పూర్తిగా మూసివేయాలని వారు కోరుతున్నారు.

జంగిల్‌ మిగలాలంటే జర ఇవి గూడ సూడుండ్రి!
ముఖ్యమంత్రి నిర్ణయాలపట్ల సంతోషం
మరిన్ని చర్యలు తీసుకోవాలని వినతులు
ఈనాడు - ఆదిలాబాద్‌

అడవుల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. కలప స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించాలని, అడవుల నుంచి పూచికపుల్ల కూడా బయటికి పోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచిస్తున్నారు.అటవీశాఖ అధికారులతో తరచూ సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంత ప్రజలకు, పర్యావరణ ప్రియులకు ఇవి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పూర్తిగా మదింపు చేసి మరికొన్ని చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నిర్ణయాలను కఠినంగా అమలు చేస్తేనే అటవీ రక్షణ సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇవిగో అక్రమాల దారులు..
* నిర్మల్‌ జిల్లా తాళ్లపేట రేంజి పరిధిలో రాత్రివేళల్లో నిఘా తక్కువగా ఉండటంతో కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం నుంచి కలపను ఇప్పటికీ తరలిస్తున్నారు.
* కల్లెడ బీట్‌ నుంచి కలప తరలింపు అధికారుల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఖానాపూర్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌కు చెందిన పలువురు రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉంటోంది. ఇచ్చోడ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ప్రాంతాలకు చెందిన అధికార తెరాస, కాంగ్రెస్‌ పార్టీ నేతలు కొందరు స్మగ్లర్లతో అంటకాగుతున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు అటవీ, పోలీసు అధికారుల భాగస్వామ్యంతోనే కలప స్మగ్లింగ్‌ జరుగుతోంది.

* ఖానాపూర్‌ మండలం బాధన్‌కుర్తి లింగాపూర్‌, మేడంపల్లి గోదావరి రేవుల నుంచి కరీంనగర్‌, జగిత్యాలలకు కలప స్మగ్లింగ్‌ జరుగుతోంది.
* ఖానాపూర్‌, పెంబి, కడెం మండలాల నుంచి ఇచ్చోడకు కలపను తరలించి అక్కడి నుంచి 44వ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్‌, నిజామాబాద్‌ ప్రాంతాలకు పంపడం ఆనవాయితీగా మారింది.
* మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ డివిజన్‌లోని కోటపల్లి అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్‌, హైదరాబాద్‌కు అక్రమంగా కలప తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
* కరీంనగర్‌ జిల్లా మంథని, మహదేవ్‌పూర్‌ అటవీ ప్రాంతాల నుంచి కరీంనగర్‌ పట్టణ అవసరాలతో పాటు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
* జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం, ములుగు, తాడ్వాయి అటవీ ప్రాంతం నుంచి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, హైదరాబాద్‌కు అక్రమంగా కలప తీసుకెళుతున్నారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవులను నరికేసి ఖమ్మం పట్టణ అవసరాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు కలపను  తరలిస్తున్నారు..
* కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌లోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి మాలిని, టోంకిని మీదుగా అటవీ అధికారుల కళ్లుగప్పి పెద్ద ఎత్తున కలప స్మగ్లింగ్‌ జరుగుతోంది.

ఇంకా ఏం చేయాలి?

* ఇప్పటికే ఉన్న తనిఖీ కేంద్రాలు (చెక్‌పోస్టులు), బేస్‌ క్యాంపుల్లో సిబ్బందిని పెంచాలి. కొత్త వాటిని ఏర్పాటు చేయాలి.
* ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో కలప డిపోలు, సామిల్లులను పకడ్బందీగా నియంత్రించాలి.
* నిందితులకు పెద్ద శిక్షలు పడకపోవడంతో జైలుకు వెళ్లి తిరిగి వచ్చి మళ్లీ కలప స్మగ్లింగ్‌ చేస్తూనే ఉన్నారు. పీడీ చట్టాన్ని ప్రయోగించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
* అడవుల్లో ఏర్పాటు చేసుకున్న దొంగదారులను మూసివేయడంతో  పాటు జాతీయ రహదారులు, గోదావరి, ప్రాణహిత నదుల ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలి.
* ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రధానంగా చెట్లు నరకడమే జీవనోపాధిగా మలచుకున్న ముల్తానీల్లో, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో చెట్లను నరకడమే వృత్తిగా మార్చుకున్న గుత్తికోయల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. జీవనోపాధి, పునరావాసం కల్పించి వారిలో
మార్పు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలి.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.