close

ప్ర‌త్యేక క‌థ‌నం

‘సాంకేతిక పంచాయతీ’.. అవగాహనతోనే సోపతి!

రానున్న రోజుల్లో భవన, లేఅవుట్‌ అనుమతులు ఆన్‌లైన్‌లోనే..
ఇంటి పన్నూ యాంత్రిక మదింపు
పంచాయతీల కొత్త పాలకవర్గాలకు ఈ మేరకు పరిజ్ఞానం తప్పనిసరి
శిక్షణ ఇస్తామంటున్న కొత్త చట్టం
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలోని పంచాయతీలు రానున్న రోజుల్లో కంప్యూటర్లతో కొత్త పుంతలు తొక్కనున్నాయి. ఆన్‌లైన్‌లో భవన, లేఅవుట్‌ అనుమతులు ఇవ్వనున్నారు. ఇంటి పన్నును ఇప్పటి మాదిరిగా బిల్‌ కలెక్టర్‌ కాకుండా కంప్యూటరే నిర్ధారించి చెప్పనుంది. ఈ నేపథ్యంలో ఆయా సాంకేతిక అంశాలపై సర్పంచులు, వార్డు సభ్యులకు పూర్తి అవగాహన ఇప్పుడు తక్షణావసరం. వీరందరికీ శిక్షణ ఇస్తామని తెలంగాణ నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో సైతం సర్కారు వెల్లడించింది. అయితే, శిక్షణ తరగతులు మునుపటి మాదిరిగా తూతూ మంత్రంగా కాకుండా పూర్తి స్థాయి తర్ఫీదు ఇచ్చే రీతిలో ఉంటేనే ప్రజాప్రతినిధులు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు.  పంచాయతీలను కంప్యూటరీకరిస్తే గ్రామస్థులకు పౌరసేవలు వేగంగా అందడంతోపాటు విధి నిర్వహణలో పారదర్శకత.. సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగుతాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే ఈ-పంచాయతీలకు రూపకల్పన చేసి వివిధ పనులకు ఉపయోగపడేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి రాష్ట్రానికి ఇచ్చింది. ఆ సాఫ్ట్‌వేర్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మరిన్ని మెరుగులు దిద్దుతోంది. పెద్దఎత్తున అవినీతికి ఆస్కారమున్న భవన నిర్మాణ అనుమతులు, ఇళ్ల  స్థలాల లేఅవుట్ల ప్రతిపాదనలను ఇక ఆన్‌లైన్‌లోకి తీసుకురానున్నారు. పంచాయతీల్లో ఇంటి పన్నును కంప్యూటర్లే మదించి చెప్పనున్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సుల జారీ, పంచాయతీల ఆస్తులు, రాబడుల నమోదు.. తదితరాలన్నింటికీ పంచాయతీ కార్యాలయాల్లోని కంప్యూటర్లే కీలకం కాబోతున్నాయి. ఇలాంటి మార్పులన్నింటిపైనా పెద్దసంఖ్యలో ఉన్న గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు అవగాహన చాలా అవసరం. మిషన్‌ భగీరథ పైపులైన్లతోపాటు వేస్తున్న ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ) ద్వారా గ్రామం అంతటా అంతర్జాలం అందుబాటులోకి వస్తోంది కాబట్టి పంచాయతీ కార్యాలయంలోని కంప్యూటర్లు పనిచేయటం లేదనే సమాధానాలకు ఇక ఆస్కారం ఉండబోదు.

అవగాహన తరగతులకు కేంద్ర నిధులు
ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు పంచాయతీ సశక్తీకరణ్‌ అభియాన్‌ పథకం ద్వారా కేంద్రం నిధులు అందజేస్తోంది. దీని ద్వారా ఇంతకుముందు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు తూతూ మంత్రంగానే ముగిసిపోయాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రం నుంచి మరిన్ని నిధులను సంపాదించి చట్టంలో పొందుపర్చినట్లుగా సర్పంచులు, వార్డు సభ్యులకు తర్ఫీదు ఇవ్వాలని పంచాయతీరాజ్‌ శాఖ భావిస్తోంది. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డీ-పీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గ్రామీణాభివృద్ధి సంస్థ కూడా శిక్షణ కార్యక్రమాలపై మునుపటి కంటే ఎక్కువగా దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.

శిక్షణతో ఇవీ ప్రయోజనాలు
* గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు మంచి శిక్షణ ఇస్తే వారు స్మార్ట్‌ఫోర్‌ ఆధార అప్లికేషన్లను, సోషల్‌ మీడియాను ఉపయోగించుకోగలుగుతారు. వివిధ రాష్ట్రాల్లోని ఉత్తమ పంచాయతీలపై రూపొందించిన లఘుచిత్రాలను కంప్యూటర్లలో వీక్షించగలుగుతారు.
* వివిధ పథకాలు, మౌలిక వసతుల, ఇతర అంశాలపై దూర దృశ్య సదస్సుల ద్వారా సర్పంచులు అవగాహన ఏర్పరచుకోవచ్చు.
* గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)లను తయారు చేయటానికి అవసరమైన శిక్షణ పొందొచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.