close

ప్ర‌త్యేక క‌థ‌నం

అమెరికా గజ గజ

కనీవినీ ఎరుగని శీతల గాలులతో అమెరికా వణికిపోతోంది. మామూలుగానే శీతాకాలంలో చల్లగా ఉండే దేశం ఈసారి గడ్డకట్టుకుపోతోంది. పోలార్‌ వొర్టెక్స్‌ ప్రభావం కారణంగా ఆర్కిటిక్‌ ప్రాంతం నుంచి వీస్తున్న గాలులతో అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 65 డిగ్రీల ఫారిన్‌హీట్‌ (మైనస్‌ 53 డిగ్రీల సెల్సియస్‌) వరకు పడిపోయాయి.

2300
రద్దయిన విమానాలు

మైనస్‌ 65 డిగ్రీల ఫారిన్‌హీట్‌: కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుత ఉష్ణోగ్రత

కారణం: ఆర్కిటిక్‌ గాలులు

ఎక్కువ ప్రభావం ఎక్కడెక్కడ?: ఇల్లినాయిస్‌, మిషిగాన్‌, విస్కాన్సిన్‌ (ఈ మూడు చోట్ల గవర్నర్లు అత్యవసర పరిస్థితి ప్రకటించారు.) షికాగో (మైనస్‌ 33 డిగ్రీల సెల్సియస్‌), డెట్రాయిట్‌ (మైనస్‌ 26 డిగ్రీల సెల్సియస్‌).

మృతులు: నలుగురు

ప్రభుత్వ చర్యలేమిటి?

* అత్యవసర ఆశ్రయ కేంద్రాల ఏర్పాటు
* విద్యా సంస్థలకు సెలవులు
* కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలూ మూసివేత
* రైళ్ల రాకపోకలకు వీలుగా  పట్టాలపై మంటలు!

అమెరికా గజ గజ
ఆర్కిటిక్‌ కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రత
స్తంభించిన జన జీవనం
అనేక ప్రాంతాల్లో మైనస్‌ 53 డిగ్రీల సెల్సియస్‌
మునుపటి రికార్డుల్ని తిరగరాసేలా శీతల గాలులు
మూడు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి
వాషింగ్టన్‌

ఎముకలు కొరికేలా ఉన్న చలికి అమెరికాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు విలవిల్లాడుతున్నారు. అమెరికా పశ్చిమ మధ్య భూభాగం (మిడ్‌ వెస్ట్‌) ఎక్కువగా ప్రభావితమయింది. ఆరుబయట వాతావరణంలో కొద్దిసేపు ఉన్నా పలు రకాల వైకల్యాలు తలెత్తి ప్రాణాల మీదికి వచ్చే (హైపోథెర్మియా) పరిస్థితి ఉంది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. అత్యవసర ఆశ్రయ కేంద్రాలను ప్రభుత్వం తెరిచింది. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. రైళ్లు నడవాలన్నా వీల్లేని రీతిలో పట్టాలపై హిమపాతం పేరుకుపోతోంది. కొన్నిచోట్ల బస్సులనే తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలుగా మార్చారు. ఇంతవరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రికార్డుల్ని తిరగరాసేలా హిమపాతం నమోదు కావచ్చని భావిస్తున్నారు. ఇళ్లు విడిచి బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది.

9 కోట్ల మందిపై ప్రభావం
సున్నా, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఉండవచ్చని అంచనా. వీరిలో 2.50 కోట్ల మంది మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌ గాలుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. డకోటా, ఉత్తర మిన్నెసోటాలలో మైనస్‌ 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంది. మినియాపోలిస్‌, మిల్వాకీ, షికాగో, డెట్రాయిట్‌లోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని భావిస్తున్నారు. తీవ్రమైన గాలుల కారణంగా చలి మరిన్ని రెట్లు పెరిగిపోతోంది. భరింపశక్యం కాని వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో మిన్నెసోటాలో అత్యవసర పరిస్థితి ప్రకటించి అన్ని రకాల విద్యా సంస్థల్ని మూసివేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పనిచేసే తపాలా కార్యాలయాల సేవలూ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 2300కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 12 వేల విమానాలు ఆలస్యమయ్యాయి. తాజా పరిస్థితులు చూసినవారికి ‘ది డే ఆఫ్టర్‌ టుమారో’ అనే హాలీవుడ్‌ చిత్రం కళ్లముందు కదలాడుతోంది. అతి శీతల వాతావరణంలో హెలికాప్టర్ల రెక్కలూ గడ్డ కట్టి కూలిపోవడం వంటివి ఆ చిత్రంలో చూపించారు.

బ్రిటన్‌లో హిమపాతం... విమానాశ్రయాల మూసివేత

లండన్‌: విపరీతమైన హిమపాతం, మైనస్‌ 10 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో బ్రిటన్‌లోనూ పలు నగరాల్లో విమానాశ్రయాలు మూసివేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మాంచెస్టర్‌, లివర్‌పూల్‌ వంటి విమానాశ్రయాల్లో రన్‌వేలపైకి విమానాలను అనుమతించడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అనేక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. స్కాట్లాండ్‌ అతి శీతలంగా మారింది.

పోలార్‌ వొర్టెక్స్‌ అంటే?

ఇదొక అతి శీతల వాతావరణ పరిస్థితి. ఉత్తర, దక్షిణ ధ్రువాల నుంచి వీస్తున్న గాలుల వల్ల ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. కేవలం అయిదు నిమిషాల్లోనే శరీరం తన సహజ ఉష్ణోగ్రతను కోల్పోయి మొద్దుబారిపోతుంది. దశలవారీగా మతి భ్రమించే ప్రమాదం సైతం ఉంటుంది. అరుదుగా ప్రాణాలూ పోవచ్చు. సెల్సియస్‌ డిగ్రీ కొలమానంలో మైనస్‌ 32 వద్దనే శరీరం గడ్డ కట్టేస్తుంది. అలాంటిది పలుచోట్ల మైనస్‌ 50 వరకు ఉందంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. అయిదేళ్ల తర్వాత ఉత్తర అమెరికాపై ‘పోలార్‌ వొర్టెక్స్‌’ ప్రభావం కనిపిస్తోంది. దీని ప్రభావం సెప్టెంబరు నుంచి మొదలవుతూ ఉంటుంది. డిసెంబరు, జనవరి నెలల్లో పూర్తిస్థాయిలో ప్రభావం చూపిస్తుంటుంది.

ఉత్తర భారత్‌పైనా ప్రభావం: ఐఎండీ

దిల్లీ: అమెరికాలో నెలకొన్న అతి శీతల వాతావరణం ఉత్తర భారతదేశంపైనా ప్రభావం చూపిస్తోంది. రాజస్థాన్‌లోని చురులో మైనస్‌ 1.1 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత పడిపోయింది. ఆర్కిటిక్‌ ప్రాంతం నుంచి వీస్తున్న చలిగాలులే దీనికి కారణమని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు చెబుతున్నారు. ఆర్కిటిక్‌ గాలులు పశ్చిమ అవాంతరాలను సాధారణం కంటే ఎక్కువగా దక్షిణ దిశగా నెడుతుండడంతో దక్షిణ ఐరోపా నుంచి ఉత్తర భారతం వైపు చలిగాలులు వీస్తున్నాయని ఐఎండీ దిల్లీ ప్రాంతీయ కేంద్రం అధిపతి బి.పి.యాదవ్‌ విశ్లేషించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.