close

ప్ర‌త్యేక క‌థ‌నం

పట్నంలో పూల్‌బాటలు

రాజధానిలో ట్రాఫిక్‌ సమస్యలకు 2,000 కోట్లతో విముక్తి
ప్రధాన కూడళ్లలో ఆకాశమార్గాలు, తీగ వంతెనల నిర్మాణం
కొన్నింటిని ఈ సంవత్సరాంతానికి ప్రారంభించేందుకు సన్నాహాలు

ఎక్కడికక్కడే..
* బయోడైవర్సిటీ కూడలి వద్ద రెండు వైపులా వంతెనలు రూ.80 కోట్లు
* ఓవైసీ ఆసుపత్రి-నల్గొండ క్రాస్‌రోడ్డు కూడలి రూ. 600 కోట్లు
* అండర్‌పాస్‌... బైరామల్‌గూడ కూడలి-కామినేని కూడలి రూ.40 కోట్లు
* స్టీల్‌ బ్రిడ్జి.. నాగార్జున సర్కిల్‌ రూ. 40 కోట్లు
* స్టీల్‌ బ్రిడ్జి... ఆర్టీసీ క్రాస్‌రోడ్డు కూడలి మీదుగా రూ. 250 కోట్లు

ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

హైదరాబాద్‌ మహానగరం పేరు చెప్పగానే మనందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ట్రాఫిక్‌ రద్దీ.. ఏ రోడ్డులో వాహనాలు ఎంతసేపు ఆగిపోతాయో తెలియదు. ఈ చక్రబంధంలో నుంచి ఎప్పుడు బయట పడతామో చెప్పలేం. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నిరోధించేందుకు మన పాలకులు చర్యలు చేపట్టినా అవి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ కష్టాల నుంచి నగరవాసుల్ని గట్టెక్కించేందుకు ఆకాశమార్గాల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో కొన్ని ఈ సంవత్సరాంతానికి సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి. మహానగరంలో దాదాపు రూ.2 వేల కోట్లతో కొన్నిచోట్ల ఆకాశమార్గాల నిర్మాణాలు, మరోచోట తీగల వంతెన పనులు మొదలుపెట్టారు. ఇవన్నీ ప్రారంభమైతే ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు ఆగకుండా సిగ్నళ్లతో సంబంధం లేకుండా వేగంగా ముందుకు ప్రయాణించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకే వీలైనంత తొందరగా వీటి నిర్మాణాలను పూర్తి చేయడానికి హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు కృషి చేస్తున్నారు.

హమ్మయ్య సమస్య తీరినట్లే
హైదరాబాద్‌లో పెద్ద కూడలి ఎల్బీనగర్‌. ఇక్కడ ఒకవైపు నుంచి మరో వైపునకు వాహనం వెళ్లాలంటే నరకయాతన తప్పదు. కానీ ఇక్కడ వాహనదారులు ఆగకుండా వెళ్లేందుకు ఇప్పుడు దాదాపు రూ.250 కోట్లతో ఆకాశమార్గాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే నాగోల్‌ నుంచి సాగర్‌ రోడ్డు వైపు వెళ్లడానికి ఒకటి నిర్మితమైంది. మరోవైపు కూడా నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఇక్కడే దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట మీదుగా వనస్థలిపురం వైపు వెళ్లే వాహనదారుల కోసం రూ.45 కోట్లతో ఆకాశమార్గం పనులు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే నెలలో దీన్ని ప్రారంభించబోతున్నారు. అనంతరం వనస్థలిపురం వైపు నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు ఆకాశమార్గం పనులు మొదలుపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీన్ని కూడా వేగంగా పూర్తిచేసి వచ్చే ఏడాదికల్లా ఈ రెండుమార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కూడలి దగ్గరే మరికొన్ని మార్గాల్లో కూడా వివిధ నిర్మాణాల ద్వారా ట్రాఫిక్‌ ఇబ్బందులు తీర్చేందుకు కృషి చేస్తున్నారు.

జేఎన్‌టీయూ వద్ద ఆకాశమార్గం
ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరగడంతో కూకట్‌పల్లి నుంచి సైబర్‌ టవర్‌ వైపు వెళ్లే వాహనదారుల సంఖ్య పెరిగింది. ప్రతిరోజూ జేఎన్‌టీయూ, మలేసియా టౌన్‌షిప్‌ మీదుగా గచ్చిబౌలి వెళ్లే వాహనదారులకు ఇక్కడి రాజీవ్‌గాంధీ విగ్రహం కూడలి వద్ద పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. దీన్ని అధిగమించేందుకు ఈ కూడలి దగ్గర రూ.70 కోట్లతో ఆరులైన్ల ఆకాశమార్గం నిర్మాణాన్ని మొదలుపెట్టారు. వచ్చే మార్చి చివరి నాటికి దీన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గచ్చిబౌలి దగ్గర మరో రెండు కీలక వంతెనలు
గచ్చిబౌలి జంక్షన్‌ దాటిన తరువాత నుంచి బొటానికల్‌ గార్డెన్‌ దగ్గర ఆకాశమార్గం మొదలై కొత్తగూడ, కొండాపూర్‌ జంక్షన్‌ దాటి హఫీజ్‌పేట ఫ్లై ఓవర్‌కు దగ్గరలో కిందకు దిగుతుంది. కొత్తగూడ జంక్షన్‌ నుంచి హైటెక్‌ సిటీ వైపు వెళ్లడానికి వీలుగా ఇక్కడ ఆకాశమార్గం నుంచి కిందికి దిగడానికి రైట్‌ టర్న్‌ ఏర్పాటు చేస్తున్నారు. రూ.265 కోట్ల వ్యయంతో ఈ ఆకాశమార్గం నిర్మాణాన్ని వేగంగా చేపడుతున్నట్లు బల్దియా ముఖ్య ఇంజినీరు శ్రీధర్‌ ‘ఈనాడు’కు తెలిపారు. రెండేళ్ల నిర్మాణ గడువును పెట్టుకున్నా అంతకన్నా ముందే పనులను పూర్తి చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి సైబర్‌ టవర్‌ మీదుగా వచ్చే వాహనదారులు గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు వీలుగా సైబర్‌ టవర్‌ వైపు నుంచి గచ్చిబౌలి వైపు మరో ఆకాశమార్గం నిర్మించడానికి ప్రతిపాదించారు. శిల్పారామంలోని కొంత స్థలంలో స్తంభాలను నిర్మించాల్సి రావడంతో అధికారుల అనుమతి కోసం ఇంజినీర్లు వేచిచూస్తున్నారు.

బాలానగర్‌ దగ్గర ఇబ్బందులు తీరినట్లే
బాలానగర్‌ దగ్గర ట్రాఫిక్‌ ఇబ్బందులు తీర్చేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కూకట్‌పల్లి వై జంక్షన్‌ నుంచి బాలానగర్‌ క్రాస్‌ రోడ్డు మీదుగా నర్సాపూర్‌ క్రాస్‌ రోడ్డు వరకు రెండువైపులా ఆరు లైన్ల ఆకాశమార్గం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.387 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల పొడవైన ఆకాశమార్గం పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి హెచ్‌ఎండీఏ అధికారులు కృషి చేస్తున్నారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నగరంలో అంబర్‌పేట చే నంబరు జంక్షన్‌ దగ్గర ఒకటి, ఉప్పల్‌ దగ్గర మరొకటి ఆకాశమార్గాలను నిర్మించడానికి జాతీయ రహదారుల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. కేబీఆర్‌ పార్కు చుట్టూ దాదాపు రూ.750 కోట్లతో నాలుగు చోట్ల ఆకాశమార్గాల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు దగ్గర ఇనుముతో తయారు చేసిన ఆకాశమార్గాల ఏర్పాటుకు బల్దియా పచ్చజెండా వూపింది.

 

తీగల వంతెనతో పలు సమస్యలకు పరిష్కారం

పంజాగుట్ట బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల నుంచి మాదాపూర్‌ వైపు వెళ్లే లక్షలాది మంది ఇప్పుడు ప్రధానంగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రోడ్డు నంబరు 36 మీదుగా ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ రోడ్డులో తీవ్రమైన రద్దీ ఏర్పడుతోంది. దీనికి ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణాన్ని అధికారులు మొదలుపెట్టారు. జూబ్లీహిల్స్‌ వైపు అంబేడ్కర్‌ యూనివర్శిటీ నుంచి దుర్గం చెరువు మీదుగా ఇనార్బిట్‌ మాల్‌ వైపు వెళ్లేందుకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తీగŸల వంతెన నిర్మాణాన్ని మొదలుపెట్టారు. చెరువు గర్భంలో పిల్లర్లు వేయకుండా 240 మీటర్ల పొడవున తీగల మీదే ఆధారపడేలా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 45 నుంచి ఎకాయెకిన ఈ వంతెన మీదుగా పైనాన్షియల్‌ డిస్ట్రిక్టు, గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు వీలుగా ఈ మార్గంలో సినీనటుడు శ్రీహరి ఇంటి నుంచి తీగల వంతెన వరకు అతి పెద్ద ఆకాశమార్గం నిర్మాణాన్ని మొదలుపెట్టారు. రూ.184 కోట్లతో నిర్మిస్తున్న తీగల వంతెనను వచ్చే అక్టోబరులో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీహరి ఇంటి దగ్గర రూ.150 కోట్లతో నిర్మిస్తున్న ఆకాశమార్గం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.