close

ప్ర‌త్యేక క‌థ‌నం

హెచ్‌1బీ.. వచ్చేదాకా వదలా!

అమెరికాలో స్థిరపడాలన్న లక్ష్యం పక్కదార్లు పట్టిస్తోంది 
నిబంధనలు పాటించని విద్యార్థులు 
అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రుల్లో కలవరం 
అవగాహన పెంచాలంటున్న నిపుణులు 
ఈనాడు, హైదరాబాద్‌

మెరికాలో చదవడానికి అక్కడికి వెళుతున్న విద్యార్థుల్లో చాలామంది ఇక అక్కడే శాశ్వతంగా స్థిరపడాలని భావిస్తూ, అందుకోసం అడ్డదారులు తొక్కడం ఎన్నో సమస్యలకు దారితీస్తోంది. ఇలాంటివారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థి వీసా(ఎఫ్‌1)పై వెళ్లిన విద్యార్థులు ఉద్యోగం చేసుకునేందుకు హెచ్‌1బీ వీసా దక్కించుకోవడానికి అపసవ్య మార్గాలను అన్వేషిస్తున్నారు. అమెరికా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో అసలుకు ఎసరు వస్తోంది. తాజాగా అమెరికాలో అక్కడి హోంల్యాండ్‌ భద్రతా విభాగం అధికారులు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకోవడం.. 600 మంది భారతీయ విద్యార్థులను ‘నకిలీ విద్యార్థులు’గా గుర్తించడం కలకలం రేపింది. అమెరికాలో 12 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉంటే, వారిలో భారతీయుల సంఖ్య 2,27,199. మొత్తం విదేశీ విద్యార్థుల్లో వీరి శాతం 18.83. అక్కడ చదివే వారిలో 77.6% మాస్టర్స్‌ డిగ్రీ (పీజీ) వారున్నారు. అమెరికాలో ఉన్న భారతీయుల్లో కనీసం 20-25% తెలుగు విద్యార్థులు ఉంటారని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో బీటెక్‌ పూర్తి చేసిన అనంతరం రెండేళ్ల ఎంఎస్‌ కోర్సు చేసేందుకు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందుతున్నారు. చదువు పూర్తయిన తర్వాత సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం(స్టెమ్‌) కోర్సుల వారికి విశ్వవిద్యాలయం అనుమతితో మూడేళ్లపాటు ఓపీటీ కింద ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆ మూడేళ్లు ముగిసిన తర్వాత అమెరికాలో ఉండటానికి వీల్లేదు. 
అందరి గురి హెచ్‌1బీ వీసాపైనే.. 
భారతీయ విద్యార్థుల్లో 1,93,274 మంది (85%) సైన్స్‌, ఇంజినీరింగ్‌, గణితం, టెక్నాలజీ(స్టెమ్‌) కోర్సుల్లోనే ప్రవేశాలు పొందుతున్నారు. ఓపీటీ పూర్తయ్యేలోపు హెచ్‌1బీ వీసా పొందితే అమెరికాలో ఉండిపోవచ్చు. మొత్తం హెచ్‌1బీ వీసాల్లో 75 శాతానికిపైగా భారతీయ విద్యార్థులకే లభిస్తున్నాయి. అయినా ఎంతో మందికి నిరాశే మిగులుతోంది. హెచ్‌1బీ వీసా ఉంటే శాశ్వతంగా ఉండేందుకు గ్రీన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకే కొందరు అక్కడ కొనసాగేందుకు అడ్డదార్లు తొక్కుతున్నారు. 
ఈ జాగ్రత్తలు తప్పనిసరి 
అమెరికా ప్రభుత్వం ఆమోదం ఉన్న విద్యాసంస్థల జాబితాను హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం(డీహెచ్‌ఎస్‌) ఆధ్వర్యంలోని స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ విజటర్‌ ప్రోగ్రాం ద్వారా తెలుసుకుని, ధ్రువీకరించిన సంస్థల్లోనే చేరాలి. 
వీసా లభించి అమెరికా వెళ్లే ముందు ఆయా కన్సల్టెన్సీలు పోస్టు వీసాపై అవగాహన కల్పించాలి. కొన్ని ఆ పని చేయడం లేదు. కొన్ని సంస్థలు చేసినా విద్యార్థులు రావడం లేదు. ‘పోస్టు వీసాపై అవగాహన కల్పించేందుకు కన్సల్టెన్సీకి రమ్మని విద్యార్థులను పిలుస్తాం. అయితే 30% విద్యార్థులు రావడం లేదు’ అని గుంటూరుకు చెందిన వరల్డ్‌ వైడ్‌ ఎడ్యు కన్సల్టెన్సీ ఎండీ ఉడుముల వెంకటేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఎందుకు రావడం లేదని అడిగితే ఇప్పటికే అక్కడ మిత్రులు ఉన్నారని, బంధువులు ఉన్నారని చెబుతుంటారని ఆయన తెలిపారు. 
చదువుకుంటూ కరిక్యులం ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(సీపీటీ) చేయడం (ఒక రకంగా ఇంటర్న్‌షిప్‌), పూర్తయిన తర్వాత మూడేళ్ల ఓపీటీ తదితర నిబంధనలు తెలుసుకోవడం అవసరం.

మా అబ్బాయి ఏ తప్పూ చేయలేదు..

ఈనాడు, వరంగల్‌: అమెరికాలో ఇమిగ్రేషన్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అదుపులోకి తీసుకున్న తెలుగు విద్యార్థుల్లో అవినాశ్‌ కూడా ఒకరు. అతడిది వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ. ఈ కేసులో అవినాశ్‌ డీ-6గా ఉన్నారు. స్వస్థలం ఎల్కతుర్తి మండలం కాగా, కొన్నేళ్ల క్రితమే వీరి కుటుంబం హన్మకొండకు వచ్చి స్థిరపడింది. దీనిపై అవినాశ్‌ తండ్రిని ఫోన్‌లో సంప్రదించగా.. తమ కుమారుడు ఏ తప్పూ చేయలేదని. ఈ కేసుతో అతడికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. 

అండ‌గా ఉంటాం...

బూర్గంపాడు, న్యూస్‌టుడే: అధికారుల అదుపులో ఉన్న విద్యార్థులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆ సంఘం ఎలెక్టెడ్‌ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ పేర్కొన్నారు. బాధితులైన విద్యార్థుల్లో పూర్వ ఖమ్మం జిల్లాకు చెందిన సుమారు 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తానా ఎలెక్టెడ్‌ (త్వరలో బాధ్యతలు చేపట్టనున్న) అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ గురువారం న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ సందీప్‌ చక్రవర్తితో సమావేశమయ్యారు. భారత ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకోవాలని జయశేఖర్‌ కోరారు. తెలుగు విద్యార్థులను వలపన్ని అదుపులోకి తీసుకోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. బాధిత విద్యార్థుల కుటుంబాలు ఆందోళనకు గురికావద్దని, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుని, వారు క్షేమంగా బయటపడేలా చూస్తామని ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ చెప్పారు.

- ‘తానా’ ఎలెక్టెడ్‌ అధ్యక్షుడు జయశేఖర్‌

ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి

న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం: అమెరికాలో ఇమిగ్రేషన్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్న వారిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారన్న సమాచారంతో పలువురు తల్లిదండ్రులు అందోళనకు గురవుతున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి వారం రోజుల్లో అమెరికాను విడిచి స్వదేశానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసిందని జేన్‌టీయూహెచ్‌ ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రవీందర్‌నాయక్‌ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన విద్యార్థులు పలువురు ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు 
పూర్తి న్యాయ సహకారం అందిస్తున్నాం 
ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు వేమూరి రవి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇమిగ్రేషన్‌ అధికారుల అదుపులో ఉన్న విద్యార్థులకు శిక్ష పడే అవకాశం లేదని, తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ పేర్కొన్నారు. ఒక వేళ తప్పు చేశారని రుజువైతే విద్యార్థుల్ని తిరిగి స్వదేశానికి పంపిస్తారని వివరించారు. ఈ లోపు విద్యార్థులకు అవసరమైన న్యాయసహకారం అందించేందుకు ఏపీఎన్‌ఆర్‌టీ తరఫున 150 మంది సమన్వయకర్తలు అమెరికాలో పనిచేస్తున్నారని వెల్లడించారు. గురువారం విజయవాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘అమెరికాలో ఎంఎస్‌ చదివేందుకు వెళ్లిన వారికి ఆ కోర్సు పూర్తయ్యాక ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ కింద 34 నెలలపాటు అమెరికాలో లీగల్‌గా ఉండే వెసులుబాటు ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన వారందరికీ ఓపీటీ కింద ఉండేందుకు అవకాశం రాదు. దీంతో ఏదో ఒక విశ్వవిద్యాలయాల నుంచి ఓపీటీ పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. వాటిలో అక్రమాలుంటే గుర్తించేందుకు హోంల్యాండ్‌ భద్రతా విభాగం అధికారులు శూల శోధన చేపట్టారు. విద్యార్థులను నకిలీ యూనివర్సిటీలో చేర్పించే వ్యవహారంలో 8 మంది మధ్యవర్తిత్వం వహించినట్లు కూడా గుర్తించారు. విద్యార్థులు నకిలీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొంది దేశంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి మధ్యవర్తులను అరెస్టు చేసింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మరో 15 మంది విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది’ అని వివరించారు. 
చట్టాలు తెలుసుకొని వెళ్తే మంచిది: భవానీ శంకర్‌ 
మధ్యవర్తుల ప్రలోభాల వల్లే వివిధ దేశాలకు వెళ్తున్న విద్యార్థులు చిక్కుల్లో పడుతున్నారని ఏపీఎన్‌ఆర్‌టీ ముఖ్యకార్యనిర్వహణాధికారి భవానీశంకర్‌ తెలిపారు. ఓపీటీ పూర్తయ్యాక స్వదేశానికి రావడం ఇష్టం లేని విద్యార్థులు.. నకిలీ విశ్వవిద్యాయాల్లో చేరేందుకు ప్రయత్నించి భద్రతా విభాగం అధికారులకు దొరికిపోతున్నారని వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏపీఎన్‌ఆర్‌టీ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విదేశాల్లోని విశ్వవిద్యాలయాల విశ్వసనీయతను వివరించేందుకు ఏపీఎన్‌ఆర్‌టీలో ప్రత్యేక వ్యవస్థ ఉందన్నారు. ఆయా దేశాలకు వెళ్లే ముందు అక్కడి చట్టాలను తెలుసుకొని వెళితే మంచిదన్నారు. 
సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్లు 
సాగర్‌ దొడ్డపనేని (+1 5104091309), మాధవి మేడి (+1 4324134769), ఏపీఎన్‌ఆర్‌టీ హెల్ప్‌లైన్‌ 0863- 2340678

న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం

మెరికాలోని డెట్రాయిట్‌లో అధికారుల అదుపులో ఉన్న తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) ప్రయత్నిస్తోందని ఆ సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గుత్తికొండ, నాట్స్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ మంచికలపూడి తెలిపారు. చాలా మంది తెలుగు విద్యార్థులు సాయం కోసం నాట్స్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేశారని చెప్పారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) పేర్కొంది. అదుపులోకి తీసుకున్న వారిని న్యాయస్థానంలో హాజరుపరిచి తిరిగి స్వదేశాలకు తిరిగి పంపించే అవకాశమే ఉందని, అరెస్టులు చేయరని అధ్యక్షుడు పర్మేష్‌ భీమ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయనో వీడియో విడుదల చేశారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.