close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఇక ‘టీటీ’కి బదులు ‘టీడీ’

10, 16 ఏళ్ల వయసు పిల్లలకు, గర్భిణులకూ ఇదే టీకా 
జూన్‌ నుంచి అమలుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు 
ఈనాడు - హైదరాబాద్‌

త్తి.. లోహపు రేకు.. గాజుపెంకులాంటివి పొరపాటున గుచ్చుకుంటేనో.. లేదా కిందపడి కాలు, చేయి గీరుకుపోతేనో.. గాయమైనవారికి వైద్యులు సూచించేది ‘టెటనస్‌ టాక్సైడ్‌(టీటీ)’ టీకా. దీన్ని తీసుకోవడం ద్వారా క్షతగాత్రుల్లో ప్రాణాంతకమైన ధనుర్వాతాన్ని నివారించవచ్చు. ఇక నుంచి ఈ టీకా కనుమరుగై.. మరో టీకాతో కలిసి, సరికొత్త రూపంలో అందుబాటులోకి రానుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం.. ‘టీటీ’కి బదులు ‘టెటనస్‌-డిఫ్తీరియా(టీడీ)’ టీకాను త్వరలో అమల్లోకి తేనున్నారు. తెలంగాణలో రాబోయే జూన్‌ నుంచి టీడీ టీకాను అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా దశలవారీగా కొత్త టీకాను అమలు చేయాల్సిందిగా ఇటీవల దిల్లీలో అన్ని రాష్ట్రాల వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేయడంతో.. ఆ దిశగా అమలుకు రాష్ట్ర వైద్యాధికారులు సంసిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రానికి టీడీ టీకాలు సరఫరా కానప్పటికీ.. ఈ టీకాల అమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు, నర్సులకు ముందస్తు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 
కొత్త టీకాను ఎప్పుడెప్పుడు ఇస్తారు? 
పిల్లలకు పదేళ్లు, 16 ఏళ్ల వయసు ఉన్నపుడు.. 
మహిళ గర్భం దాల్చినట్లు నిర్ధరించగానే తొలి టీకా, నాలుగు వారాల తర్వాత మరో టీకా. 
ఎందుకీ మార్పు? 
ధనుర్వాతం(టెటనస్‌), కంఠసర్పి(డిఫ్తీరియా) జబ్బుల నివారణ కోసం ప్రస్తుతం పెంటావాలెంట్‌ టీకాను ఇస్తున్నారు. 
ఈ టీకాలో కోరింత దగ్గు, హెపటైటిస్‌ బి, హీమోఫిలస్‌ ఇన్‌ఫ్లుయంజా టైప్‌ బి జబ్బులను నివారించే గుణాలూ ఉంటాయి. 
ప్రస్తుతం శిశువుకు 6, 10, 14 వారాల వయసులో పెంటావాలెంట్‌  టీకాను ఇస్తున్నారు. 
శిశువుకు 16-24 నెలల మధ్యలో డీపీటీ బూస్టర్‌ 1, ఐదేళ్ల వయసులో డీపీటీ బూస్టర్‌ 2 టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. 
ప్రస్తుతం పిల్లలకు పదేళ్లు, 16 ఏళ్ల వయసు వచ్చేసరికి కేవలం టీటీ టీకాను మాత్రమే ఇస్తున్నారు. 
10 ఏళ్ల వయసు తర్వాత కంఠసర్పి, కోరింత దగ్గు జబ్బులు రావడం తగ్గిపోవడంతో ఈ రెండింటికీ టీకాలు ఇవ్వడంలేదు. 
కానీ, గత కొన్నేళ్లుగా కంఠసర్పి కేసులు మధ్యవయస్కుల్లోనూ ఎక్కువగా కనిపిస్తున్నాయి.రాష్ట్రంలో ఫీవర్‌ ఆసుపత్రిలోనే ఏటా వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 
ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉండటంతో.. దాదాపు పదేళ్ల కిందటి నుంచే ధనుర్వాతం టీకాకు తోడుగా కంఠసర్పి టీకాను కూడా కలిపి ‘టీడీ’ టీకాను ప్రపంచ ఆరోగ్య  సంస్థ అమల్లోకి తీసుకొచ్చింది. 
గర్భిణి దశలోనే ఈ టీడీ టీకాను రెండు డోసుల్లో ఇవ్వడం వల్ల గర్భిణితో పాటు, పుట్టబోయే శిశువుకు కూడా ధనుర్వాతం, కంఠసర్పి జబ్బులు రాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 
ఇప్పటికే దాదాపు 133 దేశాలు ‘టీటీ’ స్థానంలో ‘టీడీ’టీకానుఅమలు చేస్తున్నాయి. 
ప్రస్తుతం ‘టీటీ’ టీకా అమలుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని యునిసెఫ్‌ అందజేస్తోంది. 
ఇక మరెంతోకాలం ‘టీటీ’ని కొనసాగించలేమనీ, ఇప్పటివరకూ అమలు చేయని అన్ని దేశాలూ 2020 జనవరి నాటికి కచ్చితంగా ‘టీడీ’ టీకాను అమలు చేయాల్సిందేననీ, లేదంటే ‘టీటీ’కిచ్చే ఆర్థికసాయాన్ని అందించలేమని యునిసెఫ్‌ తాజాగా స్పష్టం చేసింది. 
‘టీటీ’కి బదులుగా ‘టీడీ’ టీకాను అమలుచేయడంలో అయ్యే ఖర్చును భరిస్తామని తేల్చిచెప్పింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.