close

ప్ర‌త్యేక క‌థ‌నం

సిబ్బంది లేరు... ఊళ్లెలా మారు?

కార్యదర్శులతో  కొన్ని సమస్యలు కొలిక్కి
మార్గదర్శకాల కోసం పారిశుద్ధ్య కార్మికుల ఎదురుచూపు
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలోని పంచాయతీలకు ఎన్నికలు ముగిశాయి. కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు శనివారం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వారిపై పల్లె జనులు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. తమ గ్రామాల రూపురేఖలు మారిపోతాయని వారు భావిస్తున్నారు. మరి పంచాయతీల్లో వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? తగినంతమంది సిబ్బంది ఉన్నారా? అవసరమైన అన్ని పనులు వారు చేయగలిగే స్థితి ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మాత్రం నిరాశాజనకంగానే ఉన్నాయి. రాష్ట్రంలోని పంచాయతీలు చాలా కాలంగా  సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు 12,751 పంచాయతీలు ఉండగా కార్యదర్శులు కేవలం 3,560 మంది మాత్రమే ఉన్నారు. ప్రతి పంచాయతీకి ఒక్కో కార్యదర్శి చొప్పున  నియమించాలని ప్రభుత్వం నిర్ణయించి 9,200 మంది జూనియర్‌ కార్యదర్శుల నియామకాల ప్రక్రియను ఇటీవల చేపట్టింది. వీరంతా కొలువుల్లోకి వస్తే తప్ప వారి కొరత తీరదు. అప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు, బిల్‌ కలెక్టర్లు వంటివారి కొరత మాత్రం తీవ్రంగానే ఉండబోతోంది. కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసినప్పుడు పాత పంచాయతీల్లోని సిబ్బందినే సర్దుబాటు చేసినప్పటికీ.. కొత్తవాటిలో ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. పంచాయతీల్లో ప్రస్తుతం అన్ని రకాల ఉద్యోగులు కలిపి 45,293 మంది ఉన్నారు.

సర్కారు నిర్ణయం కోసం ఎదురు చూపు
రాష్ట్రంలో 17 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను నెలకు రూ.8,500 వేతనంపై నియమించనున్నట్లు ప్రభుత్వం దాదాపు ఆరు నెలల క్రితం ప్రకటించటంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో ఆశలు చిగురించాయి. వీరి నియామకాలపై పంచాయతీరాజ్‌ శాఖ కొంత కసరత్తు చేసినప్పటికీ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయాన్ని వెలువరించలేదు. వీరిని పారిశుద్ధ్యానికి మాత్రమే కాకుండా పన్నుల వసూళ్లు వంటి ఇతర పనులకూ వినియోగించుకోవాలని, వారికి బహుళ ప్రయోజన ఉద్యోగులుగా నామకరణం చేయాలని, కనీస విద్యార్హతను 7వ తరగతిగా నిర్దేశించాలని సర్కారు వద్ద ప్రతిపాదనలు ఉన్నట్టు సమాచారం. కార్యదర్శులతోపాటు వీరి నియామకాలూ కొలిక్కి వస్తే పంచాయతీల్లోని  సిబ్బంది కొరత కొంత వరకు పరిష్కారం అవుతుంది.

‘ఉపాధి హామీ’ ద్వారా కుదరదన్న కేంద్రం
పారిశుద్ధ్య కార్మికులను ఉపాధి హామీ పథకం కింద నియమించి దాని నుంచి వేతనాలను చెల్లించాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ  కేంద్రం అందుకు అంగీకరించలేదు. దీంతో ఇటీవలి వరకు ఆ పథకం ద్వారా పనిచేస్తున్నవారు సైతం గ్రామాల్లోని పనుల    నుంచి వైదొలగటంతో పారిశుద్ధ్య సమస్యలు మరింత పెరిగాయి.

ప్రస్తుత సిబ్బందికీ నామమాత్రపు వేతనాలు
ప్రస్తుతం విధులను నిర్వహిస్తున్నవారిలో 51 శాతం మంది వేతనాలు నామమాత్రంగా.. నెలకు రూ.2వేల లోపు మాత్రమే ఉండటంతో వారిలో ఆందోళన నెలకొంది. ఉద్యోగుల్లో కేవలం 5,165 మంది మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగులు. వీరిలోని 3,560 మంది కార్యదర్శులకు ప్రభుత్వం ఏటా రూ.264 కోట్ల మేర వేతనాల రూపంలో అందజేస్తోంది. మిగతా 37,750 మంది వేతనాల కోసం ఆయా గ్రామ పంచాయతీలే తమ రాబడుల నుంచి  ఏటా రూ.144 కోట్ల మేర వినియోగిస్తున్నాయి. దీన్నిబట్టే వారి వేతనాలు ఏమేరకు ఉన్నాయో తెలుస్తోంది.  కొన్ని పంచాయతీల్లో పారిశుధ్ధ్య కార్మికులకు వేతనం రూ.500 లోపే ఉంటోంది. ఇప్పుడు సిబ్బంది సంఖ్యను పెంచటంతో పాటు వారి వేతనాలనూ మెరుగు పర్చాల్సిన ఆవశ్యతక ఎంతైనా ఉంది. వేతనాలను పెంచాలని, తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు గత ఏడాది జులైలో విధులను బహిష్కరించి సమ్మెకుదిగటం తెలిసిందే.

దేశవ్యాప్తంగా పంచాయతీల్లో సిబ్బంది సమస్య తీవ్రంగా ఉంది. పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆడిట్‌, ఖాతాల సిబ్బంది తదితరులను రాష్ట్రాలు నియమించుకొనేలా కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ విశేషంగా కృషి చేయాల్సిందిగా మేం గట్టిగా సిఫార్సు చేస్తున్నాం

- పంచాయతీల అభివృద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తాజా సిఫార్సు ఇది

ప్రతి పంచాయతీకి పూర్తికాలపు కార్యదర్శి ఉండాలి. ఇంజినీరింగ్‌ పనుల కోసం పంచాయతీలో ఒక సాంకేతిక సహాయకుడు అవసరం. పంచాయతీ సిబ్బంది అందరికీ కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పని సరి

- కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుమిత్‌ బోస్‌ నేతృత్వంలోని కమిటీ చేసిన సూచన ఇది

* పంచాయతీల్లో ప్రస్తుతం సిబ్బంది సంఖ్య 45,293
* వారిలో రెగ్యులర్‌ ఉద్యోగులు5,165 (11%)
* తాత్కాలిక ఉద్యోగులు 40,128 (89%)
* నెలకు రూ.300 నుంచి రూ.500 వేతనం గలవారి సంఖ్య3,448

సరిపడా సిబ్బంది ఉండాలి

‘ప్రతి పంచాయతీలోను సరిపడినంత సిబ్బంది ఉన్నప్పుడే స్థానిక పాలన ఫలాలు ప్రజలకు సత్వరం అందుతాయి. చాలా ఏళ్లుగా నాలుగైదు పంచాయతీలకు ఒక్కో కార్యదర్శి చొప్పున పనిచేస్తూ వస్తున్నారు. కొత్త చట్టంలో కార్యదర్శి బాధ్యతలను మరింతగా పెంచినందున వాటిని అమలు చేయటానికి ఇతర రకాల ఉద్యోగులను కూడా తగిన రీతిలో నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంచాయతీ ఎన్నికల తర్వాత సిబ్బంది నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం’

- మధుసూధన్‌ రెడ్డి, పంచాయతీ ఉద్యోగుల ప్రతినిధి

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.