close

ప్ర‌త్యేక క‌థ‌నం

మాయమాటలు.. నమ్మించి మోసాలు 

తెలుగు రాష్ట్రాల్లో లైంగికదాడి, అత్యాచార బాధితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అత్యధికం 
బాధితులంతా 12-19 ఏళ్లలోపు బాలికలు 
భాగస్వామిపై నమ్మకం లేక వైవాహిక సమస్యలు 
తల్లిదండ్రులు బాధ్యతలు గుర్తెరిగితే నేరాల తగ్గుదలకు అవకాశం 
ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ నివేదికలో వెల్లడి

తెలుగు రాష్ట్రాల్లో లైంగికదాడి, అత్యాచార బాధితుల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అధికంగా ఉన్నారని హైదరాబాద్‌లోని ఫొరెన్సిక్‌ సైన్స్‌ పరిశోధనశాల అధ్యయనంలో వెల్లడైంది. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా జీవనోపాధి కోసం వ్యవసాయరంగం, నిర్మాణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 12-19 ఏళ్లలోపు చిన్నారులు, బాలికలు మాయమాటలు చెబుతున్న నిందితుల చేతుల్లో బాధితులుగా మారుతున్నారని తెలిపింది. వారు బాధితులుగా మారకుండా.. వారి మెరుగైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు బాధ్యతను గుర్తెరిగి పిల్లలను కంటికిరెప్పలా కాపాడుకోవాలని పేర్కొంది. పాఠశాలల్లో డ్రాపవుట్లు తగ్గించేలా చర్యలు తీసుకుని, నేరాలు జరగకుండా భద్రత వాతావరణం కల్పించాలని సూచించింది. ఫొరెన్సిక్‌ సైన్స్‌ పరిశోధనశాల పదిహేనేళ్లుగా అందిన ‘‘యుక్తవయసు, కౌమార దశ గర్భం, వివాదాస్పద గర్భం కేసులు’’ వివరాలను అధ్యయనం చేసి రూపొందించిన ఈ నివేదిక ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ హెల్త్‌సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌’లో ప్రచురితమైంది. 

80శాతం బాధితులు 22 ఏళ్లలోపువారే 
లైంగికదాడి, వేధింపులకు గురైన బాలికలు మానసిక వ్యధ అనుభవిస్తున్నారు. వారికి పుట్టే పిల్లలకు విద్య, వ్యక్తిగత అభివృద్ధి సమస్యగా మారుతోంది. బాధితుల్లో విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. వివాదాస్పద గర్భం బాధితుల్లో వ్యవసాయ కూలీలు అధికం. 15ఏళ్ల క్రితంతో పోలిస్తే అత్యాచార నేర కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 80శాతం కేసుల్లో బాలికలు, యువతుల వయసు 22 ఏళ్లలోపు ఉంటోంది. 17ఏళ్లలోపు ఉన్నవారు 37శాతంగా నమోదైంది. నిందితుల సగటు వయసు 20-22 ఏళ్లలోపు ఉండటం గమనార్హం. మాయమాటలు చెప్పి మోసం చేయడంలో డ్రైవర్లు ఎక్కువగా ఉంటున్నారు. నమ్మించి గర్భవతిని చేసిన కేసుల్లో 14శాతం ఉంటే, లైంగికదాడి, అత్యాచారం కేసుల్లో వీరి వాటా 42.5శాతం. కొందరు బాధితులు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకుంటే పరువు పోతుందన్న కారణంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ సందర్భాల్లో మోసానికి కారకుల వివరాలు చెప్పకపోవడం, కడుపులోని పిండం డీఎన్‌ఏ పాడవటంతో నిందితున్ని గుర్తించడం ఇబ్బందిగా మారినట్లు అధ్యయనంలో వెల్లడైంది. 

కేసుల నమోదు ఏదీ! 
బాల్యవివాహాలను తగ్గించేందుకు చట్టాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. లైంగికదాడి, అత్యాచారం కారణంగా మోసపోయిన బాధితుల వివరాలను నమోదు చేయడంలేదు. విదేశాల్లో మాదిరి ఇక్కడా గణాంకాలు సేకరించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. కొన్ని సందర్భాల్లో సరైన ఆధారాల్లేకపోవడంతో నిందితులు కేసుల నుంచి తప్పుకుంటున్నారు. భాగస్వామిపై నమ్మకం లేకపోవడం, భేదాభిప్రాయాలు, అక్రమ సంబంధాల కారణంగా పుట్టినబిడ్డ రక్తసంబంధం, వైవాహిక గొడవలు క్రిమినల్‌, సివిల్‌ కేసులకు దారితీస్తున్నాయి. లైంగికదాడికి గురవుతున్న బాధితులు, నిందితుల్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.