close

ప్ర‌త్యేక క‌థ‌నం

పని చేయట్లేదా.. పదవే పోవచ్చు 

పంచాయతీ పాలకవర్గాలకు పెరిగిన బాధ్యతలు 
సరిగా నిర్వర్తించకపోతే పాలకవర్గమే రద్దు 
అక్రమ కట్టడాల కూల్చివేత ఖర్చు సర్పంచిదే 
పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం 
రెండు నెలలకోసారి గ్రామ సభ 
ఇంటింటికీ మరుగుదొడ్డి తప్పనిసరి 
భవన నిర్మాణానికి 15 రోజుల్లోగా అనుమతివ్వాలి

పంచాయతీల్లో అక్రమ కట్టడాల కూల్చివేతకయ్యే ఖర్చును ఇకపై సర్పంచి, అక్కడి కార్యదర్శి కలసి భరించాలి. పాలకవర్గం ప్రతి రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా గ్రామసభ నిర్వహించి, సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. దరఖాస్తు అందిన 15 రోజుల్లోగా భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వకుంటే ఇక పంచాయతీ అనుమతి లభించినట్టే. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం ఇటువంటి కొత్త అంశాల మేళవింపుతో.. పంచాయతీల విధులు, బాధ్యతలను మరింతగా పెంచింది. ఈ నెల 21, 25, 30 తేదీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. సర్పంచి, ఉపసర్పంచి, వార్డు సభ్యులు మునుపటికంటే ఎక్కువగా కష్టించి పని చేయకుంటే వారి పదవులే రద్దయ్యే ప్రమాదం ఉంది. 
రాష్ట్రంలో 12,751 పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యులు కలిపి మొత్తం 1.26 లక్షల మంది స్థానిక ప్రతినిధులుగా పదవులు చేపట్టబోతున్నారు. ఎన్నికైన వెంటనే వారి విధులు మొదలవుతాయి. వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతే కలెక్టరు మొత్తం పంచాయతీ పాలకవర్గాన్నే రద్దు చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో సర్పంచులు పదవులను కోల్పోవచ్చు. కార్యదర్శిపైనా తీవ్రమైన చర్యలు తప్పవు. గ్రామ కార్యదర్శి, సర్పంచి అదే గ్రామంలో నివసించాలి. పంచాయతీ పాలకవర్గాలు ఇక ప్రతి నెలా భేటీ కావాలి. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకునేలా, ఆరుబయలు మలవిసర్జన గ్రామంలో కనిపించకుండా చూడాలి. చెత్త నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి, కంపోస్టు ఎరువును తయారు చేయించాలి. 
మొక్క చనిపోతే పన్ను 
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కొత్త చట్టం పెద్దపీట వేసింది. ప్రతి పంచాయతీలోనూ ప్రజలకు ఉపయోగపడే మునగ, రాచ ఉసిరి, చింత, వేప, మామిడి, నిమ్మ, జామ తదితర మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి నిరంతరం నీరందేలా ఏర్పాట్లు చేసి.. కనీసం 85 శాతం బతికి  ఉండేలా చూడాలి. మొక్కల కోసం పంచాయతీలో ఒక దస్త్రాన్ని నిర్వహించాలి. ప్రతి ఇంటికీ పంచాయతీ కార్యదర్శి ఆరు మొక్కలు ఇవ్వాలి. అవి ఇంటి యజమాని నిర్లక్ష్యం కారణంగా ఎండిపోతే ఇంటి పన్నుకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా విధించవచ్చు. గ్రామ సమీపంలోని కొండలపై పండ్ల మొక్కలను పెంచాలి. 
విధులు, నిధులు ఇస్తేనే.. 
పంచాయతీలకు విధులు, నిధులు ఇవ్వనంత కాలం చట్టంలో ఎన్ని చెప్పినా వాటి అమలు సాధ్యం కాదు. ప్రజల ద్వారా ఎన్నికయ్యే సర్పంచులను ప్రతి చిన్న తప్పిదానికి విధుల నుంచి తొలగిస్తామనే హెచ్చరికలు సరికాదు. కేవలం ఆర్థికపరమైన అవకతవకలు ఉన్నప్పుడే పదవి నుంచి తప్పించాలి. చిన్న గ్రామాలు సైతం పంచాయతీలుగా అవతరించాయి. కొన్ని పంచాయతీల్లో ఇంటి పన్ను చెల్లించేంత భవనాలు కూడా కనిపించటం లేదు. అలాంటి పంచాయతీలు ఆర్థికంగా నిలదొక్కుకోవటంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. కొత్తగా ఎన్నికైన వారందరికీ మంచి శిక్షణ ఇవ్వాలి. గ్రామసభలను చిత్తశుద్ధితో నిర్వహించి అక్కడి తీర్మానాలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించటం చాలా అవసరం.

- పద్మనాభరెడ్డి, కార్యదర్శి, సుపరిపాలన వేదిక

వ్యవసాయ భూములపైనా పన్ను 
గ్రామంలో ఏదైనా నిర్ధిష్ట ప్రయోజనం కోసం నిధులు అవసరమైతే అక్కడి వ్యవసాయ భూములపై పంచాయతీ పన్ను విధించవచ్చు. ఇంకా అవసరమనుకొంటే ఇళ్లు, ఇతర ఆస్తులపైనా ప్రత్యేక పన్ను వేయొచ్చు. 
అక్రమ లేఅవుట్‌కు పంచాయతీ అనుమతిస్తే ఏకంగా పాలకవర్గాన్నే రద్దు చేయొచ్చు. పంచాయతీలో అక్రమంగా కట్టిన భవనం కనిపించినా పాలకవర్గం ఇటువంటి శిక్షనే ఎదుర్కోవాల్సి వస్తుంది. 
ఇళ్ల స్థలాల లేఅవుట్‌ కోసం దరఖాస్తు వస్తే దాన్ని ఏడు రోజుల్లోగా పట్టణాభివృద్ధి సంస్థ లేదా డీటీసీపీకి పంపించాలి. లేకపోతే దాన్ని పంపినట్లుగానే పరిగణించాలని చట్టం చెబుతోంది. 
300 చదరపు మీటర్ల స్థలంలో, 10 మీటర్ల ఎత్తుకు మించని గ్రౌండ్‌ ప్లస్‌ రెండు అంతస్తుల నిర్మాణాల వరకే పంచాయతీ అనుమతివ్వాలి. దరఖాస్తు  అందిన 24 గంటల్లోగా పంచాయతీ కార్యదర్శి దాన్ని పరిశీలించి అవసరమైన పత్రాలన్నీ ఉన్నట్లుగా ధ్రువీకరించాలి. సరైన పత్రాలు లేకుంటే ఏడు రోజుల్లోగా దరఖాస్తుదారుకు తిరిగి ఇచ్చివేయాలి. 15 రోజులైనా ఏ విషయం చెప్పకుంటే ఆ భవనానికి అనుమతి లభించినట్లే. పెద్ద భవనాలకు సాంకేతిక కమిటీలు మాత్రమే అనుమతిస్తాయి. 
గ్రామాభివృద్ధికి అయిదేళ్ల ప్రణాళికలను పంచాయతీ తయారుచేయాలి. శ్మశానవాటికలను ఏర్పాటు చేయాలి. 
ప్రజారోగ్యం, పర్యావరణాలకు హానికరమైన, పరిమితులు దాటి ముందుకు చొచ్చుకువచ్చిన నిర్మాణాలను ముందస్తు నోటీసు ఇవ్వకుండానే పంచాయతీ కూల్చివేయొచ్చు. ఇందుకయ్యే ఖర్చును సర్పంచి, కార్యదర్శుల నుంచి రాబట్టాలి. 
పంచాయతీ నుంచి లైసెన్సు పొందకుండా ఎవరూ కొత్తగా ప్రైవేటు మార్కెట్‌ను ప్రారంభించకూడదు. 
కబేళాలు ఏర్పాటు చేసి, వాటిలోని మాంసాన్ని తనిఖీ చేసేవారికి పారితోషికాలు చెల్లించాలి.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.