close

ప్ర‌త్యేక క‌థ‌నం

కోరమాండల్‌ వ్యూహం!

మత్స్యకారులు, పాడి రైతుల మనసు దోచేందుకే...
తీర ప్రాంత, ఈశాన్య రాష్ట్రాల్లో బలపడేందుకు భాజపా ఎత్తుగడ

ఈనాడు, దిల్లీ: హిందీ రాష్ట్రాల్లో తన పట్టు సడలుతోందని భావిస్తున్న భాజపా... కేంద్రంలో మళ్లీ అధికారం దక్కించుకునేందుకు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. తీరప్రాంత, ఈశాన్య రాష్ట్రాల్లో స్వయంగా బలపడటం; కాంగ్రెసేతర పక్షాల మద్దతును కూడగట్టుకోవడం ద్వారా మరోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో భారీగా ఓట్లున్న మత్స్యకారులు, పాడి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు తాజా బడ్జెట్‌లో కేటాయింపులు ప్రకటించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే పునాది. సాగు రైతులకు రూ.6 వేల చొప్పున వార్షిక పెట్టుబడులను సమకూర్చుతామని ప్రకటించిన ప్రభుత్వం... కీలకమైన మత్స్య, పాడి పరిశ్రమలకూ బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చింది.

ఎందుకీ నిర్ణయం?
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఏడాది కిందట ఖరారుచేసిన ‘కోరమాండల్‌’ ప్రణాళికకు అనుగుణంగానే గోయల్‌ బడ్జెట్‌ ప్రకటనలు ఉండటం గమనార్హం. గోవుల రక్షణకు ప్రాధాన్యమిచ్చే హిందీ రాష్ట్రాల్లో కాషాయ పార్టీ పట్టు సడలుతోందన్న సర్వేల నేపథ్యంలో... తీరప్రాంత (కోరమాండల్‌), ఈశాన్య రాష్ట్రాల వ్యూహాన్ని షా సిద్ధం చేశారు. ఇప్పటికే గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటకల్లో బలం చాటుకున్న పార్టీని... మిగిలిన తీరప్రాంత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో కూడా బలోపేతం చేయడం; లేదంటే అక్కడి కాంగ్రెసేతర పక్షాల మద్దతు కూడగట్టుకోవడం- ఈ ప్రణాళిక లక్ష్యం. తదనుగుణంగా ఈ రాష్ట్రాల్లో 150 ఎంపీ సీట్లు సమీకరించుకోవాలని షా 2018 జనవరిలోనే నిర్దేశించారు.

అక్కడ 25 సీట్ల గెలుపే లక్ష్యం?
కోరమాండల్‌ ప్రణాళికలో- అసోం సహా 8 ఈశాన్య రాష్ట్రాల నుంచి 25 వరకూ పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యం కూడా ఉంది. నిజానికి ఈ ప్రణాళికకు మొదట అడుగులు పడింది ఈశాన్య రాష్ట్రాల్లోనే. 2014 ఎన్నికలకు ముందు అక్కడ అంతంత మాత్రంగానే ఉన్న భాజపా... ఇప్పుడు స్వయంగా, ఇతర పార్టీల మద్దతుతో మొత్తం 8 రాష్ట్రాల్లోనూ పాలన సాగిస్తోంది. 2015లో అంకురించిన ‘ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి’ ఆలోచనే...ఇప్పుడు తీరప్రాంత ప్రణాళిక అమలుకు బాటలు పరిచిందని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈశాన్యంలో మరింత బలపడేలా భాజపా సర్కారు  చర్యలు తీసుకుంటోంది. తొలిసారిగా అరుణాచల్‌ప్రదేశ్‌కు విమాన సేవలను; మేఘాలయ, త్రిపుర, మిజోరంలకు రైల్వే సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు బడ్జెట్‌లో ఈప్రాంతానికి 21% మేర పెంచుతూ రూ.58,166 కోట్లు కేటాయించింది. బ్రహ్మపుత్ర నదిలో సరకు రవాణాకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.