close

ప్ర‌త్యేక క‌థ‌నం

కబ్జాదారుల గుప్పిట్లో పాద బాటలు

హైదరాబాద్‌లో రెండు లక్షల ఆక్రమణలు
కొన్ని చోట్ల లీజులకూ ఇచ్చిన వైనం
రహదార్లపై ఏటా 50 మంది దుర్మరణం
ఎట్టకేలకు మేల్కొన్న బల్దియా విజిలెన్సు విభాగం
15,400 ఆక్రమణల తొలగింపు
దుకాణాల జప్తునకు నిర్ణయం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రాజధాని రహదారులపై నడచి వెళ్లడమంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే.. పాదచారుల బాటలన్నీ (ఫుట్‌పాత్‌లు) ఆక్రమణలతో కిక్కిరిసి ఉండటంతో, పాదచారులు వాహనాలు తిరిగే రోడ్లపై బిక్కుబిక్కుమంటూ నడవాల్సిన దుస్థితి నెలకొంది. హైదరాబాద్‌ మహానగరంలో ప్రధాన రహదారుల పక్కన రెండులక్షల ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కబ్జాలవల్ల నడిచేందుకు రోడ్లను ఆశ్రయిస్తున్న పాదచారులు.. వాహనాలు ఢీకొని ఏటా సుమారు 50 మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నట్లు గుర్తించారు. దాదాపు 450 మంది గాయపడుతున్నారు.

రాజధాని నగరంలో రోడ్ల పక్కన 650 కిలోమీటర్ల పొడవున ఫుట్‌పాత్‌ నిర్మాణం జరిగింది. ఇంకా చాలా చోట్ల జరగాల్సి ఉంది. అధికారులు గత 15 సంవత్సరాలుగా చూసీచూడనట్లు వదిలేయడంతో ఫుట్‌పాత్‌లపై షెడ్లు వేయడం లేదా పార్కింగ్‌కు ఇతరత్రా అవసరాల కోసం వాడుకోవడం పరిపాటిగా మారింది. దాదాపు 80% పాదబాటలపై పాదచారులు నడవటానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. కొద్ది నెలల కిందట జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కాంపాటి నేతృత్వంలో అధికారులు పాదబాటలపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేస్తే విస్తు గొలిపే నిజాలు వెలుగులోనికి వచ్చాయి. సికింద్రాబాద్‌, అబిడ్స్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర అనేక ప్రాంతాల్లో నేతల అండ ఉన్న కొంతమంది ఫుట్‌పాత్‌లను చిన్నవ్యాపారులకు లీజుకు ఇస్తున్నారని తేలింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరీదారుణంగా ఉందని వెలుగులోనికి వచ్చింది. ఈ ఆక్రమణ తొలగించడానికి అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆమోదముద్ర వేయడంతో విశ్వజిత్‌ తన సిబ్బంది ఆక్రమణలను తొలగించే ప్రక్రియను పెద్దఎత్తున మొదలుపెట్టారు. కొన్ని నెలలుగా 15,400 ఆక్రమణలను తొలగించారు. విజిలెన్సు విభాగం ఆక్రమణలు తొలగిస్తే బల్దియా ఇంజినీరింగ్‌ అధికారులు ఈ ఆక్రమణలను తొలగించిన చోట వెంటనే పాదబాటలను నిర్మించకపోవడం వల్ల అనేకచోట్ల మళ్లీ ఆక్రమణలు పుట్టుకొచ్చాయి. వీటిని గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు సంబంధిత షాపుల యజమానులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 150 షాపులను రెండుమూడు రోజులపాటు సీజ్‌ చేసి తిరిగి వ్యాపారం చేసుకోవడానికి అనుమతించారు.

దారిలోకి తేవడం కోసం..
పరిస్థితిని దారిలోకి తేవడం కోసం తిరిగి ఆక్రమణలు తొలగించి, ఆ షాపులను దాదాపు పదిహేను రోజుల నుంచి నెల రోజులపాటు జీహెచ్‌ఎంసీ చట్టప్రకారం సీజ్‌ చేయడమే కాకుండా, వీరికి భారీ ఎత్తున జరిమానా వేయాలని నిర్ణయించారు. రాబోయే పక్షం రోజుల్లో ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో మొదలుపెట్టబోతున్నారు. ఇప్పటికే 160 దుకాణాలను తాత్కాలికంగా సీజ్‌ చేశారు. కూల్చిన చోట పూర్తిస్థాయిలో ఫుట్‌పాత్‌లను నిర్మించే బాధ్యతను కూడా తమకే అప్పగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ను విజిలెన్సు డైరెక్టర్‌ విశ్వజిత్‌ కోరారు. ఒకవైపు కూల్చివేయగానే.. మరునాటి నుంచే ముందుగా నిర్ణయించిన రేట్లకు అనుగుణంగా గుత్తేదారు ఫుట్‌పాత్‌లను నిర్మించే బాధ్యతను తీసుకునేలా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఎక్కడైతే షాపు యజమానులు ఆక్రమణలకు పాల్పడ్డారో అక్కడ ఇనుప రైయిలింగ్‌ ఏర్పాటు చేసి, తిరిగి ఆక్రమణలు చేపట్టకుండా చేయాలని నిర్ణయించారు. కబ్జాలను తొలగించిన చోట్ల మళ్లీ ఆక్రమిస్తే గుర్తించడానికి ప్రత్యేకంగా కొంతమంది సిబ్బందికి బాధ్యతలను అప్పగించబోతున్నారు. శని, ఆదివారాల్లో పొక్లెయిన్లు ఇతరత్రా యంత్రాలతో పెద్దఎత్తున ఆక్రమణలు తొలగిస్తున్నారు. అవసరమైతే మరో రోజు కూడా ఆక్రమణలపై దృష్టిసారించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రధాన రహదారులపై ఆక్రమణలను తొలగించడంపై దృష్టిసారించారు. ఈ ఏడాది చివరి నాటికి రద్దీ రోడ్లలో ఆక్రమణలన్నింటినీ తొలగించి, పాదచారులను ఈ బాటలపై నడిపించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించాలని అనుకుంటున్నారు. దీనికి సమగ్ర ప్రణాళిక సిద్ధమైంది.

ఒత్తిడికి తలొగ్గేదిలేదు

అనేక ఏళ్లుగా పాదచారుల బాటలు ఆక్రమణలో ఉన్నాయి. వీటిని తొలగించే విషయంలో ఎటువంటి ఒత్తిడికీ తలొగ్గేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో నిబంధనల ప్రకారం ఎక్కడ ఆక్రమణ ఉన్నా పొక్లెయిన్‌ సహాయంతో తొలగిస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని సిద్ధం చేశాం. కబ్జాలను తొలగించిన చోట్ల నిర్మాణ వ్యర్థాలను అదే రోజు అక్కడి నుంచి రవాణా చేయడంతోపాటు బాటల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. కొద్ది నెలల్లో చక్కటి మార్పు కనిపిస్తుంది.
- విశ్వజిత్‌ కాంపాటి, విజిలెన్స్‌ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) డైరెక్టర్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.